Home
Study Material
Indian History – Groups Special | బంగారు పుట్టలు పెట్టే చీమలు.. అబద్ధాలెరుగని ప్రజలు
Indian History – Groups Special | బంగారు పుట్టలు పెట్టే చీమలు.. అబద్ధాలెరుగని ప్రజలు
మౌర్య సామ్రాజ్యం
ఆధారాలు
- గ్రీకు చరిత్రకారుడు జస్టిస్, చంద్రగుప్తుడు సామాన్య కుటుంబం నుంచి వచ్చాడని తెలిపారు. 6 లక్షల సైనిక బలగంతో మొత్తం భారతదేశాన్ని చంద్రగుప్తుడు ఆక్రమించుకున్నాడని ఆయన వివరించారు.
- సిరియా రాజు సెల్యూకస్, చంద్రగుప్త మౌర్యుల మధ్య యుద్ధానంతరం సత్సంబంధాల కోసం అరఖోసియా(గాంధార) ఉన్నతోద్యోగిగా ఉన్న మెగస్తనీస్ పాటలీపుత్రంలో తాను చూసిన వాటిని గురించి , విన్న వాటిని గురించి ఇండికా అనే గ్రంథంలో రాశాడు. ఈ గ్రంథం లభించకపోయినప్పటికీ దీనిలోని ఉదంతాన్ని గ్రీకు రచయితలు అయిన స్ట్రాబో, ఏరియన్, డిమొడారస్, లాటిన్ రచయిత ప్లీని(National History) మొదలైన వారి రచనలలో ఈ గ్రంథం ఉల్లేఖనాలు కనిపించాయి.
- మెగస్తనీస్ పాటలీ పుత్రాన్ని పాలింబోత్ర అని కూడా పిలుస్తారని తెలిపారు. ఈ పట్టణం గురించి ఆయన వర్ణిస్తూ తొమ్మిదిన్నర మైళ్ల నిడివి, ఒకటింబావు మైళ్ల వెడల్పుతో గంగా, సోని నదులు సంగం స్థానంలో ఉండేవని వివరించారు. నగరానికి చుట్టూ గోడ, 600 అడుగుల వెడల్పు, లోతైన కందకం, 64 ద్వారాలు, 570 బురుజులు ఉండేవని తెలిపారు.
- ఈ గ్రంథంలో నగర పాలన గురించి సైనిక మండలాల గురించి విపులంగా వర్ణించారు.
- మెగస్తనీస్ ప్రకారం నాటి సమాజంలో చేతి వృత్తుల వారు 7 వర్గాలుగా ఉండేవారు .
- ప్రజలు పొదుపరులని, ఎక్కువ మంది ఆయుధాల తయారీ, నౌకా నిర్మాణం, సముద్రాంతర వ్యాపారం చేపట్టేవారని, సమాజంలో బానిసత్వం లేదని మొదలైన అంశాలను గ్రంథంలో వివరించారు.
- నాటి భారతదేశంలో బానిస విధానం గ్రీకు బానిస విధానం కంటే సరళంగా ఉండేది. కనుకనే గ్రీకు బానిసత్వానికి, భారతీయ బానిసత్వానికి మధ్య ఉన్న తేడాను మెగస్తనీస్ గుర్తించలేక భారతదేశంలో బానిసత్వం లేదని తెలిపారు.
- ఈ గ్రంథంలో యుద్ధసమయాన యుద్ధ భూమికి సమీపంలోని రైతులను సైతం సైనికులు బాధించేవారు కాదని, వారు పంట పొలాలు ధ్వంసం చేయరని, ఒక వైపు యుద్ధం జరుగుతుండగా, మరొక వైపు రైతులు వ్యవసాయ పనులు చేస్తుండేవారని మెగస్తనీస్ తెలిపారు.
- అంతేగాక భారతదేశంలో వడ్డీ వ్యాపారం లేదని తెలిపాడు. భారతదేశంలో కరువులు లేవని కూడా మెగస్తనీస్ గ్రంథంలో రాశారు.
- నాటి భారతదేశాన్ని మెగస్తనీస్ బంగారు పుట్టలు పెట్టు చీమలు కలవు. దొంగతనం లేదు. దేశమున అబద్దాలాడు వారు లేరని రాశాడు.
- ఈ విషయాలను గ్రీకు రచయిత అయిన స్ట్రాబో అసత్యములని మెగస్తనీస్ను అబద్దాల కోరు అని పేర్కొన్నాడు.
- అయినప్పటికీ మెగస్తనీస్ రచనల్లో పాటలీపుత్ర వర్ణన, పాలన, సైనిక పాలన వంటి అంశాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి.
పురాణాలు - మౌర్యరాజుల కాలక్రమాన్ని , వీరి వంశాన్ని గురించి పురాణాలు తెలియజేస్తాయి.
- ‘మురా’ అనే స్త్రీకి నందరాజు వల్ల కలిగిన సంతానం చంద్రగుప్తుడని విష్ణుపురాణం తెలియజేస్తుంది.
- అశోకుని అనంతరం కుణాలుడు (అశోకుని కుమారుడు) రాజ్యానికి వచ్చాడని వాయుపురాణం తెలియజేస్తుంది .
- అశోకుని తర్వాత దశరథుడు (అశోకుని మనుమడు) రాజ్యానికి వచ్చాడని మత్య్సపురాణం తెలుస్తుంది.
బౌద్ధమత గ్రంథాలు - సింహళ రాజైన తిస్స అభ్యర్థన మేరకు అశోకుడు దౌత్య బృందాలను ధర్మప్రచారానికి తన కుమారుడు మహేంద్ర, కూతురు సంఘమిత్రలతో కూడిన తొమ్మిది దౌత్యబృందాలను గల ధూతలను పంపాడని బౌద్ధగ్రంథాలైన వీరవంశీ, మహావంశాలు తెలుపుతున్నాయని సింహళ ఇతిహాసక గ్రంథాలు పేర్కొన్నాయి .
- ఇవి శ్రీలంకలో బౌద్ధమత వ్యాప్తి కోసం అశోకుడు చేసిన కృషిని కూడా తెలియజేస్తున్నాయి.
- అశోకుడిని సంప్రదాయ బుద్ధుని అనుచరునిగా గుర్తిస్తూ గ్రంథాల్లో పేర్కొన్నారు.
- మహేంద్ర, సంఘమిత్ర అనే వారు అశోకుడు ఉజ్జయినిలో ఉన్నప్పుడు తను ప్రేమించిన దేవి అనే ఒక వైశ్య యువతికి పుట్టినవారు.
- బౌద్ధ జాతక కథలు మౌర్యుల కాలం నాటి ఆర్థిక, రాజకీయ పరిస్థితుల గురించి గ్రంథంలో విపులంగా రాశారు .
- దిఘనికాయ అనే బౌద్ధ గ్రంథంలో మౌర్యుల సామ్రాజ్యంపై బౌద్ధమతం ప్రభావం గురించి తెలియజేస్తున్నది, అంతేగాక కొన్ని రాజకీయ ఆలోచనలను కూడా ఇది చర్చిస్తుంది .
- వంశథాపకాశిని అనే గ్రంథంలో మౌర్యుల పుట్టుకకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తున్నది.
ముద్రారాక్షసం - ముద్రారాక్షసం అనేది ఒక నాటక గ్రంథం. దీన్ని విశాఖదత్తుడు రాశాడు. అనంతర కాలంలో దీనికి వ్యాఖ్యానం రాసినవారు దిండిరాజు.
- క్రీ.శ 9వ శతాబ్దంలో విశాఖదత్తుడు రచించిన ఈ గ్రంథంలో చంద్రగుప్తుడు కులహీనుడిగా, వృషాలుడు(వృషల అంటే ఒక ఆంధ్ర బ్రాహ్మణ వంశం. మరొక అర్థంలో చాందసుడు కాని వాడని, కులహీనుడని, సామాన్య కుటుంబం అని అర్థాలు)గా అభివర్ణించాడు.
- ఈ నాటకంలో చంద్రగుప్తుని శత్రువులకు వ్యతిరేకంగా చాణిక్యుడు చేసిన మంత్రాంగాలు వర్ణించబడ్డాయి.ఆధునిక యుగంలో ఈ నాటకం ఆధారంగా అనేక నాటకాలు వచ్చాయి.
- ఇవే కాకుండా టిబెట్ చరిత్రకారుడైన 16 వ శతాబ్దానికి చెందిన రామా తారనాథ్ మౌర్యుల చారిత్రాత్మక సాంప్రదాయాలను తెలిపే సమాచారాన్ని తన గ్రంథంలో పేర్కొన్నారు.
- దివ్యవదన అనే టిబెట్ గ్రంథం అశోకుని బౌద్ధమత వ్యాప్తికి చేసిన కృషిని, అతని ధర్మయాత్రల గురించి తెలియజేస్తుంది.
- క్రీ.శ 12వ శతాబ్దంలో హేమచంద్రుడు జైనమత సాహిత్యం కోసం రాసిన పరిశిష్ట పర్వాన్లో చంద్రగుప్తు మౌర్యుడు జైనమతంలోకి మారడాన్ని తెలిపే సమాచారం ఉంది.
- డైమకస్ అనే గ్రీకు రాయబారి డియోనిసియోస్ అను ఈజిప్టు రాయబారి రచనల వలన బిందుసారుని కాలం నాటి మౌర్య చరిత్ర తెలియజేస్తుంది ,
- అశోకుని మనుమడైన దశరథుడి శాసనం, నాగార్జుని పర్వత గృహ శాసనాలు, క్రీ.శ 150 నాటి రుద్రదాముని జునాగఢ్ శాసనం మౌర్యుల చరిత్రను వివరిస్తుంది.
మౌర్యరాజ్య స్థాపన - చంద్రగుప్తుడు మౌర్యవంశ స్థాపకుడు. ఆయన ధననందున్ని ఓడించి క్రీ.పూ. 321 లో మగధ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈ మహత్తర కార్యసాధనలో చాణిక్యుడు లేదా కౌటిల్యుడు అనే బ్రాహ్మాణ పండితుడు చంద్రగుప్తునికి తోడై నిలిచాడు.
- చంద్రగుప్తుడు మురా అనే స్త్రీకి నందరాజు వల్ల కలిగిన సంతానం అని, అందువల్ల ఈ వంశానికి మౌర్యవంశం అని పేరు వచ్చిందని ఒక కథనం విష్ణుపురాణంలో ఉంది .
- ముద్రారాక్షసంలో చంద్రగుప్తున్ని కులహీనుడిగా, వృషలుడిగా వర్ణించారు. (వృషలుడు అనగా శూద్రుడని, రాజుల్లో పెద్దవాడని ,చాందస్తుడు కానివాడని అర్థాలు)
- బౌద్ధమత గ్రంథమైన మహావంశ, జైన గ్రంథమైన పరిశిష్ట పర్వ మౌర్యులను క్షత్రియులుగా పేర్కొన్నాయి.
- చంద్రగుప్తుడు సామాన్య కుటుంబానికి చెందినవాడని గ్రీక్ చరిత్రకారుడు జస్టిస్ తెలిపారు.
- బౌద్ధగ్రంథాల ప్రకారం పిప్పిలివన ప్రాంతపు మౌర్యులు బుద్ధుని అస్థికలు పొందారని ప్రశస్తి. దీన్ని బట్టి క్రీ.పూ 6వ శతాబ్దంలో మౌర్యులు పిప్పిలివన ప్రాంతంలో గణరాజ్యాన్ని పాలించారని, అయితే కాలక్రమేణా వింధ్యా ప్రాంతంలోని మయూర పోషకుల తెగకు అధిపతులుగా మిగిలారు.
- బౌద్ధ గ్రంథమైన వంశీథాపకాశిని గౌతమ బుద్ధ వంశానికి చెందిన శాక్య క్షత్రియులకు మౌర్య వంశానికి దగ్గర సంబంధం ఉందని తెలిపారు.
- దీని ప్రకారం మౌర్యులు వచ్చిన ప్రాంతమంతా మయూరాలతో నిండి ఉందని, కాబట్టి వారికి మౌర్యులనే పేరు వచ్చిందని తెలియజేస్తున్నది .
- చంద్రగుప్తుడు సాధించిన ఘనకార్యాలు రెండు(2). అవి
1. వాయవ్య భారతదేశాన్ని గ్రీకుల నుంచి స్వాధీన పరుచుకోవడం
2. నందరాజులను ఓడించి మగధను ఆక్రమించడం - క్రీ.పూ 305లో భారతదేశంపై సెల్యూకస్ (సిరియా రాజు అనే బిరుదాంకితుడు) దండెత్తగా చంద్రగుప్తుడు అతన్ని ఓడించి సంధికి ఒప్పించాడు. ఈ సంధి ప్రకారం మెగస్తనీస్ను రాయబారిగా మౌర్యుల కొలువుకు పంపగా అతను ఇండికా అనే గ్రంథాన్ని రచించాడు. ఈ సంధిని అనుసరించిన చంద్రగుప్తుడు సెల్యుకస్ నుంచి గెడ్రోసియ, అరికోసియ, అరియ, పరోపమిసాదె లను జయించాడు.
- చంద్రగుప్తుడు 6లక్షల సైన్యంతో భారతదేశమంతటినీ జయించాడని ప్లూటార్క్ అనే చరిత్రకారుడు రాశాడు.
- శకరుద్రదాముని జునాగఢ్ శాసనాన్ని బట్టి సౌరాష్ట్రం (గుజరాత్) చంద్రగుప్తుని సామ్రాజ్యంలో ఒక రాష్ట్రమైనట్లు తెలుస్తుంది.
- చంద్రగుప్తుని సౌరాష్ట్ర గవర్నర్ అయిన పుష్యగుప్తుడు సుదర్శన తటాకాన్ని తవ్వించాడు.
- జైనమత గ్రంథమైన పరిశిష్ట నిర్వాణ్ ప్రకారం చంద్రగుప్తుడు రాజ్యాన్ని తన కుమారుడైన సింహసేనునికి (బిందుసారుడు)రాజ్యాధికారాన్ని అప్పజెప్పి భద్రబాహుతో కర్నాటకలోని శ్రావణబెల్గోలకు వెళ్లి అక్కడ సల్లేఖన వ్రతం ఆచరించి మరణించినట్లు తెలుస్తుంది.
- శ్రావణ బెల్గాలిలో గోమటేశ్వర విగ్రహం జైనమత భంగిమలో ఉంది. దీనిని గంగరాజ వంశస్థులైన చామూండరాయ క్రీ.శ. 9వ శతాబ్దం రెండవ అర్ధభాగంలో ఈ విగ్రహం నిర్మించాడు.
- ఏకశిలతో చేయబడ్డ ఈ విగ్రహం దాదాపు 56 అడుగుల ఎత్తు ఉన్నది .
- ఈ విగ్రహం నిలబడ్డ విధానాన్ని బట్టి కాయతో సర్గీ విధానంలో ఉన్నట్లు వాస్తుపరంగా తెలిపారు. ఇక్కడే 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభాభిషేకం జరుగుతుంది.
- చంద్రగుప్తుని రాజ్యం పశ్చిమాన పర్షియా నుంచి తూర్పున బిహార్ వరకు, దక్షిణాన తిరునల్వేలి వరకు విస్తరించి ఉంది. దీనిని బట్టి చంద్రగుప్తుని సామ్రాజ్యం కశ్మీర్, కళింగ, తమిళనాడు తప్ప మిగిలిన భారతదేశమంతా విస్తరించి ఉందని తెలుస్తుంది .
- చంద్రగుప్తుడు క్రీ.పూ 300 ప్రాంతంలో తన రాజ్యకాలపు చివరి సంవత్సరంలో ఉత్తర భారతదేశంలో తీవ్రమైన కరువు రాగా రాజ్యపరిత్యాగం చేసి, రాజ్యాన్ని తన కుమారుడైన బిందుసారునికి అప్పగించి, జైన సంప్రదాయం ప్రకారం జైనమతాచార్యుడైన భద్రీవాహుడిని అనుసరించి శ్రావణ బెల్గోల వెళ్లి సల్లేఖను వ్రతాన్ని పాటించి, దేహాన్ని చాలించాడు.
- చంద్రగుప్తుడు సువిశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించడమే కాక, సువ్యవస్థితమైన పరిపాలనా విధానాన్ని ఏర్పాటు చేశాడనే విషయం కౌటిల్యుని అర్థశాస్త్రం ద్వారా తెలుస్తుంది . అంతేకాకుండా మౌర్య సామ్రాజ్యానికి బలమైన ఆర్థిక పునాదిని కూడా కల్పించాడని తెలియజేస్తుంది .
- పాటలీపుత్ర నగరంలో నగర పాలన, సైన్య నిర్వహణలో వికేంద్రీకరణ పద్దతులను ప్రవేశపెట్టడం మౌర్య చంద్రగుప్తుని కాలంలోని ప్రత్యేకాంశాలు .
- గ్రీకు రచయితలు చంద్రగుప్తున్ని శాండ్రో కొట్టోస్గా పేర్కొన్నారు.
బిందుసారుడు - చంద్రగుప్తుని కుమారుడైన బిందుసారుడు తండ్రి విధానాలను, లక్ష్యాలను అనుసరించాడు. ఇతనిని గ్రీకు గ్రంథాలు అమిత్రఖేట్సు( అమిత్ర ఘాత= శత్రు భక్షకుడు, శత్రు విధ్వంసకుడు) అనే బిరుదుతో ప్రశంసించాయి. బిందుసారునికి సింహసేనుడు అనే పేరు కూడా కలదు.
- బిందుసారుని ఆస్థానంలో పింగళి వాస్తవ అనే అజీవక జ్యోతిష్యడు ఉన్నాడు. దీనిని బట్టి బిందుసారుడు అజీవకుని పట్ల ఎక్కువ ఆదరణ వహించాడని తెలుస్తోంది .
మాదిరి ప్రశ్నలు
1. చంద్రగుప్త మౌర్యుడు జైన మతంలోకి చేరాడని తెలియజేసే గ్రంథం? (ఎ)
ఎ. పరిశిష్ట పర్వాన్ బి. అర్థశాస్త్రం
సి. ముద్ర రాక్షసం డి. దివ్యావధన
2. సిరియా రాజు ఆంటియేఖస్, ఈజిప్టు రాజు టాలమీ ఫిలడెల్పస్లు తమ రాయబారులను ఏ మౌర్య చక్రవర్తి ఆస్థానానికి పంపారు? (బి)
ఎ. అశోకుడు బి. బిందుసారుడు
సి. చంద్రగుప్తు మౌర్యుడు
డి. దశరథుడు
3. బౌద్ధ భిక్షువు దుస్తుల్లో ఉన్న అశోకుడి శిలా విగ్రహాన్ని చూసినట్లు ఏ చైనా యాత్రికుడు పేర్కొన్నాడు? (సి)
ఎ. ఫాహియాన్ బి. హుయాన్త్సాంగ్
సి. ఇత్సింగ్ డి. తారానాథ్
4. అశోకుడు ఎవరి అధ్యక్షతన మూడవ బౌద్ధ సంగీతిని నిర్వహించారు? (ఎ)
ఎ. మొగలి పుత్రతిస్స
బి. అశ్వ ఘోషుడు
సి. దేవపాల క్షత్రియ డి. బోధి ధర్మ
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు