economy | ప్రణాళికలు -విధులు- ఆవశ్యకత-లక్ష్యాలు
- ప్రణాళిక అనే భావనకు ఆర్థిక వ్యవస్థలో చాలా ప్రాధాన్యం ఉంది.
- ప్రణాళిక అనేది మానవ ప్రవర్తనలో ఒక అంతర్భాగం.
- ఒక వ్యక్తిగాని, ఒక సంస్థగాని, ఒక రంగంగాని అభివృద్ధి చెందాలంటే నిర్దిష్ట ప్రణాళిక అవసరం.
- అలాగే ఒక గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం, ఒక దేశం అభివృద్ధి చెందాలంటే నిర్దిష్ట ప్రణాళిక అవసరం.
- ఈ ప్రణాళికల ప్రాధాన్యాన్ని ప్రపంచంలో మొదట గుర్తించిన దేశం రష్యా
- ప్రపంచంలో మొట్టమొదట జాతీయ ప్రణాళికలను అమలు చేసి త్వరితగతిన అభివృద్ధి దశకు చేరింది రష్యా.
- రష్యాలో అమలు చేసిన ప్రణాళిక విధానానికి ప్రపంచంలోని ఇతర దేశాలు ప్రేరేపితులై తమ దేశాలలో కూడా ప్రణాళిక బద్ధమైన అభివృద్ధిని సాధించాలని నిర్ణయించుకున్నాయి.
- అలాగే భారతదేశం కూడా తనదైన శైలిలో ప్రణాళికలను అమలు చేయాలని దేశంలోని వనరులను బట్టి అంటే సహజ, మానవ, ఆదాయ వనరులను బట్టి, ఆర్థిక స్థితిగతులను బట్టి, వాటి ప్రాధాన్యాన్ని బట్టి తమకు అనువైన ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని నిర్ణయించుకుంది.
- ఈ ప్రణాళికల రూపకల్పనకు ఒక ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాక ప్రణాళిక సంఘం తయారు చేసిన ప్రణాళికలను పరిశీలించి ఆమోదించడానికి జాతీయాభివృద్ధి మండలిని కూడా ఏర్పాటు చేసింది.
- ప్రణాళిక సంఘం, జాతీయాభివృద్ధి మండలి గురించి గత సంచికలో వివరంగా నేర్చుకున్నాం.
ప్రణాళికా సంఘం విధులు
- దేశంలోని వనరులను అంటే సహజ వనరులను, మానవ వనరులను, ఆర్థిక వనరులను అంచనావేసి ఉపయోగించటం.
- వనరుల వినియోగానికి తగిన ప్రణాళికలను రూపొందించడం.
- దేశ అవసరాలు, ప్రాధాన్యాన్ని బట్టి దశల వారీగా వనరులను కేటాయించి, ఉపయోగించడం.
- ప్రణాళికల అమలులో ఆర్థికాభివృద్ధికి గల ఆటంకాలను గుర్తించడం. ప్రణాళికల అమల్లో పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు సర్దుబాటు చేయడం.
- ప్రణాళికల అమల్లో సాధించిన పురోగతిని క్రమం తప్పకుండా నమోదు చేయడం. అవసరమైన సందర్భాల్లో దిద్దుబాటు, సిఫారసులను ప్రతిపాదించడం.
ప్రణాళికల ఆవశ్యకత
- వెనుకబడిన ఆర్థిక వ్యవస్థను త్వరితగతిన అభివృద్ధి దశకు తీసుకురావాలి అంటే ప్రణాళికల అమలు అవసరం.
- ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక కేంద్రీకరణను ఛేదించి ఆర్థిక వికేంద్రీకరణ సాధించాలంటే ప్రణాళికల అమలు తప్పనిసరి.
- దేశాభివృద్ధి, దీర్ఘకాలిక లక్ష్యాలు సాధించాలంటే ప్రణాళికలను తప్పనిసరిగా అమలు చేయాలి.
- ఆర్థిక వ్యవస్థలో, సామాజిక వ్యవస్థలో అసమానతలను తగ్గించాలంటే, వృద్ధి ఫలాలు అందరికి అందాలంటే, సాంఘిక న్యాయం సాధించాలంటే ప్రణాళికల అమలు జరగాలి.
- ఒక దేశ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రతి ప్రణాళికకు కొన్ని నిర్దిష్ట లక్ష్యాలు అవసరం.
1) ఆర్థిక వృద్ధి (Economic Growth): - జాతీయాదాయంలో వార్షిక వృద్ధి రేటును పెంపొందించడం ఉత్పత్తిలోని పెరుగుదలను కొనసాగించి తద్వారా ఆదాయాన్ని వృద్ధి చేయాలి. ఈ ఉత్పత్తిలో భారీ పెరుగుదలకు ఇటు వ్యవసాయ రంగాన్ని అటు పారిశ్రామిక రంగాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేయాలి. తద్వారా జాతీయాదాయం పెరిగి వృద్ధి రేటు పెరుగుతుంది.
తలసరి ఆదాయాన్ని పెంచి జీవన ప్రమాణ స్థాయిని పెంచడం (Increasing the PCI and Standard of living of the People) - దేశంలోని ప్రజల తలసరి ఆదాయం పెంచి తద్వారా జీవన ప్రమాణస్థాయిని పెంచాలి. అందుకు జనాభా పెరుగుదల రేటును తగ్గించి ఆదాయ పెరుగుదల రేటును పెంచాలి. అందుకు ఉత్పత్తి, ఉపాధి అవకాశాలను పెంచాలి అప్పుడు ఆదాయం పెరిగి జాతీయాదాయం, తలసరి ఆదాయం పెరిగి జీవన ప్రమాణస్థాయి పెరుగుతుంది.
ఉపాధి అవకాశాల పెరుగుదల (Increasing the Employment Opportunities) - భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రధాన సమస్య నిరుద్యోగం. ఇటు గ్రామీణ ప్రాంతాల్లో రుతు సంబంధ నిరుద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత, అటు పట్టణ ప్రాంతాల్లో అసంఘటిత రంగంలో నిరుద్యోగిత, విద్యావంతుల్లో నిరుద్యోగిత ఎక్కువగా ఉంది.
- వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించి అభివృద్ధి పరచడమే కాక నూతన పరిశ్రమలను స్థాపించి, విస్తరించి, అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలను పెంచడం ప్రణాళికల ముఖ్య ఉద్దేశం.
పేదరిక నిర్మూలన
- ప్రపంచంలో వివిధ దేశాలు ఎదుర్కొం టున్న సమస్యల్లో పేదరికం ఒకటి. ముఖ్యంగా భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య.
- భారతదేశంలో పేదరిక రేఖకు దిగువన అధిక శాతం జనాభా జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో అంటే 2006-21 సంవత్సరాల మధ్య (15 సంవత్సరాల కాలంలో) 415 మిలియన్ల మంది పేదరికం నుంచి బయట పడ్డారు అని యూఎన్డీపీ తెలిపింది.
- అదే విధంగా పేదరికం 55.1 శాతం నుంచి 16.4 శాతం తగ్గిందని గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ తెలిపింది. అయినప్పటికీ పేదరికం అనేది ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా ఉంది. పేదరిక నిర్మూలన లేకుంటే అభివృద్ధి సాధ్యంకాదు. కాబట్టి పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం వివిధ ప్రణాళికలతో వివిధ రకాల పథకాలను అంటే గ్రామీణ, పట్టణ ఉపాధి పథకాలు, అఖిల భారత స్థాయి పథకాలు, సామాజిక భద్రత పథకాలు అమలు చేస్తుంది.
ఆదాయ, సంపద అసమానతలను తొలగించుట (Reduction in Income, Wealth Inequalities) - భారతదేశంలో ఆదాయ సంపద పంపిణీ అసమానతలు ఎక్కుగా ఉన్నాయి. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం అయ్యింది. అంటే ఆర్థిక శక్తి కేంద్రీకరణ జరిగింది. కాబట్టి ఆర్థిక శక్తి కేంద్రీకరణ నివారించి ఆర్థిక శక్తి వికేంద్రీకరణ ద్వారా ఆదాయ అసమానతలను తగ్గించి సామ్యవాద సమాజ స్థాపన ప్రణాళికల ముఖ్య లక్ష్యం.
ప్రాంతీయ అసమానతలను తొలగించుట(Removal of Regional Imbalances) - భారత్వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది మరికొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. ఈ అసమానతలు రాష్ర్టాలు, ప్రాంతాలు, జిల్లాలు, మండలాలు, గ్రామల మధ్య ఉన్నాయి. ఈ అసమానతలను వివిధ సంస్కరణల ద్వారా తగ్గించి ప్రాంతీయ సమానత్వాన్ని, ఆర్థిక సమానత్వాన్ని సాధించడం ప్రణాళికల లక్ష్యం.
ఆధునికీకరణ (Modernization) - సంస్థాగత, వ్యవస్థాపూర్వక మార్పులను ప్రవేశ పెట్టడం ఆధునికీకరణగా చెప్పవచ్చు. ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల్లో ఉత్పాదకతను పెంపొందించడానికి శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి, హేతుబద్ద నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తూ ఆధునికీకరణ సాధించడం ప్రణాళికల ప్రధాన లక్ష్యం
పదజాలం
అసమానతలు (Inequalities)
- వ్యక్తుల మధ్య ఆదాయ సంపద వ్యత్యాసాలను అసమానతలు అంటారు.
ఆదాయ సంపద పంపిణీ అసమానతలు - జాతీయాదాయంలో కొంతమందికి ఎక్కువ ఆదాయం, మరికొంత మందికి తక్కువ ఆదాయం పంపిణీ అయినట్లయితే దానిని ఆదాయ సంపద పంపిణీ అసమానతలు అంటారు.
ప్రాంతీయ అసమానతలు (Regional Imbalances) - ఒక దేశంలోని కొన్ని రాష్ర్టాలు అభివృద్ధి చెంది ఉండి, మరికొన్ని రాష్ర్టాలు వెనుకబడి ఉండటం ఒక రాష్ట్రంలో కొన్ని ప్రాంతా లు అభివృద్ధి చెంది ఉండి, మరికొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉంటే దాన్ని ప్రాంతీయ అసమానతలు అంటారు.
ఆర్థిక శక్తి కేంద్రీకరణ (Concentration of Economic Power) - పెట్టుబడి పెట్టే శక్తి లేదా కంపెనీల వాటాలు లేదా సంపద కొద్దిమంది చేతుల్లో ఉండటాన్ని ‘ఆర్థిక శక్తి కేంద్రీకరణ’ అంటారు.
సాంఘిక భద్రత (Social Security) - సమాజంలోని వ్యక్తుల పట్ల ఎలాంటి వివక్ష లేకుండా అందరి జీవితాలకు భద్రత కల్పించే బీమా సదుపాయమే ‘సాంఘిక భద్రత’ అంటారు. దీనినే సాంఘిక సంక్షేమం అని కూడా అంటారు.
మానవ మూలధనం (Human capital) - దేశంలోని జనాభానే మానవ మూలధనం అంటారు.
భౌతిక మూలధనం (Physical Capital) - భూములు, భవనాలు, యంత్రాలు. యంత్ర పరికరాలు, ఉత్పాదక వస్తువుల కొనుగోళ్లు, పెట్టుబడి కోసం చేసే ఖర్చుని ‘భౌతిక మూలధనం’ అంటారు.
సవరణ : ఫిబ్రవరి 21న ప్రచురించిన ఎకానమీ పేజీలో 42వ ప్రశ్రకు 3,1,4,2 సమాధానం గా చదువుకోగలరు.
ప్రాక్టీస్ బిట్స్
1. ప్రపంచంలోని ఏ దేశం ప్రణాళికాబద్ధమైన ఆర్థికాభివృద్ధి సాధనకు ప్రేరేపితమైనవి?
ఎ) అమెరికా బి) రష్యా
సి) భారతదేశం డి) బ్రిటన్
2. కిందివాటిలో ఏది ప్రణాళిక విధుల్లో సరైంది?
1) దేశంలోని వనరులను అంచనా వేసి ఉపయోగించడం
2) దేశంలోని భౌతిక, మానవ, ఆర్థిక వనరులను అంచనావేసి ఉపయోగించడం
ఎ) 1 బి) 2
సి) 1, 2 డి) పైవేవీ కావు
3. కిందివాటిలో ప్రణాళిక విధుల్లో సరైనవి ఏవి?
ఎ) వనరుల వినియోగానికి తగిన ప్రణాళికలను రూపొందించడం
బి) వనరులను అవసరాన్ని బట్టి అభిలషణీయంగా వినియోగించడం
సి) వనరుల అంచనా వేయడంలో, కొరతగా ఉన్న వనరులను గుర్తించడం
డి) పైవన్నీ
4. కింది ప్రణాళికా విధుల్లో సరైనది ఏది?
ఎ) ప్రతి ప్రణాళిక వృద్ధిని నమోదు చేయడం
బి) ప్రణాళికా వృద్ధిలో అవసరమైన దిద్దుబాటు చేయడం
సి) ప్రణాళిక వృద్ధి సాధనలో ఏర్పడ్డ ఆటంకాలను గుర్తించి తగు సిఫారసులను ప్రతిపాదించడం
డి) పైవన్నీ
5. భారతదేశంలో ప్రణాళికల రూపకల్పన చేసేది ఏది?
ఎ) కేంద్ర ప్రభుత్వం
బి) రాష్ట్ర ప్రభుత్వం
సి) ప్రణాళిక సంఘం
డి) జాతీయాభివృద్ధి మండలి
6. ఆర్థిక కేంద్రీకరణ ఛేదించి ఆర్థిక వికేంద్రీకరణ సాధించాలంటే వేటిని అమలు చేయాలి?
ఎ) పథకాలు బి) ప్రణాళికలు
సి) పెట్టుబడి డి) పన్నుల విధింపు
7. కింది వాటిలో సరైనది ఏది?
ఎ) స్వల్పకాలిక లక్ష్యాల సాధనకు ప్రణాళికలు అమలు చేయాలి
బి) దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు ప్రణాళికలు అమలు చేయాలి
సి) అవసరాన్ని బట్టి, స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు ప్రణాళికలు అమలు చేయాలి
డి) పైవన్నీ
8. ఆర్థిక వ్యవస్థలో అసమానతలు తగ్గించి, వృద్ధి ఫలాలు అందరికి అందాలంటే వేటిని అమలు చేయాలి?
ఎ) సంక్షేమ పథకాలు
బి) అన్ని రంగాల్లో పెట్టుబడి పెట్టాలి
సి) ప్రణాళికలు అమలు చేయాలి
డి) పన్ను విధించాలి
9. జాతీయాదాయ వృద్ధి రేటు సాధించాలంటే?
ఎ) వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి
బి) పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలి
సి) సేవా రంగాన్ని అభివృద్ధి చేయాలి
డి) పైవన్నీ
10. తలసరి ఆదాయం పెరిగితే?
ఎ) జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది
బి) జీవన ప్రమాణస్థాయి తగ్గుతుంది
సి) తలసరి ఆదాయానికి జీవన
ప్రమాణ స్థాయికి సంబంధం లేదు
డి) ఏదీకాదు
11. ప్రణాళిక లక్ష్యాల్లో సరైనది ఏది?
ఎ) ఆర్థిక వృద్ధి
బి) తలసరి ఆదాయ వృద్ధి
సి) జీవన ప్రమాణ స్థాయి పెంపు
డి) పైవన్నీ
12. కింది వాటిలో ప్రణాళిక లక్ష్యం కానిది?
ఎ) పేదరిక నిర్మూలన
బి) నిరుద్యోగ నిర్మూలన
సి) జానాభా పెరుగుదల
డి) అసమానతల తగ్గింపు
సమాధానాలు
1-బి 2-సి 3-డి 4-డి
5-సి 6 -బి 7-డి 8-సి
9-డి 10-ఎ 11-డి 12-సి
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు