ప్రపంచీకరణ.. వలస దోపిడీ
సరళీకరణ (Liberalization), ప్రైవేటీకరణ (Privatization), ప్రపంచీకరణ (Globalization) భావన (ఎల్పీజీ) వ్యాప్తి ప్రపంచ దేశాల ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిణామాలను ప్రభావితం చేసింది. ఇది తెలంగాణ సమాజంపై ఆంధ్రాపాలకుల పక్షపాతపాలన మరింత దుష్ఫలితాలను మిగిల్చింది. ఈ నేపథ్యాన్ని చారిత్రక కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. రెండో ప్రపంచ యుద్ధానంతరం ద్విధ్రువ ప్రపంచం ఏర్పడింది. ఒకటి USSR ఆధ్వర్యంలోని సోషలిస్టు శిబిరం, మరోటి USA ఆధ్వర్యంలోని పెట్టుబడిదారీ శిబిరం. నూతనంగా స్వాతంత్య్రం పొందిన దేశాలు అలీన విధానంపై ఐక్యమయ్యాయి. రెండు శిబిరాల మధ్య ఏర్పడిన యుద్ధ వాతావరణాన్ని ప్రచ్ఛన్నయుద్ధంగా గుర్తించారు.
-1990లో USSR పతనానంతరం ప్రపంచమంతా అమెరికా ఆధ్వర్యంలో ఏకధ్రువ ప్రపంచంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే పెట్టబడిదారీ విధానానికి మూలసూత్రమైన స్వేచ్చా వాణిజ్యం ప్రపంచమంతా వ్యాపించింది.
సరళీకరణ
-ఏదైనా సంస్థ స్థాపించడానికి వ్యాపారానికి అనుమతి ఇవ్వడం, దాని కోటా నిబంధనలను తొలగించడం అనే ప్రక్రియ. అంటే ప్రభుత్వ ప్రమేయాన్ని తగ్గించడం లేదా ఆంక్షలు తొలగించడం. ఈ సైద్ధాంతిక అంశం ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్ఛా వాణిజ్యానికి వాతావరణాన్ని ఏర్పాటు చేసింది.
ప్రైవేటీకరణ
-ఒక సంస్థ యాజమాన్యాన్ని ప్రభుత్వం నుంచి ప్రైవేటు వ్యక్తులకు లేదా సంస్థలకు బదిలీ చేయడాన్ని ప్రైవేటీకరణ అంటారు. పర్యవేక్షణ, నియంత్రణ ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంటుంది.
ప్రపంచీకరణ
-దేశాల మధ్య ఎటువంటి ఆంక్షలు లేకుండా వ్యవహారాలు నిర్వహించబడతాయి. అంటే దేశాల మధ్య సరిహద్దులు పటంలో మాత్రమే ఉంటాయి. వనరులు, విజ్ఞానం, శ్రమశక్తి, సంపద దేశాల సరిహద్దులను దాటి ప్రపంచమంతా విస్తరిస్తాయి. ఎల్పీజీ నేపథ్యంలోనే WTO ఏర్పడింది. భారతదేశం WTO (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్) సభ్య దేశాల్లో చేరి ప్రపంచీకరణలో భాగమైంది.
ఎల్పీజీ భారతదేశం
-భారతదేశం 1991లో ఆర్థికవిధానాలకు NIEO (నూతన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ) అనుగుణంగా ప్రారంభమయ్యాయి. అప్పటి భారత ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ సంస్కరణలకు మూలం. ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశం భారతీయ ఆర్థికరంగాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయడం.
ప్రాంతీయ అసమానతలు
-WTOలో సభ్యదేశంగా చేరిన భారతదేశంలో పెట్టుబడులు విపరీతంగా రావడం/ప్రవహించడం ప్రారంభమైంది. అయితే అభివృద్ది పట్టణ కేంద్రంగా (City Oriented) సాగింది. అభివృద్ధి చెందిన ప్రాంతాలకే మరింత అభివృద్ధి చేకూరింది. అభివృద్ధికి ప్రజాసంక్షేమం లక్ష్యం కాకుండా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే వ్యవస్థను నిర్మించడం లక్ష్యంగా మారడంతో ప్రాంతీయ అసమానతలకు దారితీసింది. పంజాబ్, హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు మొదలైన రాష్ర్టాలు పెట్టుబడులను ఎక్కువగా ఆకర్షించగా, బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, అసోం మిగిలిన ఈశాన్య రాష్ర్టాలకు పెట్టుబడుల ప్రవాహం తగినంతగా వెళ్లలేదు. అదే విధంగా కొన్ని రాష్ర్టాల్లో అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. ఉదాహరణకి గుజరాత్‌లోని కచ్, సౌరాష్ట్ర ప్రాంతాలు, ఒడిశాలోని కలహండీ ప్రాంతం, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ, కర్ణాటకలోని కుర్గ్ ప్రాంతం, బెంగాల్‌లోని పర్వత ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్‌లోని ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌లోని ఆదివాసీ ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా నెట్టివేయబడ్డాయి. దీంతో ఆ ప్రాంతాల్లో ప్రాంతీయ ఉద్యమాలు ఆవిర్భవించాయి.
రాజకీయ అసమానతలు, సాంఘిక మార్పులు
-రాజకీయ రంగం ధన ప్రవాహానికి లోనై ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు MNCల నుంచి పెట్టుబడిదారుల నుంచి ధనం అందుతుంది.
-ధనికులు మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతున్నారు. సాంఘిక వ్యవస్థలో వినిమయ సంస్కృతి పెరిగింది. మానవ సంబంధాల్లో వ్యాపార సంస్కృతి విస్తరించి భారతీయ సమాజంలో/విలువల్లో సంక్షోభం మొదలైంది.
-ఈ ప్రభావం ప్రజలు, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక విధానాలపై ప్రభావం చూపింది.
ఉమ్మడిలో ప్రాంతీయ అసమానతలు
-ఉపాధి అవకాశాలకు, పెట్టుబడుల విస్తరణకు ఎల్పీజీ అవకాశాలు కల్పించినప్పటికీ అభివృద్ధిలో ప్రాంతీయ అసమానతలకు పునాదులు పడ్డాయి. తెలంగాణ ప్రాంతీయ కమిటీ రద్దుతో ఈ ప్రాంతీయ అసమానతలకు నియంత్రణ జరుగలేదు. రాజా చెల్లయ్య కమిటీ కేంద్రంలో, సుబ్రమణ్యం కమిటీ రాష్ట్రంలో అధ్యయనం చేసి ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటులో కలిపేందుకు/మూసివేసేందుకు నిషేధించింది. దీనివల్ల తెలంగాణలో అనేక పరిశ్రమలు మూసివేయబడ్డాయి. అవి.
1. ఆజంజాహీమిల్లు (వరంగల్)
2. బోధన్షుగర్ ఫ్యాక్టరీ (నిజామాబాద్, బోధన్)
3. పేపర్ ఫ్యాక్టరీ (సిర్పూర్, కాగజ్‌నగర్)
4. ఆల్విన్ ఫ్యాక్టరీ (హైదరాబాద్)
-ఈ ఫ్యాక్టరీల మూసివేతల కారణంగా ఉపాధి అవకాశాలు తగ్గిపోయి నిరుద్యోగానికి దారితీసింది. విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ గ్రిడ్లు ప్రైవేటు పరమయ్యాయి. వీటిలో 100 శాతం ఆంధ్రా పెట్టుబడిదారుల చేతిలో ఉన్నాయి. పారిశ్రామిక రంగం మిగులును కోస్తాంధ్రకు తరలించడంతో తలసరి ఆదాయంలో విశాఖపట్నం, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు అగ్రస్థానానికి చేరాయి. మరోవైపు ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్, నల్లగొండ జిల్లాలో సగటు కంటే తక్కువ అభివృద్ధి నమోదైంది. దేశంలో ఎన్నికల వ్యయం అధికంగా జరిగే రాష్ట్రంగా ఉమ్మడి రాష్ట్రం గుర్తించబడింది.
-సీఎం పదవి ఆంధ్ర, రాయలసీమ వారి చేతిలోనే ఉండిపోయింది. అదే విధంగా ముఖ్యమైన క్యాబినెట్ హోదాలు వారికే దక్కాయి. ధనికవర్గం నుంచి ఎమ్మెల్యేలు, వారసత్వ రాజకీయాలను ప్రభావితం చేశారు.
విద్యా, ఉపాధి రంగం
-విద్యారంగంలో కార్పొరేట్ విద్యపై ఆధారపడేలా కృత్రిమ వాతావరణం ఏర్పడింది. సర్కారీ విద్యపై ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించారు. ప్రధానంగా విశ్వవిద్యాలయాల ఏర్పాటులో, వనరుల కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. సింగరేణిలో ఓపెన్‌కాస్ట్ మైనింగ్ ద్వారా వనరుల దోపిడీ పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య గణనీయంగా తగ్గించారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు, ఔట్సోర్సింగ్ ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేశారు. తెలంగాణను వలస ప్రాంతంగా, పరాయి ప్రాంతంగా మార్చారు. దీంతో తెలంగాణలో అస్థిత్వ, ఆర్థిక, సాంఘిక సంక్షోభం ఏర్పడింది. దీని ప్రభావం వ్యవసాయరంగంపై, చేతివృత్తులపై గణనీయంగా పడింది. ఆంధ్రాపాలకుల పక్షపాత దోరణితో ఈ రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి.
వ్యవసాయ రంగం- సంక్షోభం
-ఎల్పీజీ ప్రభావంతో వినిమయ వస్తువులకు, వాణిజ్య పంటలకు ప్రాధాన్యం పెరిగింది. రియల్ ఎస్టేట్ సెజ్‌ల ఏర్పాటుతో వ్యవసాయ భూములు వ్యవసాయేతర రంగాలకు ఉపయోగించారు. WTO ఒప్పందంతో సబ్సిడీలు తగ్గించారు. దీనివల్ల వ్యవసాయానికి ఉపయోగపడే భూమి శాతం తగ్గి, ఖర్చులు పెరిగాయి.
1. రైతులకు అవసరమైన ఫర్టిలైజర్ ధరలు 8-10 రెట్లు పెరిగాయి.
2. కూలీ రేట్లు 4 రెట్లు పెరిగాయి. కానీ వ్యవసాయ ఉత్పాదక రేట్లు అదేస్థాయిలో మిగిలాయి.
3.ఉత్పాదక వ్యయం 5 – 8 రెట్లు పెరిగింది. 1956లో వ్యవసాయ భూమి 46,57,287 హెక్టార్లు ఉండగా, ఇది 2015 నాటికి 40 లక్షల హెక్టార్లకు పడిపోయింది.
4. వ్యవసాయ పంపుసెట్లు 1956లో 230 ఉండగా, 2015 నాటికి 25 లక్షలకు చేరుకున్నాయి.
5. దేశంలో వ్యవసాయానికి విద్యుత్‌ను వినియోగిస్తున్న రాష్ర్టాల్లో మహారాష్ట్ర తర్వాత తెలంగాణ ఉంది.
6. నిరంతర కరువుతో ఆహార పంటల స్థానంలో వాణిజ్య పంటలను పండించడం వ్యవసాయ సంక్షోభానికి కారణం.
7.ప్రభుత్వపరంగా వ్యవసాయానికి ప్రోత్సాహం తగ్గింది. మొదటి పంచవర్ష ప్రణాళికలో 56 శాతం ఉండగా, ఇది 12వ ప్రణాళిక కాలం నాటికి 5 శాతానికి తగ్గించారు.
8. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో ప్రకారం గత 20 ఏండ్లలో 26,948 (2015 నవంబర్ 1) మంది రైతులు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారు. 2005లో అగ్రికల్చర్ ప్రొడ్యూసరీ మార్కెట్ కమిటీ పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా చట్టం చేసింది. అయినా వ్యవసాయరంగం నేటికీ దళారుల చేతిలోనే ఉంది.
9. 2002 నాటికి బ్యాంకింగ్ చట్టాలు వ్యవసాయదారులకు రుణాలు అందకుండా అడ్డుకున్నాయి. బ్యాంక్ రంగాల్లో 16 శాతానికి మించి చేరలేదు.
10. 2013 కేంద్ర నివేదికను అనుసరించి తెలంగాణలో రైతు కుటుంబానికి సగటు ఆదాయం నెలకు రూ. 4,500. అప్పు సగటు మాత్రం రూ. 94,000. తెలంగాణలో 55 శాతానికి పైగా రైతు కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లుగా ఈ నివేదిక వెల్లడించింది.
11. ఒకప్పుడు తెలంగాణను కౌస్టన్ బౌల్ ఆఫ్ ఇండియా (ఆముదాల పంటకు ప్రసిద్ధి)గా గుర్తించారు. ఇప్పుడు ఆముదాల ఉత్పత్తి ఆగింది. పప్పుధాన్యాల ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేదు. ఇవి వ్యవసాయ సంక్షోభానికి గల కారణాలు.
ఎల్పీజీతో చేతివృత్తులపై ప్రభావం
-2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభాలో అర్ధభాగం చేతివృత్తులవారే.
ఎల్పీజీ నేపథ్యంలోనే చేనేత వృత్తులు
1. ఎల్పీజీ ప్రభావంతో ప్లాస్టిక్ పరిశ్రమ ప్రపంచ విస్తరణ
2. వ్యవసాయ రంగంలో భారీ యంత్రాలు
3. మానవ వనరులకు ప్రాధాన్యత తగ్గుదల
-దీనివల్ల ఉపాధి కొల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డు ప్రకారం 1995 నుంచి నేటి వరకు 600 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో 119 మం ది స్వర్ణకారులు, మిగతావారు చేనేత కార్మికులు ఉన్నారు.
4. వలసలతో తెలంగాణ పల్లెలు ఖాళీ అయ్యాయి. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారిలో చాలామంది చేతివృత్తుల వారే.
5. నేత కార్మికులు మాత్రం సూరత్, భీవండి, షోలాపూర్‌లకు వలస వెళ్తున్నారు.
వ్యవస్థలో లోపాలు
1. ఆధునీకరణకు ప్రయత్నాలు జరుగకపోవడం
2. తెలంగాణ, రాజస్థాన్, జమ్ముకశ్మీర్, గుజరాత్ రాష్ర్టాల మాదిరిగా వీరికి ఆర్థిక చేయూత అందకపోవడం ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యాలు కల్పించకపోవడం, విదేశాలకు ఎగుమతి జరుగకపోవడం.
3. తెలంగాణ టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆదరణ పథకం ఆధునీకరణ పరికరాల పంపిణీ చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ అభ్యుదయ యోజన పథకాన్ని చేపట్టింది. ఈ పథకాలు లక్ష్యసాధనలో విఫలమయ్యాయి.
4. ప్రస్తుత ప్రభుత్వానికి బీసీ సహకార సమాఖ్యను ఏర్పాటు చేసింది. దీనివల్ల కుల సమాఖ్యలు ఏర్పాటయ్యాయి. వీటిని వృత్తి సంఘాలుగా గుర్తించారు. ఈ పథకం కింద 31,401 మందికి రూ.173.04 కోట్ల సహాయం కోసం ఉత్తర్వులు ఇచ్చింది. దీనివలన రూ.86.52 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద, మిగిలింది బ్యాంకుల రుణాల కింద అందచేయాలి. అయితే బ్యాంకుల సహకారం ఆశించినంతగా లేకపోవడంతో ఈ పథకం ప్రశ్నార్థకంగా మారింది.
-ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన మార్పులను ఆంధ్రాపాలకులు తమ ప్రాంతాలకు అనుకూలంగా మార్చుకోవడంతో తెలంగాణ ప్రాంతంలో, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి నిస్తేజంగా మారింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు