భారత యూనియన్‌లో హైదరాబాద్ విలీనం
#దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా భారత ప్రజలు సంతోషాలతో గడుపుతున్నారు. కానీ అందుకు విరుద్ధంగా హైదరాబాద్‌లోని ప్రజలు నిజాం నిరంకుశ పాలనలో మగ్గుతున్నారు. హైదరాబాద్ రాజ్యంలో ఖాసీంరజ్వీ నాయకత్వంలోని మతతత్వవాదుల దాడుల్ని, ఖాసీం రజ్వీ భారత ప్రభుత్వాన్ని, నాయకుల్ని వ్యతిరేకిస్తూ, బాహాటంగా మాట్లాడటాన్ని నియంత్రించలేని నిజాం సర్కార్‌పై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతున్నారు. మెజార్టీ ప్రజలు భారత యూనియన్‌లో కలువడానికి సంసిద్ధులు కావడం, ప్రగతి శీల ముస్లింలు హైదరాబాద్ విముక్తి ఉద్యమానికి బాసటగా నిలిచారు. హైదరాబాద్‌ను పాకిస్థాన్‌లో కలపాలనే ప్రతిపాదనలు, ఎరకోటను ఆక్రమించి దానిపై అసఫ్‌జాహీల పతాకాన్ని ఎగురవేస్తానని ఖాసీంరజ్వీ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం, హైదరాబాద్ రాజ్యం స్వతంత్రంగానే ఉంటుందని నిజాం ప్రకటించుకోవడం అనేక కీలక సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీనికి తోడు జాయిన్ ఇండియా దినోత్సవం జరపాలని హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పిలుపునివ్వడం, భారత యూనియన్ నిజాంలకు మధ్య జరిగిన యథాతథ ఒప్పందం, అందులోని అంశాల్ని ఉల్లఘించిన నిజాం ప్రభుత్వం, ఒప్పంద ఉల్లంఘనలపై అలెన్క్యాంప్ బెల్ ప్రధానమంత్రి(నిజాం ప్రభుత్వం) లాయక్ అలీల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడం, భారత ప్రభుత్వ ప్రతినిధి కె.ఎం.మున్షీ ప్రతిపాదనల్ని నిజాం అంగీకరించకపోవడం, భారత యూనియన్‌కు, హైదరాబాద్ సంస్థానానికి తలెత్తిన వివాదంలో జోక్యం చేసుకోవాల్సిందిగా నిజాం అమెరికా అధ్యక్షునికి(బ్రిటన్ చక్రవర్తి), ప్రధాని, ప్రతిపక్షనేతలకు లేఖలు రాయడం, వారు తిరస్కరించడం, నిజాం హైదరాబాద్ అంశాన్ని ఐక్యరాజ్య సమితికి నివేదించడం..వెరసి భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసేందుకే ఆపరేషన్ పోలో లేదా ఆపరేషన్ కాటర్ పిల్లర్ లేదా పోలీస్ చర్య చేపట్టారు.
ఆపరేషన్ పోలో
# మీర్ ఉస్మాన్ అలీఖాన్(చివరి ఏడో నిజాం) పాలనలో గల హైదారాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో అంతర్భాగం చేసే నిమిత్తమై చేపట్టిన చర్యనే ‘అపరేషన్ పోలో’ అంటారు.
# ఈ ఆపరేషన్ పోలో అని పేరు పెట్టడానికి ప్రధాన కారణం నిజాం రాజ్యంలో ‘పోలో గ్రౌండ్లు’ ఎక్కువగా ఉండటం
#ఈ సైనిక చర్య 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు జరిగింది.
# ఆపరేషన్ పోలోనే పోలీస్‌చర్య అని, ఆపరేషన్ కాటర్‌పిల్లర్ (గొంగలిపురుగు) అని కూడా అంటారు.
తెలంగాణ పోరాటాలు
# పోలీస్‌చర్య/ ఆపరేషన్ పోలోకు హైదరాబాద్ రాజ్యంలో ముఖ్యంగా తెలంగాణలో ఏ విధమైన పోరాటాలు జరిగినాయో తెలుసుకుందాం. ముఖ్యంగా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటు, నిజాంకు వ్యతిరేకంగా పోరాడటం, తెలంగాణ సాయుధ పోరాటం, రజాకార్లు యథాతథ ఒప్పందం మొదలైన అంశాలపైన అవగాహన ఏర్పర్చుకుంటే ఆపరేషన్ పోలోకు దారితీసిన పరిస్థితులు క్షుణ్ణంగా అర్థమవుతాయి.
హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్
# హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపనకు ముఖ్యకారకుడు స్వామి రామానంద తీర్థ. దేశభక్తి భావనల్ని వ్యాపింపచేసే ఉద్దేశంతో ఇది ఏర్పాటైంది. 1938 జూలైలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపించాలని నాయకులు నిర్ణయించారు.
# దీనికి రామకృష్ణదూత్ కన్వీనర్‌గా, బూర్గుల రామకృష్ణారావు, రావి నారాయణరెడ్డి, హరిశ్చంద్రడా, రామాచారి, జనార్దన్ రావు దేశాయ్, పాండురంగ జోషిలు సభ్యులుగా తాత్కాలిక కమిటీ ఎన్నికైంది.
# 1938, సెప్టెంబర్ 9న సర్వసభ్య సమావేశం నిర్వహించడానికి నిర్ణయించారు.
#గోవింద్‌రావ్ నానల్, షరాఫ్ నాయకత్వంలోని మహారాష్ట్ర పరిషత్, జనార్దన్‌రావు దేశాయ్, రామాచారి నాయకత్వంలోని కర్ణాటక పరిషత్ స్టేట్ కాంగ్రెస్‌లో విలీనమైంది.
# దీని వ్యవస్థాపకుడు, తొలి అధ్యక్షుడు – స్వామి రామానంద తీర్థ
# అయితే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌ను నిషేధిస్తూ 1938, సెప్టెంబర్ 8న ప్రభుత్వం (నాటి ప్రధానమంత్రి అక్బర్హైదరీ) ప్రకటన జారీ చేసింది.
# వ్యక్తిగత హోదాలో మందుముల నర్సింగరావు, మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు నవాబ్ బహదూర్ యార్జంగ్ మధ్య చర్చలు జరిగాయి. కానీ నిషేధం ఎత్తివేసే విషయంలో చర్చలు విఫలమయ్యాయి.
హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహం
# హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ 1938, అక్టోబర్ 24న సత్యాగ్రహానికి పిలుపు నిచ్చింది. దీంతో సత్యాగ్రహం చేపట్టిన స్వామి రామానంద తీర్థ అక్టోబర్ 27న పుత్లీబౌలీ వద్ద అరెస్ట్ అయ్యారు.
# ఈ సత్యాగ్రహంలో పాల్గొన్న మొత్తం జట్లు – 18
# చివరి జట్టు నియంత కాశీనాథరావు వైద్య
స్టేట్ కాంగ్రెస్ పై నిషేధం ఎత్తివేత
# 1946, జూలై 3న స్టేట్ కాంగ్రెస్ పై నిషేధం ఎత్తివేశారు. హైదరాబాద్‌లో జరిగిన తొలి స్టేట్‌కాంగ్రెస్ సమావేశానికి స్వామి రామానంద తీర్థ అధ్యక్షత వహించారు.
జాయిన్ ఇండియా ఉద్యమం
# హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్‌లో చేరాలని హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
#1947, ఆగస్టు 7న ‘జాయిన్ ఇండియా దినోత్సవం/ ఉద్యమాన్ని’ చేపట్టారు. నిజాం తన రాజ్యాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేసింది.
# స్వాతంత్య్రస్ఫూర్తితో 1947, ఆగస్టు 15న విద్యార్థులు అనేక ప్రాంతాల్లో జాతీయజెండాల్ని ఎగురవేశారు.
#స్వాతంత్య్ర దినోత్సవం రోజున తన (నిజాం) రాజ్యంలో జాతీయ జెండాను ఎగురవేయడాన్ని నిషేధిస్తూ ఫర్మానాను జారీ చేశారు.
# స్వామి రామానందతీర్థ తనకు జేఎల్ నెహ్రూ అందించిన జాతీయ పతాకాన్ని సుల్తాన్ బజార్ (హైదరాబాద్)లో 1947, ఆగస్టు 15న ఎగురవేశారు.
#ఈ విధంగా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపించే సమయం నుంచి అంటే పురిటిప్పుల దశనుంచి చివరి వరకు నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంది.
ఆపరేషన్ పోలో కాలంలో ముఖ్యులు
భారత ప్రధానమంత్రి – జవహర్లాల్ నెహ్రూ
ఉపప్రధానమంత్రి, హోంమంత్రి — సర్దార్ వల్లభాయ్ పటేల్
భారత రక్షణశాఖ మంత్రి – బల్దేవ్ సింగ్
భారత సర్వసైన్యాధిపతి – జనరల్ బుచర్
భారత సంస్థానాల కార్యదర్శి – వీపీ మీనన్
భారత ప్రభుత్వపు హైదరాబాద్ ప్రతినిధి– కేఎం మున్షీ
దక్షిణ కమాండెంట్ – జనరల్ మహరాజా రాజేంద్రసింగ్
ఆపరేషన్ పోలో ముఖ్య నాయకుడు – మేజర్ జయంతినాథ్ దరి
హైదరాబాద్ సంస్థాన పాలకుడు – మీర్ ఉస్మాన్ అలీఖాన్
దివాన్/ ప్రధానమంత్రి – లాయక్ అలీ
హైదరాబాద్ సైన్యాధిపతి – సయ్యద్ అహ్మద్ ఆండ్రూస్
పోలీస్ వ్యవహారాల పర్యవేక్షకుడు – పింగళి వెంకట్రామారెడ్డి
రజాకార్ల నాయకుడు – ఖాసీం రజ్వీ
నిజాంపై ప్రముఖుల వ్యాఖ్యలు
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’
‘మా నిజాం రాజు జన్మజన్మల బూజు’
‘ఓ నిజాం పిశాచమా… కానరాడు నిన్నుబోలిన రాజు మాకెన్నడేని తీగెలను తెంపినావు అగ్నిలో దింపినావు’
– దాశరథి
బండెనక బండి కట్టి.. 16 బండ్లు కట్టి, ఏ బండ్లెపోతవ్ కొడుకో నైజాం సర్కారోడా’
– బండి యాదగిరి
‘మా నిజాం రాజ్యం కల్తీలేని మధ్యయుగపు భూస్వామ్యవ్యవస్థ’ – రావి నారాయణరెడ్డి
‘పగలేయ్ ఈ నిజాం కోట… ఎగరేయ్ ఎర్రబావుటా’
– రెంటాల గోపాలకృష్ణ
తెలంగాణ సాయుధ పోరాటం
# భూమికోసం, భుక్తికోసం, నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం ఆగ్రహోదగ్రులైన తెలంగాణ ప్రజల పోరాట పటిమకు నిలువెత్తు నిదర్శనమే తెలంగాణ సాయుధ పోరాటం
# ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు చేసిన పోరాటాల్లోకెల్లా మహోజ్వలమైన ఘట్టం తెలంగాణ ప్రజలు చేసిన సాయుధ పోరాటం.
#బానిసత్వంలో గడుపుతున్న ప్రజానీకం తమ భావ స్వాతంత్య్రం కోసం, కనీస హక్కుల కోసం పోరాటం చేశారు.
# పోలీసులు, భూస్వాములు ప్రజల్ని తీవ్రంగా అణిచివేసి, కష్టాలకు గురి చేస్తున్నప్పుడు కమ్యూనిస్ట్‌లు, ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేశారు.
గ్రామ రక్షకదళాల ఏర్పాటు
# గ్రామ సంఘాల పేరుతో ఆత్మరక్షణ దళాలు ఏర్పాటు చేసుకున్నారు. కమ్యూనిస్ట్‌లు ఆయుధాల్ని సమకూర్చుకునే ప్రయత్నాలు చేశారు.
# తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీని రహస్యంగా స్థాపించారు.
# రజాకార్లు, పోలీసులు, భూస్వాముల ఆగడాలను ఎదిరించడంలో కమ్యూనిస్ట్‌లు ప్రముఖ పాత్రపోషించారు.
#1944లో భువనగిరిలో జరిగిన ఆంధ్రమహాసభపై సంపూర్ణాధిపత్యాన్ని సాధించారు.
# వెట్టిచాకిరి, నాగుపద్ధతి, అక్రమలెవీ వసూళ్లకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్‌లు పోరాటాలు చేశారు.
# జన్నారెడ్డి ప్రతాపరెడ్డి సూర్యాపేట తాలుకా 1,50,000 ఎకరాల భూమి, విసునూరు దేశ్‌ముఖ్ రాపాక వెంకటరామచంద్రారెడ్డి- 40,000 ఎకరాల భూమి ఉండేది. వీరు ప్రజల్ని హింసించేవారు.
దొడ్డి కొమురయ్య హత్య – కడివెండి
# 1946, జూలై 4న విసునూరు దేశ్‌ముఖ్ రాపాక వెంకట రామచంద్రారెడ్డికి చెందిన గూండాలు దొడ్డి కొమురయ్యను హత్య చేశారు. తెలంగాణ పోరాట చరిత్రలో జూలై 4 మరిచిపోలేని రోజు. కడివెండి గ్రామం (నాటి జనగామ తాలూకా, నల్లగొండ జిల్లా)లో జరిగిన ఈ విషయాన్ని ‘మీజాన్’ పత్రిక 1946, జూలై 9న ప్రచురించింది (మీజాన్ ఎడిటర్ అడవి బాపిరాజు).
#ఆంధ్ర మహాసభ కార్యకర్త మరణం కడివెండిలో రౌడీల తుపాకీ కాల్పులు అనే శీర్షీకతో మీజాన్ పత్రిక ప్రచురించింది.
పాలకుర్తి కుట్రకేసు
# పాలకుర్తి కుట్రకేసును ఐలవర్మ, ఇతర ఆంధ్రమహాసభ కార్యకర్తలకు వ్యతిరేకంగా బనాయించిండు నాటి విసునూరు దేశ్‌ముఖ్. అదే విధంగా ఆంధ్రమహాసభకు చెందిన భీంరెడ్డి నరసింహారెడ్డి, కల్కూరి రామచంద్రారెడ్డి, చకిలం యాదగిరిరావు, నల్లుప్రతాప రెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వర రావు, కోట వెంకటరెడ్డిలను దొమ్మీకేసు కింద పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నాయకుల్ని కోర్టులో హాజరుపర్చలేదు. వారి కుటుంబ సభ్యులకు వారెక్కడున్నారో కూడా తెలియజేయలేదు పోలీసులు. ఈ విషయం రావినారాయణ రెడ్డి ద్వారా తెలుసుకొని, అతని కోరిక మేరకు పాలకుర్తికి వెళ్తిన ఆరుట్ల లక్ష్మీనరసింహరెడ్డిని విసునూరు దేశ్‌ముఖ్ గూండాలు అడ్డుకుని తీవ్రంగా కొట్టారు.
# పాలకుర్తి కేసు విసునూరు దొర తరఫున స్సేన్ వాదించాడు. అతడు పబ్లిక్ ప్రాసిక్యూటర్
# సీనియర్ లాయర్ నాగులపల్లి కోదండ రామారావు, కొండాలక్ష్మణ్ బాపూజీ అనే జూనియర్ లాయర్, ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి, వఫాఖానీ అనే లాయర్లు ఆంధ్ర మహాసభ తరఫున ఈ కేసు కోసం పని చేశారు.
# అయితే ఈ కేసును విచారిస్తున్న సెషన్స్‌జడ్జి గులాం పతంజన్ విసునూరు దొర రామచంద్రారెడ్డికి మిత్రుడు కావడంతో అతనికి అనుకూలంగా వ్యవహరించి,ఆంధ్రమహాసభ కార్యకర్తల్ని ఇబ్బందిపెట్టే ప్రయత్నాలు చేశాడు.
# దీన్ని గ్రహించిన ఆంధ్రమహాసభ నాయకులు కేసును మరో జడ్జికి బదిలీ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు దాన్ని అంగీకరించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు