Employment ఉపాధి భాష (ష్యా)లు
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచం ఒక కుగ్రామంలా మారిపోయింది. దేశాల మధ్య దూరభారం తగ్గి.. వ్యాపార, వాణిజ్య సంబంధాలు బలపడుతున్నాయి. ఒక దేశానికి చెందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మరో దేశంలో పరిశ్రమలు, వ్యాపార సంస్థలను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో వివిధ దేశాల్లోని కంపెనీల మధ్య సమాచార మార్పిడి నిత్యకృత్యంలా మారింది. అందుకు ప్రధాన సాధనం భాష కాబట్టి.. విదేశీ భాషలు తెలిసినవారికి అన్ని దేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. పలు కంపెనీలు విదేశీభాషా నిపుణులకు తక్షణమే ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫారిన్ లాంగ్వేజ్ కోర్సులు, యూనివర్సిటీలు, కెరీర్ వివరాలు నిపుణ పాఠకుల కోసం…
-ప్రపంచీకరణతోపాటు విదేశీ వాణిజ్యంలో అభివృద్ధి కారణంగా పలు మల్టీనేషనల్ కంపెనీలు భారత్‌కు తరలివస్తున్నాయి. అదేవిధంగా మనదేశానికి చెందిన కంపెనీలు జాయింట్ వెంచర్స్ పేరిట విదేశాలకు వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. ఫలితంగా నిరంతరం విదేశీ నిపుణులతో సంప్రదింపులు జరపడంతోపాటు, ఎప్పటికప్పుడు డాక్యుమెంటేషన్ తదితర వ్యవహారాలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఫారిన్ లాంగ్వేజ్ కోర్సులు పూర్తిచేసినవారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి.
-చైనీస్, జర్మన్, జపనీస్, ఫ్రెంచ్, రష్యన్, అరబిక్, స్పానిష్, ఇటాలియన్, పర్షియన్ భాషల నుంచి ఏదో ఒకదానిలో నైపుణ్యం సాధిస్తే మంచి ఆదాయం ఉన్న ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. అందుకే ఫారిన్ లాంగ్వేజ్‌ను కెరీర్‌గా ఎంచుకునే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. దేశవ్యాప్తంగా పలు ప్రభుత్వ యూనివర్సిటీలతోపాటు అనేక ప్రైవేటు సంస్థలు ఫారిన్ లాంగ్వేజ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో లాంగ్వేజ్ బేసిక్స్ నుంచి సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ వరకు ఎన్నో కోర్సులు నేర్చుకోవచ్చు.
టాప్ రిక్రూటర్స్
-ఐక్యరాజ్యసమితి వివిధ విభాగాలు, ప్రపంచబ్యాంక్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ బ్యాంకులు, రెడ్‌క్రాస్ సొసైటీ, విదేశీ రాయబార కార్యాలయాలు, పార్లమెంటు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, ఐటీ కంపెనీలు, మీడియా సంస్థలు, హెచ్‌పీ, ఒరాకిల్, సామ్సంగ్, హ్యుందాయ్, ఎల్జీ వంటి కార్పొరేట్ సంస్థలు, పర్యాటక సంస్థలు, స్టార్ హోటళ్లు, విమానయాన సంస్థలు, కేంద్రీయ విద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్లు మొదలైన వాటిలో విదేశీ భాషా నిపుణులకు విస్తృత అవకాశాలున్నాయి.
వేతనాలు
-విదేశీభాషా నిపుణులకు ఇతర రంగాలవారితో పోల్చుకుంటే వేతనాలు కూడా చాలా ఎక్కువ. ట్రాన్స్లేటర్లకు అనువదించే భాషను బట్టి ఒక్కో పదానికి 50 పైసల నుంచి రూ. 5 వరకు ఉంటుంది. ఇంటర్ప్రిటేటర్లుగా వ్యవహరించేవారు గంటకు రూ. 1000 వరకు సంపాదించవచ్చు. ఫారిన్ లాంగ్వేజ్ ఫ్యాకల్టీలుగా పనిచేసేవారికి నెలకు రూ. 20-25 వేల ప్రారంభం వేతనం లభిస్తుంది. సర్టిఫైడ్ టూరిస్ట్గైడ్లు సుమారుగా రోజుకు రూ. 3 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. ఫార్మా, ఐటీ తదితర కంపెనీల్లో చేరే ఫారిన్ లాంగ్వేజ్ నిపుణులు భారీ వేతన ప్యాకేజీలు అందుకుంటున్నారు.
కెరీర్ ఎలా ఉంటుంది?
-ఫారిన్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. వారు చదివిన కోర్సును బట్టి వివిధ స్థాయిల్లో ఉద్యోగాలు పొందవచ్చు.
ట్రాన్స్లేటర్లుగా..
-ఫారిన్ లాంగ్వేజెస్ అభ్యసించిన వారిలో అత్యధిక మంది ట్రాన్స్లేటర్లుగా ఉపాధి పొందుతున్నారు. నేర్చుకున్న భాషపై పట్టు, అర్థం మారకుండా విషయాన్ని అనువాదంచేసే నేర్పు ఉంటే ట్రాన్స్లేటర్లుగా రాణించవచ్చు. వివిధ దేశాల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరినప్పుడు సంబంధిత పత్రాలను అనువాదం చేయడానికి ప్రభుత్వంలోని పలు శాఖల్లో ట్రాన్స్‌లేటర్లు అవసరమవుతున్నారు. ఐటీ కంపెనీలకు ప్రపంచ దేశాల నుంచి అనేక ప్రాజెక్టులు వస్తున్నాయి. ఆయా ప్రాజెక్టు నివేదికలను తర్జుమా చేయడానికి ట్రాన్స్‌లేటర్లను నియమించుకుంటాయి. దవాఖానలు, చిన్నచిన్న క్లినిక్‌లు, ఫార్మాస్యూటికల్ సంస్థల్లో వివిధ డాక్యుమెంట్లను తర్జుమా చేయడానికి ట్రాన్స్‌లేటర్లు అవసరమవుతారు.
ఇంటర్ప్రిటేటర్లుగా..
-ఒక వ్యక్తి మాటలను అప్పటికప్పుడు అనువాదంచేసి వినిపించే ప్రక్రియను ఇంటర్‌ప్రిటేషన్ అంటారు. ఇలా ఇంటర్‌ప్రిటేషన్ చేసేవారినే ఇంటర్ప్రిటేటర్లుగా పిలుస్తారు. విభిన్న భాషలు మాట్లాడే వారితో జరిగే సెమినార్లు, కాన్ఫరెన్సులు, సభలు, సమావేశాల్లో ఇంటర్‌ప్రిటేటర్లు కీలకపాత్ర పోషిస్తారు. పార్లమెంటు, కేంద్ర మంత్రిత్వశాఖలు, కార్పొరేట్ సంస్థలతోపాటు పలు రంగాల్లో వీరి అవసరం ఉంటుంది.
అధ్యాపకులుగా..
-బోధనారంగం ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకున్న అభ్యర్థులకు మరో ఉపాధి వేదికగా నిలుస్తున్నది. ఫారిన్ లాంగ్వేజ్‌లో నైపుణ్యం సాధించిన అభ్యర్థులకు వారు చదివిన డిగ్రీ స్థాయిని బట్టి వివిధ హోదాల్లో ఫ్యాకల్టీలుగా ఉద్యోగాలు లభిస్తాయి. దేశంలోని పలు కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు విదేశీ భాషల కోర్సులను అందిస్తున్నాయి. ఆయా కోర్సుల కోసం విదేశీ భాషా బోధకులను నియమించుకుంటున్నాయి.
ఇతర హోదాల్లో..
పైన పేర్కొన్నవేగాక ఇంకా అనేక రంగాల్లో విదేశీ భాషా నిపుణులకు డిమాండ్ ఉంది. ప్రముఖ సంస్థలు, వ్యక్తుల దగ్గర పీఆర్వోలుగా, పర్సనల్ మేనేజర్లుగా, సెక్రటరీలుగా, బిజినెస్ రంగంలో ఎగ్జిక్యూటివ్‌లుగా, స్టెనోగ్రాఫర్లుగా, ఫ్రీలాన్సర్లుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందవచ్చు. కంటెంట్ రైటర్లుగా, పాఠ్యపుస్తకాల రచయితలుగా, న్యాయస్థానాల్లో అనువాదకులుగా, ట్రావెల్ రైటర్లుగా, టూర్ ఆపరేటర్లుగా, టెక్నకిల్ ట్రాన్స్లేటర్లుగా, డీకోడర్లుగా, సాఫ్ట్వేర్ కన్సల్టెంట్లుగా, కాల్ సెంటర్లలో ఎగ్జిక్యూటివ్‌లుగా, మెడికల్ ట్రాన్స్స్క్రిప్షనిస్టులుగా ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో రకాల ఉద్యోగావకాశాలు విదేశీ భాషలు తెలిసినవారి కోసం ఎదురుచూస్తున్నాయి.
విద్యాసంస్థలు – కోర్సులు
1. ఉస్మానియా యూనివర్సిటీ
-ఎంఏ: అరబిక్, పర్షియన్ లాంగ్వేజ్‌లు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులు.
-ఎంఫిల్: అరబిక్, పర్షియన్ లాంగ్వేజ్‌లు. సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
-పీహెచ్డీ: అరబిక్, పర్షియన్. సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ లేదా ఆ సబ్జెక్టులో ఎంఫిల్ చేసినవారు అర్హులు.
-డిప్లొమా కోర్సులు: వీటిలో జూనియర్ డిప్లొమా, సీనియర్ డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా అని మూడు రకాల కోర్సులు ఉన్నాయి.
2. రామకృష్ణ మఠం (హైదరాబాద్ శాఖ)
-ఫారిన్ లాంగ్వేజ్‌లు: జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, జపనీస్ భాషలను ఆఫర్ చేస్తున్నది. జపనీస్‌ను ఐదు స్థాయిల్లో, మిగతా భాషలను ఆరేసి స్థాయిల్లో నేర్పుతుంది. ఒక్కో స్థాయి వ్యవధి మూడు నెలలు ఉంటుంది. ఏటా మూడు సెషన్లలో (జనవరి, జూన్, సెప్టెంబర్) క్లాసులు ప్రారంభమవుతాయి.
3. ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ (ఇఫ్లూ)
-బీఏ (ఆనర్స్): జర్మన్, ఫ్రెంచ్, రష్యన్, జపనీస్, అరబిక్, స్పానిష్ లాంగ్వేజ్‌లు.
-ఎంఏ: జర్మన్, ఫ్రెంచ్, రష్యన్, అరబిక్, స్పానిష్, లింగ్విస్టిక్స్ కోర్సులు.
-పైకోర్సులతోపాటు జర్మన్, ఫ్రెంచ్, రష్యన్, అరబిక్, జపనీస్, స్పానిష్ లాంగ్వేజ్‌లలో పీజీ డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా, డిప్లొమా కోర్సులను కూడా ఇఫ్లూ ఆఫర్ చేస్తున్నది.
4. యూరివర్సిటీ ఆఫ్ ఢిల్లీ
-బీఏ (ఆనర్స్): ఫ్రెంచ్, జర్మన్, పర్షియన్, స్పానిష్, జోంగా, అరబిక్ లాంగ్వేజ్‌లు.
-ఎంఏ: ఫ్రెంచ్, జర్మన్, అరబిక్, హిస్పానిక్, ఇటాలియన్, పర్షియన్ లాంగ్వేజ్‌లు.
-ఎంఫిల్: ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, అరబిక్, బల్గేరియన్, హిస్పానిక్, ఇటాలియన్, పర్షియన్, లింగ్విస్టిక్స్ కోర్సులు.
-పీహెచ్డీ: జర్మన్, హిస్పానిక్, పర్షియన్ లాంగ్వేజ్‌లు
-పై వాటితోపాటు అప్లయిడ్ లింగ్విస్టిక్స్, ఫ్రెంచ్, జర్మన్, పోలిష్, పర్షియన్, ఇటాలియన్, చెక్, బల్గేరియన్, హంగేరియన్ భాషల్లో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను ఈ యూనివర్సిటీ అందిస్తున్నది.
5. యూనివర్సిటీ ఆఫ్ ముంబై
-బీఏ: జర్మన్, ఫ్రెంచ్, చైనీస్, రష్యన్, జపనీస్, అరబిక్, పాళి, పర్షియన్, పోర్చుగీస్ లాంగ్వేజ్‌లు.
-ఎంఏ: ఫ్రెంచ్, పర్షియన్, అరబిక్ లాంగ్వేజ్‌లు. ఈ లాంగ్వేజ్‌ల్లో పీహెచ్డీ కూడా అందిస్తున్నది.
-పై వాటితోపాటు ఈ యూనివర్సిటీలో జర్మన్, ఫ్రెంచ్, రష్యన్, పర్షియన్, అరబిక్, ఇటాలియన్, పాళీ, పోలిష్ భాషల్లో డిప్లొమా, సర్టిఫికెట్, అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
6. బెనారస్ హిందూ యూనివర్సిటీ
-బీఏ (ఆనర్స్): జర్మన్, ఫ్రెంచ్, రష్యన్, చైనీస్, నేపాలీ, అరబిక్, పాళి, పర్షియన్ లాంగ్వేజ్‌లు.
-ఎంఏ: జర్మన్, రష్యన్, చైనీస్, అరబిక్, పర్షియన్, నేపాలీ, పాళి, లింగ్విస్టిక్స్ కోర్సులు.
-వీటితోపాటు జర్మన్, చైనీస్, ఫ్రెంచ్, అరబిక్, రష్యన్, నేపాలీ, పర్షియన్, సింహళీస్ లాంగ్వేజ్‌లలో యూజీ డిప్లొమా, జపనీస్ స్టడీస్‌లో పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
7. జామియా మిలియా ఇస్లామియా
-బీఏ (ఆనర్స్): పర్షియన్, అరబిక్ లాంగ్వేజ్‌లు. ఇవే లాంగ్వేజ్లతో ఎంఏ, పీహెచ్డీ కోర్సులను కూడా ఈ సంస్థ ఆఫర్ చేస్తున్నది.
-వీటితోపాటు ఫ్రెంచ్, రష్యన్, పోర్చుగీస్, మోడరన్ అరబిక్, మోడరన్ పర్షియన్, టర్క్‌మెనియన్, టర్కిష్, స్పానిష్ లాంగ్వేజ్లతో అడ్వాన్స్డ్ డిప్లొమా, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
గమనిక: పై కోర్సుల్లో చేరడానికి కావాల్సిన అర్హతలు, అడ్మిషన్ ప్రక్రియ, అడ్మిషన్లు జరిగే సమయం తదితర వివరాల కోసం సంబంధిత యూనివర్సిటీల వెబ్సైట్లను తరచూ పరిశీలిస్తుండాలి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?