‘డిజిటల్ నోమాడ్’ వీసాలను ప్రవేశపెట్టిన దేశం?
1) ఇప్పటి వరకు ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్ని సార్లు ప్రకటించింది? (3)
1) 5 2) 6 3) 7 4) 8
వివరణ: ఏదైనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ ఉన్నప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తుంది. ఇప్పటి వరకు ఏడు సందర్భాల్లో ప్రకటించింది. ఇటీవల మంకీ పాక్స్ వైరస్ విజృంభిస్తుండటంతో మరోసారి ఈ పరిస్థితి వచ్చింది. 2009లో స్వైన్‌ఫ్లూ, 2014లో పోలియో, 2014లో ఎబోలా, 2016లో జికా, 2019లో మరోసారి ఎబోలా, 2020లో కరోనా వైరస్ల విజృంభణతో ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ చర్యవల్ల ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌పై పరిశోధన పెరుగుతుంది. అందుకు అవసరమైన నిధుల సమీకరణ కూడా ఉంటుంది. ఫలితంగా ఔషధాలు, వ్యాక్సిన్లు కూడా వస్తాయి. అందుకే అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు.
2. యూఎన్ఆర్డబ్ల్యూఏ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? (4)
1) న్యూయార్క్ 2) జెనీవా
3) పారిస్ 4) అమ్మన్
వివరణ: యూఎన్‌ఆర్‌డబ్ల్యూ అంటే యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీ అని అర్థం. దీనిని 1949లో పాలస్తీనా శరణార్థుల కోసం ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కేంద్రం అమ్మన్లో ఉంది. ఈ సంస్థకు భారత్ ఇటీవల 2.5 మిలియన్ డాలర్లను అందించింది. ఈ సంస్థకు స్వచ్ఛందంగా వచ్చే విరాళాలే ఆధారం.
3. భారత్, జపాన్ల మధ్య శాంతియుత అవసరాల కోసం అణుశక్తి ఒప్పందం కుదిరింది. ఇది ఎప్పటినుంచి అమల్లోకి వచ్చింది? (3)
1) జూలై 20, 2015 2) జూలై 20, 2016
3) జూలై 20, 2017 4) జూలై 20, 2018
వివరణ: భారత్, జపాన్ దేశాలు శాంతియుత అవసరాల కోసం అణుశక్తి రంగంలో పరస్పరం సహకరించుకుంటాయి. ఇందుకు ఇరుదేశాల మధ్య 2016, నవంబర్ 11న ఒప్పందం కుదిరింది. అయితే ఇది 2017 జూలై 20న అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందానికి కృషిచేసిన నాటి జపాన్ ప్రధాని షింజో అబే ఇటీవల హత్యకు గురయ్యారు. ఆయన ఆ దేశ ప్రధానిగా నాలుగు సార్లు భారత్‌లో పర్యటించారు. జపాన్ ప్రధాని భారత్‌కు అన్నిసార్లు సందర్శించడం ఆయనకు ముందు, ఆయన తర్వాత జరగలేదు. అలాగే 2014 భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి జపాన్ ప్రధాని కూడా ఆయనే.
4. ఇటీవల ‘డిజిటల్ నోమాడ్’ వీసాలను ప్రవేశపెట్టిన ఆసియా దేశం? (3)
1) శ్రీలంక 2) మాల్దీవులు
3) ఇండోనేషియా 4) థాయిలాండ్
వివరణ: విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు డిజిటల్ నోమాడ్ వీసాలను ఇండోనేషియా ప్రకటించింది. తమ విధులను నిర్వహిస్తూనే, వివిధ దేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపే వారికి ఇచ్చే వీసాలనే డిజిటల్ నోమాడ్స్ అంటారు. వర్క్ ఫ్రమ్ హోం లాగానే ఉంటుంది. అయితే సుదూరంగా ఉండే విభిన్న ప్రాంతాలకు వెళుతూ వీళ్లు తమ విధులను నిర్వహిస్తుంటారు. ఈ తరహా విధానాన్ని గతంలో ఇటలీ, అంటిగ్వా-బర్బుడా, బార్బడోస్ దేశాలు అందుబాటులోకి తెచ్చాయి. ఇటలీలో 90 రోజుల పాటు ఉండేందుకు అనుమతి ఇస్తారు. అంటిగ్వా-బర్బుడాల్లో రెండు సంవత్సరాలు, బార్బడోస్‌లో ఒక సంవత్సరం అనుమతి ఇస్తారు.
5. ‘మోసి-ఓ-తున్యా’ అనే పదం ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? (1)
1) జింబాబ్వే ప్రవేశపెట్టిన బంగారు నాణెం
2) జింబాబ్వేలో ఇటీవల కనుగొన్న పురాతన శిలాజం పేరు
3) దక్షిణాఫ్రికాలో గుర్తించిన కొత్త చమురు క్షేత్రం
4) ఏదీకాదు
వివరణ: మోసి-ఓ-తున్యా పేరుతో ఇటీవల జింబాబ్వే కొత్త బంగారు నాణేన్ని ప్రవేశపెట్టింది. నానాటికి పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆ దేశం ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు 2000 నాణేలను వాణిజ్య బ్యాంకులకు సరఫరా చేసింది. ఆ దేశంలో ద్రవ్యోల్బణం 190 శాతానికి చేరింది. పది సంవత్సరాలుగా జింబాబ్వేలో తీవ్ర స్థాయిలో ద్రవ్యోల్బణం ఉంది. ఎన్నో రకాలుగా కట్టడి చేసేందుకు ఆ దేశం యత్నించింది. డాలర్‌తో పాటు ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే జింబాబ్వే కరెన్సీ విపరీతంగా పడిపోయింది. దీంతో భారీ ఎత్తున అమెరికా డాలర్ల బ్లాక్ మార్కెట్ జరిగింది. పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ఈ అక్రమ వాణిజ్యాన్ని అడ్డుకొనేందుకు బంగారు నాణేలను ప్రవేశపెట్టాలని జింబాబ్వే నిర్ణయించింది.
6. కెతాంజి బ్రౌన్ ఎందుకు వార్తల్లో నిలిచారు? (3)
1) అమెరికా ఉపాధ్యక్షురాలికి న్యాయ సలహాదారుగా నియమితులయ్యారు
2) యూరోపియన్ యూనియన్‌కు అధ్యక్షు రాలిగా నియమితులయ్యారు
3) అమెరికా సుప్రీంకోర్ట్‌లో జడ్జిగా నియమితులయ్యారు
4) చంద్రుడిపైకి వెళ్లనున్న తొలి మహిళ
వివరణ: కెతాంజి బ్రౌన్ అమెరికా సుప్రీంకోర్ట్‌లో జడ్జిగా నియమితులయ్యారు. ఈ ఘనతను సాధించనున్న తొలి నల్ల జాతికి చెందిన మహిళ ఆమె. ఆ దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థలో ప్రస్తుతం తొమ్మిది మంది న్యాయమూర్తులు ఉన్నారు. అందులో ప్రస్తుతం నలుగురు మహిళలే ఉండటం విశేషం.
7. పురుష, మహిళా క్రికెటర్లకు సమానంగా చెల్లింపులు చేయాలని నిర్ణయించిన దేశం? (1)
1) న్యూజిలాండ్ 2) ఆస్ట్రేలియా
3) ఇంగ్లండ్ 4) దక్షిణాఫ్రికా
వివరణ: పురుష, మహిళా క్రికెటర్లకు సమానంగా చెల్లింపులు చేయాలని న్యూజిలాండ్ నిర్ణయించింది. ఫలితంగా ఎక్కువమంది మహిళలు ఈ క్రీడ పట్ల ఆసక్తి చూపేందుకు ముందుకు వస్తారని ఆ దేశం భావిస్తుంది. చెల్లింపుల్లో తేడాలు చాలా దేశాల్లో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కాబట్టి ఎక్కువమంది మహిళలు క్రీడలను ఆడేందుకు ఆసక్తి చూపడం లేదు. తాజాగా న్యూజిలాండ్ నిర్ణయంతో, ఆ దేశంలో మహిళలు క్రికెట్ ఆడేందుకు ముందుకు వస్తారు.
8. స్వాతి ధింగ్రా ఇటీవల ఎందుకు వార్తల్లో నిలిచారు? (2)
1) అమెరికా ద్రవ్య విధాన కమిటీలో బాహ్య సభ్యురాలిగా నియమితులయ్యారు
2) యూకే ద్రవ్య విధాన కమిటీలో బాహ్య సభ్యురాలిగా నియమితులయ్యారు
3) యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు
4) అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో ప్రధాన ఆర్థికవేత్తగా నియమితులయ్యారు
వివరణ: యూకేలోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ద్రవ్య విధాన కమిటీలో బాహ్య సభ్యురాలిగా భారత సంతతికి చెందిన స్వాతి ధింగ్రా నియమితులయ్యారు. ఈ ఘనతను సాధించిన భారత సంతతికి చెందిన తొలి మహిళ ఆమెనే. మైఖేల్ సౌండర్స్ స్థానాన్ని ఆమె భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం ధింగ్రా సెంటర్ ఫర్ ఎకనామిక్ పర్ఫామెన్స్లో అసోసియేట్‌గా ఉన్నారు. ఆగస్ట్ 9న ఆమె బాధ్యతలను స్వీకరించారు. మూడేండ్లు ఆమె ఈ పదవిలో ఉంటారు.
9. ఏ దేశంలో బౌద్ధ సంస్కృతి వారసత్వ భవనాన్ని భారత్ నిర్మిస్తుంది? (3)
1) జపాన్ 2) థాయిలాండ్
3) నేపాల్ 4) మయన్మార్
వివరణ: బుద్ధుడు జన్మించిన ప్రదేశం లుంబిని. ఇది నేపాల్‌లో ఉంది. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ ఏడాది మే 16న ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఇక్కడ బౌద్ధ సంస్కృతి వారసత్వ భవనాన్ని నిర్మించేందుకు ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ (ఐబీసీ) ఈ నిర్మాణాన్ని చేపట్టనుంది. ఐబీసీ భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు సంబంధించిన సంస్థ. 2013లో దీనిని ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ లుంబినిలో భవన నిర్మాణాన్ని చేపట్టనుంది. నేపాల్‌లో నిర్మించనున్న తొలి శూన్య ఉద్గారాల భవనంగా కూడా ఇది నిలువనుంది.
10. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో రష్యా స్థానాన్ని భర్తీ చేసిన దేశం ఏది? (2)
1) స్పెయిన్ 2) చెక్ రిపబ్లిక్
3) ఫిన్లాండ్ 4) నార్వే
వివరణ: ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి రష్యాను తొలగించారు. ఈ సంస్థ స్విట్జర్లాండ్‌లోని జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. రష్యా స్థానంలో చెక్ రిపబ్లిక్ దేశానికి సభ్యత్వం కల్పించారు. మానవ హక్కుల మండలిలో 47 దేశాలకు సభ్యత్వం ఉంటుంది. అలాగే ఇటీవల ప్రపంచంలోనే అతి పొడవైన వేలాడే బ్రిడ్జిని చెక్ రిపబ్లిక్లో ప్రారంభించారు. దాదాపు రెండేండ్ల పాటు దీనిని నిర్మించారు. దీనికి ‘స్కై బ్రిడ్జి 721’ అని పేరు పెట్టారు.
11. ఈ ఏడాది మే నెలలో యూరప్‌లోని ఎన్ని దేశాలను ప్రధాని మోదీ పర్యటించారు? (4)
1) జర్మనీ 2) డెన్మార్క్
3) ఫ్రాన్స్ 4) పైవన్నీ
వివరణ: ఈ ఏడాది మే నెలలో మూడు యూరప్ దేశాలకు ప్రధాని మోదీ వెళ్లారు. మే 2న జర్మనీ, 3, 4 తేదీల్లో డెన్మార్క్, అలాగే నాలుగో తేదీన ఫ్రాన్స్‌ను సందర్శించారు. జర్మనీలో ఆ దేశ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్‌తో మోదీ సమావేశం అయ్యారు. ద్వైపాక్షిక సహకారానికిగాను 10 బిలియన్ యూరోల సాయానికి జర్మనీ అంగీకరించింది. అలాగే హరిత శక్తి ఉత్పత్తికిగాను ఇరుదేశాల మధ్య 10.5 బిలియన్ డాలర్ల ఒప్పందం కూడా కుదిరింది. అలాగే డెన్మార్క్‌లో భారత్-నార్డిక్ సమావేశంలో మోదీ పాల్గొన్నారు. హరిత వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని సమీక్షించారు. ఫ్రాన్స్ ప్రధాని మేక్రాన్‌తో కూడా చర్చించారు. పరస్పర ఆసక్తి ఉన్న అంశాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్షించారు.
12. ఐపీఈఎఫ్ను విస్తరించింది…? (3)
1) ఇండియన్ ప్రీమియర్ ఎఫెక్టివ్ ఫ్రేమ్‌వర్క్
2) ఇంటర్నేషనల్ ఫ్రేమ్ ఫర్ ఎఫెక్టివ్ నెస్
3) ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ప్రాస్పరిటీ 4) ఏదీకాదు
వివరణ: ఐపీఈఎఫ్ను అమెరికా ప్రతిపాదించింది. ఇది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కాదు. అలాగే 11 దేశాలతో కూడిన ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ ఒప్పందం లాంటిది కూడా కాదు. కేవలం ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, పరస్పర సహకారానికి చేసుకొనే ఏర్పాటు మాత్రమే. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఏడాది మే 24న దీనిని ప్రతిపాదించారు. ఇందులో చేరేందుకు భారత్ తన ఆసక్తిని వ్యక్తం చేసింది.
13. ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్రపతి మధ్య ఆసియాలోని కింది ఏ దేశాన్ని సందర్శించారు? (4)
1) ఉజ్బెకిస్థాన్ 2) కజకిస్థాన్
3) కిర్గిజ్‌స్థాన్ 4) తుర్క్మెనిస్థాన్
వివరణ: ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 4 వరకు నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మధ్య ఆసియా దేశం అయిన తుర్క్మెనిస్థాన్ను సందర్శించారు. భారత రాజ్యాధినేత ఒకరు ఆ దేశానికి వెళ్లడం ఇదే ప్రథమం. భారత్ ఈ ఏడాది 75వ స్వాతంత్య్ర వేడుకల్లో చేసుకుంటుండగా, తుర్క్మెనిస్థాన్ స్వాతంత్యాన్ని సాధించి 75 సంవత్సరాలు పూర్తయింది. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై కూడా 30 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆర్థిక సేవలు, విపత్తు నిర్వహణ, సాంస్కృతిక రంగాల్లో సహకారానికి ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. టీఏపీఐ గ్యాస్ పైప్‌లైన్‌తో పాటు ఆశ్గాబాత్ ఒప్పందంపై కూడా చర్చకు వచ్చాయి.
14. ఏ దేశంలో పిచ్ బ్లాక్ విన్యాసాలు జరుగనున్నాయి? (2)
1) అమెరికా 2) ఆస్ట్రేలియా
3) నైజీరియా 4) ఫిలిప్పీన్స్
వివరణ: ఆస్ట్రేలియా ఉత్తర ప్రాంతంలో పిచ్ బ్లాక్ 2022 విన్యాసాలు జరుగనున్నాయి. ఈ వాయు యుద్ధ విన్యాసాల్లో 17 దేశాలు పాల్గొంటాయి. 100 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పాటు 2500 మిలిటరీ సైన్యం ఇందులో పాల్గొంటుంది. ఆగస్ట్ 19 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఇది కొనసాగనుంది.
15. ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన వాతావరణం అనే హక్కును ఇవ్వాలనే తీర్మానాన్ని ఆమోదించింది ఎవరు? (3)
1) ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం
2) ప్రపంచ ఆరోగ్య సంస్థ
3) ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ
4) భద్రతా మండలి
వివరణ: ఆరోగ్యకరమైన వాతావరణం ప్రతి ఒక్కరి హక్కు అంటూ ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ ఇటీవల ఒక తీర్మానాన్ని ఆమోదించింది. భారత్ ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చింది. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన, సుస్థిరమైన పర్యావరణాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని తీర్మానంలో ప్రతిపాదించారు. ఈ తీర్మానానికి 161 దేశాలు మద్దతు ఇవ్వగా, ఎనిమిది దేశాలు వ్యతిరేకించాయి.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
ఎడ్యు రిపబ్లిక్
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?