వారం రోజుల్లో గ్రూప్ 4కు అనుమతి!
– 5 నెలల్లో 65.5% ఉద్యోగాలు
– 52,460 పోస్టులకు అనుమతి
– పదిరోజుల్లోనే నోటిఫికేషన్లకు
-ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆదేశం
రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. 80,039 ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి దశలవారీగా సర్కారు అనుమతులు ఇస్తున్నది. ఏప్రిల్‌లో సీఎం కేసీఆర్ ప్రకటించగా, 5 నెలల్లోనే 65.5 శాతం ఉద్యోగాలకు ప్రభుత్వం అనుమతులు మంజూరుచేసింది. గ్రూప్-1, గ్రూప్- 2, గ్రూప్- 3 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతులు ఇచ్చింది. నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఆశగా ఎదురుచూస్తున్న గ్రూప్-4కు సైతం వారంరోజుల్లో గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో 9,168 గ్రూప్- 4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇప్పటికే ఖాళీల వివరాలు, భర్తీ ప్రక్రియ తదితర అంశాల గురించి ఆయా శాఖలు కసరత్తు చేస్తున్నాయి.
ఇప్పటికే 52,460 పోస్టులకు అనుమతి
సీఎం కేసీఆర్ ప్రకటించిన 5 నెలల్లోనే 52,460 ఉద్యోగాలకు ఆర్థికశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇంకా 27,579 ఉద్యోగాలకు మాత్రమే అనుమతులు ఇవ్వాల్సి ఉన్నది. ఇప్పటికే 19,359 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చేశారు. మరో 33,101 పోస్టులకు ఈ నెలలోనే నోటిఫికేషన్లు రానున్నట్టు తెలిసింది. వీటికి సంబంధించి ఇప్పటికే జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయిలోని ఖాళీల వివరాలను ఆయా నియామక సంస్థలు తెప్పించు కున్నాయి. ఆ వివరాలన్నింటినీ పునఃపరిశీలించి నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు సమాచారం. మిగిలిన 27,579 పోస్టుల్లో సుమారు 90 శాతం ఉద్యోగాలకు సెప్టెంబర్‌లోనే అనుమతు ఇవ్వనున్నట్టు తెలిసింది. మిగిలిన కొన్నింటికి అక్టోబర్ మొదటి, రెండోవారంలో ఆర్థికశాఖ అనుమతి ఇవ్వనున్నట్టు సమాచారం.
ప్రక్రియ మరింత వేగవంతం
80,039 ఉద్యోగాలను భర్తీ చేయాలనే సంకల్పంతో సర్కారు శరవేగంగా అడుగులు వేస్తున్నది. దీనికి అనుగుణంగా అధికారులు, ఆయా శాఖలతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నది. ఇప్పటికే పోలీసు, వైద్య, ఆరోగ్యశాఖల్లో నియామకాల ప్రక్రియ వేగంగా సాగుతున్నది. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ల ప్రక్రియలో మరింత వేగం పెంచింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీని కమిషన్ ప్రకటించింది. మెయిన్స్‌ను సైతం వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహిస్తామని తెలిపింది. ఉద్యోగ నియామక ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ఆర్థికశాఖ అనుమతులు ఇచ్చిన వారం, పదిరోజుల్లోనే నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం. దీనికి సంబంధించి అనుమతులు, సవరణలు, నోటిఫికేషన్ల జారీ సంబంధిత ప్రక్రియపై ప్రతి వారం నివేదిక ఇవ్వాలని సాధారణ పరిపాలనాశాఖకు ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది.
పకడ్బందీ ప్రణాళిక
ఉద్యోగ నియామక ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ ప్రణాళికతో ముందుకెళ్తున్నది. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నోటిఫికేషన్లు ఇస్తున్నది. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం 95 శాతం స్థానిక కోటా, రిజర్వేషన్లు తదితరాలు అన్నింటినీ ఒకటికి రెండుసార్లు పరిశీలిస్తున్నది. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయిలో అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి, ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో ఆయా శాఖల ఉన్నతాధికారుల పర్యవేక్షణలో మరోసారి సరిచూసుకొని, నియామక బోర్డులు రీ చెక్ చేసిన తర్వాత నోటిఫికేషన్లు జారీచేస్తున్నారు.
పటిష్ఠంగా నోటిఫికేషన్లు
ఆర్థికశాఖ అనుమతులు ఇచ్చిన తర్వాత 24 నుంచి 48 గంటల్లో ఆయా శాఖల హెచ్‌వోడీలతో సమీక్ష నిర్వహిస్తున్నాం. వారం నుంచి మూడు వారాల్లోనే నోటిఫికేషన్లు ఇస్తున్నాం. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అన్నింటినీ ఒకటికి రెండుసార్లు పునః పరిశీలించిన తర్వాతే నోటిఫికేషన్లు ఇస్తున్నాం. నిబంధన లన్నీ పటిష్ఠంగా అమలు చేస్తున్నాం. అభ్యర్థులకు నిత్యం అందుబాటులో ఉంటున్నాం. నోటిఫికేషన్‌కు ముందే అభ్యర్థుల సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నాం. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటున్నాం. గ్రూప్- 2, గ్రూప్- 3 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో వెంటనే ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాం. వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు ఇస్తాం.
– జనార్దన్‌రెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?