రాజ్యాంగంపై అంబేద్కర్ ముద్ర
భారత రాజ్యాంగంపై వివిధ సందర్భాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వ్యక్తం చేసిన అభిప్రాయాలపై వివిధ పోటీ పరీక్షల్లో తరుచూ ప్రశ్నలు అడుగుతున్నారు. అందువల్ల పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు ఆయా అంశాలను తెలుసుకోవడం అవసరం. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక వ్యాసం నిపుణ పాఠకుల కోసం..
-స్వాతంత్య్రం రావడం వల్ల ఇక నుంచి ఏదైనా తప్పు జరిగితే బ్రిటిష్ను నిందించే అవకాశం మనకు ఉండదు. ఏ పొరపాటు జరిగినా ఇక మనల్ని మనమే నిందించుకోవాలి – డాక్టర్ బీఆర్.అంబేద్కర్
స్వాతంత్య్ర భారత ప్రథమ ప్రభుత్వంలో
-స్వాతంత్య్ర భారత ప్రథమ ప్రభుత్వంలో డాక్టర్ బీఆర్. అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్.
-హిందూకోడ్ బిల్లు విషయమై నెహ్రూతో విభేదించి కేంద్రమంత్రి మండలికి అంబేద్కర్ రాజీనామా చేశారు.
రాజ్యాంగ పరిషత్లో
-రాజ్యాంగ పరిషత్లో అఖిల భారత షెడ్యూల్డ్ కులాల సంఘం తరఫున అంబేద్కర్ ప్రాతినిధ్యం వహించారు.
-దేశ విభజన కారణంగా బెంగాల్ నుంచి ఎన్నికైన అంబేద్కర్ తన సభ్యత్వాన్ని కోల్పోగా బొంబాయి నుంచి ఎంపిక చేశారు.
-1947 ఆగస్టు 29న రాజ్యాంగ ముసాయిదా సంఘం చైర్మన్గా అంబేద్కర్ నియమించబడ్డారు. రాజ్యాంగ పరిషత్లో ప్రధాన కమిటీ – ముసాయిదా (డ్రాఫ్టింగ్) కమిటీ.
రాజ్యాంగ రచనపై అంబేద్కర్ అభిప్రాయాలు
-భవిష్యత్తులో రాజ్యాంగం వైఫల్యం చెందితే రాజ్యాంగాన్ని నిందించరాదు, దాన్ని అమలుపరిచేవారిని నిందించాలి.
రాజ్యాంగ ప్రవేశికపై..
-సౌభ్రాతృత్వం అంటే సోదరభావం, పౌరుల మధ్య సంఘీభావం, వ్యక్తి గౌరవం ఉండాలి. ఈ పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో చేర్చాలని సూచించినది డాక్టర్ బీఆర్.అంబేద్కర్.
-సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలు రాజ్యాంగంలో భాగమే కాబట్టి వాటిని ప్రవేశికలో చేర్చాలని అంబేద్కర్ భావించలేదు.
-వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కన్నా దేశ సౌర్వభౌమత్వం గొప్పది – అంబేద్కర్
నూతన రాష్ర్టాల ఏర్పాటు – ప్రకరణ 3పై ..
-రాజ్యాంగ పరిషత్లో రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి నూతన రాష్ర్టాల ఏర్పాటులో సంబంధిత రాష్ట్ర అసెంబ్లీకి కూడా నిర్ణయాధికారం ఉండాలనే ఆలోచనను అంబేద్కర్ తిరస్కరించారు. అసెంబ్లీకి నిర్ణయాధికారం ఇస్తే, తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి ఎప్పుడు ఆ సభ అంగీకరించదని, రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణలో అసెంబ్లీ అభిప్రాయాన్ని తీసుకొంటే చాలని సూచించారు. అసెంబ్లీ సమ్మతి అనవసరమని ప్రతిపాదించి, రాజ్యాంగంలో ప్రకరణ 3 రూపకల్పన చేశారు. అంబేద్కర్ దూరదృష్టితో ఆలోచించి ఉండకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండేది కాదు.
ప్రాథమిక హక్కులపై..
-మనిషిని మనిషిగా చూడాలని అంబేద్కర్ రాజ్యాంగంలో అనేక ప్రకరణలను పొందుపరిచారు. ప్రకరణలు 14, 15(2), 16, 17, 23, 24లను రూపొందించడంలో అంబేద్కర్ అపూర్వ కృషి చేశారు.
ప్రకరణపై..
-రాజ్యాంగ పరిహారపు హక్కు భారత రాజ్యాంగానికి ఆత్మ, హృదయం వంటింది – అంబేద్కర్
ఆదేశిక సూత్రాలపై..
-నిర్దేశిక నియమాలను నిర్లక్ష్యం చేయడానికి అవకాశం లేదు. అవి ప్రభుత్వాల దృఢ సంకల్పాన్ని, చిత్తశుద్ధిని తెలియజేస్తాయి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన విధాన రూపకల్పనలో ప్రాధాన్యతను కలిగి ఉంటాయి – అంబేద్కర్
-ఆదేశిక సూత్రాలను ఏ ప్రభుత్వమైనా విస్మరిస్తే వారు ఎన్నికల కాలంలో ప్రజల ముందు జవాబుదారీగా తప్పనిసరిగా నిలవాలి – అంబేద్కర్
-ఇవి దేశంలో ఆర్థిక ప్రజాస్వామ్యం స్థాపించడానికి ఉద్దేశించిన సూత్రాలు – అంబేద్కర్
-దేశంలో ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని అంబేద్కర్ పేర్కొన్నారు.
-ఆధునిక రాజ్యాంగాల్లో ఇలా ఆదేశిక సూత్రాలను పేర్కొనడం ఒక కొత్త పోకడ – అంబేద్కర్.
-ఇవి భారత ప్రభుత్వ చట్టం, 1935లోని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లాంటివి – అంబేద్కర్
రాష్ట్రపతి ఎన్నిక విధానంపై..
-ప్రస్తుతం రాష్ట్రపతిని ఎన్నుకొనేందుకు వినియోగించే పద్ధతి ప్రత్యక్ష ఎన్నికతో సమానమని సమర్థించినవారు – అంబేద్కర్.
-రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి అధికారాలు కేంద్రం, రాష్ర్టాలకు విస్తరిస్తాయి. అందువల్ల అతని ఎన్నికలో పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర విధాన సభ సభ్యులు కూడా పాల్గొనడం సమంజసం- అంబేద్కర్.
రాష్ట్రపతి పదవిపై..
-రాష్ట్రపతి పదవిని బ్రిటిష్ రాజమకుటంతో పోల్చవచ్చు. ఎందుకంటే వారు దేశానికి ఏలిక మాత్రమే, పాలకులు కాలేరు- అంబేద్కర్.
-రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలికి మిత్రునిగాను, మార్గదర్శిగాను, తాత్వికునిగా వ్యవహరిస్తారు- అంబేద్కర్.
ఉప రాష్ట్రపతి పదవిపై..
-ఉపరాష్ట్రపతి పదవిని వేల్స్ యువరాజుతో పోల్చదగినది.
-ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో అతని బాధ్యతలు రాజ్యసభకు అధ్యక్షత వహించడం వరకే పరిమితం. అందువల్ల పార్లమెంట్ సభ్యులు ఎన్నుకుంటే సరిపోతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్ర విధాన సభ సభ్యులు పాల్గొనడం అనవసరం.
ప్రధానమంత్రి పదవిపై..
ప్రధాని, క్యాబినెట్ అనే సౌధానికి మూలస్తంభం వంటివారు.
-మనదేశ ప్రధాని పదవిని అమెరికా అధ్యక్ష పదవితో పోల్చవచ్చు.
రాజ్యసభపై..
-రాజ్యసభ (ఎగువ సభ)కు వ్యతిరేకంగా అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్లో మాట్లాడారు. ఆయన ఆలోచనల ప్రకారం రాజ్యసభ అంతగా ప్రాముఖ్యతలేని సభ.
గవర్నర్ వ్యవస్థపై..
-ఎలాంటి ప్రాముఖ్యంలేని గవర్నర్లను ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. నియామక పద్ధతి ఉత్తమమైనది.
ప్రకరణ 370పై..
-జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ప్రకరణ 370ని అంబేద్కర్ వ్యతిరేకించారు.
భారత సమాఖ్య, కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై..
-భారతదేశం సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగాను, అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్ర ప్రభుత్వంగా వ్యవహరిస్తుంది.
-భారతదేశం సూత్రబద్ధమైన సమాఖ్య కాదు అంటే ఒప్పందం ద్వారా ఏర్పడిన సమాఖ్య కాదు. అందువల్ల దేశంలోని రాష్ర్టాలకు యూనియన్ నుంచి విడిపోయే అధికారం లేదు.
-మాన సమాఖ్య ఒక ఒప్పందం ద్వారా ఏర్పడినది కాదు కాబట్టి ఏ రాష్ర్టానికీ ఇందులోంచి విడిపోయే అధికారం లేదు.
-అంబేద్కర్ అధికరణం 252ను సమాఖ్య ప్రభుత్వాన్ని తక్కువ కాఠిన్యంతో కూడుకుని న్యాయబద్ధంగా ఉండేవిధంగా తీర్చిదిద్దేక్రమంలో భారతదేశం కనుగొన్న ఒక కొత్త ఆలోచన అని అభివర్ణించారు.
-అంబేద్కర్ బలమైన కేంద్రం, స్వతంత్రమైన రాష్ర్టాలు ఉండాలని భావించారు.
-రెవెన్యూ పంపిణీ వ్యవస్థను అంబేద్కర్ నాకు తెలిసిన ఆర్థిక వ్యవస్థల్లో అత్యుత్తమమైనది అని అభివర్ణించారు. అయితే రాష్ర్టాలు తమ వనరుల కోసం కేంద్రం తమకు ఇచ్చే గ్రాంటులపై మితిమీరి ఆధారపడటమే పెద్ద లోపం అని కూడా అన్నారు.
-భారత సమాఖ్య కఠినత్వం లేదా న్యాయ శాస్ర్తాధిక్యతలోని పొరపాట్ల వల్ల ఇబ్బందికి గురికావడమనేది జరగదని ఎవరైనా చెప్పవచ్చు. సరళమైన సమాఖ్య కావడమే హాని కలిగిస్తుంది. దేశంలో శాంతిని కాపాడటంలో కీలకమైన విషయాలను సమన్వయపర్చడంలో విఫలమవుతుంది. అంతర్జాతీయ వేదికలపై యావద్దేశం తరఫున సమర్థమంతంగా ప్రాతినిధ్యం వహించలేకపోతుంది. మన రాజ్యానికి పటిష్టమైన కేంద్రంతో కూడిన సమాఖ్య విధానమే అత్యంత ఆరోగ్యవంతమైన పద్ధతి.
-కేంద్ర చట్టాలకు సమాఖ్య స్వభావం ఉంటుంది. కాబట్టి పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం (ప్రకరణ 108)ను అంబేద్కర్ సమర్థించారు. రాష్ర్టాల్లో ఉభయ సభల సంయుక్త సమావేశం అవసరం లేదని పేర్కొన్నారు.
అత్యవసర పరిస్థితులు-అధికారాలపై..
-అత్యవసర అధికారాలను సమర్థించారు. జాతీయ సమైక్యతకు, సమగ్రతకు ఇది అవసరమని భావించారు.
-ఈ అత్యవసర అధికారాలను రాజకీయ ఉద్దేశాల కోసం దుర్వినియోగం చేయరు అనే అభిప్రాయంతో ఆయన అంగీకరించారు.
-జాతీయ అత్యవసర పరిస్థితి (ప్రకరణ 352)పై భారత రాజ్యాంగాన్ని విపత్కర పరిస్థితుల నుంచి కాపాడేందుకు వినియోగించే ఆపత్కాల ఉపాయాలు అని అన్నారు.
-రాష్ట్రపతి పాలనపై ప్రకరణ 356 కేవలం ఒక మృతపత్రం (డెత్ లెటర్)గా మాత్రమే అంతిమంగా ఉపయోగపతాయని అన్నారు.
-అంబేద్కర్ మరణించారు కానీ ఆయన రూపొందించిన మృతపత్రం (ప్రకరణ 356) మాత్రం సజీవంగానే ఉంది- హెచ్వీ కామత్.
రాజ్యాంగ సవరణ పద్ధతి (ప్రకరణ 368)పై..
-రాజ్యాంగ సవరణ గురించి రాజ్యాంగ సభలో అంబేద్కర్ కిందివిధంగా పేర్కొన్నారు. ఎవరైతే భారత రాజ్యాంగం పట్ల అసంతృప్తితో ఉంటారో వారు సాధారణ ప్రజల తరఫున పార్లమెంటు సభ్యుల్లో 2/3 వంతు మెజారిటీతో వారి అసంతృప్తిని తొలగించవచ్చు.
-రాజ్యాంగ సవరణ విధానం ఒక మూస విధానాన్ని ఎంచుకోలేదు. ఇదే అంతిమం, సవరణకు అతీతం అనే లేబుల్ ఏర్పాటు చేయదల్చుకోలేదు, ఒక సరళ విధానాన్ని పొందుపర్చారు.
భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్పై..
-రాజ్యాంగం సృష్టించిన అధికారుల్లో కాగ్ అత్యున్నతమైన అధికారి.
భారత ప్రభుత్వంపై అంబేద్కర్ అభిప్రాయాలు
-భారత ప్రభుత్వ ప్రధాన లక్ష్యం దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్న ప్రజల ఆర్థిక, సామాజిక, విద్య, వైజ్ఞానిక రంగాల్లో వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి ప్రయత్నించడం. సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వర్గాల సంక్షేమం కోసం పాటుపడటం అని అన్నారు.
-ప్రభుత్వం విజయవంతంగా నడవాలంటే ఒక మెజారిటీ పార్టీ తప్పనిసరిగా ఉండాలన్నారు.
-ప్రజల ఆర్థిక, సామాజిక జీవితాల్లో విప్లవాత్మక మార్పులను ఏ రక్తపాతమూ లేకుండా తెచ్చే ప్రభుత్వ రూపమే ప్రజాస్వామ్యం అని అన్నారు.
-నేను రాజ్యాంగ పరిషత్లోకి చేరింది షెడ్యూల్డ్ కులాల ప్రయోజనాలను కాపాడటానికి. ఇంతకన్నా మించిన లక్ష్యం లేదు అని అన్నారు.
భారత రాజ్యాంగం ఇతర రాజ్యాంగాలన్నింటిని కొల్లగొట్టి రూపొందించినదిగా వర్ణిస్తే నేను గర్వపడతాను. ఎందుకంటే మంచి ఎక్కడ ఉన్నా గ్రహించడం తప్పు కాదు.
రాజ్యాంగంలో అత్యంత ముఖ్యమైన ప్రకరణ ఏది? అని నన్ను ఎవరైన అడిగితే – ఏ ప్రకరణ లేకపోతే ఈ రాజ్యాంగం పెద్ద సున్నా అవుతుంది? అని అడిగితే 32వ ప్రకరణ తప్ప ఇతర ప్రకరణలను వేటినీ పేర్కొనను. – అంబేద్కర్.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు