ఫలదీకరణ స్థానం.. ఫాలోపియన్ నాళం ( బయాలజీ)
క్షీరదాలన్నింటిలో మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థది ప్రత్యేక స్థానం. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మరింత భిన్నమైనది. గర్భధారణ మొదలుకొని శిశుజననం, శిశు పాలన వరకు ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ నేపథ్యంలో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పిండ ప్రతిస్థాపన, శిశుజననం గురించి వివరంగా నిపుణ పాఠకుల కోసం..
స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ
– స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘గైనకాలజీ’ అంటారు.
– స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత స్త్రీ బీజకోశాలు, ఒక జత స్త్రీ బీజవాహికలు, గర్భాశయం, బాహ్య జననేంద్రియం అనే ముఖ్య భాగాలుంటాయి.
స్త్రీ బీజకోశాలు: ఉదర కుహరంలో ఒక జత స్త్రీ బీజకోశాలుంటాయి. స్త్రీ బీజకోశ పుటికల్లో అండాలు అభివృద్ధి చెందుతాయి. ఈ పుటికలను గ్రాఫియన్ పుటికలు అంటారు. పరిపక్వం చెందినప్పుడు పుటిక పగిలి అండం విడుదలవుతుంది. ఇలా అండం విడుదల కావడాన్ని అండోత్సర్గం అంటారు. ఈ ప్రక్రియ తర్వాత పుటికా కణాలు విభజన చెంది పసుపు రంగు కార్పస్ లూటియంను ఏర్పరుస్తాయి. దీని నుంచి ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ విడుదలవుతుంది.
స్త్రీ బీజవాహికలు: అండాలు వెడల్పాటి గరాటు వంటి కుల్యాముఖం ద్వారా స్త్రీ బీజవాహికలలోకి ప్రవేశిస్తాయి. వీటినే ఫాలోపియన్ నాళాలు అని కూడా అంటారు. ఇవి దళసరి గోడలు కలిగిన గర్భాశయంలోకి తెరుచుకుంటాయి. ఫాలోపియన్ నాళంలోనే అండం ఫలదీకరణం చెందుతుంది.
గర్భాశయం: ఇది తలకిందులైన బేరిపండు ఆకారంలో ఉంటుంది. మానవ గర్భాశయం సింప్లెక్స్ రకానికి చెందినది. గర్భాశయం లోపలి పొరను ఎండోమెట్రియం అంటారు. రుతుచక్రం తర్వాత ఈ పొర మందం పెరుగుతుంది. ఈ స్థితి పిండాన్ని స్వీకరించడానికి అనువుగా ఉంటుంది. ఒకవేళ ఫలదీకరణం జరగకపోవడం వల్లఎండోమెట్రియం పొర విచ్ఛిన్నమై రుతుస్రావం రూపంలో బయటకు వస్తుంది. ఫలదీకరణం జరిగితే ఈ పొర మందం పెరుగుతూ పిండానికి పోషణ అందిస్తుంది. అదేవిధంగా వ్యర్థాలను తొలగించడానికి సహాయపడుతుంది.
రుతుచక్రం: దీన్నే మెన్స్ట్రువల్ సైకిల్ అంటారు. ఇది స్త్రీలలో 28 రోజులకొకసారి జరిగే ప్రక్రియ. యుక్త వయస్సుకు వచ్చిన అమ్మాయిల్లో ఈ ప్రక్రియ 11-12 సంవత్సరాల వయస్సులో మొదలవుతుంది. ఇది మొదటిసారిగా రావడాన్ని ‘రజస్వల’ అంటారు. స్త్రీలలో ప్రతినెలా ఒక అండం మాత్రమే విడుదలవుతుంది. గర్భాశయంలోని ఎండోమెట్రియం పొర ఒక నిర్దిష్ట కాలవ్యవధిలో విసర్జితమై తిరిగి కొత్తగా తయారవుతుంది. ఈవిధంగా విసర్జించిన స్రావాల్ని రుతుస్రావం అంటారు. శరీర తత్వాన్ని బట్టి 50 సంవత్సరాల పైబడిన స్త్రీలలో రుతుస్రావం ఆగిపోతుంది. ఈస్థితిని ‘మోనోపాజ్’ అంటారు. రుతుస్రావం సమయంలో పాటించాల్సిన హైజీన్ గురించి అవగాహన కల్పించడానికి ఏటా మే 28ని ‘మెనుస్ట్రువల్ హైజీన్ డే’గా పాటిస్తారు.
పిండ ప్రతిస్థాపన
-శుక్రకణం-అండం కలిసి ఫాలోపియన్ నాళంలో ఫలదీకరణం చెందుతుంది. సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత గర్భాశయంలోకి చేరుతుంది. దీన్నే పిండ ప్రతిస్థాపన అంటారు. ఫలదీకరణం ఫలితంగా ఏర్పడిన సంయుక్త బీజం ప్రవేశించడానికి ముందుగా గర్భాశయ పరిమాణం పెరుగుతుంది. పెరుగుతున్న పిండాన్ని రక్షిస్తూ పొరలు ఏర్పడుతాయి. అవి పరాయువు, ఉల్బం, ఆలిందం, సొనసంచి.
పరాయువు: ఇది పిండాన్ని ఆవరించి ఉండే బాహ్యత్వచం. ఇది పిండానికి పోషక పదార్థాలను అందించడానికి, పిండం నుంచి విసర్జక పదార్థాలను తీసివేయడానికి సహాయపడుతుంది.
ఉల్బం: ఇది పిండాన్ని ఆవరించి ఉండే లోపలి భాగం. ఉల్బం, పిండానికి మధ్యలో ఉల్బద్రవం ఉంటుంది. ఉల్బం, ఉల్బద్రవం యాంత్రిక అఘాతాల నుంచి పిండానికి రక్షణ కల్పిస్తాయి.
ఆళిందం: పిండాన్ని ఆవరించి ఉన్న మరొక త్వచం. ఈ త్వచం నుంచి పిండం ఆహార నాళం ఉద్భవిస్తుంది. పిండాన్ని జారాయువుతో కలిపే నాళాన్ని నాభిరజ్జువు అంటారు. ఇది రక్తనాళాలను కలిగి ఉండి తల్లి నుంచి బిడ్డకు పోషక పదార్థాలను అందజేస్తుంది.
సొనసంచి: ఇది ద్రవంతో నిండిన సంచి వంటి పొర. జరాయు క్షీరదాల్లో దీనికి ప్రత్యేకమైన విధిలేదు.
జరాయువు
– పిండ కణాలు, తల్లి కణాలు కలిసి జరాయువును ఏర్పరుస్తాయి. ఇది గర్భధారణ జరిగిన 12 వారాలకు ఏర్పడుతుంది. తల్లి, బిడ్డ ఇద్దరి రక్త ప్రసరణ వ్యవస్థలు పలుచని త్వచం ద్వారా వేరుచేయబడి ఉంటాయి. జరాయువు ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్, పోషకాలు, వ్యర్థ పదార్థాల రవాణా విసరణ పద్ధతి ద్వారా చేస్తుంది. గర్భధారణ జరిగిన 3వ నెల నుంచి పిండాన్ని భ్రూణం అంటారు. దీనిలో ముఖ్యమైన అవయవాలన్నీ ఏర్పడతాయి. పిండంలో హృదయ స్పందన 21వ రోజు నుంచి ప్రారంభమవుతుంది.
గర్భావధి కాలం: గర్భాశయంలో పిండం అభివృద్ధి చెందే కాలాన్ని గర్భావధి కాలం అంటారు. జీవికి, జీవికి గర్భావధి కాలం వేరుగా ఉంటుంది. అత్యధిక గర్భావధి కాలం గల జంతువు ఏనుగు. అత్యల్ప గర్భావధి కాలం గల జంతువు అపోసం.
శిశు జననం
– ఫలదీకరణం జరిగిన 9 నెలలకు గర్భావధి కాలం చివరి దశలో తలభాగం గర్భాశయ ముఖద్వారానికి చేరుతుంది. సాధారణంగా ప్రసవ సమయంలో తల ముందుగా బయటకు వస్తుంది. కొన్ని సమయాల్లో కాళ్లు ముందుగా బయటకు వస్తాయి. ఈ పరిస్థితుల్లో ప్రసవం చాలా కష్టం. పురిటి ప్పులు రావడం అనేది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ. యోని ద్వారా శిశువు బాహ్య ప్రపంచంలోకి నెట్టబడుతుంది. శిశువు నుంచి జరాయువు వరకు ఉన్న నాభిరజ్జువును వైద్యులు కత్తిరించి వేరుచేస్తారు. గర్భావధి చివరి దశలో శోషరసాన్ని పోలిన ద్రవం స్తన గ్రంథుల్లో పోగవుతుంది. ఈ ద్రవాన్ని మురుపాలు లేదా ప్రథమ స్తన్యం అంటారు. ఇది నవజాత శిశువుకు వ్యాధి నిరోధకతను పెంచడానికి అవశ్యకం. దీని తర్వాత పాలు స్రవించబడతాయి. శిశు జనన అనంతరం క్షీరోత్పత్తి ఆగిన తర్వాత రుతుచక్రం మళ్లీ ప్రారంభమవుతుంది.
గర్భధారణ, శిశు జననానికి తోడ్పడే హార్మోన్లు
టెస్టోస్టిరాన్: శుక్రోత్పాదక నాళికల మధ్య ఉండే లీడిగ్, మధ్యంతర కణాలు ఈ పురుష లైంగిక హార్మోన్‌ను స్రవిస్తాయి. ఇది పురుషుల్లో ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుంది.
ఈస్ట్రోజన్: ఈస్ట్రోజన్‌ను స్త్రీ బీజకోశాలు, కార్పస్లూటియం స్రవిస్తాయి. ఈస్ట్రడయోల్ అనేది ప్రధానమైన ఈస్ట్రోజన్. ఈస్ట్రోజన్స్ స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలను కలుగజేస్తాయి.
ప్రొజెస్టిరాన్: కార్పస్లూటియం ఈ హార్మోన్‌ను స్రవిస్తుంది. ఇది గర్భధారణ కోసం గర్భాశయాన్ని సిద్ధం చేస్తుంది. అదేవిధంగా క్షీర గ్రంథులను పాల ఉత్పత్తి కోసం సిద్ధం చేస్తుంది.
ఇవే కాకుండా జరాయువు విడుదల చేసే రిలాక్సిన్ అనే హార్మోన్ శ్రోణి బంధనాలను సడలించడం ద్వారా శిశు జననానికి తోడ్పడుతుంది.
శుక్రకణంలోని హయలురోనిడేజ్ అనే ఎంజైమ్ ఫలదీకరణంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
క్షీరదాలు – గర్భావధి కాలం
జీవి గర్భావధి కాలం (రోజుల్లో)
అపోసం 12
ఎలుక 22
ఉడుత 30-40
కుందేలు 31
కుక్క, పిల్లి 60
కంగారూ 80
సింహం 105-115
పంది 114
మేక, గొరె 149
మానవుడు 270-280
ఏనుగు 600
ప్రాక్టీస్ బిట్స్
1. అలైంగిక ప్రత్యుత్పత్తికి అవసరమైనవి ఏవి?
1) రెండు జీవులు
2) వ్యతిరేక లింగానికి చెందిన రెండు జీవులు
3) ఒకే జీవి 4) స్త్రీ జీవి
2. మానవ శరీరంలో ఫలదీకరణం జరిగే భాగం?
1) గర్భాశయం 2) యోని
3) ఫాలోపియన్ నాళం 4) పుటిక
3. జంతువుల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి ఎక్కువగా జరిగేది?
1) చేపలు 2) ఉభయచరాలు
3) క్షీరదాలు 4) అకశేరుకాలు
4. వ్యాధికి గురైనప్పుడు శస్త్ర చికిత్స ద్వారా గర్భాశయాన్ని తొలగించే విధానాన్ని ఏమంటారు?
1) ట్యూబెక్టమీ 2) వాసెక్టమీ
3) హిస్టిరెక్టమీ 4) ఏదీ కాదు
5. ఒకే విధమైన కవలలు పుట్టడానికి కారణం?
1) రెండు అండాలు, ఒక శుక్రకణంతో ఫలదీకరణం చెందినప్పుడు
2) ఒకే అండం, రెండు శుక్రకణాలతో ఫలదీకరణం చెందినప్పుడు
3) ఒకే అండం, ఒక శుక్రకణం కలిసినప్పుడు
4) రెండు శుక్రకణాలు, రెండు అండాలు ఫలదీకరణం చెందినప్పుడు
6. ఫలదీకరణం చెందని అండం నుంచి జరిగే ప్రత్యుత్పత్తి?
1) అనిషేక జననం 2) సంయుగ్మం
3) అర్హీనోటోకీ 4) ప్లాస్మాటోమీ
7. అత్యధిక గర్భావధి కాలం గల జంతువు ఏది?
1) ఆవు 2) మనిషి
3) మేక 4) ఏనుగు
8. లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే ప్రతీ జంతువూ తన జీవనాన్ని ఏకకణ స్థాయి నుంచి ప్రారంభిస్తుంది. ఆ కణం ఏది?
1) సిద్ధబీజం 2) సంయుక్త బీజం
3) అండం 4) శుక్రకణం
9. కుటుంబం నియంత్రణలో భాగంగా పురుషులకు చేసే శస్త్ర చికిత్స ఏది?
1) హిస్టరెక్టమీ 2) ట్యూబెక్టమీ
3) వాసెక్టమీ 4) లాప్రోస్కోపీ
10. కుటుంబ నియంత్రణ కోసం స్త్రీలకు చేసే శస్త్ర చికిత్స ఏది?
1) వాసెక్టమీ 2) హిస్టరెక్టమీ
3) ట్యూబెక్టమీ 4) లాప్రోస్కోపీ
సమాధానాలు
1. 3 2. 3 3. 4 4. 3 5. 2 6. 1 7. 4 8. 2 9. 3 10. 3
ఏవీ సుధాకర్
స్కూల్ అసిస్టెంట్
జడ్పీహెచ్ఎస్
లింగంపల్లి
రంగారెడ్డి జిల్లా
9000674747
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు