Biology – Classification of Organisms | జీవుల వర్గీకరణ
ప్రపంచంలోని అన్ని సజీవుల గురించి అధ్యయనం చేయడం అసాధ్యం. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి జీవులను వర్గీకరిస్తారు. ఒక జనాభాలో వంశపారంపర్యంగా వచ్చే కొన్ని లక్షణాలు, ఆ జీవులు ఎలా పరిణామం చెందాయో తెలిపే అంశాల ఆధారంగా వాటన్నింటినీ ఒక సమూహం కిందికి తీసుకురావడాన్ని వర్గీకరణ అంటారు. వర్గీకరణ విధానాన్ని మొదటిసారిగా ప్రతిపాదించింది ఎ.పి.డి. కండోల్.
రాజ్యం: అన్ని విషమ పోషక బహుకణ జీవులను (పూతికాహారులు తప్ప) ఎనిమేలియా అనే రాజ్యంలో చేర్చారు.
వర్గం: ఒకటి లేదా ఎక్కువ విభాగాలు కలిసి ఒక వర్గం ఏర్పడుతుంది. ఉదాహరణకు సైక్లోస్టొమేటా, కాండ్రిక్తిస్, ఆస్టిక్తిస్, ఉభయజీవులు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు మొదలైన విభాగాలను కార్డెటా వర్గంలో చేర్చారు. దీనికి కారణం ఆ జీవుల్లో పృష్ఠవంశం, బోలుగా ఉండే పృష్ఠనాడీ దండం, గ్రసనీ మొప్పచీలికలు, పాయు-పరపుచ్ఛం లాంటి విశిష్ట లక్షణాలు ఉండటమే.
విభాగం: సన్నిహిత సంబంధం గల ఒకటి లేదా ఎక్కువ క్రమాలు కలిసి ఒక విభాగం ఏర్పడుతుంది. ఉదాహరణకు క్షీరదాల విభాగంలో రొడెన్షియా(ఎలుకలు), కైరోప్టెరా(గబ్బిలాలు), సిటేషియా(తిమింగళాలు), కార్నివోరా(కుక్కలు), ప్రైమేట్స్(కోతులు, మానవుడు) ఉన్నాయి.
క్రమం: ఒకటి లేదా దగ్గర సంబంధం కలిగిన కొన్ని కుటుంబాలు కలిసి ఒక క్రమం ఏర్పడుతుంది. ఉదాహరణకు ఫేలిడే, కానిడే, హైనిడే (హైనా), ఉర్సిడే (భల్లూకం) కుటుంబాల జీవులన్నింటిని కలిపి కార్నివోరా అనే క్రమంలో చేర్చారు.
కుటుంబం: సన్నిహిత సంబంధం గల కొన్ని ప్రజాతులను ఒక కుటుంబంగా పేర్కొంటారు. ఉదాహరణకు ఫేలిడే కుటుంబంలో పిల్లి ప్రజాతి(ఫేలిస్), చిరుత ప్రజాతి(పాంథారా) ఉంటాయి. నమూనా ప్రజాతి పేరుకు చివర ‘ఇడే’అనే అంత్య ప్రత్యయాన్ని చేర్చితే కుటుంబం పేరు అవుతుంది. ఉదాహరణకు మానవుడి ప్రజాతి ‘హోమో’. దీనికి చివర ‘ఇడే’ అంత్య ప్రత్యయాన్ని చేర్చడం వల్ల మానవుడి కుటుంబం ‘హోమోనిడే’ అవుతుంది.
ప్రజాతి: దగ్గర సంబంధం కలిగి, కొన్ని లక్షణాల్లో పోలికలున్న జాతులు కలిసి ప్రజాతి ఏర్పడుతుంది. పాంథారా లియో (సింహం), పాంథారా టైగ్రిస్ (పులి), పాంథారా పార్డస్ (లెపార్డ్) మొదలగునవి పాంథారా ప్రజాతికి చెందుతాయి.
జాతి: క్రమానుగత వర్గీకరణ వ్యవస్థలో జాతి ఒక ప్రాథమిక ప్రమాణం. ఉమ్మడి జన్యు సముదాయాన్ని పంచుకుంటూ స్వేచ్ఛగా అంతర ప్రజననం జరుపుకొని ఫలవంతమైన సంతానాన్ని ఉత్పత్తిచేసే ఒకే రకమైన జంతువుల సమూహాన్ని ‘జాతి’ అంటారు. ఒక జాతి అనేక అంతరప్రజననం జరిగే జనాభాలుగా ఉంటుంది. ఒక జాతిలో కొన్ని ఉపజాతులుండవచ్చు. ఒక జాతిలో జీవులు భౌగోళికంగా వివక్తత చెంది స్వల్ప మార్పులను సంతరించుకోవడం వల్ల ఉపజాతులు ఏర్పడ్డాయి. ఒక ఉపజాతిలోని జంతువులు అదే జాతి నుంచి ఏర్పడిన ఇతర ఉపజాతి జీవులతోనూ, జనకజాతి జీవులతోనూ ప్రజననం జరుపగలుగుతాయి. ఉపజాతులు అనేవి తయారవుతున్న కొత్త జాతులు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు