‘ప్రథమ పౌరుడి’ ఎన్నిక ఇలా!
భారతదేశ 16వ రాష్ట్రపతి ఎంపికకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం చేస్తుంది. జూలై 18న ఓటింగ్, 21న లెక్కింపు చేయడానికి ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి నిపుణ పాఠకుల కోసం..
రాష్ట్రపతి ఎన్నిక-రాజ్యాంగ నిబంధనలు
– అధికరణ 54- రాష్ట్రపతి ఎన్నిక- ఎలక్టోరల్ కాలేజ్ (నియోజక గణం)
–అధికరణ 55- రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి
– అధికరణ 58- రాష్ట్రపతికి ఉండాల్సిన అర్హతలు
– అధికరణ 59- రాష్ట్రపతి పదవి-అనర్హతలు
అర్హతలు
–భారత పౌరుడై ఉండాలి.
–35 సంవత్సరాలు నిండాలి.
– లోక్‌సభకు ఎన్నికకాగల అర్హతలు కలిగి ఉండాలి.
అనర్హతలు
–ఎలాంటి లాభదాయక పదవుల్లో ఉండరాదు.
– ఆర్థికంగా, మానసికంగా దివాళా తీసి ఉండకూడదు.
–నేరారోపణ రుజువై ఉండకూడదు.
–పార్లమెంట్ లేదా రాష్ట్ర చట్టసభల్లో సభ్యత్వం ఉండకూడదు. ఒకవేళ చట్టసభల సభ్యుడై ఉంటే పదవి చేపట్టిన రోజే తన సభ్యత్వం రద్దవుతుంది.
ఎన్నికల నియోజక గణం
– దేశంలోని పార్లమెంట్, అసెంబ్లీలకు ఎన్నికైన ప్రజాప్రదినిధులు సభ్యులుగా ఉండే నియోజక గణాన్ని ఎలక్టోరల్ కాలేజ్ అని అంటారు.
ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు
1) ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు : ఎన్నికైన లోక్‌సభ సభ్యులు- 543, +ఎన్నికైన రాజ్యసభ సభ్యులు- 233 = మొత్తం 776.
2) ఎన్నికైన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభ్యులు – 4120.
నోట్: 70వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ప్రకారం ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభ్యులకూ రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కల్పించారు.
ఎలక్టోరల్ కాలేజీలో భాగం కానివారు
1) నామినేటెడ్ రాజ్యసభ సభ్యులు
2) నామినేటెడ్ అసెంబ్లీ సభ్యులు
3) శాసన మండలి సభ్యులు (ఎమ్మెల్సీలు)
నోట్: గతంలో లోక్‌సభలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు రాష్ట్రపతి ద్వారా నామినేట్ అయ్యేవారు. కానీ 104వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం చట్టసభల్లో ఆంగ్లో ఇండియన్ల ప్రాతినిథ్యాన్ని రద్దు చేశారు.
ఓట్ల విలువ లెక్కించడం
ఎమ్మెల్యేల ఓటు విలువ లెక్కించడం
–1971 జనాభా లెక్కల ప్రకారం ఒక రాష్ట్ర జనాభాను ఆ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల సంఖ్యతో భాగించాలి. అలా వచ్చిన విలువను 1000తో భాగించాలి. అప్పుడు వచ్చే సంఖ్యే ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఓటు విలువ అవుతుంది.
-ఎమ్మెల్యే ఓటు విలువ= రాష్ట్రం మొత్తం
జనాభా/ఎన్నికైన మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యX1/1000
-తెలంగాణలో ఎమ్మెల్యే ఓటు విలువ= తెలంగాణ జనాభా (1971 సెన్సస్ ప్రకారం)- 1,57,02,122
-మొత్తం శాసనసభ స్థానాలు = 119
-ఎమ్మెల్యే ఓటు విలువ= 1,57,02,122/119
= 131950.605042
= 131950.605042
1000 = 131.95
-తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ= 132
– ఈ లెక్కన తెలంగాణ (ఎమ్మెల్యేలు) మొత్తం ఓటు విలువ= 132X119= 15,708
దేశంలో అత్యధికంగా, అత్యల్పంగా ఓటు విలువ కలిగిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు
అత్యధికం అత్యల్పం
ఉత్తరప్రదేశ్- 208 సిక్కిం- 7
తమిళనాడు- 176 మిజోరం- 8
జారండ్- 176 అరుణాచల్ ప్రదేశ్- 8
మహారాష్ట్ర- 175 నాగాలాండ్- 9
బీహార్- 173 పుదుచ్చేరి- 16
ఆంధ్రప్రదేశ్- 159 మేఘాలయ- 17
ఎంపీల ఓటు విలువ లెక్కించడం
– దేశంలోని అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువను మొత్తం ఎన్నికైన ఎంపీల సంఖ్యతో భాగిస్తే వచ్చేదే ఎంపీల ఓటు విలువ.
ఎంపీల ఓటు విలువ= అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ -ఎన్నికైన మొత్తం ఎంపీల సంఖ్య
– 2017 రాష్ట్రపతి ఎన్నికల నాటికి దేశంలో 4120 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వీరి మొత్తం ఓటు విలువ 5,49,495.
– ప్రస్తుతం 4033 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరి ఓటు విలువ- 5,43,200
– అప్పుడు ఒక్కో ఎంపీ ఓటు విలువ= 776= 5,43,200/776= 700
– తెలంగాణలో ఎంపీల ఓటు విలువ= తెలంగాణలో లోక్‌సభ స్థానాలు- 17, రాజ్యసభ స్థానాలు- 7. మొత్తం 24.
– మొత్తం వీరి ఓటు విలువ= 24X700= 16,800
– తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎంపీల మొత్తం ఓటు విలువ= 15,708+16,800= 32,508
-ప్రస్తుతం (2022 జూన్) రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల సంఖ్య
– పార్లమెంట్ సభ్యులు- 776
అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలు 4,033
మొత్తం ఓటర్లు 4809
మొత్తం ఓట్లు విలువ
ఎంపీల ఓట్ల విలువ 5,43,200
ఎమ్మెల్యేల ఓట్ల
విలువ 5,43,231
మొత్తం ఓట్ల విలువ- 10,86,431
– ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువలో 2017 ఎన్నికలతో పోలిస్తే కొంత తగ్గడం వల్ల మొత్తం ఓట్ల విలువ కూడా తగ్గింది.
ఎన్నిక పద్ధతి
– రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం-1952 ప్రకారం రాష్ట్రపతి ఎన్నికలు పరోక్షంగా, నైష్పత్తిక ప్రాతినిథ్య విధానంలో ఏక ఓటు బదిలీ పద్ధతిలో రహస్యంగా జరుగుతుంది. దీనిని కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.
–రాష్ట్రపతి ఎన్నికలు పార్లమెంట్ హౌస్, రాష్ట్రాల్లోని అసెంబ్లీ సచివాలయాల్లో జరుగుతాయి.
– రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు గెలిచినట్లు కాదు. మొత్తం పోలైన, చెల్లుబాటైన ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ కోటా ఓట్లు పొందినవారే రాష్ట్రపతిగా ఎన్నికవుతారు. ఈ కోటాను నిర్ణయించేందుకు పోలైన వ్యాలిడ్ ఓట్లను 2తో భాగించి వచ్చే సంఖ్యకు ఒకటి కలుపుతారు.
కోటా ఓటు విలువ=
పోలై చెల్లుబాటైన మొత్తం ఓట్లు
——————– +1
2
ఉదాహరణకు మొత్తం 1,00,000 వ్యాలిడ్ ఓట్లు పోలయ్యాయని
అనుకుంటే అప్పుడు కోటా ఓటు విలువ=
1,00,000
————– = 50,000
2
=50,000+1= 50,001
రాష్ట్రపతి ఎన్నికలు – ప్రాధాన్యతా ఓటు క్రమం
– రాష్ట్రపతికి ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ చేస్తే ప్రాధాన్యతా క్రమంలో అభ్యర్థులకు ఓటు వేయాలి.
– ఒక అభ్యర్థికి తొలి ప్రాధాన్యతా ఓట్లు, కోటా కంటే ఎక్కువ వస్తే ఆ అభ్యర్థిని రిటర్నింగ్ అధికారి విజేతగా ప్రకటిస్తారు. లేదంటే మళ్లీ లెక్కింపు మొదలుపెడతారు.
– తొలి ప్రాధాన్యతా ఓట్లు అత్యంత తక్కువ పొందిన అభ్యర్థిని తొలగించి, ఆ అభ్యర్థికి వచ్చిన ఓట్లను మిగతా అభ్యర్థులకు పంచుతారు. అప్పుడు ఎవరైతే కోటా కంటే ఎక్కువ ఓట్లు పొందుతారో వారిని గెలిచినట్లు ప్రకటిస్తారు.
–లేదంటే ముందు చెప్పిన పద్ధతిలో మళ్లీ కౌంటింగ్ చేపడతారు. ఇలా ఎవరో ఒకరు అభ్యర్థి గెలిచేవరకూ లెక్కింపు జరుగుతుంది.
రాష్ట్రపతి ఎన్నిక వివాదాలు
– రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన వివాదాలను కేవలం సుప్రీంకోర్టులో మాత్రమే సవాల్ చేయాలి.
–ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత 30 రోజుల్లోపల దానిని సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేయాలి.
– రాష్ట్రపతి ఎన్నికల వివాదాల పిటిషన్‌ను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలంటే ఆ పిటిషన్‌పై కనీసం 20 మంది ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు సంతకాలు చేయాలి.
నోట్: ఎన్నిక వివాదంలో సుప్రీంకోర్టు మెట్లెక్కిన ఏకైక రాష్ట్రపతి వరాహగిరి వెంకటగిరి.
ఆసక్తికర అంశాలు
1) రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించదు. సభ్యులు వారికి నచ్చినట్లు ఓటు వేయవచ్చు. పార్టీలు విప్ జారీచేయడానికి వీల్లేదు.
2) ఎన్నికల్లో నోటా అవకాశం ఉండదు.
3) రాష్ట్రపతిగా పోటీచేసే అభ్యర్థులను ఎలక్టోరల్లోని 50 మంది ప్రతిపాదించి మరొక 50 మంది బలపర్చాలి. నామినేషన్‌ను అభ్యర్థి నేరుగా గాని, ప్రతిపాదకుల ద్వారా గాని, బలపరిచే వారి ద్వారా గాని ఉదయం 11 నుంచి 3 గంటల్లోపల దాఖలు చేయవచ్చు.
4) రూ.15,000 నేరుగా లేదా ఆర్బీఐ పేరిట ప్రభుత్వ ట్రెజరీలో డిపాజిట్ రుసుం లాగా చెల్లించాలి. పోలైన ఓట్లలో 1/6వ వంతు ఓట్లు పొందని అభ్యర్థి డిపాజిట్‌ను కోల్పోతారు.
5) రాష్ట్రపతి ఎన్నికలకు రొటేషన్ పద్ధతిలో లోక్‌సభ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. ఈసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. అన్ని రాష్ట్ర రాజధానుల్లో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఉంటారు.
6) ఈ ఎన్నికలకు తెలంగాణ ఏఆర్వోలుగా అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ సీహెచ్ ఉపేందర్ రెడ్డి, డిప్యూటీ సెక్రటరీ వీఎన్ ప్రసన్న కుమారి వ్యవహరిస్తారు.
7) ఈ ఎన్నికలో రెండు రంగుల బ్యాలెట్ పేపర్లు ఉపయోగిస్తారు. 1) గ్రీన్ బ్యాలెట్ పేపర్- ఇది ఎంపీలకు ఇస్తారు. 2) పింక్ బ్యాలెట్ పేపర్- ఇది ఎమ్మెల్యేలకు ఇస్తారు.
8) 2001లో తీసుకువచ్చిన 84వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2026 వరకు రాష్ట్రపతి ఎన్నికల్లో 1971 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకుంటారు.
9) 1961లో తీసుకువచ్చిన 11వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఎలక్టోరల్ కాలేజీలో ఖాళీలు ఉన్నంత మాత్రాన రాష్ట్రపతి ఎన్నికను కోర్టులో సవాల్ చేయడానికి వీల్లేదు.
10) 1978లో తీసుకువచ్చిన 44వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రాష్ట్రపతి ఎన్నిక వివాదాన్ని సాధారణ పౌరులు న్యాయస్థానంలో ప్రశ్నించడానికి వీల్లేదు. సస్పెన్షన్‌కు గురైన ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా ఎన్నికల్లో పాల్గొనవచ్చు.
11. ప్రివెంటివ్ డిటెన్షన్‌లో ఉన్న ఓటరుకు (ఎంపీ/ఎమ్మెల్యే) కూడా ఓటు వేయడానికి హక్కు ఉంది.
12. జైలులో ఉన్న సభ్యులకు (ఎంపీ/ఎమ్మెల్యే) పెరోల్ మంజూరైతే వారు కూడా ఎన్నికల్లో పాల్గొనవచ్చు.
13) ఓటింగ్‌లో పాల్గొనే వారు రహస్య విధానాన్ని పాటించాలి. బ్యాలెట్ పేపర్‌ను ఎవరికైనా చూపితే ఆ ఓటు చెల్లుబాటు కాదు.
14) ఇప్పటివరకు అత్యధికంగా 1967 రాష్ట్రపతి ఎన్నికల్లో 17 మంది పోటీ చేశారు.
15) దేశ చరిత్రలో తొలిసారి 1969 రాష్ట్రపతి ఎన్నికల్లో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. ఈ పరిణామం ద్వారా రాష్ట్రపతి అయిన వ్యక్తి వీవీ గిరి.
16) ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం లేదు.
17) రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చే పెన్నుల ద్వారా మాత్రమే ప్రాధాన్యతా ఓట్ల క్రమాన్ని గుర్తించాలి.
18) ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే 1977లో రాష్ట్రపతి తొలి ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. నీలం సంజీవరెడ్డి ఆ విధంగా రాష్ట్రపతి అయ్యారు.
రాష్ట్రపతి ఎన్నిక – సూత్రాలు
– విశాలమైన భూభాగం, ప్రపంచంలో రెండో అతిపెద్ద జనాభా, అత్యంత పెద్దదైన ప్రజాస్వామ్య వ్యవస్థ వంటి కారణాల వల్ల భారత రాష్ట్రపతి ఎన్నిక అత్యంత ప్రత్యేకంగా జరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో రెండు రకాల సూత్రాలు ఇమిడి ఉంటాయి. అవి.. 1) సమానత్వ సూత్రం (Principle of Uniformity) 2) సారూప్యతా సూత్రం (Principle of Parity)
సమానత్వ సూత్రం: ఒక రాష్ట్ర జనాభా ఆధారంగా చేసుకొని ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలందరికీ ఒకే రకమైన ఓటు విలువ ఉంటుంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అది భిన్నంగా ఉంటుంది. ఉదా: ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ- 159. ఇది రాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యేలకూ ఒకేవిధంగా ఉంటుంది.
– తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ- 132. ఇది రాష్ట్రంలోని 119 మంది ఎమ్మెల్యేలకూ ఒకే రకంగా ఉంటుంది.
సారూప్యతా సూత్రం: భారత దేశ సమాఖ్య లక్షణాన్ని కాపాడటానికి కేంద్రం, రాష్ట్రాల ప్రాతినిథ్యం సమానంగా ఉండటానికి రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ సూత్రం పాటిస్తారు. దీని ప్రకారం మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ మొత్తం ఎంపీల ఓటు విలువతో సమానంగా ఉంటుంది.
– దేశంలో మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ= 5,43,231
–దేశంలో మొత్తం ఎంపీల ఓటు విలువ= 5,43,200
పీ శ్రీరామ్‌చంద్ర
గ్రూప్స్ మెంటార్
హైదరాబాద్
8008356825
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?