కార్మికుల సంక్షేమం రాజ్యాంగ హక్కులు
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ పాలన కాలంలో, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఎన్నో కార్మిక చట్టాలు చేశారు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లోని ఎన్నో ప్రకరణలు కార్మికుల సంక్షేమం గురించి తెలుపుతున్నాయి.
రాజ్యాంగ ప్రవేశిక-సంక్షేమ అంశాలు
– పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అంతస్తులోను, అవకాశాల్లోను సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తిగౌరవాన్ని పెంపొందించాలి.
ప్రాథమిక హక్కుల్లో కార్మికుల సంక్షేమ ప్రకరణలు
ప్రకరణ 14: చట్టం ముందు అందరూ సమానులే
– చట్టం ముందు సమానత్వాన్ని, చట్టం వల్ల సమాన రక్షణను భారత భూభాగంలోని ఏ వ్యక్తికీ నిరాకరించరాదు
ప్రకరణ 16: పౌరులందరికీ ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు
– ప్రకరణ 16 (1)ను అనుసరించి ప్రభుత్వోద్యోగాల్లో పౌరులందరికీ సమాన అవకాశాలు.
– ప్రకరణ 16 (2) ప్రభుత్వోద్యోగాల్లో పౌరులను జాతి, మత, కుల, లింగ, పుట్టుక, వారసత్వ, స్థిరనివాస ప్రాతిపదికన వివక్ష చూపరాదు.
ప్రకరణ 19 (1సి): సంఘాలు, సంస్థలు స్థాపించుకోవడం
– ప్రతి వ్యక్తి సర్వతోముఖాభివృద్ధి, ఉన్నతిని సాధించడానికి, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో తగిన సహకారం అందించడానికి, అవసరమైన సంఘాలు, సహకార సంఘాలు, సంస్థలు స్థాపించుకోవచ్చు.
పీడనాన్ని నిరోధించే హక్కు
– పీడనాన్ని నిరోధించే హక్కును రాజ్యాంగంలోని ప్రకరణలు 23, 24లు పేర్కొంటున్నాయి.
ప్రకరణ 23: మనుషుల క్రయ విక్రయాలు, బలవంతపు వెట్టి చాకిరి నిషేధం
– ప్రకరణ 23 (1) వ్యక్తుల క్రయ విక్రయాలు, వెట్టిచాకిరీలను నిషేధించింది.
– ఎలాంటి ప్రతిఫలం లేకుండా పనిచేయించడం కూడా పీడన కిందకే వస్తుంది. అందువల్ల దాన్ని కూడా నిషేధించారు.
ప్రకరణ 24 : కర్మాగారాలు మొదలైన వాటిలో బాలకార్మిక వ్యవస్థ నిషేధం
– 14 ఏండ్లలోపు బాలబాలికలను గనులు, పేలుడు పదార్థాల తయారీ వంటి ప్రమాదకర చోట్ల పనిచేయించడం నిషేధించడమైంది.
– పైన పేర్కొన్న 23, 24 ప్రకరణలు సకారాత్మక హక్కులను తెలుపుతున్నాయి.
– ఈ హక్కుల అమలు కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు రూపొందించాయి.
ఆదేశిక సూత్రాల్లో కార్మికుల సంక్షేమ ప్రకరణలు
ప్రకరణ 38: ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే వ్యవస్థ కోసం కృషి చేయాలి.
– ప్రకరణ 38 (1) ప్రభుత్వాలు ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమాన న్యాయాన్ని అందించాలని తెలుపుతుంది.
– ప్రకరణ 38 (2) వ్యక్తుల మధ్య ఆదాయ అసమానతలు, హోదాల్లోని అంతరాలు, వివిధ వృత్తుల్లో, వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వ్యక్తుల మధ్య ఉన్న ఆర్థిక, పని, ఉద్యోగ అవకాశాల్లోని అసమానతలు తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేయాలి.
ప్రకరణ 39: ప్రభుత్వం అనుసరించాల్సిన కొన్ని విధాన సూత్రాలు
– ప్రకరణ 39 (ఎ) స్త్రీ, పురుష భేదం లేకుండా పౌరులు జీవనోపాధి హక్కును పొందడం.
– ప్రకరణ 39 (బి) ప్రజలందరి సమిష్టి ప్రయోజనం కోసం సమాజంలోని భౌతిక వనరులపై యాజమాన్యం, నియంత్రణలను విభజించుడం.
– ప్రకరణ 39 (సి) సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడటం.
– ప్రకరణ 39 (డి) స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం.
– ప్రకరణ 39 (ఇ) బాలబాలికలు, యువతీయువకుల ఆరోగ్య పరిరక్షణకు ఆటంకంగా ఉన్న పరిస్థితులను తొలగించడం.
– ప్రకరణ 39 (ఎఫ్) బాలలు హుందాగా పెరగడానికి అవకాశం కల్పించాలి, యువత దోపిడీకి గురికాకుండా నైతికంగా పతనం చెందకుండా చూడాలి.
ప్రకరణ 39 (1): సమాన న్యాయం, ఉచిత న్యాయ సహాయం
– న్యాయ వ్యవస్థ ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. ఆర్థికంగా కోర్టులను ఆశ్రయించే శక్తి, స్థోమత లేనివారికి తగిన న్యాయ సహాయం అందించడానికి చట్టాల ద్వారా లేదా ఇతర సంస్థలను ఏర్పాటుచేయాలి
ప్రకరణ 41: పనికి, విద్యకు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ సహాయం పొందే హక్కు (నిరుద్యోగులకు, వికలాంగులకు, వృద్ధులకు జీవనభృతి)
– ఆర్థిక స్థోమత పరిమితులకు లోబడి పనిచేసే హక్కు, విద్య నేర్చుకొనే హక్కు కల్పించాలి. నిరుద్యోగులకు, వృద్ధులకు, వికలాంగులకు, అణగారిన వర్గాలకు సహాయాన్ని అందించాలి.
– ప్రజలకు పనిచేసే, ప్రభుత్వ సహాయాన్ని పొందే హక్కు కల్పించడం.
ప్రకరణ 42: సరైన పని వాతావరణాన్ని కల్పించడం, స్త్రీలకు ప్రసూతి సౌకర్యాలు అందించడం.
– కార్మికులకు పని చేసే ప్రదేశాల్లో, పనులను చేయించటంలో న్యాయ, ధర్మబద్ధమైన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలి.
– స్త్రీలకు పని ప్రదేశాల్లో సరైన వసతులను కల్పించాలి. ప్రసూతి సౌకర్యాలను అందించాలి.
ప్రకరణ 43: కార్మికులకు కనీస జీవన వేతనం
– కార్మికుల జీవన ప్రమాణానికి సరిపోయే వేతనం అందేలా చర్యలు తీసుకోవాలి. వీరికి క్రీడలు, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించాలి.
– ప్రకరణ 43 (ఎ) కార్మికులకు యాజమాన్యంలో భాగస్వామ్యం కల్పించడం.
– ప్రకరణ 43 (బి) సహకార సంఘాలను ప్రోత్సహించడం.
ఏడో షెడ్యూల్లో కార్మికుల సంక్షేమ అంశాలు
కేంద్ర జాబితాలోని అంశాలు
ప్రకరణ 43 (బి): సహకార సంఘాలను ప్రోత్సహించడం. ఈ ఆదేశిక సూత్రాన్ని 2011లో పొందుపర్చారు.
– గనులు, చమురు క్షేత్రాల్లో కార్మిక భద్రత నియంత్రణ (ఎంట్రీ నం. 55)
– కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పారిశ్రామిక వివాదాలు (ఎంట్రీ నం.61)
– కేంద్ర ఏజెన్సీలు, సంస్థలకు శిక్షణ, పరిశోధన, నేరశోధన, (ఎంట్రీ నం.65)
ఉమ్మడి జాబితాలోని అంశాలు
– కార్మిక సంఘాలు, పారిశ్రామిక, కార్మిక వివాదాలు (ఎంట్రీ నం.22)
– సామాజిక భద్రత, సామాజిక బీమా, ఉద్యోగ కల్పన, నిరుద్యోగం (ఎంట్రీ నం.23)
– కార్మిక సంక్షేమం (ఎంట్రీ నం.24)
– విద్య, సాంకేతిక విద్య, వైద్య విద్య, విశ్వ విద్యాలయాలు, కార్మికులకు సాంకేతిక, వొకేషనల్ శిక్షణ.
వివిధ కేసులు- కోర్టు తీర్పులు
– రణ్‌ధీర్ సింఘ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా: సమాన పనికి సమాన వేతనం అనేది రాజ్యాంగ లక్ష్యం అని సుప్రీంకోర్టు పేర్కొంది.
– బ్రొజోనాథ్ గంగూలి వర్సెస్ సెంట్రల్ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్: (సహజ న్యాయ సూత్రాలు ప్రకరణ 14) శాశ్వత ఉద్యోగులను తొలగించడానికి కారణాలను తెలుపకుండా మూడు నెలల ముందు నోటీసు ఇచ్చి లేదా బదులుగా నోటీసు కాలపరిధికి జీతం చెల్లించి తొలగించడాన్ని ప్రజావిధానానికి వ్యతిరేకమైన రైట్ టు హియర్ నిరాకరించిందని సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది.
– విశాఖ వర్సెస్ సేట్ట్ ఆఫ్ రాజస్థాన్: మహిళలు వారు పని చేస్తున్న ప్రదేశంలో వేధింపులకు గురికాకుండా చూడాలని సుప్రీంకోర్టు సూచించింది.
– ఢిల్లీ డెవలప్మెంట్ హార్టికల్చర్ ఉద్యోగుల యూనియన్ వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్: పనిచేసే హక్కు ప్రకరణ 21లో భాగమే అని పని హక్కును ప్రాథమిక హక్కుగా చేర్చడానికి దేశంలోని పరిస్థితులు అనుకూలంగా లేవని సుప్రీంకోర్టు పేర్కొంది
– సంజిత్ రాయ్ వర్సెస్ సేట్ట్ ఆఫ్ రాజస్థాన్: కేసులో దుర్భిక్ష నివారణ కార్యక్రమం కింద రాజస్థాన్ ప్రభుత్వం నియమించిన ఉద్యోగులు ప్రకరణ 23 ప్రకారం కనీస వేతనాలను పొందేహక్కు కలిగి ఉన్నారని పేర్కొంది.
– విశాల్‌జిత్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా: మనుషుల క్రయవిక్రయాలు అనే పదంలో దేవదాసీలు కూడా వస్తారని పేర్కొంది.
– దీనా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా: ఖైదీలకు తగిన మొత్తం చెల్లించకుండా పనిచేయంచడం బలవంతపు వెట్టి చాకిరి కిందికి వస్తుందని పేర్కొంది.
– చంద్రభాను వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర: సస్పెండ్ అయిన ప్రభుత్వ ఉద్యోగికి నెలకు ఒక రూపాయి చొప్పున నామమాత్రపు జీవనభృతిని చెల్లించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకరణ 21 ప్రకారం మానవమర్యాదల్లో జీవించే హక్కును ఉల్లంఘించడమే అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
– నీరజా చౌదరి: వెట్టి చాకిరి అనేది ప్రకరణ 21కు భంగకరమైందని, ప్రభుత్వాలు వెట్టిచాకిరి నిర్మూలించే చట్టాలు చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
-ఓల్గా టెల్లిస్ వర్సెస్ బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ (పేవ్మెంట్ నివాసితుల కేసు): ప్రాణం అనే మాటలో జీవనోపాధి పొందే హక్కు ఉంటుందని పేర్కొంది.
-చమేలిసింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్: ఆశ్రయం పొందే హక్కు ప్రాథమిక హక్కు
-సీపీఐ (ఎం) వర్సెస్ భరత్ కుమార్: బంద్‌లు చట్ట వ్యతిరేకం
-పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఏషియాడ్ కేసు): ఏషియాడ్ ప్రాజెక్టు కోసం నియమించిన కార్మికులకు కనీస వేతనం కంటే తక్కువ వేతనం చెల్లించడం 23వ ప్రకరణ ఉల్లంఘనగా పేర్కొంది
-ఎంసీ మెహతా వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు: ప్రకరణ 39(ఎఫ్), ప్రకరణ 45లోని అంశాలను దృష్టిలో ఉంచుకొని బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా మార్గదర్శకాలను సుప్రీంకోర్టు జారీ చేసింది.
ఉజ్వల పథకం
దేశంలో బాలలు, మహిళలు తప్పిపోయిన కేసులు అనేకం నమోదవుతున్నాయి. ఈ విధంగా కనపడకుండా పోయిన వారితో వ్యభిచారం, వెట్టిచాకిరి చేయిస్తుంటారు. రాజ్యాంగంలోని 23వ ప్రకరణ ప్రకారం వారి పరిరక్షణకు ఉజ్వల పథకాన్ని ప్రభుత్వం 2007లో ప్రారంభించింది. బాలలకు ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం- 2009, లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం-2012 చేసింది.
1మే, 1886న అమెరికాలోని చికాగో నగరంలో 3 లక్షల మంది కార్మికులు వివిధ డిమాండ్లతో (8 గంటల పనిదినం కోసం) సమ్మె చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా మే1న ప్రపంచ కార్మికుల దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా జరుపుకొంటున్నారు.
– జెనీవా కేంద్రంగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్యసమితికి అనుబంధ సంస్థగా పనిచేస్తున్నది.
– బ్రిక్స్ దేశాల కార్మిక సదస్సు 25 జనవరి, 2016న రష్యాలో జరిగింది
– మన దేశంలో మొదటిసారిగా మేడే ఉత్సవాలు మద్రాసులో 1923లో జరిగాయి
– 46వ కార్మిక సదస్సును ప్రధానమంత్రి నరేంద్రమోదీ 20 జూలై, 2015న ప్రారంభించారు.
– ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్‌లో ఏప్రిల్ 2016 నాటికి 187 దేశాలకు సభ్యత్వం ఉంది.
దేశంలో శ్రామిక విధానం
1. ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం
2. నూతన ఉద్యోగాల కల్పన
3. అసంఘటిత రంగంలో సామాజిక భద్రత పథకాలను ప్రవేశపెట్టడం
4. శ్రామికులకు సామాజిక భద్రత కార్డులు ఇవ్వడం.
5. ఏకీకృత,ఉపయోగకర సంక్షేమ బోర్డుల ఏర్పాటు.
6. నమూన ఉద్యోగి-యజమాని సంబంధాలు, నెలకొల్పటం
7. ఉత్పాదక ఆధారంగా దీర్ఘకాల పరిష్కారాలు
8. పారిశ్రామిక సంబంధాల కమిటీల ఏర్పాటు
9. కార్మికులకు ఆధునిక వైద్య సదుపాయాల ఏర్పాటు
10. అంగవైకల్యానికి గురైన కార్మికులకు పునరావాసం
11. ఉపాధి కల్పన కేంద్రాల ఆధునీకరణ
– సుప్రీంకోర్టు తన తీర్పుల్లో అనేక ఆదేశిక సూత్రాలను ప్రాథమిక హక్కులుగా మార్చింది.
దేశంలో కార్మికులకు…
1. కనీస వేతనం రూ. 6,000/
2. దినసరి పని 8 గంటలు
3. కనీసం 30 నిమిషాల విరామం 6 గంటల పనికి ఉండాలి
4. ఓవర్ టైం గరిష్ట పరిమితి ఏడాదికి 200 గంటలు
5. ఓవర్ టైంకు ప్రీమియం చెల్లింపు 100 శాతం ఉండాలి
8 కార్మిక చట్టాలకు సంబంధించి రాజ్యాంగంలోని కార్మికులు (శ్రామికులు) అనే అంశం ఉమ్మడి జాబితాలో ఉంది. అంటే కార్మిక చట్టాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయవచ్చు.
– కొన్ని కార్మిక చట్టాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, వాటి అమలును పర్యవేక్షిస్తుంది.
– మరికొన్ని కార్మిక చట్టాలు కేంద్ర పభుత్వం చేస్తుంది. అయితే వాటి అమలు బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడతాయి.
– కొన్ని కార్మిక చట్టాలు కేంద్ర ప్రభుత్వం చేసినప్పటికీ వాటి అమలును రాష్ట్ర ప్రభుత్వాలు చేపడతాయి.
– మరికొన్ని కార్మిక చట్టాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి. వాటి అమలును ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపడతాయి.
దేశంలో కార్మిక చట్టాలు-వర్గీకరణ
ఎ) పారిశ్రామిక సంబంధాలకు సంబంధించినవి
1) ట్రేడ్ యూనియన్స్ యాక్ట్-1926
2) పారిశ్రామిక ఉపాధి స్టాండింగ్ ఆర్డర్ యాక్ట్-1946
3) పారిశ్రామిక వివాదాల చట్టం-1947, మొదలైనవి
బి) వేతనాలకు సంబంధించినవి
1) వేతన చెల్లింపుల చట్టం-1936
2) కనీస వేతనాల చట్టం-1948
3) బోనస్ చెల్లింపు చట్టం-1965
4) వర్కింగ్ జర్నలిస్ట్ చట్టం-1958, మొదలైనవి
సి) పనిగంటలు, సర్వీసు నిబంధనలకు సంబంధించినవి
1) ఫ్యాక్టరీల చట్టం-1948
2) ప్లాంటేషన్ లేబర్ యాక్ట్-1951
3) గనుల చట్టం-1952
4) వర్కింగ్ జర్నలిస్ట్, ఇతర వార్తా పత్రికల ఉద్యోగుల చట్టం-1955
5) మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్-1958
6) మోటార్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ యాక్ట్-1961
7) బీడి, సిగరేట్ వర్కర్స్ యాక్ట్-1966
8) కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్-1970
9) సినిమా వర్కర్స్ చట్టం-1981
10) ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ యాక్ట్-2005, మొదలైనవి
డి) మహిళలకు సంబంధించినవి
1) మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్-1961
2) సమాన వేతన చట్టం-1976 , మొదలైనవి
ఇ) డిప్రివ్డ్ అండ్ డిసడ్వాంటేజ్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ (బాలలు, అణగారిన వర్గాలు)
1) వెట్టి చాకిరి నిర్మూలన చట్టం-1976
2) బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం-1986
3) బాలల హక్కుల చట్టం-2005
4) మనుషుల అక్రమ రవాణా నిషేధ చట్టం, 1956., మొదలైనవి
ఈ) సామాజిక భద్రతకు సంబంధించినవి
1) పనివారి నష్టపరిహార చట్టం-1923
2) ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ చట్టం-1948
3) ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ చట్టం-1952
5) గ్రాడ్యుటీ చెల్లింపు చట్టం-1972
6) పారిశుద్ధ్య కార్మికుల ఉపాధి కల్పన చట్టం-1993
7) అసంఘటిత రంగం సామాజిక భద్రత చట్టం-2008
8) మాన్యువల్ స్కావెంజర్స్ ఉపాధి నిషేధం, పునరావాస చట్టం, 2013, మొదలైనవి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు