స్వాతంత్య్ర భారత్ సాధించిందేమిటి?
సుమారు రెండు శతాబ్దాలపాటు బ్రిటిష్ వలస పాలనలో కుంగి కృశించిన భారతావని, సుదీర్ఘమైన జాతీయోద్యమ పోరాటం ఫలితంగా 1947, ఆగస్టు 15న స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని స్వాతంత్య్రం పొందింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చరిత్రాత్మకమైన ట్రైన్డ్ విత్ డెస్టినీ అనే పేరుతో ‘అర్ధరాత్రి సమయంలో ప్రపంచం నిద్రపోతున్న వేళ, భారత్ స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం మేల్కొంది’ అని ప్రసంగించారు. నాటి నుంచి నేటి వరకు ఈ 75 సంత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కోట్లమంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తూ.. ప్రజాస్వామ్య బద్ధమైన రీతిలో పాలన అందిస్తూ తనను తాను పునర్నిర్మించు కుంటూ.. చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రపంచంలో అన్ని రంగాల్లో అగ్రస్థానం వైపు భారతదేశం అడుగులు వేస్తున్నది.
సాధించిన విజయాలు
సామాజిక, ఆర్థిక ప్రగతి ముఖచిత్రం
సూచిక 1947 2022
జనాభా 36.1 కోట్లు 135 కోట్లు
జనసాంద్రత 108 431
జీడీపీ రూ.2.7 లక్షల కోట్లు రూ.235 లక్షల కోట్లు
తలసరి ఆదాయం రూ.11,570 రూ.1,50,000
విదేశీ మారకద్రవ్య – – – – 633 బి. డాలర్లు
నిల్వలు
ఎగుమతులు 1.6 బి. డాలర్లు 660బి. డాలర్లు
పేదరికం సుమారు 55% 25 శాతం
నిరుద్యోగం – 8 శాతం
ఆయుర్దాయం 35.21 సం. 70.1 సం.
మాతృత్వ 1000 103
మరణాల రేటు
బాలల మరణాల రేటు 189 36
శిశు మరణాల రేటు 189 27
సంతాన సాఫల్య రేటు 5.9 2.1
1) సమున్నతమైన రాజ్యాంగ రూపకల్పన
వలస పాలన అనంతరం భారత సామాజిక తాత్విక భావాలకు అనుగుణంగా, శ్రేయో రాజ్య స్థాపనే లక్ష్యంగా, సమసమానత్వమే సిద్ధాంతంగా దేశంలోని అన్ని వర్గాల వారికి సమాన ప్రాతినిథ్యం వహించేలాగా 395 అధికరణలతో భారత రాజ్యాంగం రూపొందింది. ఇది దేశంలో సమాఖ్య వ్యవస్థను స్థాపించి అధికారాన్ని ప్రజల చేతిలో పెట్టింది. జాతి అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా మార్పుచెందుతూ దేశంలో ప్రజాస్వామ్య సంరక్షణకు కేంద్ర బిందువుగా ఉంది. ఈ క్రమంలో ఇప్పటివరకు 105 సార్లు రాజ్యాంగాన్ని సవరించారు. ఈ రాజ్యాంగ సవరణల ద్వారా దేశంలో భూస్వామ్య విధానాన్ని రద్దు చేసిన భూసంస్కరణలు, అట్టడుగు వర్గాల వారికి విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు, ఎన్నికల సంస్కరణలు, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి సంబంధించిన అంశాలు, ప్రాథమిక విధులు, పంచాయతీరాజ్ వ్యవస్థ వంటివి రాజ్యాంగంలో చేర్చారు.
2) సుస్థిరమైన సార్వభౌమాధికారం
దేశ విభజన నాటి నుంచి నేటి వరకు భారత ఆంతరంగిక, విదేశాంగ విధానాల్లో ఎవరి ఒత్తిళ్లకు తలవంచకుండా తన నిర్ణయాలను సొంతంగా తీసుకోగలిగింది. భారత పొరుగు దేశాలైన పాకిస్థాన్, చైనాతో అనేకసార్లు భౌగోళిక సంఘర్షణలు జరిగినా.. తన భూభాగం మీద సార్వభౌమాధికారాన్ని నిలుపుకోగలిగింది. ముఖ్యంగా 1962 ఆక్సాయ్‌చిన్ దురాక్రమణ నుంచి 2020 గల్వాన్ లోయ ఘర్షణల వరకు చైనాతో పలుసార్లు యుద్ధ వాతావరణం ఏర్పడినప్పటికీ భారత్ తన దౌత్య నీతితో, శక్తిమంతమైన సైనిక వ్యవస్థతో అడ్డుకోగలిగింది. 1954లో పుదుచ్చేరి, 1961లో గోవా, 1975లో సిక్కింను విజయవంతంగా భారత భూభాగంలో విలీనం చేసుకుంది. 3.28 మిలియన్ చ.కి.మీ. భారత భూభాగం 12 నాటికల్ మైళ్ల భారత జల భూభాగం, 2.3 నాటికల్ మైళ్ల ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌ను కాపాడుకోగలిగింది.
3) వికసించిన విదేశాంగ విధానం
స్వాతంత్య్రం వచ్చే నాటికే కామన్వెల్త్, ఐక్యరాజ్యసమితిలో ప్రవేశం పొందిన భారత్ తదనంతరం తన విదేశాంగ విధానాన్ని విస్తృతం చేసుకుంది. 1950-60 నాటికి ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణంలో కేంద్ర కూటములకు మద్దతు తెలపకుండా సరికొత్త అలీనోద్యమం భావనకు నాంది పలికింది. తన పొరుగు దేశాలతో ‘నైబర్స్ ఫస్ట్ పాలసీ’, ఆగ్నేయాసియా దేశాలతో ‘లుక్ ఈస్ట్ పాలసీ, యాక్ట్ ఈస్ట్ పాలసీ’ విధానాలను అవలంబించింది. మరోవైపు అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, జపాన్ వంటి అగ్ర రాజ్యాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తూ, అరబ్, ఆఫ్రికా దేశాలతో కూడా మంచి సంబంధాలను ఏర్పరచుకుంది.
సార్క్, బ్రిక్స్, నామ్, బిమ్స్టెక్, క్వాడ్ వంటి అంతర్జాతీయ కూటముల్లోనూ భారత్ క్రియాశీల పాత్ర పోషిస్తుంది. కొవిడ్-19, అంతర్జాతీయ పౌర యుద్ధాలు, ప్రకృతి విపత్తులు వంటివి జరిగినప్పుడు భారత్ మానవతా దృక్పథంతో బాధిత దేశాలకు అండగా నిలబడి వసుదైక కుటుంబం అనే తన విదేశాంగ విధాన మౌలిక సూత్రాన్ని ఆచరణలో పెట్టింది.
4) బలమైన రక్షణ వ్యవస్థ
దేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ప్రపంచంలో 5వ అతిపెద్ద సైనిక వ్యవస్థను భారత్ అభివృద్ధిపరచుకున్నది. పటిష్ఠమైన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నౌకా దళాలతోపాటు అత్యంత శక్తిమంతమైన అణ్వాయుధాలను కూడా కలిగి ఉంది. 1974లో స్మైలింగ్ బుద్ధ, 1998లో మిషన్ శక్తి పేర్లతో రెండుసార్లు అణు పరీక్షలు నిర్వహించి ప్రపంచానికి తన అణుశక్తిని చాటి చెప్పింది. రష్యా నుంచి ఎస్-400 క్షిపణులను, సుఖోయ్ యుద్ధ విమానాలను, ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలను, అమెరికా నుంచి భారీ యుద్ధ సామగ్రిని దిగుమతి చేసుకుంటూ అంతర్జాతీయంగా మంచి రక్షణ సంబంధాలను కలిగి ఉంది. అదేవిధంగా పొరుగు దేశాలతో పాటు ఇతర దేశాలతోనూ ఉమ్మడి సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తూ తన సైనిక ప్రతిభా పాటవాలను మరింత బలోపేతం చేసుకుంటున్నది. ఉదా: యుద్ధ్ అభ్యాస్ (భారత్+అమెరికా), హ్యాండ్ ఇన్ హ్యాండ్ (భారత్+చైనా), ఇంద్ర (భారత్+రష్యా), మిత్రశక్తి (భారత్+శ్రీలంక).
5) ప్రపంచ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ
స్వాతంత్య్రం వచ్చే నాటికి కేవలం 2.7 లక్షల కోట్లతో ప్రపంచ జీడీపీలో 3 శాతంగా ఉన్న భారత ఎకానమీ 2022 నాటికి 235 లక్షల కోట్లు (3.1 ట్రి. డాలర్లు) అంటే ప్రపంచ జీడీపీలో సుమారు 10 శాతానికి పెరిగింది. 2024 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రి. డాలర్లకు తీసుకెళ్లేలా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే దీర్ఘకాలిక వ్యూహంతో ప్రభుత్వం కృషిచేస్తున్నది. అదేవిధంగా 1991 ఆర్థిక సంస్కరణల వల్ల భారతదేశం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు గమ్యస్థానంగా మారి 2022 నాటికి 633 బి.డాలర్ల విదేశీ మారక ద్రవ్యంతో ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది.
6) అంగారకుని వరకు చేరిన అంతరిక్ష యాత్రలు
దేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో అత్యంత కీలకమైన అంతరిక్ష పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఇస్రో రూపంలో భారత్ అద్భుత ప్రగతిని కనబరుస్తుంది. సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని వివిధ రకాల ఉపగ్రహాల ద్వారా జాతికి అందించడమే కాకుండా ప్రపంచ దేశాలకు వాటి సేవలను అందించే స్థాయికి భారత్ ఎదిగింది. అదే విధంగా తీవ్రమైన అంతరిక్ష పోటీని తట్టుకుంటూనే 2008లో చంద్రయాన్-1, 2019లో చంద్రయాన్-2 ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువంపై పరిశోధనలు నిర్వహించి అక్కడి నీటి జాడలను ప్రపంచానికి నిర్ధారించింది. అదే విధంగా 2018లో మంగళ్యాన్ ద్వారా హాలీవుడ్ సినిమా బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో అంగారకునిపై విజయవంతంగా ప్రయోగం చేపట్టింది. అదే విధంగా 7 ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా భారతదేశ సొంత ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ (నావిక్)ను భారత్ రూపొందించుకుంది. అదే క్రమంలో 2017, ఫిబ్రవరి 15న పీఎస్ఎల్వీ సీ37 ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి ఈ ఘనత సాధించిన మొదటి దేశంగా రికార్డు సృష్టించింది.
ఇవే కాకుండా భారత్ తన సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో గగన్‌యాన్ ప్రాజెక్ట్, శుక్రగ్రహం మీద ప్రయోగాల కోసం శుక్రయాన్ ప్రాజెక్టు, అంతరిక్ష యాత్రల కోసం అవతార్ కార్యక్రమాన్ని కూడా భవిష్యత్‌లో ఇస్రో ప్రయోగించనుంది.
7) సామాజిక ఆర్థిక అభివృద్ధిలో అద్భుత ఫలితాలు
1951 నుంచి 2015 వరకు పంచవర్ష ప్రణాళికల వ్యవస్థ ద్వారా దేశంలో పేదరిక, నిరుద్యోగ నిర్మూలన చాలావరకు విజయవంతమయ్యాయి. 2006లో తీసుకువచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రపంచంలోనే చట్టబద్ధం అయిన అతిపెద్ద నగదు బదిలీ చెల్లింపుల ఉపాధి పథకం. అదే విధంగా 2009లో వచ్చిన విద్యాహక్కు చట్టం ద్వారా దేశంలో 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యను అందిస్తున్నది. అదే విధంగా సమాజంలో అట్టడుగువర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాంగ బద్ధమైన సంరక్షణలు కల్పించి వారి సామాజిక స్థితిని మెరుగుపరచారు. 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా స్థానిక సంస్థలను ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యం, అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేశారు. జాతీయ ఆరోగ్య మిషన్, ప్రజా పంపిణీ వ్యవస్థ, జాతీయ ఆహార భద్రతా చట్టం, జాతీయ సామాజిక భద్రత పెన్షన్, ఆయుష్మాన్ భారత్, ఆవాస్ యోజన, గ్రామ సడక్ యోజన, స్వచ్ఛ భారత్, డ్వాక్రా వంటి కార్యక్రమాల ద్వారా సామాజిక సాధికారతను సాధించే ప్రయత్నం చేశారు.
ఎదుర్కొంటున్న సవాళ్లు
1) సమాఖ్య వివాదం
రాజ్యాంగం ప్రకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన శాస్త్రీయంగా జరిగినప్పటికీ తరచూ కేంద్రంలో ఏర్పడే బలమైన ప్రభుత్వాలు రాష్ట్రాల అధికారాలను హరించివేస్తున్నాయి. ముఖ్యంగా రాజ్యాంగంలోని అధికరణం 356 ను తమ అవసరాలకు అనుగుణంగా విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పటి వరకు 125 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. అదే విధంగా యథేచ్ఛగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాష్ట్రాల్లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలదోస్తున్నారు. ఒకే దేశం – ఒకే విధానం పేరుతో రోజురోజుకూ రాష్ట్రాల అధికారాలను కేంద్ర లాక్కోవడం దేశ సమాఖ్య వ్యవస్థకు ప్రమాదకరం.
దేశంలో కింది అంశాలు సమాఖ్య వ్యవస్థను బలహీనపరుస్తున్నాయి.
గవర్నర్ల నియామకం, అధికరణం 356 ప్రయోగం, సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థల ప్రయోగం, జాతీయ పౌర రిజిస్టర్, జీఎస్టీ వంటి పన్నుల విధానం.
2) భౌగోళిక/సరిహద్దు సవాళ్లు
భారతదేశం ఏడు పొరుగు దేశాలతో సుమారు 15,100 కి.మీ. సరిహద్దును పంచుకుంటున్నది. చైనా, పాకిస్థాన్ దురాక్రమణ విధానాల వల్ల తరచూ వారితో ఘర్షణ పడాల్సి వస్తుంది. 1947-48 విభజన పరిణామాల వల్ల జమ్ముకశ్మీర్‌లోని చాలా భూభాగాన్ని పాకిస్థాన్ ఆక్రమించుకొని తన ఆధీనంలో ఉంచుకుంది. అదే విధంగా చైనాతో సుమారు 3488 కి.మీ. సరిహద్దు శాస్త్రీయంగా నిర్ధారణ కాకపోవడం వల్ల అనేకసార్లు రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రోహింగ్యాలు వంటివారు బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల నుంచి అక్రమంగా భారతదేశంలోకి వలస వస్తూ దేశ భద్రతకు ప్రమాదంగా మారుతున్నారు.
3) సీమాంతర ఉగ్రవాదం
ఇది భారతదేశం ఎదుర్కొంటున్న అతి ప్రమాదకరమైన సవాలు. దేశ ఆంతరంగిక భద్రతను, జాతీయ సమైక్యతను దెబ్బతీసేలా ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు హింసాత్మక దాడులు చేస్తూనే ఉన్నారు. 2001 పార్లమెంట్‌పై దాడి, 2007 హైదరాబాద్ బాంబు పేలుడు, 2008 ముంబై తాజ్ హోటల్ దాడి, 2016 పఠాన్‌కోట్ దాడి వంటి భారతదేశ సార్వభౌమాధికారాన్ని సవాలు చేసేలా ఉన్నాయి. ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్ అండగా ఉండటం వల్ల దేశ భద్రతకు ఎప్పటికీ ముప్పే.
4) రూపాయి క్షీణత
స్వాతంత్య్రం వచ్చే నాటికి అమెరికన్ డాలర్‌తో సమానంగా ఉన్న భారత రూపాయి విలువ 75 ఏండ్ల కాలంలో భారీగా తన విలువను కోల్పోయింది. 2022, జూలై 20 నాటికి చరిత్రలో అత్యంత కనిష్ఠ స్థాయికి అంటే అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 80 రూపాయల దిగువకు పడిపోయింది. ఇప్పటికీ పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఆయుధాలు, ఎలక్టానిక్స్ వంటి ఉత్పత్తుల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి రావడం, విదేశీ చెల్లింపుల శేషంలో లోటు పెరగడం, దేశీయంగా ద్రవ్యోల్బణంలో వృద్ధి వంటి అనేక అంశాలు దీనికి కారణాలు. ఆర్థిక వ్యవస్థ సుమారు 3 ట్రిలియన్ డాలర్లు దాటిన రూపాయి విలువ రోజురోజుకు పడిపోవడం అస్థిరమైన భారత ఆర్థికవ్యవస్థను సూచిస్తుంది.
5) పేదరికం, నిరుద్యోగం
సుదీర్ఘకాలం పంచవర్ష ప్రణాళికలు, ప్రతి బడ్జెట్లో భారీగా కేటాయింపులు, అనేక పేదరిక, నిరుద్యోగ నిర్మూలన పథకాలు అమలు చేస్తున్నప్పటికీ 2021 నీతి ఆయోగ్ బముఖ పేదరిక సూచీ ప్రకారం జాతీయ పేదరికం 25 శాతంగా, నిరుద్యోగం సుమారు 8 శాతంగా ఉంది. విపరీతంగా జనాభా పెరుగుదల, ఉద్యోగాల సృష్టి చేయలేని అభివృద్ధి విధానాలు, పథకాలు అమలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం, అవినీతి, రాజకీయ జోక్యం వంటి కారణాల వల్ల ఈ సమస్యలు పరిష్కారం కావడం లేదు.
6) ప్రాంతీయవాదం, మతోన్మాదం, కులోన్మాదం
భారతదేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నప్పటికీ స్వార్థపూరిత రాజకీయాల వల్ల దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, ఈశాన్య భారతదేశం అనే ప్రాంతీయ విభేదాలు ఏర్పడుతున్నాయి. ఇవి దేశంలో జాతీయ సమైక్యతకు భంగం కలిగిస్తున్నాయి. బోడోల్యాండ్ వివాదం, నాగాలాండ్ వివాదం ఇలాంటివే.
అదే సమయంలో మందిర్-మసీద్ పేరుతో గత కొన్ని దశాబ్దాలుగా దేశంలో మత విద్వేషాలు చెలరేగి సామాజిక అశాంతికి కారణమవుతున్నాయి. బాబ్రీ మసీదు వివాదం, జ్ఞాన్వాపీ మసీద్ వివాదం ఇందుకు ఉదాహరణలు.
దేశంలో సమాజం రోజురోజుకు కులాల ప్రాతినిథ్యం ఆధారంగా గ్రూపులుగా విడిపోవడం, కులాల వారీ రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు చేయడం, కులాల వారీగా రాజకీయాలు చేయడం వంటివి భిన్నత్వంలో ఏకత్వాన్ని నాశనం చేసేలా ఉన్నాయి.
ముగింపు: నేరమయమైన రాజకీయాలు, అవినీతితో కూడిన అధికార యంత్రాంగం, లోపభూయిష్టమైన చట్టాలు వంటి కారణాల వల్ల భారతదేశంలో లింగ సమానత్వం, మహిళా సాధికారత, నిరుద్యోగం, పేదరికం, అల్ప ఉత్పాదకత, ప్రాంతీయ అసమానతలు వంటి సమస్యలు మరింత జఠిలమవుతున్నాయి. ఈ 75 ఏండ్లలో ఒకవైపు ప్రజల సంక్షేమాన్ని కొనసాగిస్తూ మరోవైపు విస్తృతమైన మౌలిక సదుపాయాల కల్పనతో కూడిన సంపద సృష్టి జరగడం దేశం సాధించిన అతిపెద్ద విజయం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతూనే పరిపాలనలో ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో పారదర్శకత, జవాబుదారీతనం పెంచాల్సిన అవసరం ఉంది. అదే విధంగా దేశ పరువు ప్రతిష్ఠలను పెంచేలా క్రీడలు, నైపుణ్యాభివృద్ధి పర్యావరణ, జీవ వైవిధ్య పరిరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. అన్నింటికీ మించి రాజ్యాంగ మౌలిక సూత్రాలైన సమానత్వం, లౌకికత్వం, న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, జాతీయ సమైక్యత వంటి వాటిని కాపాడుకోవడం దేశం నిర్వర్తించాల్సిన బాధ్యతాయుత కర్తవ్యం. ఆ పునాదుల మీదనే భారత నిర్మాణ ప్రక్రియ పరిపూర్ణం కావాలి.
పీ శ్రీరామ్‌చంద్ర
గ్రూప్స్ మెంటార్
హైదరాబాద్
8008356825
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు