సాలార్జంగ్.. సంస్కరణల సారథి
హైదరాబాద్ రాజ్యం ఆధునికీకరణకు ఆద్యుడిగా పేరొందిన మొదటి సాలార్జంగ్, అసఫ్‌జాహీ వంశ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నాడు.
# నిజాం రాజ్య పాలనలో సుదీర్ఘకాలం 30 సంవత్సరాల (1853-83) పాటు ముగ్గురు నిజాం రాజుల దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసి, మౌలిక సంస్కరణలు చేపట్టిన ఘనత మొదటి సాలార్‌జంగ్‌కు దక్కింది. ఆయన కాలంలో హైదరాబాద్ రాజ్యం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. సాలార్‌జంగ్‌కు పూర్వం హైదరాబాద్ సంస్థానంలో అశాంతి, అలజడి, ఆర్థిక సంక్షోభం నెలకొని ఉన్నాయి. శాంతి భద్రతలు క్షీణించి, పాలన యంత్రాంగం నిర్వీర్యమైంది. మరోవైపు సంస్థానంలోని ఉన్నతాధికారులు, స్థానిక భూస్వాములు, తాలూక్దార్లు, దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలు, రోహిల్లాలు, అరబ్‌లు తదితరులు ఇష్టానుసారంగా ప్రవర్తించి లూటీలు, దోపిడీలు చేసి, వ్యాపారులు, రైతాంగంపై నిర్బంధాన్ని విధించారు. దీంతో రాజ్యంలో ఆర్థిక సంక్షోభం తీవ్రమైంది. నిజాం రాజుల అలసత్వం, అశ్రద్ధ కారణంగా అధికారుల అవినీతి, లంచగొండితనం విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు బ్రిటిష్ ప్రభుత్వం తన స్వప్రయోజనాల కోసం అనేక రకాలుగా నిజాం పాలకులపై ఒత్తిడి తెచ్చి రాజ్యంలోని కొంత భూభాగాన్ని బీరార్‌ను ఆక్రమించింది. దాని కారణంగా ప్రభుత్వ ఆదాయ వనరులు తగ్గి నిజాం రాజులు అప్పుల పాలయ్యారు.
# చుందూలాల్ వంటి ఉన్నతాధికారులు బ్రిటిష్ పాలకుల ఏజెంట్లు, తొత్తులుగా పనిచేసి ఆర్థిక వనరులను వారి హస్తగతం చేశారు. బ్రిటిష్ వర్తక కంపెనీలు, ప్రైవేటు వడ్డీ వ్యాపారులు నిజాం ప్రభుత్వానికి అధిక వడ్డీలకు లక్షల రూపాయలు అప్పులు ఇచ్చి ఆదాయం వచ్చే ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. తాలూక్దార్లు, జాగీర్దార్లు రైతాంగంపై అధిక శిస్తు విధించి దోపిడీ చేసేవారు. పోలీస్, న్యాయవ్యవస్థ నిర్వీర్యం అయినందువల్ల పాలనా యంత్రాంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఈ తరుణంలో తన 23వ ఏట సాలార్జంగ్ ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, రెవెన్యూలో అవినీతి, లంచగొండితనం, మధ్యవర్తుల, దళారీల దోపిడీ, నిర్వీర్యమైన పరిపాలనా వ్యవస్థ ఆయన ముందున్న ప్రధాన సమస్యలు. వాటిని అధిగమించడానికి సాలార్జంగ్ ప్రవేశపెట్టిన సంస్కరణలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. హైదరాబాద్ రాజ్యానికి శాంతి భద్రతలు కల్పించి, ఆర్థికంగా అభివృద్ధి చేయడం ఆయన ప్రధాన లక్ష్యం.
# ప్రధానమంత్రి పదవిని చేపట్టకముందు సాలార్జంగ్ మెదక్ తాలూక్దార్గా పనిచేశాడు. సాలార్జంగ్ నిజాం రాజ్యంలోని ఒక ప్రముఖ కులీన కుటుంబంలో జన్మించాడు. ఆయన పూర్వీకులు బీజాపూర్, మొఘల్ వంశ పాలకుల పరిపాలనలో ఉన్నత పదవులు పొందారు. ఆ తర్వాత నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జా ఆస్థానంలో కూడా సాలార్జంగ్ కుటుంబీకులు ఉన్నత స్థానాలను ఆక్రమించారు. వారిలో ప్రముఖుడైన మీర్ ఆలం నిజాం సంస్థానంలో ప్రధాన మంత్రి పదవిని పొందాడు.
#సాలార్జంగ్ తెలివితేటలను గమనించిన నిజాం ఆయ న్ను ప్రధానమంత్రిగా ఉన్నతోద్యోగంలో నియమించాడు. మొదట తాలూక్దార్గా అనుభవం సంపాదించిన సాలార్జంగ్, నిజాం పాలన, ఆర్థిక రంగాల్లో మౌలికమైన మార్పులకు శ్రీకారం చుట్టాడు. రెవెన్యూ శాఖలో ఉన్నతాధికారిగా ఆయన నిర్వహించిన పాత్ర, అనుభవం తర్వాత కాలంలో ప్రధానమంత్రి హోదాలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి దోహదం చేశాయి.
#సాలార్జంగ్ నిజాం రాజ్యంలోని ప్రధానమంత్రులందరిలోనూ అపర మేధావిగా, సంస్కర్తగా పేరు ప్రఖ్యాతలు పొందాడు. ఆయనకు బ్రిటిష్ అధికారులతో ఉన్న సతసంబంధాలు, స్నేహం, బ్రిటిష్ పాలనా యంత్రాంగం విశిష్టత ఆయనకు ఎంతగానో తోడ్పడ్డాయి. సాలార్జంగ్ సంస్కరణల ప్రధాన లక్ష్యం.. శాంతిభద్రతలను కాపాడి, ప్రజా సంక్షేమం, రాజ్య రక్షణ కోసం ఉన్నతమైన సమర్థపాలనా యంత్రాంగాన్ని నిర్మించి, ఆర్థిక పురోగతికి తోడ్పడటం. సంస్కరణలను ఆచరణలో పెట్టడానికి ఆయన ఒకవైపు నిజాం ప్రభువు అనుమతిని, మరోవైపు బ్రిటిష్ ప్రభుత్వ తోడ్పాటును పొందాడు. నిజాం-బ్రిటిష్ సంబంధాన్ని సమన్వయపరుస్తూ సంస్కరణల ప్రక్రియను కొనసాగించాడు.
# నిజాం అలీ నుంచి అఫ్జల్ ఉద్దౌలా కాలం వరకు ముఖ్యంగా 1802-53 మధ్య నిజాం రాజ్యం అనేక రాజకీయ, దౌత్య, ఆర్థిక, సాంఘిక సంక్షోభాలకు లోనైంది. నిజాం అలీ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వంతో ఏర్పర్చుకున్న సైన్య సహకార పద్ధతి నిజాం రాజ్య ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
#ముఖ్యంగా బ్రిటిష్ సైన్యాన్ని అంటే హైదరాబాద్ కంటింజెన్సీ పోషణ నిమిత్తం సంవత్సరానికి లక్షల రూపాయల ఖర్చు భరించాల్సి వచ్చింది. పరిపాలనా యంత్రాంగం అసమర్థత వల్ల ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం సాధ్యం కాలేదు. అందువల్ల ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, బ్రిటిష్ కంపెనీల వద్ద నిజాం ఆభరణాలు, భూములను కుదువ పెట్టి కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత సైన్యానికయ్యే ఖర్చు నిమిత్తం బీరార్, రాయచూర్, ఉస్మానాబాద్‌లను బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ 1853లో వశపర్చుకుంది. అందువల్ల నిజాం ప్రభుత్వ రెవెన్యూ ఆదాయం బాగా పడిపోయింది. కొంత భూభాగాన్ని కోల్పోవడం, ఆదాయవనరులు సన్నగిల్లడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల సాలార్జంగ్ మొదటగా బ్రిటిష్ ప్రభుత్వ సహకారం పొందాల్సి వచ్చింది.
#1857 సిపాయిల తిరుగుబాటు సందర్భంగా సాలార్జంగ్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని కాపాడాడు. తురెబాజ్ ఖాన్ నాయకత్వంలో హైదరాబాద్ రెసిడెన్సీపై తిరుగుబాటును అణచివేసి బ్రిటిష్ ప్రభుత్వం మెప్పును పొందాడు. తద్వారా బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న కొన్ని ప్రాంతాలు రాయచూర్, ఉస్మానాబాద్‌లను తిరిగి నిజాం రాజుకు ఇచ్చేసింది. నిజాం రాజ్యంలోని కొన్ని ప్రాంతాల పునరుద్ధరణలో సాలార్జంగ్ పాత్ర కీలకమైంది. ఎందుకంటే నిజాం చెల్లించే 50 లక్షల రూపాయల అప్పును బ్రిటిష్ ప్రభుత్వం మాఫీ చేసింది. నిజాం రాజు పొందిన ప్రాంతాల ఆదాయం దాదాపు రూ.34 లక్షలు. అందువల్ల నిజాం రాజ్య ఆదాయం క్రమంగా పెరిగింది. దాని వెనుక సాలార్జంగ్ కృషి బాగా తోడ్పడింది.
# 1850-60 దశకాల్లో సాలార్జంగ్ సంస్కరణలు ప్రధానంగా పరిపాలన, రెవెన్యూ యంత్రాంగంపై కేంద్రీకృతమయ్యాయి. నిజాం రాజ్యంలో మూడు ముఖ్యమైన పాలన, రెవెన్యూ వ్యవస్థలు ఉన్నాయి. అవి దివానీ, జాగీర్, సర్ఫేఖాస్. సాలార్జంగ్ పాలనకు ముందు దివానీ ప్రాంతం మినహా ఇతర ప్రాంతాల్లో అంటే సర్ఫేఖాస్, జాగీర్, పైగాల్లో స్థానిక పాలనా వ్యవస్థ ఉండేది కాదు. అంతేకాకుండా ఈ ప్రాంతాల్లో మధ్యవర్తుల ప్రమేయం అధికంగా ఉండేది. జాగీర్ వ్యవస్థలో కూడా ప్రాంత సరిహద్దులు, పాలనా వ్యవస్థ, జాగీర్దార్ విధులు సక్రమంగా నిర్వర్తించలేదు. విభిన్న రూపాల్లో ఉన్న పాలనా వ్యవస్థను క్షుణ్ణంగా అధ్యయనం చేసి దివానీ జిల్లాలను క్రమపద్ధతిలో ఏర్పాటు చేశాడు. తద్వారా దివానీ భూభాగంలో సమర్థవంతమైన పాలనను చేపట్టాడు.
# పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాను కేంద్రంగా చేసి రాజ్యాన్ని సుబాలుగా, కింది స్థాయిలో తాలూకాలుగా విభజించి ప్రతి సుబాకు సుబేదారుడిని నియమించాడు. పరిపాలనా వ్యవస్థకు ప్రభుత్వ ఆధీనంలో ఉండే అధికార యంత్రాంగాన్ని నియమించాడు. బ్రిటిష్ ఇండియా పాలనా వ్యవస్థను మోడల్‌గా తీసుకొని నిజాం రాజ్య పరిపాలనా యంత్రాంగాన్ని పటిష్టం చేయడంలో సాలార్జంగ్ సఫలీకృతుడయ్యాడు. ఆ తర్వాత రాజ్యంలో ప్రధాన ఆదాయ వనరు భూమి శిస్తు విధానంలో కూడా సమూలమైన మార్పులు చేపట్టాడు. బొంబాయి రాష్ట్రంలోని బ్రిటిష్ రెవెన్యూ వ్యవస్థను నిజాం రాజ్యంలో ప్రవేశపెట్టి సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టాడు.
# హైదరాబాద్ రాజ్యంలో 1853కు పూర్వం అమల్లో ఉన్న రెవెన్యూ వ్యవస్థలో వేలం పద్ధతి ప్రధానమైనది. జిల్లా స్థాయిలో తాలూక్దార్లు శిస్తు వసూలు చేయడంలో, శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమయ్యారు. వేలం పాటదార్లు, తాలూకాదార్లు అధిక మొత్తంలో శిస్తు, ఇతర పన్నులు వసూలు చేసి రైతాంగంపై నిర్బంధాన్ని ప్రయోగించారు. ఎక్కువ మొత్తం పన్నులు వసూలు చేసి ప్రభుత్వానికి తక్కువగా చెల్లించేవారు. ఈ విధానానికి స్వస్తి చెప్పి 1865 నుంచి జిలాబందీ విధానం ప్రవేశపెట్టి, తాలూక్దార్, జిల్లా కలెక్టర్, తహసీల్దార్లను నియమించి వారికి జీతభత్యాలు చెల్లించి సమర్థంగా శిస్తు వసూలు, శాంతి భద్రతలను నిర్వహించాడు. ఈ విధానం వల్ల రైతులు దళారుల కబంధ హస్తాల నుంచి బయటపడ్డారు. జిలాబందీ విధానం బ్రిటిష్ ఇండియాలోని రైత్వారీ విధానాన్ని పోలి ఉంటుంది. అందువల్ల ప్రభుత్వానికి రైతులకు మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఏర్పడ్డాయి. రైతులకు భూమిపై పట్టాదారు హక్కు కల్పించారు.
# గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్దిష్టమైన రెవెన్యూ పాలనా యంత్రాంగాన్ని నిర్మించి, రెవెన్యూ వ్యవస్థను సమన్వయం చేయడానికి రెవెన్యూ బోర్డును, రెవెన్యూ కార్యదర్శిని నియమించారు. సర్వే, సెటిల్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టి రెవెన్యూ రికార్డులు, హక్కుదారు పట్టా వ్యవస్థను, రైతులకు రక్షణను కల్పించారు. దీని ఫలితంగా రైతుకు భద్రత ఏర్పడి వ్యవసాయం వృద్ధి చెందింది. ప్రభుత్వ రెవెన్యూ ఆదాయాన్ని క్రమబద్ధీకరించడానికి ద్రవ్య స్థిరీకరణ నిధి కోసం సాలార్జంగ్ నాణేల ముద్రణను ప్రభుత్వ గుత్తాధిపత్యం కిందకు తెచ్చాడు. నియంత్రణలో లేని జిల్లా టంకశాలల్ని రద్దు చేసి హైదరాబాద్‌లో ప్రభుత్వ టంకశాలను ఏర్పాటు చేశాడు. సాలార్జంగ్ ప్రవేశపెట్టిన నూతన నాణేన్ని ‘హోలిసిక్కా’గా పిలిచేవారు. ఈ నాణెం వస్తు వినిమయంలో ప్రామాణికంగా గుర్తింపు పొందింది. సాలార్జంగ్ ప్రవేశపెట్టిన ముఖ్యమైన ద్రవ్య సంబంధ సంస్కరణల ఫలితంగా రాజ్య ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి.
#నిజాం రాజ్యంలో ప్రజలకు రక్షణ, శాంతిభద్రతలను కాపాడటానికి సాలార్జంగ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పోలీస్ యంత్రాంగాన్ని క్రమబద్ధీకరించాడు. అంతకు పూర్వం నిజాం మత సిబ్బంది, ప్యూన్, గ్రామ సేవకులు శాంతి భద్రతలను పర్యవేక్షించేవారు. వారు అసమర్థులు కావడంతో రోహిల్లాలు దొంగతనాలు, దోపిడీలు, అల్లర్లకు పాల్పడ్డారు. 1865లో ఆధునిక పోలీస్ వ్యవస్థను రూపొందించారు. దాని ప్రకారం ప్రతి జిల్లాకు ఒక పోలీస్ సూపరింటెండెంట్ (మెహతమీన్)ను నియమించాడు. పోలీస్ సిబ్బందికి జీతభత్యాలు చెల్లించి గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పటిష్టమైన శాంతిభద్రతల యంత్రాంగాన్ని ప్రవేశపెట్టారు.
#పరిపాలన, శాంతి భద్రతల వ్యవస్థను పటిష్టపర్చడానికి న్యాయవ్యవస్థను సమూలంగా మార్చారు. నిజాం రాజ్యంలో ఒక సర్వోన్నత న్యాయస్థానం (అదాలత్-ఇ-పాదుషా) ఒక అప్పీలు న్యాయస్థానం ఏర్పాటు చేశారు. ఈ న్యాయస్థానంలో ఓ ప్రధాన న్యాయమూర్తి, నలుగురు న్యాయమూర్తులను నియమించారు. కింది స్థాయిలో నగర, జిల్లా కోర్టులను ఏర్పాటు చేశారు. న్యాయవ్యవస్థలో ప్రత్యేక సివిల్ (దివాని అదాలత్), క్రిమినల్ (ఫౌజ్దారి అదాలత్) కోర్టులను ఏర్పాటు చేశారు. 1862లో ప్రధానమంత్రి పర్యవేక్షణలో న్యాయశాఖ సెక్రటేరియన్ ఏర్పర్చారు. ముస్లిం న్యాయశాస్త్ర మతసంబంధమైన కేసులను పరిష్కరించడానికి మహకామ-ఇ-సదరత్ అనే న్యాయస్థానాలను ఏర్పా టు చేశారు. సాలార్జంగ్ కాలంలో నిజాం రాజ్యంలో మొదటిసారిగా అంగవిచ్ఛేదన శిక్ష రద్దయ్యింది.
#విద్య, వైద్యం, విజ్ఞాన, శాస్త్ర, సాంకేతిక, ఉపాధి, రవాణా రంగాల్లో వినూత్నమైన సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత సాలార్‌జంగ్‌కు దక్కుతుంది. ఎందుకంటే సంప్రదాయ పద్ధతులు, ఆలోచన విధానంలో మార్పు రావడానికి నూతన పాశ్చాత్య విద్య, విజ్ఞానం అవసరమని ఆయన గుర్తించాడు. అందువల్ల నిజాం రాజ్యంలో ఆధునిక విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాడు. రాజ్యపాలన, వ్యవహారాలు సక్రమంగా, సమర్థంగా నిర్వహించడానికి విద్యావంతులైన, శిక్షణ పొందిన సిబ్బంది ఆవశ్యమని గ్రహించిన సాలార్జంగ్ విద్యారంగంలో పలు సంస్కరణలు చేపట్టాడు. పార్శీ, అరబిక్ భాషలతో పాటు ఇంగ్లిష్‌ను, పాశ్చాత్య విద్యాబోధనను ప్రవేశపెట్టాడు. దారుల్ ఉల్మ్, ఓరియంటల్ కాలేజీ, సిటీ హైస్కూల్, చాదర్‌ఘాట్ హైస్కూల్, మదర్సా-ఇ-ఆలియా లాంటి విద్యాసంస్థలను స్థాపించాడు. వీటితోపాటు ఇంజినీరింగ్, మెడికల్ విద్యాసంస్థలను నెలకొల్పాడు. తద్వారా హైదరాబాద్ రాజ్యంలో ఆధునిక విద్యను అభ్యసించిన సమర్థులైన ఉద్యోగులు తయారయ్యారు. దాంతోపాటు ప్రతిభావంతులు, నైపుణ్యం కలిగిన విద్యావంతుల్ని భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఆహ్వానించి ప్రాంత, కుల, మత, భాషా భేదాలు లేకుండా పదవులు ఇచ్చి గౌరవించాడు. అందువల్ల సాలార్జంగ్ చేపట్టిన సంస్కరణలు పాలనా యంత్రాంగం సమర్థతను పెంచాయి.
# బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో అనుభవం కలిగిన అనేకమంది హైదరాబాద్ రాజ్యంలో ఉన్నత పదవుల్లో నియమితులయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే 19వ శతాబ్దపు చివరి దశకంలో ఉన్నవారి మధ్య ముల్కీ, నాన్ ముల్కీ విభేదాలు పొడచూపాయి. బయటి ప్రాంతాలవారు హైదరాబాద్ రాజ్యంలో ఉన్నత పదవులు పొంది, కీర్తి ప్రతిష్టలు పొందడం స్థానిక విద్యావంతులకు, ఉద్యోగులకు నచ్చలేదు. భవిష్యత్తులో తమకు ఉపాధి అవకాశాలు దక్కవేమో అనే భావనతో ముల్కీ అస్తిత్వాన్ని, భావనను ముందుకు తెచ్చారు. అయినప్పటికీ సాలార్జంగ్ పరిపాలనా నైపుణ్యాన్ని పెంపొందించడానికి ప్రతిభ కలిగిన వారిని ఉన్నతోద్యోగాల్లో నియమించారు.
అడపా సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు