Ecological Balance | అసంఖ్యాక జీవులకు ఆవాసం.. సహజ సంపదకు నిలయం
ఆవరణ వ్యవస్థలు
- సౌర కుటుంబంలో జీవజాలం గల ఏకైక గ్రహం భూమి. భూమి అసంఖ్యాక జీవులకు ఆవాసం. అందుకే భూమిని జీవగ్రహం (Living Planet) అంటారు. భూమిపై గల మొక్కలు, జంతువులు, భౌతిక అంశాలైన గాలి, నీరు, నేల, పరిసరాలన్నీ కలిపి పర్యావరణం అంటారు. పర్యావరణాన్ని ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. అవి. సహజ పర్యావరణం, మానవ నిర్మిత పర్యావరణం. మానవ నిర్మిత పర్యావరణాన్ని సామాజిక, సాంస్కృతిక పర్యావరణం అని కూడా అంటారు.
- సహజ పర్యావరణాన్ని రెండు రకాలుగా విభజించవచ్చు. అవి. 1. నిర్జీవ పర్యావరణం 2. సజీవ పర్యావరణం
నిర్జీవ పర్యావరణం - భూమిపై గల సౌరశక్తి (కాంతి, ఉష్ణోగ్రత), గాలి, నీరు, నేల మొదలైన భౌతిక అంశాలన్నింటిని నిర్జీవ పర్యావరణం అంటారు. భూమిపై గల నేల భాగాన్ని శిలావరణం అని నీటి భాగాన్ని జలావరణం అని, గాలిలోని వాయువుల భాగాన్ని వాతావరణం అని అంటారు.
సౌర శక్తి - భూమిపై గల శక్తికి మూలాధారం సూర్యుడు.
- భూమి నుంచి 9,09,60,000 మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ భూమిపై జీవకోటి సూర్యుడి సౌరశక్తిపైనే ఆధారపడుతుంది.
- భూమి గుండ్రంగా ఉండటం వల్ల భూమిపై ప్రసరించే సౌరశక్తి ఒకేలా ఉండదు. ఇందువల్ల ఎడారులు, ధృవాలు, సమశీతోష్ణ ప్రదేశాలు ఏర్పడ్డాయి.
- జీవుల పెరుగుదల, అభివృద్ధికి సౌరశక్తి ముఖ్య కారణం.
- ఆకుపచ్చని మొక్కలు సౌరశక్తి సహాయంతో ఆహారం తయారుచేస్తాయి.
గాలి - మన చుట్టూ ఆవరించి ఉన్న గాలిలో ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్, నైట్రోజన్, నీటి ఆవిరి, ఇతర వాయువులు ఉంటాయి.
- ఈ వాయువుల సంఘటనం గాలిలో సమతుల్యంగా ఉంటుంది. అందుకు జీవరాశులు తోడ్పడతాయి.
- శ్వాసక్రియలో జీవరాశులు ఆక్సిజన్‌ను గ్రహించి కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తాయి.
- మొక్కలు ఈ కార్బన్ డై ఆక్సైడ్‌ను ఉపయోగించుకుని ఆహారాన్ని తయారు చేస్తాయి.
నీరు - భూగోళ ఉపరితలం 70 శాతం నీటితో ఆవరించి ఉంటుంది.
- జీవుల శరీరాల్లో 70 శాతం నుంచి 75 శాతం వరకు నీరు ఉంటుంది.
- మొక్కలకు కిరణజన్య సంయోగక్రియలోనూ, విత్తనాలు మొలకెత్తడానికి, లవణాలు, ఆహార పదార్థాలు, ఎరువుల శోషణలో నీరు ఉపయోగపడుతుంది.
- జంతువుల అవయవాల్లో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. ఆహార పదార్థాల ప్రసరణ, వ్యర్థ పదార్థాల విసర్జన, ప్రత్యుత్పత్తి, అభివృద్ధి కోసం నీరు అవసరం.
- వాతావరణంలో నీరు ఆవిరి రూపంలో ఉంటుంది.
నేల - భూ ఉపరితలంలో 30 శాతం భాగాన్ని నేల ఆవరించి ఉంది.
- శిలల నుంచి నేలలు ఏర్పడతాయి. కాబట్టి నేల భాగాన్ని శిలావరణం అంటారు.
- భూమి ఉపరితలంపై గల మెత్తని మట్టినే మృత్తిక అంటారు.
- గాలిలో, నేలపై, నీటిలో నివసించే జీవులకు నేల ఆధారం.
- నేలలో కుళ్లిన ఆకులు, జంతువుల కళేబరాలు, బ్యాక్టీరియాను విచ్ఛిన్నం చేయడం వల్ల నేల సారవంతం అవుతుంది.
జీవ పర్యావరణం - జీవ పర్యావరణంలో ఆకుపచ్చని మొక్కలు, జంతువులే కాకుండా కంటికి కనిపించని సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు మొదలైన జీవాంశాలు ఉంటాయి.
మొక్కలు - ప్రపంచంలో జంతు జాతుల కంటే వృక్ష జాతులే ఎక్కువ.
- అన్ని జీవులకు ఆహారాన్ని ఇచ్చేది మొక్కలే.
- ఆకుపచ్చని మొక్కలు సౌరశక్తిని ఉపయోగించి భూమిపై నివసించే జంతువులకు ఆహారం తయారు చేస్తాయి. కాబట్టి మొక్కలను ఉత్పత్తిదారులు అంటారు.
- మొక్కలు వాటికి కావలసిన ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుంటాయి. కాబట్టి మొక్కలను స్వయం పోషకాలు అంటారు.
- మొక్కల్లో అధికంగా తయారైన ఆహారాన్ని పిండి పదార్థాలు, నూనెలు, మాంసకృత్తుల రూపంలో వివిధ భాగాల్లో నిల్వ చేస్తాయి.
- ఆహారం తయారుచేసే ఆకుపచ్చని మొక్కలు ఉత్పత్తిదారులు.
జంతువులు - జంతువులు మొక్కలలాగా ఆహారాన్ని తయారు చేయలేవు. ఇవి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తమ ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడతాయి. కాబట్టి వీటిని పరపోషకాలు అంటారు.
- మొక్కల ఉత్పత్తులను ఆహారంగా ఉపయోగించే జంతువులను వినియోగదారులు అంటారు.
- జంతువులు తీసుకునే ఆహారాన్ని బట్టి శాకాహారులు, మాంసాహారులు, సర్వ భక్షకాలు అంటారు.
శాకాహారులు: కేవలం మొక్కలను మాత్రమే ఆహారంగా తీసుకునే జంతువులను శాకాహారులు అంటారు. వీటిని ప్రథమ వినియోగదారులు అంటారు.
ఉదా: ఆవు, మేక, కుందేలు, జింక, ఏనుగు, చిలుక, గడ్డి కీటకాలు మొదలైనవి
మాంసాహారులు: మాంసాన్ని ఆహారంగా తీసుకునే జంతువులను మాంసాహారులు అంటారు. శాకాహార జంతువులను తినే వాటిని ద్వితీయ వినియోగదారులు అంటారు. మాంసాహారులను తినే వాటిని తృతీయ వినియోగదారులు అంటారు.
ఉదా: పులులు, సింహాలు, చిరుతలు, తోడేళ్లు, నక్కలు, అడవి పిల్లులు, కుక్కలు, పిల్లులు, చేపలు, పాములు మొదలైనవి
సర్వ భక్షకాలు: శాకాహారాన్ని, మాంసాహారాన్ని తినే జంతువులను సర్వ భక్షకాలు అంటారు.
ఉదా: మనుషులు, ఎలుగుబంట్లు, కాకులు, పిచ్చుకలు, బొద్దింక మొదలైనవి
విచ్ఛిన్నకారులు - నేలలో ఉండే కొన్ని సూక్ష్మజీవులు (ఉదా: బ్యాక్టీరియా, శిలీంధ్రాలు) మృత వృక్ష, జంతువులను కుళ్లింపజేసి వాటి నుంచి భిన్న మూలకాలను విడుదల చేస్తాయి. అలాంటి జీవులను విచ్ఛిన్నకారులు అంటారు.
మొక్కలు, జంతువుల పరస్పర ఆధారం - మొక్కలు, జంతువులు గాలి, ఆహారం మొదలైన వాటి కోసం పరస్పరం ఆధారపడి ఉంటాయి.
- ప్రతి జీవి ఆహారం కోసం మరొక జీవిపై ఆధారపడి ఉంటుంది.
- మొక్కలు, జంతువుల మధ్య ఆహారం ద్వారా ఏర్పడే సంబంధాన్ని ఆహారపు గొలుసు అంటారు.
- జంతువులు ఆహారం కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా మొక్కలపై ఆధారపడతాయి.
- జంతు విసర్జకాలు ఎరువుగా మొక్కల పెరుగుదలకు ఉపయోగపడతాయి.
- కొన్ని జంతువులు చెట్ల తొర్రలు, పొదలు, చెట్ల నీడలో నివసిస్తాయి.
- పరాగ సంపర్కం, బీజ వ్యాప్తి కోసం మొక్కలు, పక్షులు, కీటకాలు, జంతువులు, మనుషులపై ఆధారపడతాయి.
జీవులపై ఉష్ణోగ్రత ప్రభావం - ఉష్ణోగ్రత ప్రభావం వల్ల భూమిపై కొన్ని ప్రాంతాల్లో మొక్కలు, జంతువులు కొన్ని అనుకూలనాలను చూపిస్తాయి.
- ఎడారి ప్రాంతంలోని మొక్కలు ఉష్ణ తాపాన్ని తట్టుకునేందుకు వీలుగా మార్పులు చెంది ఉంటాయి.
- ఉష్ణోగ్రత ఎక్కువైతే పత్రాల ద్వారా నీటి నష్టాన్ని అరిటకట్టడానికి ఎడారి మొక్కలు ఆకులు రాల్చి కాండంలో నీటిని నిల్వ చేస్తాయి.
ఉదా: బ్రహ్మజెముడు, నాగజెముడు - ఉష్ణోగ్రత ఎక్కువైతే మానవుల్లో, జంతువుల్లో నీరు చెమట రూపంలో బయటకు వెళుతుంది. ఇలాంటి పరిస్థితులను తట్టుకునేందుకు వీలుగా ఎడారి జంతువులు తక్కువ రోమాలు కలిగి నీటిని నిల్వ చేస్తాయి.
- ఒంటె నీరు లేకుండా పది రోజులు ఉండగలదు. నీరు లభించినప్పుడు 3-4 బకెట్ల నీటిని తాగుతుంది. కొంత నీటిని శరీరంలో గల తిత్తిలో దాచుకుంటుంది.
- శీతల ప్రాంతంలో నివసించే జంతువులు దట్టమైన ఉన్ని లేదా రోమాలు కలిగి ఉంటాయి. చర్మం కింద దళసరి కొవ్వు పొర ఉంటుంది. ఇది శరీరం నుంచి వేడిమి బయటకు పోకుండా కాపాడుతుంది.
ఉదా: జడల బర్రె - సైబీరియా కొంగలు శీతాకాలం ప్రారంభం కాక ముందే రష్యా నుంచి భారతదేశానికి వలస పోతుంటాయి. భారతదేశంలో వేసవి కాలం ప్రారంభం కాకముందే స్వదేశానికి తిరిగి వెళతాయి.
- మొక్కల పెరుగుదలకు 30..0-40..0 ఉష్ణోగ్రత అనుకూలిస్తుంది.
మధుమేహ వ్యాధి (చక్కెర వ్యాధి)
- మధుమేహ వ్యాధిని వైద్యపరిభాషలో ‘డయాబెటిస్ మెల్లిటస్’ అంటారు. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వుల జీవక్రియల లోపాలతో కూడిన సిండ్రోం. ఇది అంతఃస్రావక వ్యవస్థ లోపం వల్ల కలిగే సర్వసాధారణమైన రుగ్మత. దేహ కణాలకు గ్లూకోజ్ రవాణా కాకపోవడం వల్ల కణాల్లో గ్లూకోజ్ వినియోగం బాగా తగ్గుతుంది. దీంతో కొవ్వులు, ప్రొటీన్ల వినయోగం పెరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ పరిమాణం 180 mg కన్నా ఎక్కువైతే మూత్రం ద్వారా గ్లూకోజ్ కోల్పోడం (గ్లూకోసూరియా) జరుగుతుంది. మిశ్రమ గ్రంథి అయిన క్లోమంలోని లాంగర్‌హాన్స్ పుటికల్లోని ఆల్ఫా, బీటా కణాలు ఇన్సులిన్, గ్లూకగాన్ అనే హార్మోన్లను స్రవిస్తాయి. ఇన్సులిన్ రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గిస్తే గ్లూకగాన్ చక్కెర స్థాయిని పెంచుతుంది.
- డయాబెటిస్ మెల్లిటస్ ముఖ్య లక్షణాలు మూడు. అవి..
పాలియూరియా: మూత్రపిండాల నీటి పునఃశోషణ సామర్థ్యం తగ్గడం వల్ల మూత్రం ఎక్కువగా తయారవుతుంది.
పాలిడిప్సియా: శరీరం నుంచి నీరు మూత్రం రూపంలో ఎక్కువగా బయటకు వెళ్లడం వల్ల నీటి శాతం తగ్గి అధిక దాహం కలుగుతుంది.
పాలిఫెజియా: మూత్రం ద్వారా గ్లూకోజ్, పోషకాలు ఎక్కువగా బయటకు వెళ్లడం వల్ల అధిక ఆకలి, అతిగా తినడం జరుగుతుంది. - డయాబెటిస్ మెల్లిటస్‌లో రెండు సాధారణ రకాలుంటాయి. అవి..
రకం-1 డయాబెటిస్: ఇన్సులిన్ స్రావం తక్కువగా ఉండటం వల్ల లేదా లోపించడం వల్ల టైప్ 1 డయాబెటిస్ కలుగుతుంది. దీన్ని ఇన్సులిన్ ఆధారిత డయాబెటిస్ మెల్లిటస్ (IDDM) అంటారు. ఎందుకంటే మరణం నుంచి కాపాడటానికి ఇన్సులిన్ ఇంజెక్షన్లు అవసరమవుతాయి. 30 ఏళ్లలోపు వయస్సుల గల వారిలో ఇది సర్వసాధారణంగా, ఆకస్మికంగా ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో దీన్ని ‘శాబక డయాబెటిస్’ (Juvenile Diabetes) అంటారు. ఈ వ్యాధిని అదుపులో ఉంచడానికి రోజువారీ ఇంజెక్షన్లు, ప్రణాళికబద్ధమైన ఆహారం, క్రమయుత వ్యాయామం, ప్రతిరోజు రక్తంలో చక్కర స్థాయిని పరిరక్షించుకోవాలి.
రకం-2 డయాబెటిస్: దీన్ని నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మెల్లిటస్ (NIDDM) అంటారు. లక్ష్య కణజాలం ఇన్సులిన్‌కు తక్కువ సూక్ష్మగ్రాహకంగా ఉండటం వల్ల ఇది కలుగుతుంది. ఇది రకం-1 కన్నా ఎక్కువ సాధారణంగా ఉంటుంది. రకం-2 డయాబెటిస్ ప్రధానంగా స్థూలకాయుల్లో, వ్యాయామం చేయని వారిలో ఎక్కువగా సంభవిస్తుంది. దీన్ని కొన్నిసార్లు వయస్సులో ఆరంభమయ్యే లేదా ప్రౌఢ ఆరంభ డయాబెటిస్ గా వ్యవహరిస్తారు. దీని ప్రభావం నెమ్మదిగా ప్రారంభమవుతుంది. అభివృద్ధి చెందడానికి కొన్ని సందర్భాల్లో చాలా ఏళ్లు పడుతుంది. రకం-2 డయాబెటిస్ ఉన్న చాలామందిలో ఆహార నియంత్రణ ద్వారా అదుపులోకి రాకుంటే ఇన్సులిన్ ఇంజెక్షన్లు అవసరమవుతాయి. - గర్భిణుల్లో వచ్చే మధుమేహాన్ని జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు.
నోట్: డయాబెటిస్ వ్యాధి పట్ల అవగాహన పెంపొందించడానికి ఏటా నవంబర్ 14ను ప్రపంచ మధుమేహ నివారణ దినోత్సవంగా నిర్వహిస్తారు.
వ్యాధి లక్షణాలు - అధిక మూత్ర విసర్జన, ఆకలి, దాహం వేయడం.
- మసక చూపు, కంటి చూపు మందగించడం.
- ఆకస్మికంగా బరువు పెరగడం లేదా తగ్గడం.
- చేతులు, కాళ్లకు స్పర్శ తెలియకపోవడం మొదలైన అపస్థితులు ఏర్పడటం.
Previous article
Sports Current Affairs | క్రీడలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు