Current Affairs – TSPSC Exams Special | ‘తలసిరి’లో నంబర్ వన్ – ‘జలసిరి’లో నంబర్ త్రీ
1. ఈ ఏడాది యోగా దినోత్సవ ఇతివృత్తం ఏంటి? (3)
1) ఆరోగ్య యోగం
2) ఆరోగ్యం మహా భాగ్యం
3) వసుదైక కుటుంబం కోసం యోగా
4) మన యోగా మన ఆరోగ్యం
వివరణ: ఏటా జూన్ 21న యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది వసుదైక కుటుంబం కోసం యోగా అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐక్యరాజ్య సమితిలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహించారు. అలాగే హైదరాబాద్‌లోని కన్హా శాంతి వనంలో 3000 మంది దివ్యాంగులు యోగా నిర్వహించారు. 16 రాష్ర్టాలకు చెందిన దివ్యాంగులు ఇందులో పాల్గొన్నారు. వీళ్లు వేర్వేరు 21 రుగ్మతలతో ఇబ్బందులు పడుతూ ఉన్నవారు. ఇంతమంది దివ్యాంగులు ఒకే చోట యోగా చేయడం అనేది వండర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.
2. సాజిద్ మిర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా, భద్రతా మండలిలో అడ్డుకున్న దేశం? (4)
1) రష్యా 2) పాకిస్థాన్
3) అమెరికా 4) చైనా
వివరణ: 26/11 ఘటనలో కీలక సూత్రధారి అయిన సాజిద్ మిర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భద్రతా మండలిలో అమెరికా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని చైనా సాంకేతికంగా నిలుపుదల చేసింది. మరో ఆరు నెలల పాటు ఈ అంశం చర్చకు రాకుండా అడ్డుకోవడాన్నే భద్రతా మండలిలో సాంకేతిక నిలుపుదల అంటారు. సాజిద్ మిర్‌పై ఈ తరహా నిర్ణయం చైనా తీసుకోవడం ఇది తొలిసారి కాదు. గతేడాది కూడా భారత్, అమెరికా సంయుక్తంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా అప్పుడు కూడా చైనా అడ్డుకుంది.
3. యూఎన్డీపీ, డీఏవై-ఎన్యూఎల్ఎం ఇటీవల భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. దీని లక్ష్యం ఏంటి? (3)
1) గృహాల నిర్మాణం
2) మురికి వాడలు లేకుండా చేయడం
3) వ్యవస్థాపకులుగా మార్చడం
4) పర్యావరణ మెరుగు
వివరణ: న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే సంస్థ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం. ఈ సంస్థ దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన-నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. వ్యవస్థాపన రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించింది ఇది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ఎలక్ట్రిక్ వాహన రంగం, వృథా నిర్వహణ, ఆహార ప్యాకేజింగ్ తదితర రంగాల్లో పెట్టుబడుల ద్వారా మహిళలను వ్యవస్థాపకులుగా మార్చడం ప్రధాన ఉద్దేశం. మూడు సంవత్సరాల పాటు ఈ భాగస్వామ్యం కొనసాగనుంది.
4. ‘35.3 మిలియన్లు’ దేనికి సంబంధించింది? (1)
1) 2022 చివరి నాటికి శరణార్థులు
2) ఈ ఏడాది పెరిగిన భారత ఆదాయం
3) కరోనా సమయంలో చేసిన అప్పు
4) పైవేవీ కావు
వివరణ: 2022 చివరి నాటికి 35.3 మిలియన్ల మంది శరణార్థులుగా ఉన్నారని యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ పేర్కొన్నది. గతేడాదితో పోలిస్తే శరణార్థుల సంఖ్య ఎనిమిది మిలియన్లు పెరిగిందని సంస్థ వెల్లడించింది. జెనీవా కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తుంది. మొత్తం శరణార్థుల్లో 52% మంది ఉక్రెయిన్, సిరియా, అఫ్గానిస్థాన్ దేశాల నుంచే ఉన్నారని గణాంకాలు సూచిస్తున్నాయి. ఉక్రెయిన్‌లో 6.5 మిలియన్ల మంది శరణార్థులుగా మారారని, యుద్ధమే ఇందుకు కారణం అని పేర్కొంది. అఫ్గానిస్థాన్, సిరియా దేశాల్లో అంతర్యుద్ధం మూలంగా వరుసగా 5.7 మిలియన్లు, 6.5 మిలియన్ల మంది ఆశ్రయాన్ని కోల్పోయారని వెల్లడించింది.
5. ‘హై సీస్’ ఒప్పందం సంతకాలు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి? (4)
1) సెప్టెంబర్ 21 2) అక్టోబర్ 2
3) అక్టోబర్ 24 4) సెప్టెంబర్ 20
వివరణ: హై సీస్ ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన ఒప్పందాన్ని జూన్ 19న ఐక్యరాజ్య సమితిలోని 193 దేశాలు అంగీకరించాయి. దీనికి సంబంధించి సెప్టెంబర్ 20 నుంచి సంతకాలు ప్రారంభం కానున్నాయి. కనీసం 60 దేశాలు ఆమోదించిన తర్వాత అమల్లోకి వస్తుంది. తీరం కలిగిన ఏ దేశం నుంచి అయినా 200 నాటికల్ మైళ్ల వెలుపల ఉన్న సముద్ర భాగాన్ని హై సీస్ అంటారు. భూమి ఉపరితలంపై దాదాపు 50% ఉండే ఈ ప్రాంతంలో జీవ వైవిధ్యం కాపాడుకోవాలన్న అంశంపై 20 సంవత్సరాలుగా చర్చలు సాగిస్తున్నారు. ఇన్నాళ్ల తర్వాత సాకారం కానుంది.
6. ఐఎన్ఎస్ కిర్పాణ్‌ను భారత్ ఏ దేశానికి బహుమతిగా ఇచ్చింది? (3)
1) కాంబోడియా 2) ఇండోనేషియా
3) వియత్నాం 4) థాయిలాండ్
వివరణ: స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ కిర్పాణ్ అనే క్షిపణిని వియత్నాం దేశానికి భారత్ బహుమతిగా ఇవ్వనుంది. వియత్నాం నావికా దళాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించింది ఇది. భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వియత్నాం రక్షణ శాఖ మంత్రి ఫన్ వాన్గాంగ్ మధ్య చర్చల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. తీర భద్రతతో పాటు రక్షణ రంగానికి సంబంధించి పలు అంశాల్లో పరస్పరం సహకరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఐఎన్ఎస్ కిర్పాణ్‌ను 1991, జనవరి 12న భారత నావికా దళంలోకి ప్రవేశపెట్టారు.
7. ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన అధికరణం? (1)
1) 44 2) 45 3) 34 4) 42
వివరణ: రాజ్యాంగంలోని నాలుగో భాగంలో ఆదేశిక సూత్రాల్లో ఉన్న 44వ అధికరణం ఉమ్మడి పౌరస్మృతి గురించి చెబుతుంది. దేశంలో గోవా మినహా మరెక్కడా ఇది అమలు కావడం లేదు. ఇటీవల కాలంలో ఈ అంశం చర్చలోకి వచ్చింది. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని 22వ న్యాయ కమిషన్ నిర్ణయించింది. ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు వేర్వేరు తీర్పులను కూడా గతంలో వెలువరించింది. షాబాను, సైరాబాను, సరళ ముద్గల్ తదితర కేసులు ఈ అధికరణానికి సంబంధించినవే. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని ఆయా కేసుల తీర్పుల్లో భాగంగా న్యాయ స్థానం సూచించింది.
8. ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’లో మియావాకి పద్ధతి గురించి ప్రస్తావించారు. ఇది దేనికి సంబంధించింది? (2)
1) పిల్లల్లో విద్యకు సంబంధించింది
2) అడవుల పునరుద్ధరణ
3) క్రీడాంశం 4) ఏదీకాదు
వివరణ: అడవుల పునరుద్ధరణకు సంబంధించి మియావాకి అనే వ్యక్తి 1970 దశకంలో ప్రవేశపెట్టిన విధానాన్నే మియావాకి పద్ధతి అంటారు. మానవ చర్యల మూలంగా కోల్పోయిన అడవులను ఈ పద్ధతి ద్వారా వేగంగా తిరిగి పొందే అవకాశం ఉంటుంది.
9. ఏ రాష్ట్రంలో 37వ జాతీయ క్రీడలను నిర్వహించనున్నారు? (3)
1) పంజాబ్ 2) ఒడిశా
3) గోవా 4) ఆంధ్రప్రదేశ్
వివరణ: 37వ జాతీయ క్రీడలు గోవాలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన మస్కట్‌ను గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ జూన్ 18న ఆవిష్కరించారు. 36వ జాతీయ క్రీడలు గుజరాత్లో జరిగాయి. దేశంలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి వీటిని నిర్వహిస్తారు. జాతీయ క్రీడలను నిర్వహించాలని 1920లో తొలిసారి సూచించింది దొరాబ్జి టాటా.
10. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు ఐక్యరాజ్య సమితి ఇటీవల భారత్‌కు చెందిన ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? (1)
1) నీతి ఆయోగ్
2) జాతీయ అభివృద్ధి మండలి
3) జీఎస్టీ మండలి
4) కేంద్ర ఆర్థిక-పర్యావరణ మంత్రిత్వ శాఖలు
వివరణ: సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు ఐక్యరాజ్య సమితి, నీతి ఆయోగ్ కలిసి పనిచేయనున్నాయి. 2023-27 కాలానికి ఇది వర్తిస్తుంది. లక్ష్యాల సాధన ఈ ఒప్పందం ద్వారా వేగవంతం కానుంది. మొత్తం ఇవి 17 ఉన్నాయి. ఉపలక్ష్యాలతో కలిపి 169 ఉంటాయి. జాతీయ లక్ష్యాలు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఏకరూపకత తీసుకొచ్చేందుకు కూడా ఈ ఒప్పందం ఉపయోగపడనుంది.
11. ఏ రాష్ట్రంలో అతిపెద్ద సహజమైన ఆర్చ్‌ను గుర్తించారు? (2)
1) మేఘాలయ 2) ఒడిశా
3) పశ్చిమబెంగాల్ 4) అసోం
వివరణ: దేశంలో అత్యంత పెద్దదైన సహజ ఆర్చ్‌ను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఇది ఒడిశాలోని సుందర్ఘర్ జిల్లాలో ఉంది. దీన్ని దేశపు జియో హెరిటేజ్ సైట్ జాబితాలో చేర్చాలంటూ ప్రతిపాదనను కూడా పంపింది. ఇది 184 నుంచి 160 మిలియన్ సంవత్సరాలకు పూర్వం ఏర్పడినట్లు భావిస్తున్నారు. అడుగు భాగంలో 12 మీటర్లు, ఉపరితలంలో 30 మీటర్ల ఎత్తులో ఉంది. భౌగోళిక పరంగా అత్యంత కీలకమైన నిర్మాణాలనే జియోలాజికల్ హెరిటేజ్ సైట్ల జాబితాలో చేర్చుతారు.
12. లాయిడ్స్ అనే సంస్థ ఏ రంగానికి సంబంధించింది? (3)
1) రియల్ ఎస్టేట్ 2) క్రీడా సామగ్రి
3) బ్యాంకింగ్ 4) బీమా
వివరణ: లాయిడ్స్ అనేది ప్రసిద్ధ బ్యాంకింగ్ రంగ సంస్థ. తెలంగాణలో సాంకేతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ రాష్ట్రంలో వ్యాపార అనుకూలతలు, అత్యంత నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు సంస్థ పేర్కొంది. ఇది బ్రిటిష్‌కు చెందిన బ్యాంక్. 1765లో ఏర్పాటు చేశారు. యూకేలో బర్మింగ్‌హాం కేంద్రంగా ఇది పనిచేస్తుంది. 2023 డిసెంబర్‌లోపు ఇది తన కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. సాంకేతికంగా అత్యున్నతంగా ఉండే దాదాపు 600 మంది ఇందులో పనిచేయనున్నారు.
13. రూ.3,08,732 అనే సంఖ్య వార్తల్లో ఉంది. ఇది దేనికి సంబంధించింది? (2)
1) తెలంగాణ ఆదాయం
2) తెలంగాణ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం
3) తెలంగాణలో ఒక ఏడాదిలో పెరిగిన ఆదాయం 4) తెలంగాణ జీఎస్డీపీ
వివరణ: దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని పదేళ్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధి నివేదిక వెల్లడించింది. ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.3,08, 732గా ఉంది. 16 రాష్ర్టాలకు సంబంధించిన సమాచారాన్ని ఇందులో పొందుపర్చారు. 2014-15 సంవత్సరంలో, తెలంగాణ ఏర్పడినప్పుడు తలసరి ఆదాయం పరంగా పదో స్థానంలో ఉన్న రాష్ట్రం తాజాగా తొలిస్థానానికి చేరుకుంది. 2014-23 కాలంలో తలసరి ఆదాయ సగటు వృద్ధి రేటు 12.1% ఉంది.
14. జాతీయ జల అవార్డుల్లో ఉత్తమ జిల్లా విభాగంలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణ జిల్లా? (4)
1) భద్రాద్రి కొత్తగూడెం 2) రంగారెడ్డి 3) మెదక్ 4) ఆదిలాబాద్
వివరణ: జలవనరుల సంరక్షణ ప్రోత్సహించడంలో భాగంగా అందుకు కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలు, రాష్ర్టాలకు కేంద్రం జలశక్తి అవార్డులను ప్రకటించింది. ఇందులో మధ్యప్రదేశ్ తొలి స్థానంలో, ఒడిశా రెండో స్థానంలో ఉన్నాయి. ఉత్తమ జిల్లా విభాగంలో తెలంగాణకు చెందిన ఆదిలాబాద్ మూడో స్థానంలో ఉంది. గ్రామ పంచాయతీ విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జగన్నాథపురం తొలి స్థానంలో ఉంది. క్యాంపస్‌ల విభాగంలో హైదరాబాద్‌లోని మౌలానా నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ రెండో స్థానంలో నిలిచింది.
15. 2021 గాంధీ శాంతి బహుమతిని గెలుచుకున్న సంస్థ? (3)
1) ఇస్రో 2) నీతి ఆయోగ్
3) గీతాప్రెస్ 4) సీఎస్ఐఆర్
వివరణ: 2021 గాంధీ శాంతి బహుమతిని గీతా ప్రెస్‌కు ప్రకటించారు. ఈ సంస్థ గోరక్‌పూర్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థను 1923లో ఏర్పాటు చేశారు. జయ దయాళ్ గోయంకా, ఘన్‌శ్యాం దాస్ జలాన్ ఈ సంస్థ వ్యవస్థాపకులు. హిందూ మత పుస్తకాల ప్రచురణలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా దీన్ని చెప్పుకోవచ్చు. గాంధీ శాంతి బహుమతిని 1995లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ సంవత్సరం మహాత్మాగాంధీ 125వ జయంతి. అవార్డులో భాగంగా రూ.కోటి ఇస్తారు. తాజాగా గీతాప్రెస్ అవార్డును మాత్రమే స్వీకరిస్తామని, నగదు తీసుకోవడం తమ సంస్థ నిబంధనలకు విరుద్ధం అని పేర్కొంది.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
21st సెంచరీ ఐఏఎస్
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?