హార్మోన్లు.. సమతాస్థితి నియంత్రకాలు (అన్ని పోటీ పరీక్షలకు..)
దేహ సమతాస్థితిని కాపాడటానికి, శరీరంలోని కణాలు ఏకీకృతం కావడానికి రక్తంలోకి నేరుగా విడుదలయ్యే రసాయన పదార్థాలను హార్మోన్లు అంటారు. ఇవి వార్తాహరులుగా పనిచేస్తాయి. హార్మోన్లను వినాళ గ్రంథులు (అంతఃస్రావ గ్రంథులు) ఉత్పత్తి చేస్తాయి. పోటీ పరీక్షల్లో హార్మోన్లు అనే అంశం నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. హార్మోన్ల రకాలు, విధులు, వాటి లోపం వల్ల వచ్చే అపస్థితుల గురించి తెలుసుకుందాం.
దేహంలో రెండు రకాల గ్రంథులుంటాయి.
1. బహిస్రావక గ్రంథులు
ఇవి నాళ గ్రంథులు.
ఉదా: స్వేద గ్రంథులు
2. అంతఃస్రావక గ్రంథులు
అంతఃస్రావక గ్రంథులు విడుదల చేసే రసాయన పదార్థాలను హార్మోన్లు అంటారు. అంతఃస్రావక గ్రంథులను వినాళ గ్రంథులు అంటారు.
1905లో స్టార్లింగ్ అనే శరీరధర్మ శాస్త్రవేత్త రక్తంలో స్రవించే పదార్థాలకు హార్మోన్లు అని పేరు పెట్టాడు.
అంతఃస్రావక వ్యవస్థ అధ్యయనాన్ని ఎండోక్రైనాలజీ అంటారు.
రసాయనికంగా హార్మోన్లను మూడు రకాలుగా విభజించవచ్చు.
1. పప్టైడ్ హార్మోన్లు
ప్రొటీన్ల నుంచి ఉత్పత్తి అవుతాయి.
ఉదా: ఇన్సులిన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్
2. స్టిరాయిడ్ హార్మోన్లు
ఇవి కొలెస్ట్రాల్ నుంచి ఉత్పన్నమవుతాయి.
ఉదా: ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, టెస్టోస్టిరాన్
3. అమైనో హార్మోన్లు
ఒకే అమైనో ఆమ్లం నుంచి ఏర్పడతాయి.
మెలనిన్ అనే హార్మోన్ ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం నుంచి ఉత్పన్నమవుతుంది.
అంతఃస్రావక గ్రంథులు
1. పీయూష గ్రంథి 2. థైరాయిడ్ గ్రంథి
3. అధివృక్క గ్రంథి 4. ముష్కాలు
5. స్త్రీబీజ కోశం 6. క్లోమం
పీయూష గ్రంథి
- దీన్ని ప్రధాన గ్రంథి (Master Gland) అంటారు.
- పీయూష గ్రంథి మధ్య మెదడులో సెల్లా టర్సికా అనే గుంతలో ఇమిడి ఉండి మిగతా అన్ని గ్రంథులపైన ఆధిపత్యం ప్రదర్శిస్తుంది.
- దీనిలో ఎడినోహైపోఫైసిస్, న్యూరో హైపోఫైసిస్ అనే భాగాలుంటాయి.
- 1. ఎడినోహైపోఫైసిస్ పెరుగుదల హార్మోన్ లేదా సొమాటోట్రోపిన్
- ఇది కణాల పెరుగుదల, వృద్ధిని కలుగజేస్తుంది.
- ఎదిగే వయసులో ఈ హార్మోన్ అల్పస్రావం వల్ల పిల్లల్లో పెరుగుదల మందగించి మరుగుజ్జులుగా మారుతారు. ఈస్థితిని పీయూష
- మరుగుజ్జుతనం (Dwarfism) అంటారు.
- బాల్యదశలో పెరుగుదల హార్మోన్ అధికస్రావం వల్ల ఎముకల పొడవు అసాధారణంగా పెరుగుతుంది. ఈ స్థితిని అతిదీర్ఘకాయత్వం (Gigantism) అంటారు.
- ప్రౌఢ దశలో పెరుగుదల హార్మోన్ అధిక స్రావం వల్ల కాళ్లు, చేతులు, దవడ ఎముకలు, దళసరిగా మారుతాయి. కనురెప్పలు, పెదవులు,
- నాలుక పెద్దగా అవుతాయి. ఈ స్థితిని ‘ఏక్రోమెగాలి’ అంటారు.
అవటు గ్రంథి ఉద్దీపన హార్మోన్ (TSH): - ఇది అవటు గ్రంథి (thyroid Gland) నుంచి థైరాయిడ్ హార్మోన్ల సంశ్లేషణను, హార్మోన్లు స్రవించడాన్ని ప్రేరేపిస్తుంది.
అధివృక్క వల్కల ఉద్దీపన హార్మోన్ (ACTH): - ఇది అధివృక్క గ్రంథి వల్కలం నుంచి గ్లూకోకార్టికాయిడ్ల స్రావాన్ని నియంత్రిస్తుంది.
పుటిక ఉద్దీపన హార్మోన్ (FSH): - స్త్రీలలో అండ పుటికల అభివృద్ధిని, పురుషుల్లో ముష్కాల్లోని శుక్రోత్పాదక నాళికల్లో శుక్ర కణోత్పాదనను ప్రేరేపిస్తుంది.
లూటినైజింగ్ హార్మోన్ (LH): - ఇది పురుషుల ముష్కాల్లోని మధ్యంతర లేదా లీడిగ్ కణాలను ప్రేరేపించి టెస్టోస్టిరాన్ హార్మోన్ విడుదలకు, స్త్రీలలో అండోత్సర్గాన్ని కార్పస్ లూటియం ఏర్పడటాన్ని, దాని నుంచి ప్రొజెస్టిరాన్ హార్మోన్ విడుదలకు తోడ్పడుతుంది.
ప్రొలాక్టిన్ (PRL): - ఇతర హార్మోన్లతో కలిసి క్షీరగ్రంథుల నుంచి పాల ఉత్పత్తిని కొనసాగిస్తుంది.
మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (MSH): - దీన్ని పార్స్ ఇంటర్మీడియాకు చెందిన కణాలు స్రవిస్తాయి. నిమ్నస్థాయి సకశేరుకాల్లో
మెలనిన్ రేణువులు వ్యాప్తిచెందడాన్ని ప్రేరేపించడం ద్వారా చర్మ వర్ణాన్ని అధికం చేస్తుంది.
2. న్యూరో హైపోఫైసిస్
హార్మోన్లను సంశ్లేషణ చేయదు. కానీ ఆక్సిటోసిన్, వ్యాసోప్రెసిన్ అనే హార్మోన్లను నిల్వ చేసి, విడుదల చేస్తుంది.
ఆక్సిటోసిన్:
శిశు జనన సమయంలో గర్భాశయ కుడ్యంలోని నునుపు కండర కణాల సంకోచాన్ని పెంచుతుంది. శిశు జననానంతరం క్షీర గ్రంథుల నుంచి పాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.
వ్యాసోప్రెసిన్:
దీన్నే యాంటీ డయూరటిక్ హార్మోన్ (ADH) అంటారు. ఈ హార్మోన్ ప్రభావం వల్ల మూత్రపిండాల నుంచి ఎక్కువ నీరు రక్తంలోకి పునఃశోషణం చెందుతుంది. ఈ హార్మోన్ లోపిస్తే మూత్ర పరిమాణం రోజుకు 20 లీటర్లకు పెరుగుతుంది. దీన్నే అతిమూత్ర వ్యాధి లేదా డయాబెటిస్ ఇన్సిఫిడస్ అంటారు.
థైరాయిడ్ గ్రంథి
- అంతఃస్రావక గ్రంథులన్నింటిలో అతిపెద్ద గ్రంథి. స్వరపేటిక ఉపరితలంలో ఉంటుంది.
- ఈ గ్రంథిలోని కుడి, ఎడమ లంబికలు ఇస్తమస్తో కలిసి ఉంటాయి.
- థైరాయిడ్ గ్రంథిలోని కణాలు రెండు రకాల హార్మోన్లను విడుదల చేస్తాయి. అవి థైరాక్సిన్ లేదా టెట్రా అయడో థైరోనిన్, ట్రై అయడోథైరోనిన్ లేదా T3
- థైరాయిడ్ గ్రంథి పుటికల మధ్య ఉండే పుటిక పార్శ కణాలు కాల్సిటోనిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి.
- థైరాక్సిన్ అధిక స్రావం వల్ల హైపర్‌థైరాయిడిజమ్, అల్ప స్రావం వల్ల హైపోథైరాయిడిజమ్ అనే అపస్థితులు కలుగుతాయి.
- హైపోథైరాయిడిజమ్ వల్ల క్రిటినిజమ్, మిక్సోడిమా వ్యాధులు కలుగుతాయి.
- హైపర్‌థైరాయిడిజమ్ వల్ల గ్రేవ్స్, ఎక్సాఫ్తాల్మిక్ గాయిటర్ వ్యాధులు సంభవిస్తాయి.
- అవటు గ్రంథి పెద్దగా కావడాన్ని సరళ గాయిటర్ అంటారు.
- అయోడిన్లోపం వల్ల ఈ వ్యాధి సంభవిస్తుంది.
అధివృక్క గ్రంథి
- ప్రతి మూత్రపిండం పైన టోపీ ఆకారంలో ఉండే గ్రంథులు అధివృక్క గ్రంథులు.
- ఇది అధివృక్క వల్కలం, అధివృక్క దవ్వగా విభజించి ఉంటుంది.
- అధివృక్క వల్కలం జీవి మనుగడకు అవసరమైన స్టిరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.
- అధివృక్క దవ్వ నార్ఎపీనెఫ్రిన్, ఎపీనెఫ్రిన్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. కొద్దిమోతాదులో డోపమైన్‌ను కూడా ఉత్పత్తి చేస్తుంది.
- అధివృక్క వల్కలం మినరలో కార్టికాయిడ్స్, గ్లూకోకార్టికాయిడ్స్, లైంగిక కార్టికాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.
- అధివృక్క దవ్వ విడుదల చేసే నార్ఎపీనెఫ్రిన్, ఎపీనెఫ్రిన్ హార్మోన్లు మానసిక ఉద్రేకాలను కలుగజేస్తాయి. అందుకే వీటిని పోరాట లేదా పలాయన హార్మోన్లు అంటారు.
- అధివృక్క వల్కలం ఉత్పత్తి చేసే హార్మోన్లు అధికంగా స్రవించడం వల్ల కుషింగ్ సిండ్రోమ్, హైపర్ైగ్లెసీమియా, ఆస్టియోపోరోసిస్ లాంటి వ్యాధులు కలుగుతాయి.
- గ్లూకోకార్టికాయిడ్స్, ఆల్డోస్టిరాన్ల అల్పస్రావం వల్ల అడిసన్స్ వ్యాధి కలుగుతుంది.
ముష్కాలు
ఇవి లైంగిక హార్మోన్లను స్రవిస్తాయి. ముష్కాలు స్రవించే హార్మోన్లను ఆండ్రోజన్లు అంటారు. ముష్కాలు టెస్టోస్టిరాన్ అనే హార్మోన్‌ను స్రవిస్తాయి. ఈ హార్మోన్ పురుషుల్లో ద్వితీయ లైంగిక లక్షణాలను ప్రేరేపిస్తుంది.
స్త్రీబీజ కోశాలు
ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు ప్రధానంగా స్త్రీబీజ కోశాల నుంచి విడుదలవుతాయి. ఈస్ట్రోజన్ స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలను ప్రేరేపిస్తుంది. ప్రొజెస్టిరాన్ గర్భధారణ కోసం గర్భాశయాన్ని సిద్ధం చేస్తుంది.
క్లోమ గ్రంథి
ఇది మిశ్రమ గ్రంథి. బహిస్రావక, అంతఃస్రావక లక్షణాలను కలిగి ఉంటుంది. క్లోమంలోని ప్రత్యేక కణాల గుంపును లాంగర్‌హాన్స్ పుటికలు అంటారు. వీటిలోని ప్రత్యేక కణాలు వివిధ రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి.
ఇతర గ్రంథులు
1. పీనియల్ గ్రంథి
ఇది మెదడు మూడో కోష్టకం పైకప్పుకు అతికి ఉండే చిన్న గ్రంథి. ఇది మెలటోనిన్, ఇతర హార్మోన్లను స్రవిస్తుంది. మెలటోనిన్ దేహపు
జీవగడియారం అమలు చేయడంలో పాలుపంచుకుంటుంది.
2. బాల గ్రంథి
దీన్నే థైమస్ గ్రంథి అని కూడా అంటారు. ఇది హృదయానికి ముందు ఉదర భాగంలో ఉండే బల్లపరుపు గ్రంథి. ఇది ప్రౌఢ జీవుల్లో క్షీణించి
ఉంటుంది. ఈ గ్రంథి T కణాల పరిణితిని పెంపొందించే థైమోసిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది.
3. సహ అవటు గ్రంథులు
వీటినే పారాథైరాయిడ్ గ్రంథులు అంటారు. థైరాయిడ్ గ్రంథికి పార్శభాగంలో రెండు జతలు పాక్షికంగా ఇమిడి ఉంటాయి. ఈ గ్రంథులు
పారాథార్మోన్ను స్రవిస్తాయి. ఈ హార్మోన్ మూత్రం ద్వారా కాల్షియం కోల్పోవడాన్ని నిరోధిస్తుంది.
ప్రాక్టీస్ బిట్స్
1. కింది వాటిలో పప్టైడ్ హార్మోన్‌ను గుర్తించండి.
1) టెస్టోస్టిరాన్ 2) ఇన్సులిన్
3) టైరోసిన్ 4) థైరాక్సిన్
2. కింది వాక్యాల్లో తప్పుగా ఉన్న దాన్ని గుర్తించండి.
1) ప్రొలాక్టిన్ క్షీరగ్రంథుల నుంచి పాల ఉత్పత్తిని ప్రారంభించి కొనసాగిస్తుంది
2) కార్టిసాల్, ఆల్డోస్టిరాన్ హార్మోన్లను న్యూరోహైపోఫైసిస్ స్రవిస్తుంది
3) మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్‌ను పార్స్ ఇంటర్మీడియాకు చెందిన కణాలు స్రవిస్తాయి
4) లూటినైజింగ్ హార్మోన్ స్త్రీలలో అండోత్సర్గాన్ని ప్రేరేపిస్తుంది
3. ఏ హార్మోన్ లోపించడం ద్వారా మూత్ర విసర్జన పరిమాణం పెరిగి అతిమూత్ర వ్యాధికి దారితీస్తుంది?
1) వ్యాసోప్రెసిన్ 2) ఆక్సిటోసిన్
3) ఆల్డోస్టిరాన్ 4) ఇన్సులిన్
4. హైపోథైరాయిడిజమ్ వల్ల పిల్లల్లో కలిగే వ్యాధి?
1) మిక్సోడిమా 2) గ్రేవ్స్ వ్యాధి
3) క్రిటినిజం 4) గాయిటర్
5. పోరాట లేదా పలాయన హార్మోన్‌గా దేన్ని పిలుస్తారు?
1) ఎపినెఫ్రిన్ 2) కార్టిసాల్
3) ఆల్డోస్టిరాన్ 4) మెలనిన్
6. థైరాయిడ్ గ్రంథి పుటికా పార్శకణాలు విడుదల చేసే హార్మోన్?
1) థైరాక్సిన్ 2) ట్రై అయడో థైరోనిన్
3) కాల్సిటోనిన్ 4) పారాథార్మోన్
7. బహిస్రావ, అంతఃస్రావక గ్రంథిగా దేన్ని పిలుస్తారు?
1) థైరాయిడ్ గ్రంథి 2) క్లోమం
3) అధివృక్క గ్రంథి 4) పీయూష గ్రంథి
8. అతిదీర్ఘకాయత్వం, మరుగుజ్జుతనం ఏ హార్మోన్ ప్రభావం వల్ల సంభవిస్తాయి?
1) పీయూష గ్రంథి న్యూరోహైపోఫైసిస్ హార్మోన్లు ఆక్సిటోసిన్, వ్యాసోప్రెసిన్
2) పీయూష గ్రంథి ఎడినోహైపోఫైసిస్లోని పెరుగుదల హార్మోన్
3) అధివృక్క గ్రంథి వల్కలం హార్మోన్లు కార్టిసాల్, ఆల్డోస్టిరాన్
4) అధివృక్క గ్రంథి దవ్వ హార్మోన్లు నార్‌ఎపినెఫ్రిన్, ఎపినెఫ్రిన్
9. జత పరచండి.
ఏ బీ
1. ఆల్ఫాకణాలు ఏ. సోమటోస్టాటిన్
2. బీటా కణాలు బీ. పాంక్రియాటిక్ పాలీపెప్టైడ్
3. డెల్టా కణాలు సీ. ఇన్సులిన్
4. F కణాలు డీ. గ్లూకగాన్
సమాధానాలు
1. 2 2. 2 3. 1 4. 3 5. 1 6. 3 7. 2 8. 2 9.1
స్కూల్ అసిస్టెంట్
జడ్పీహెచ్ఎస్, లింగంపల్లి, రంగారెడ్డి జిల్లా
9000674747
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు