3వ సవరణ (1955): VIIవ షెడ్యూల్ 3వ జాబితాలోని 33వ అంశాన్ని సవరించారు. ప్రజాప్రయోజనాల కోసం వస్తువుల ఉత్పత్తి సరఫరాను చేపట్టే అధికారాన్ని ఈ సవరణ కేంద్రప్రభుత్వానికిచ్చింది. ఉపయోగానికి వచ్చే ఆహారపదార్థాలు పశువులు, పచ్చిదాణా, పత్తి, జనపనార అనే అంశాలు అదనంగా 3వ జాబితాలో చేరాయి.
4వ సవరణ(1955): 31, 31A, 305 ప్రకరణలను, IXవ షెడ్యూలుకూ సవరణలు జరిగాయి. ప్రజాప్రయోజనం కోసం తప్పనిసరిగా ప్రభుత్వం ప్రైవేటు ఆస్తులను స్వాధీనం చేసుకున్నప్పటికీ వాటికిచ్చే నష్టపరిహారానికి సంబంధించిన అంశాలను కోర్టులో సవాల్ చేయరాదు.
5వ సవరణ(1955): రాష్ర్టాలు, సరిహద్దులను మార్చడానికి సంబంధించి, కేంద్రం చేసే చట్టాలకు రాష్ట్రపతి విధించే నిర్ణీత గడువులోగా రాష్ట్ర శాసనసభలు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించాలి. లేకపోతే కేంద్రానికి ఆ చట్టాన్ని పార్లంమెంటులో ప్రకటించే అధికారాన్ని ఇచ్చింది.
6వ సవరణ(1956): 269, 286 ప్రకరణలను సవరించారు. VIIవ షెడ్యూల్లోని 1వ జాబితాకు 54వ అంశాన్ని, 2వ జాబితాకు 92వ అంశాన్ని చేర్చారు. కేంద్ర జాబితాకు అంతర్రాష్ట్ర వ్యాపార, వాణిజ్య వ్యవహారాల్లో వస్తువుల అమ్మకం, కొనుగోళ్ల మీద వేసే పన్నులకు సంబంధించిన ఒక కొత్త అంశాన్ని ఈ సవరణ కలిపింది.
7వ సవరణ(1956): 49, 80, 81, 82, 131, 153, 158, 168, 170, 171, 216, 217, 220, 231, 232, 239, 240, 253, 298, 371 ప్రకరణలను సవరించారు. రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ సిఫారసు ఆధారంగా రాష్ర్టాల A, B, C వర్గీకరణను తొలగించి A, B రాష్ర్టాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. లోక్‌సభ నిర్మాణాన్ని ప్రతి జనాభా లెక్కల సేకరణ తర్వాత సవరించే నిబంధనను రాజ్యాంగంలో చేర్చారు. పదవీ విరమణ చేసిన హైకోర్టు జడ్జికి సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేసుకొనే వీలును కల్పించారు. తాత్కాలిక, అదనపు జడ్జీల నియామకానికి అనుమతి ఇచ్చారు. రెండు కంటే ఎక్కువ రాష్ర్టాలకు ఒకే హైకోర్టు ఏర్పాటు. భాషా ప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటు వల్ల ఆయా రాష్ర్టాల్లో ఉన్న భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలకు రాజ్యాంగ రక్షణలకు సంబంధించి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సంఘాలు చేసిన సిఫారసులను అమలు జరిపే చర్యలను అనుమతించింది. కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన అంశాలపై కూడా మార్పులు జరిగాయి. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, బొంబాయి రాష్ర్టాలకు సంబంధించి కొన్ని ప్రత్యేకాంశాలను చేర్చారు.
8వ సవరణ (1959): ప్రకరణ 334ను సవరించి 10 ఏండ్లు అనే స్థానంలో 20 ఏండ్లు అనే మాటను పొందుపర్చారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలకు సంబంధించిన ప్రత్యేక రాజ్యాంగ సదుపాయాల కాలపరిమితిని, లోక్‌సభకు, రాష్ట్ర విధానసభలకు ఆంగ్లోఇండియన్ ప్రతినిధులను నియమించే విధాన కాలపరిమితిని 10 ఏండ్ల నుంచి 20 ఏండ్ల వరకు ఈ సవరణ ద్వారా పొడిగించారు.
9వ సవరణ (1960): 1వ షెడ్యూల్. సుప్రీంకోర్టు బెరుబారి కేసులో తీర్పునకు అనుగుణంగా బెరుబారి ప్రాంతాన్ని ఇండో-పాక్ ఒప్పందం (1958) ప్రకారం పాకిస్థాన్(ప్రస్తుతం బంగ్లాదేశ్)కు అప్పగిస్తూ పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లో మార్పులు చేయడానికి షెడ్యూల్-1ను సవరించారు.
10వ సవరణ (1961): 240వ ప్రకరణ, 1వ షెడ్యూల్. పోర్చుగీసు ఆధీనంలోని దాద్రా, నగర్హవేలీలకు ఈ సవరణ వల్ల కేంద్రపాలిత ప్రాంత హోదా లభించింది. వాటి పాలన కోసం నిబంధనలు జారీ చేసే అధికారం రాష్ట్రపతికి సంక్రమించింది.
11వ సవరణ (1961): 66, 71లను సవరించారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశం అనే కఠిన విధానాన్ని తొలిగించి రెండు సభలు విడివిడిగా ఎన్నికల్లో పాల్గొనడానికి అవకాశం కల్పించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల ఎలక్టోరల్ కాలేజిల్లో ఖాళీలుఉన్నాయనే కారణం వల్ల వారి ఎన్నికకు న్యాయస్థానాల్లో సవాల్ చేయరాదు.
12వ సవరణ (1962): 240వ ప్రకరణ, షెడ్యూల్-I. గోవా, డయ్యూ, డామన్‌లకు భారతదేశంలో విలీనం చేసి కేంద్రపాలిత ప్రాంత హోదా కల్పించారు.
13వ సవరణ (1962): 371A ప్రకరణను చేర్చారు. XXIవ భాగాన్ని కూడా సవరించారు. 16వ రాష్ట్రంగా నాగాలాండ్‌కు రాష్ట్ర హోదాను కల్పించడమే కాకుండా దానికి కొన్ని ప్రత్యేకతలను కల్పించారు.
14వ వసరణ (1962): 81, 240 ప్రకరణలను సవరించారు. ప్రకరణ 239కు 239A చేర్చారు. I, IV షెడ్యూళ్లను సవరించారు. ప్రకరణ 81ని సవరించి కేంద్రపాలిత ప్రాంతాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం 20 నుంచి 25కు పెంచారు. ఫ్రెంచ్ కాలనీల నుంచి భారత భూభాగంలోకి 1962 ఆగస్టు 16న చేరిన పుదుచ్చేరి, కరైకల్, యానం, మహేలను కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిగా మార్చారు. హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, గోవా, డామన్డయ్యూ, పుదుచ్చేరిలకు శాసనసభలు, మంత్రివర్గాలను ఈ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు.