Current Affairs | ప్రాజెక్ట్ టైగర్ @ గోల్డెన్ జూబ్లీ
మన జాతీయ సంపదల్లో జంతుసంపద కూడా ఒకటి. సృష్టిలో మానవ మనుగడ జంతుసంపదపై ఆధారపడి ఉంది. ఇంతేకాకుండా జంతువుల వల్ల దేశానికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అంతటి ప్రాధాన్యమున్న వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది. ఇప్పటివరకు దేశంలో ఐదుసార్లు పులుల జనాభాను లెక్కించారు. ప్రధానంగా మన దేశంలో పులుల సంఖ్య పెరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ‘ప్రాజెక్ట్ టైగర్’ కు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల లెక్కలు విడుదల చేసింది.
ఆ వివరాలు సంక్షిప్తంగా..
Status of Tigers – 2022
- ఇవి ఐదో పులుల జనాభా లెక్కలు. వీటిని కర్ణాటకలోని మైసూరులో ‘ప్రాజెక్ట్ టైగర్’ను ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ విడుదల చేశారు. ఈ లెక్కల ప్రకారం 2022లో దేశంలో మొత్తం పులల సంఖ్య-3167
- 2018 లెక్కలతో పోలిస్తే దేశంలో 2022 నాటికి 200 పులులు పెరిగాయి. 2018 లెక్కల ప్రకారం దేశంలో పులులు-2967
- 2018 నుంచి 2022 నాటికి దేశంలో పులుల సంఖ్యలో వృద్ధి రేటు 6.7%. ఇది 2014 నుంచి 2018 మధ్య వృద్ధిరేటుతో పోలిస్తే తగ్గింది.
- 2014-2018ల మధ్య పులుల వృద్ధిరేటు 33%
- ఈ పులుల జనాభా దేశంలో అటవీ ప్రాంతాలు కలిగిన 20 రాష్ర్టాల్లో నిర్వహించి విడుదల చేశారు.
- మాంసాహార సంకేతాలు, ఆహారం సమృద్ధిగా అంచనా వేయడానికి 6,41,449 కి.మీల అడుగుల సర్వే జరిగింది. (పాద ముద్రలు)
- అడవుల్లో 3,24,003 ఆవాసాలు, వృక్ష సంపద, మానవ ప్రభావాల కోసం నమూనా చేయబడ్డాయి.
- ఈ సర్వే కోసం 32,588 ప్రదేశాల్లో కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 4,70,81,881 ఫొటోలు తీయగా అందులో 97,399 పులుల ఫొటోలు ఉన్నాయి.
- ఈ సర్వే కోసం మనుషులు పని చేసిన రోజులు-6,41,102
- కెమెరాకు చిక్కిన పులుల సంఖ్య-3080
- ప్రపంచంలో ఉన్న మొత్తం పులుల్లో 70% భారత్‌లో ఉన్నాయి. వీటిల్లో రాష్ర్టాల వారీగా జాబితాను ఇవ్వలేదు.
- ఈ పులుల జనాభా స్థితిని లెక్కించడానికి, పులుల ఆవాసాలు కలిగిన 20 రాష్ర్టాలను ఐదు ప్రాంతాలుగా విభజించి మూడు దశల్లో లెక్కించారు.
- మొదటి దశలో M-STIPES (Monito ring System for Tigers Intensive protection and Ecological Status) మొబైల్ యాప్‌లో డేటాను డిజిటల్ రూపంలో సేకరించేందుకు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.
- రెండో దశలో రిమోగా గ్రహించిన డేటా గ్రిడ్ వారీగా సంగ్రహించారు. ఆక్యుపెన్సీ, సమృద్ధి నమూనాల్లో కోవేరియంట్గా ఉపయోగించారు.
- మూడో దశలో కెమెరా ట్రాప్ డేటాను విశ్లేషించడానికి న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) సహకారంతో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో రూపొందించిన ఇమేజ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ CaTRAT (Camera Trap Data Repository and Analysis Tool) ను ఉపయోగించారు.
- ఫీల్డ్ నుంచి పొందిన ఫొటోలు, జియో ట్యాగ్ చేయబడిన చిత్రాలు కృత్రిమ మేథ ద్వారా జాతులుగా విభజించడానికి మరింత ప్రాసెస్ చేశారు.
ప్రాంతాల వారీగా కెమెరా ట్రాప్‌లో చిక్కిన పులుల సంఖ్య
1. మధ్య భారతం, తూర్పు కనుమలు-1161
2. శివాలిక్ పర్వత సానువులు, గంగా మైదానం-804
3. పశ్చిమ కనుమలు- 824
4. ఈశాన్య పర్వతాలు, బ్రహ్మపుత్ర మైదానం – 194
5. సుందర్బన్స్ – 100
- రాణిపూర్ పులుల సంరక్షణ కేంద్రం, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ పులుల సంరక్షణ కేంద్రాల్లో మూడు పులులు కామన్‌గా గుర్తించారు. అందుకే పైవాటి మొత్తం 3083 వచ్చినా ఆ మూడు పులులు తీసివేసి మొత్తం 3080గా చూపించారు.
- శివాలిక్ పర్వత సానువులు, గంగా మైదానంలో అత్యధికంగా 158 పులులు పెరిగాయి. శివాలిక్, సుందర్బన్ ప్రాంతాల్లో పులుల సంఖ్య పెరగగా, మిగతా మూడు చోట్ల తగ్గాయి.
- ఆంధ్రప్రదేశ్‌లో వెంకటేశ్వర జాతీయ పార్క్‌లో, తెలంగాణలోని కవ్వాల్‌లో పులులు అంతరించినట్లు నివేదిక పేర్కొంది.
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లలో పులుల సంఖ్యను ఇదివరకున్న స్థాయికి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది.
- ఈ రాష్ర్టాల్లో పులులు తగ్గడానికి గల కారణం ఆవాసాల ఆక్రమణ, వేటాడటం, మనుషులతో ఘర్షణాత్మక వాతావరణం, అడవుల్లో అగ్నిప్రమాదాలు, పశువుల మేతను నియంత్రించకపోవడం, కలపేతర అటవీ ఉత్పత్తులను అధికంగా సాగు చేయడం, గనుల తవ్వకం, మౌలిక వసతుల విస్తరణ.
- భారతదేశంలో పులుల జనాభా 2006 నుంచి ప్రతి నాలుగేళ్లకోసారి నిర్వహిస్తున్నారు.
- ఈ బాధ్యతను National Tiger Conservation Authority (NTCA) తీసుకుంటుంది.
- దేశంలో ఇప్పటి వరకు ఐదుసార్లు పులుల జనాభాను లెక్కించారు.
- NTCA ను వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972లోని సెక్షన్ 38 L(1) ప్రకారం ఏర్పాటు చేశారు.
- ఇదే చట్టంలోని సెక్షన్ 38 L(2) ప్రకారం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి (ప్రస్తుతం భూపేంద్ర యాదవ్) NTCAకి చైర్మన్‌గా, కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి వైస్ చైర్మన్‌గా ఉంటారు.
- NTCAలో ముగ్గురు సభ్యులు ఉంటారు. దీన్ని 2005లో ఏర్పాటు చేశారు.
2018కి సంబంధించిన పులుల జనాభా స్థితి
- ఇవి నాలుగో జనాభా లెక్కలు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా 2019, జూలై 29న వీటిని ప్రధాని మోదీ విడుదల చేశారు.
- ఈ పులుల జనాభా స్థితి ప్రకారం దేశంలో 2967 పులులు ఉన్నాయి. అంటే 2014 నుంచి 2018ల మధ్య వార్షిక వృద్ధి రేటు ఆరు శాతం కాగా మొత్తం వృద్ధిరేటు 33% గా నమోదైంది.
- అత్యధిక పులులు కలిగిన రాష్ట్రం- మధ్యప్రదేశ్ (526)
- అత్యధిక పులులు కలిగిన రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం- కర్ణాటక (524)
- ఆంధ్రప్రదేశ్‌లో 48 పులులు, తెలంగాణలో 26 పులులున్నాయి.
- తెలంగాణ రాష్ట్రంలో అమ్రాబాద్, కవ్వాల్, ఆంధ్రప్రదేశ్‌లో నాగార్జున సాగర్ పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి.)
ప్రాజెక్ట్ టైగర్‌కు 50 ఏండ్లు
- దీన్నే గోల్డెన్ జూబ్లీ అంటారు. ఈ స్వర్ణోత్సవాలను 2023, ఏప్రిల్ 9న కర్ణాటకలోని మైసూరులో ప్రారంభించారు.
- ఈ ప్రాజెక్ట్ టైగర్ 2023, ఏప్రిల్ 1 నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొంది. ఈ సందర్భంగా మోదీ ప్రాజెక్ట్ టైగర్ భారత్‌కే కాకుండా ప్రపంచానికి గర్వకారణం అని పేర్కొన్నారు.
- ఈ సందర్భంగా నరేంద్రమోదీ ‘స్టేటస్ ఆఫ్ టైగర్స్-2022’ నివేదిక పులుల రక్షిత వలయాల నివేదికల ఆవిష్కరణ చేశారు.
- అలాగే మోదీ ఇంటర్నేషనల్ బిగ్‌క్యాట్ అలయన్స్ (IBCA)ను ప్రారంభించారు.
- IBCA అనేది క్యాట్ వర్గానికి చెందిన ఏడు జంతువులను రక్షించడానికి అంతర్జాతీయంగా పని చేస్తుంది.
1. పులి 2. సింహం 3. చిరుత పులి
4. మంచు చిరుత 5. చీతా
6. జాగ్వార్ 7. ప్యూమా - IBCA ద్వారా వన్యప్రాణులను సంరక్షించేందుకు అవసరమైన సాంకేతికత సాయం, అనుభవాన్ని సభ్య దేశాలు పంచుకుంటాయి.
- ఈ కార్యక్రమం కంటే ముందు నరేంద్ర మోదీ తమిళనాడు పరిధిలోని ముదుమలై అభయారణ్యంలో ఏనుగుల శిబిరాన్ని సందర్శించి ‘ఎలిఫెంట్ విస్పరర్స్’కి ఆస్కార్ అవార్డు రావడంతో ప్రాచుర్యం పొందిన బొమ్మన్, బెల్లీ దంపతులను కలిసి అభినందించారు.
- ప్రపంచ వన్యజీవి పరిరక్షణ ప్రాంతంలో 2.4% భూ భాగం భారత్‌లో కలదు.
- భారతదేశంలో 1875 నుంచి 1925 సంవత్సరాల మధ్య దాదాపు 80,000 పులులను చంపినట్లు అంచనా
- భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి 40,000 పులులు ఉండేవి.
- పులులు వేగంగా తగ్గడానికి కారణం అక్రమ వేట అని తేలింది.
- 1970లో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) పులిని అంతరించిపోతున్న జాతిగా ప్రకటించింది. దీంతో భారతదేశం 1972లో ఫారెస్ట్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను తీసుకొచ్చింది. దీంతో పులుల సంరక్షణ కార్యక్రమాలు ప్రారంభించారు.
- దీనికి కొనసాగింపుగా 1973, ఏప్రిల్ 1న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ‘ప్రాజెక్ట్ టైగర్’ను ప్రస్తుత ఉత్తరాఖండ్ లో ఉన్న ‘జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్’లో ప్రారంభించారు. ఇది కేంద్ర ప్రాయోజిత పథకం (CSS)
- ప్రాజెక్ట్ టైగర్ మొదట 18,278 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో తొమ్మిది పులుల సంరక్షణ కేంద్రాలతో ప్రారంభమై, ప్రస్తుతం 75,796 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో 53 పులుల సంరక్షణ కేంద్రాలతో నడుస్తుంది.
- మొదట అసోం, బీహార్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్లో ప్రారంభమైంది.
- రాజస్థాన్‌లో సరిస్కా పులుల సంరక్షణ కేంద్రంలో 2005లో అత్యధికంగా పులులు అంతరించిపోవడంతో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా NTCA ఏర్పాటు చేయబడింది.
- విస్తీర్ణపరంగా పెద్ద పులుల సంరక్షణ కేంద్రం- నాగార్జున సాగర్ (3296 చ.కి.మీ.)
- విస్తీర్ణపరంగా చిన్న పులుల సంరక్షణ కేంద్రం- నమేరి (అసోం, 464 చ.కి.మీ.)
- అత్యధిక పులుల సంరక్షణ కేంద్రాలు మధ్యప్రదేశ్ (6), మహారాష్ట్ర (6)లో ఉన్నాయి.
సంవత్సరం పులుల సంఖ్య
2006 1411
2010 1706
2014 2226
2018 2967
2022 3167
తాన్న రవి
ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీసర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?