భారత రాజ్యాధినేతగా రాజ్యాంగంలో రాష్ట్రపతి

భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం అమల్లో ఉంది. కేంద్రంలో ప్రభుత్వ అంగాలు మూడు. అవి మూడు విధులను నిర్వహిస్తాయి.
1. శాసననిర్మాణ శాఖ – శాసనాలను తయారుచేస్తుంది.
2. కార్యనిర్వహణ శాఖ – శాసనాలను అమలుపరుస్తుంది.
3. న్యాయశాఖ – శాసనాలను వ్యాఖ్యానిస్తుంది.
– రాజ్యాంగంలో V భాగంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. అవి..
– 1వ అధ్యాయం – కేంద్ర కార్యనిర్వహణ శాఖ
– 2వ అధ్యాయం – కేంద్ర శాసననిర్మాణ శాఖ
– 3వ అధ్యాయం – ఆర్డినెన్సు
– 4వ అధ్యాయం – కేంద్ర న్యాయశాఖ
– 5వ అధ్యాయం – కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా
– కేంద్ర కార్యనిర్వహణ శాఖ అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రితో కూడిన మంత్రిమండలి, అటార్నీ జనరల్.
– పార్లమెంటరీ విధానంలో కార్యనిర్వహణ వర్గం 2 రకాలు
1. నామమాత్రపు కార్యనిర్వహణ వర్గం – రాష్ట్రపతి
2. వాస్తవ కార్యనిర్వహణ వర్గం – ప్రధానమంత్రితో కూడిన మంత్రిమండలి
– కేంద్ర కార్యనిర్వహణ వర్గం గురించి రాజ్యాంగంలో 52వ ప్రకరణం నుంచి 78 వరకు వివరిస్తున్నాయి.
– రాష్ట్రపతి గురించి రాజ్యాంగంలో 52వ ప్రకరణం నుంచి 62 వరకు పొందుపర్చారు.
– 52వ నిబంధన ప్రకారం భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడు.
– రాష్ట్రపతి పదవి బ్రిటిష్ రాజు లేదా రాణి పదవిని పోలి ఉంటుంది.
– 53వ నిబంధన ప్రకారం దేశ కార్యనిర్వహణాధికారి రాష్ట్రపతి
– 53(1) అధికరణం ప్రకారం దేశ కార్యనిర్వహణాధికారం రాష్ట్రపతికి వర్తిస్తుంది.
– దేశ కార్యనిర్వహణాధికారం రాష్ట్రపతి తాను స్వయంగాకాని లేదా తన ఆధీనుల ద్వారా కాని నిర్వహించవచ్చు.
– 53(2) అధికరణం ప్రకారం భారతదేశ త్రివిధ దళాల సర్వసైన్యాధ్యక్షుడు – రాష్ట్రపతి
– భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి
1. భారతదేశ మొదటిపౌరుడు
2. దేశాధినేత
3. దేశ కార్యనిర్వహణాధికారి
4. రాజ్యాంగ అధినేత
5. గణతంత్ర అధినేత
– 74(1) నిబంధన ప్రకారం రాష్ట్రపతికి విధులు నిర్వర్తించడంలో ప్రధానమంత్రితో కూడిన మంత్రిమండలి తోడ్పడుతుంది.
– 77వ నిబంధన ప్రకారం భారతదేశ కార్యనిర్వహణాధికారం రాష్ట్రపతి పేరు మీద నిర్వహిస్తారు.
– భారత సుప్రీంకోర్టు రామ్జవాయ్ వర్సెస్ పంజాబ్ (1955), షంషేర్‌సింగ్ వర్సెస్ పంజాబ్ కేసులో రాష్ట్రపతి రాజ్యాధినేత అని ప్రధానమంత్రి ప్రభుత్వ అధినేత అని తన తీర్పులో తెలిపింది.
రాష్ట్రపతి ఎన్నిక విధానం – 55 ప్రకరణం
– రాష్ట్రపతి ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.
– రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఒకసారి లోక్‌సభ సెక్రటరీ జనరల్, మరొకసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ వ్యవహరిస్తాడు.
– రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి స్వీకరించారు.
– రాష్ట్రపతిని నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా పరోక్ష విధానం, ఏక ఓటు బదిలీ సూత్రం ద్వారా ఎన్నుకుంటారు. దీన్ని దామాషా ఓటింగ్ పద్ధతి ప్రకారం రహస్యంగా నిర్వహిస్తారు.
– రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ విధానం రాజ్యాంగ పరిషత్‌లో ప్రతిపాదించినది- ఎన్ గోపాలస్వామి అయ్యంగార్
రాష్ట్ర జనాభా
– ఎమ్మెల్యే ఓటు విలువ = û 1000
విధాన సభకు ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య
– ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు విలువ – 208 (ఎక్కువ)
– ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు విలువ – 148
– సిక్కిం ఎమ్మెల్యే ఓటు విలువ – 7 (తక్కువ)
– పుదుచ్చేరి ఎమ్మెల్యే ఓటు విలువ – 16
– ఢిల్లీ ఎమ్మెల్యే ఓటు విలువ – 58
– అరుణాచల్‌ప్రదేశ్, మిజోరం ఎమ్మెల్యే ఓటు విలువ – 8
– తమిళనాడు – 176, మహారాష్ట్ర – 175
అన్ని రాష్ర్టాల ఎమ్మెల్యేల ఓట్ల విలువ
ఎంపీ ఓటు విలువ = పార్లమెంటు ఉభయసభల్లో ఎన్నికైన సభ్యుల సంఖ్య
– ఎంపీ ఓటు విలువ – 708
– 84వ రాజ్యాంగ సవరణ ద్వారా (2001) ఎంపీ, ఎమ్మెల్యేల ఓట్ల విలువ 2026 వరకు మార్చరాదని సవరణ చేశారు.
– 1961లో 11వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ర్టాల విధాన సభలు రద్దయితే రాష్ట్రపతి ఎన్నిక నిలుపుదల చేయరాదు.
రాష్ట్రపతి అర్హతలు – 58వ అధికరణం
– భారతపౌరుడై ఉండాలి
– 35 ఏండ్లు నిండి ఉండాలి
– లోక్‌సభ సభ్యుడిగా పోటీ చేయడానికి కావాల్సిన అర్హతలు కలిగి ఉండాలి.
అనర్హతలు – జీతభత్యాలు : 59వ నిబంధన
– కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల్లో ఆదాయం వచ్చే ప్రభుత్వ ఉద్యోగంలో ఉండరాదు.
– ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, ఎంపీ, ఎమ్మెల్యే పదవులు ప్రభుత్వ ఉద్యోగాలు కావు.
– ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఉంటే రాజీనామా చేయాలి. ఒకవేళ రాజీనామా చేయకపోయినా రాష్ట్రపతిగా ఎన్నికై ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఆ పదవి రద్దవుతుంది.
– ఉదా : బైరాన్‌సింగ్ షెకావత్ ఉపరాష్ట్రపతిగా ఉంటూ రాజీనామా చేయకుండా రాష్ట్రపతి పదవికి పోటీ చేశారు.
షరతులు (Conditions)
– 1977లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి కొన్ని సవరణలు చేశారు.
– అభ్యర్థి నామినేషన్ పత్రంతో పాటు రూ. 15,000 ధరావతు చెల్లించాలి.
– చెల్లించిన డిపాజిట్ రావాలంటే పోలై చెల్లిన ఓట్లలో 1/6వ వంతు ఓట్లు రావాలి.
– రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రంపై రాష్ట్రపతి ఎన్నికల గణంలోని 50 మంది సభ్యులు ప్రతిపాదించారు. మరో 50 మంది సభ్యులు బలపర్చాలి.
జీతభత్యాలు
– రాష్ట్రపతి ప్రస్తుత వేతనం రూ. 1,50,000 (1-1-2006 నుంచి)
– పదవీ విరమణ తర్వాత దేశంలో ఏ ప్రాంతంలోనైనా నివాసం నిర్మించి ఏడాదికి రూ. 9 లక్షలు పింఛన్ చెల్లిస్తారు.
– రాష్ట్రపతి అధికారిక నివాస భవనాలు న్యూఢిల్లీతో పాటు, హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లా, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని బొల్లారంలో ఉన్నాయి.
– రాష్ట్రపతి పదవిలో ఉన్న సమయంలో ఖర్చులకు, అతిథుల విందులకు ఏడాదికి రూ. 22.5 కోట్ల గ్రాంటు ఇస్తుంది.
– రాష్ట్రపతి జీతభత్యాలను అతను పదవిలో ఉండగా తగ్గించరాదు.
– రాష్ట్రపతి జీతభత్యాలు పార్లమెంటు నిర్ణయిస్తుంది.
– రాష్ట్రపతి వేతనం, భత్యాలు, పింఛన్ కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
– రాష్ట్రపతి నివాస భవనాన్ని స్వాతంత్య్రానికి పూర్వం వైస్రాయ్ రేగల్హౌజ్ అని, దీన్నే రైసనాపాల్స్ అని, సాధారణ ప్రజలు లాట్ సాహెబ్కాదఫ్తార్ అని పిలుస్తారు.
రాష్ట్రపతి ప్రమాణస్వీకారం
– 60వ అధికరణం ప్రకారం రాష్ట్రపతిగా ఎన్నికైన వారిచేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. (ప్రధాన న్యాయమూర్తే అందుబాటులో లేనప్పుడు సీనియర్ న్యాయమూర్తే ప్రమాణ స్వీకారం చేయిస్తాడు)
రాష్ట్రపతి పదవీకాలం – 56వ ప్రకరణం
– రాష్ట్రపతి పదవీకాలం – ఐదేండ్లు
– రాష్ట్రపతి పదవీకాలం ముగియకముందే రాజీనామా చేయాలంటే ఉపరాష్ట్రపతి పేరు మీద రాజీనామా చేయాలి.
– 1969 ఏడాదిలో రాష్ట్రపతి బాధ్యతా నిర్వహణ చట్టం ప్రకారం ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్న సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాజీనామా లేఖను పంపాలి.
– ఉపరాష్ట్రపతి రాజీనామా విషయం (రాష్ట్రపతి రాజీనామా గురించి) లోక్‌సభ స్పీకర్‌కు తెలపాలి.
– రాష్ట్రపతి రాజీనామా చేసిన సందర్భంలో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి విధులను ఆరు నెలలు నిర్వహిస్తారు.
– రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు ఆరు నెలల్లోపు ఎన్నిక నిర్వహించాలి.
ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించే సందర్భాలు
– రాష్ట్రపతి రాజీనామా చేసినప్పుడు
– రాష్ట్రపతి దీర్ఘకాలిక సెలవు లేదా అస్వస్థతకు గురైనప్పుడు
– మహాభియోగ తీర్మానం ద్వారా రాష్ట్రపతిని తొలగించిన సందర్భంలో
– రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణించినప్పుడు
– 1960 జూన్‌లో బాబూ రాజేంద్రప్రసాద్ 15 రోజులు సోవియట్ రష్యా వెళ్లినప్పుడు ఆనాటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు.
– 1961 మేలో రాజేంద్రప్రసాద్ అస్వస్థతకు గురైనప్పుడు తాత్కాలిక రాష్ట్రపతిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వ్యవహరించారు.
– 1969లో ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ జాకీర్‌హుస్సేన్ మరణించినప్పుడు ఆనాటి ఉపరాష్ట్రపతి వరహాగిరి వెంకటగిరి (వీవీ గిరి) తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు.
– 1969లో ఉపరాష్ట్రపతిగా ఉన్న వీవీ గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న సందర్భంలో రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు రాజీనామా చేయగా ఆనాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహ్మద్ హిదాయతుల్లా తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు.
– 1977లో ఆనాటి రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీ అహ్మద్ మరణించినప్పుడు ఉపరాష్ట్రపతి బీడీ జెట్టి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు.
– 57వ నిబంధన ప్రకారం ఒక వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నిసార్లయినా పోటీ చేయవచ్చు.
– బాబూ రాజేంద్రప్రసాద్ రెండు పర్యాయాలు రాష్ట్రపతిగా విధులు నిర్వహించారు. అది సంప్రదాయం మాత్రమే.
మహాభియోగ తీర్మానం – 61వ నిబంధన
– రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానాన్ని అమెరికా రాజ్యాంగం నుంచి (Impeachment Motion) స్వీకరించారు. దీన్ని క్వాజీజ్యుడీషియల్ విధానం అంటారు.
– భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పుడు అభిశంసన ద్వారా తొలగించవచ్చు.
– రాష్ట్రపతిని తొలగించే తీర్మానం పార్లమెంటు ఉభయసభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు.
– ముందుగా ఏదైనా ఒక సభలో కనీసం 1/4వ వంతు సభ్యులు మహాభియోగ తీర్మానంపై సంతకం చేయాలి.
– తీర్మానం ప్రవేశపెట్టే 14 రోజుల ముందుగా సభాపతికి తెలపాలి.
– రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఆ సభ అతనిపై వచ్చిన అభియోగాలను ప్రత్యేక కమిటీ, లేదా ట్రిబ్యునల్ వేసి దర్యాప్తు చేసి విచారించిన తరువాత పార్లమెంటు ఉభయసభలు మూడింట రెండువంతుల మెజార్టీతో (2/3వ వంతు) వేర్వేరుగా ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి పదవి నుంచి వైదొలగాలి.
– 1970లో వీవీ గిరిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి ఉపసంహరించుకున్నారు.
– రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనకుండా రాష్ట్రపతి మహాభియోగ తీర్మానంలో పాల్గొనేవారు – పార్లమెంటు ఉభయసభలకు నామినేట్ అయిన 14 మంది సభ్యులు.
– రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొని రాష్ట్రపతి మహాభియోగ తీర్మానంలో పాల్గొనే అవకాశం లేనివారు ఢిల్లీ, పుదుచ్చేరి రాష్ర్టాల విధాన సభల ఎమ్మెల్యేలు.
– రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రపతి స్వయంగా కాని లేదా రాష్ట్రపతి తన ప్రతినిధి ద్వారా కాని వాదనలు వినిపించవచ్చు.
– రాష్ట్రపతి పదవిలో ఉండగా అతనిపై క్రిమినల్ కేసులు పెట్టరాదు. సివిల్ కేసులు వేయాలంటే రెండు నెలల ముందుగా నోటీస్ ఇవ్వాలి.
– 361వ ప్రకరణం అనుసరించి రాష్ట్రపతి పదవిలో ఉన్నప్పుడు అతను నిర్వర్తించిన విధులకు అతను జవాబుదారీగా వ్యవహరించడు. అతని నిర్ణయాన్ని ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించరాదు.
– 62వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి పదవీకాలం ముగియకముందే నూతన రాష్ట్రపతి ఎన్నిక నిర్వహించి పూర్తి చేయాలి.
– 71వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఫిర్యాదులను సుప్రీంకోర్టు విచారిస్తుంది.
– రాష్ట్రపతి ఎన్నికలు జరగడానికి ముందుకాకుండా ఎన్నికలు జరిగిన 30 రోజుల్లోపు ఫిర్యాదు చేయాలి.
– ఎన్నికల ఫిర్యాదుపై రాష్ట్రపతి ఎన్నికలగణంలోని 20 మంది సభ్యులు సంతకాలు చేయాలి.
– రాష్ట్రపతి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు ప్రకటిస్తే అతను అంతకుముందు తీసుకున్న నిర్ణయాలు చెల్లుతాయి.
Latest Updates
దేహంలోని అతిచిన్న ఎముక దేనికి సహాయపడుతుంది?
గ్రూప్-1 మెయిన్స్ జనరల్ ఎస్సే
గ్రూప్ -1 కొట్టడం సులువే!
Top Cities and Universities in the USA
సైబర్ సంగిని దేనికి సంబంధించింది?
తొలి పశువుల హాస్టల్‌ను ఏ జిల్లాలో నిర్మించారు?
Scholarships
నిశ్శబ్ద మహమ్మారి.. గుర్తించకుంటే ప్రమాదకారి
ప్లేగు లక్షణాలు వ్యాధి సోకిన ఎన్ని రోజులకు బయటపడతాయి?
రాష్ట్ర ప్రభుత్వానికి ‘కామధేనువు’గా ఏ పన్నును పిలుస్తారు?