Current Affairs | ‘కాల్ బిఫోర్ యూ డిగ్’ అనే యాప్ దేనికి సంబంధించింది?
1. కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి? (3)
ఎ. బ్రిక్స్ బ్యాంక్‌లో ఈజిప్ట్ చేరింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 22న వెలువడింది
బి. బ్రిక్స్ బ్యాంక్‌కు దిల్మా రౌసెఫ్ నేతృత్వం వహించనున్నారు
1) ఎ 2) బి 3) రెండూ సరైనవే
4) రెండూ సరికావు
వివరణ: ఆఫ్రికా ఖండానికి చెందిన ఈజిప్ట్ బ్రిక్స్ బ్యాంక్‌లో చేరింది. ఈ మేరకు మార్చి 22న నోటిఫికేషన్ వెలువడింది. చైనాలోని షాంఘై కేంద్రంగా ఈ బ్యాంక్ పనిచేస్తుంది. భారత్, రష్యా, బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు కలిసి ఈ బ్యాంక్‌ను ఏర్పాటు చేశాయి. దీన్ని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని కూడా పిలుస్తారు. బ్రిక్స్ కూటమికి చెందిన నాలుగో సమావేశంలో బ్యాంక్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశం న్యూఢిల్లీలో 2012లో జరిగింది. అలాగే ఈ బ్యాంకుకు దిల్మా రౌసెఫ్ నేతృత్వం వహించనున్నారు. ఆమె బ్రెజిల్ దేశానికి చెందినవారు. ఆ దేశానికి అధ్యక్షురాలిగా పనిచేసిన తొలి మహిళ ఆమె. అవినీతి ఆరోపణలతో అభిశంసనకు గురయ్యారు.
2. ఎంపీ ల్యాడ్స్ పథకంలో ఇటీవల చేసిన మార్పులు ఏవి? (4)
1) ఈ నిధులను వినియోగించి ఎంపిక చేసుకొనే ప్రాజెక్టులపై ఎంపీలకు మరింత స్వేచ్ఛను ఇచ్చారు
2) నిధుల విడుదల వరకు వేచి ఉండకుండా, ఏటా పరిమితులతో కూడిన మొత్తాన్ని విడుదల చేస్తారు
3) పథకం అమలులో అన్ని భాగస్వామ్య వ్యవస్థలు, నిధులను ట్రాక్ చేసే అవకాశం కల్పిస్తారు
4) పైవన్నీ సరైనవే
వివరణ: ఎంపీ ల్యాడ్స్‌ను విస్తరిస్తే- మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీం. ఈ పథకంలో భాగంగా ప్రతి ఎంపీకీ ఏటా రూ.5 కోట్లు తమ నియోజకవర్గ అభివృద్ధికి కేటాయిస్తారు. పథకం తీరులో పలు మార్పులు చేశారు. అవి ఎంపీ ల్యాడ్స్‌ను ఉపయోగించి చేపట్టే కొత్త పనుల్లో ఎంపీలకు స్వేచ్ఛను కల్పించారు. అయితే ఆయా ప్రాజెక్టులు ప్రజలకు ఉపయోగపడే ఆస్తులను సృష్టించాలి. అలాగే నిధుల విడుదల వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. సంవత్సరంలో డ్రా చేసుకొనే మొత్తాన్ని పలు పరిమితులతో అందిస్తారు. అలాగే నిధుల ప్రవాహానికి సంబంధించి పథకం అమలులో భాగస్వాములు అయిన అందరూ ట్రాక్ చేసేందుకు వీలు కల్పించనున్నారు.
3. కింది వాటిలో ఏ రాష్ట్రంలో ఆరావళి హరిత గోడ ప్రాజెక్ట్ లేదు? (3)
1) రాజస్థాన్ 2) గుజరాత్
3) పంజాబ్ 4) ఢిల్లీ
వివరణ: భూ అథోకరణం, ఎడారికీకరణ కాకుండా ఆరావళి హరిత గోడ ప్రాజెక్టును కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ చేపట్టింది. ఇది హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీల్లో ఆరు మిలియన్ హెక్టార్లు విస్తరించి ఉంటుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 75 జల వ్యవస్థలను కూడా పునరుద్ధరించనున్నారు. స్థానిక వృక్ష జాతులను పరిరక్షిస్తారు. వ్యవసాయ అటవీ అంశాలపై దృష్టి సారిస్తారు. అలాగే స్థానికులకు జీవనోపాధి లభించేలా కూడా విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందుకు సొసైటీ ఫర్ జియోఇన్ఫర్మాటిక్స్ అండ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్, ఐఎం గుర్గావ్ అనే మరో స్వచ్ఛంద సంస్థ సహకారాన్ని కూడా తీసుకోనున్నారు.
4. ఉమెన్ ప్రీమియర్ లీగ్‌ను ఏ జట్టు గెలుచుకుంది? (2)
1) ఢిల్లీ క్యాపిటల్స్
2) ముంబై ఇండియన్స్
3) యూపీ వారియర్స్
4) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
వివరణ: ఉమెన్ ప్రీమియర్ లీగ్‌ను ముంబై ఇండియన్స్ జట్టు గెలుచుకుంది. తుదిపోరులో డిల్లీ క్యాపిటల్స్ జట్టును ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ టోర్నీ మార్చి 4 నుంచి 26 వరకు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న జట్లు- ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, గుజరాత్ జెయింట్స్. టోర్నీలో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకుంది మెగ్ లానింగ్. ఆమె ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్. ఆస్ట్రేలియా జట్టు క్రికెటర్. అలాగే అత్యధిక వికెట్లు తీసుకొని పర్పుల్ క్యాప్‌ను హేలీ మాథ్యూస్ సొంతం చేసుకుంది. ఆమె వెస్టిండీస్ జట్టు క్రీడాకారిణి.
5. ప్రధానమంత్రి ఉజ్వల యోజనను ఎంత కాలం పొడిగించారు? (1)
1) ఒక సంవత్సరం
2) రెండు సంవత్సరాలు
3) మూడు సంవత్సరాలు
4) నాలుగు సంవత్సరాలు
వివరణ: ఎల్పీజీ సిలిండర్లకు రాయితీ ఇచ్చేందుకు ఉద్దేశించిన ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను మరో సంవత్సరం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్‌కు పేదలకు రూ.200 రాయితీ ఇవ్వనున్నారు. ఒక సంవత్సరంలో 12 సిలిండర్లకు ఇది వర్తిస్తుంది. దీనివల్ల 9.6 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. ఇందుకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వంపై పడనున్న భారం రూ.7680 కోట్లు.
6. ఈశాన్య రాష్ర్టాల్లో తొలి సీతాకోక చిలుకల పార్కును ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? (3)
1) అరుణాచల్ ప్రదేశ్ 2) మిజోరం
3) త్రిపుర 4) మణిపూర్
వివరణ: దక్షిణ త్రిపుర జిల్లాలో సీతాకోక చిలుకల పార్కును ఏర్పాటు చేశారు. భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుకు దగ్గరగా, చొట్టఖోలా అనే ప్రాంతంలో ఇది ఉంది. ఇప్పటికే ఉన్న త్రిష్నా అభయారణ్యానికి ఇది సమీపంలో ఉంది.
7. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్-2023ని ఏ నగరంలో నిర్వహించారు? (4)
1) ముంబై 2) పుణె
3) భువనేశ్వర్ 4) ఢిల్లీ
వివరణ: మార్చి 15 నుంచి 26 వరకు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్‌ను న్యూఢిల్లీలో నిర్వహించారు. రష్యా, బెలారస్ దేశాలు కూడా పాల్గొనడాన్ని నిరసిస్తూ అమెరికా, ఫ్రాన్స్ వంటి పలు అగ్రదేశాలు ఈ పోటీని బహిష్కరించాయి. పతకాల పట్టికలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. నాలుగు బంగారు పతకాలను కైవసం చేసుకుంది. మూడు బంగారు పతకాలతో చైనా రెండో స్థానంలో ఉంది. భారత్ నుంచి నీతుగంగాస్ (48 కేజీలు), స్వీటీ బూరా (81కేజీ), లవ్లీనా బోర్గేహెయిన్, నిఖత్ జరీన్ బంగారు పతకాలను సాధించారు. పోటీలను ఢిల్లీలోని కేడీ జాదవ్ స్టేడియంలో నిర్వహించారు.
8. ప్రపంచంలోని ఎంత శాతం మందికి సురక్షిత తాగునీరు లేదని ఇటీవల ఒక నివేదికలో యూఎన్వో తెలిపింది? (1)
1) 26% 2) 50% 3) 16% 4) 36%
వివరణ: ప్రపంచంలో 26% మంది ప్రజలకు సురక్షిత తాగునీరు అందడం లేదని యునెస్కో ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. మార్చి 22 నుంచి 24 వరకు న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా నివేదికను విడుదల చేశారు. ప్రపంచ జనాభాలో 46% మందికి సరైన పారిశుద్ధ్య సౌకర్యలు లేవని ఇందులో పేర్కొన్నారు. నీటికి సంబంధించి ఇది రెండో సదస్సు. గతంలో అర్జెంటీనాలో 1977లో నిర్వహించారు.
9. ‘కాల్ బిఫోర్ యూ డిగ్’ అనే యాప్ దేనికి సంబంధించింది? (3)
1) భూ అంతర్గత పరిశోధన
2) భూమిలోని ఖనిజాల అన్వేషణ
3) భూ అంతర్గత ఆస్తుల పరిరక్షణ
4) పైవేవీ కాదు
వివరణ: భూమిలోపలుండే ఫైబర్ కేబుల్స్‌తో పాటు ఇతర ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ కాల్ బిఫోర్ యూ డిగ్ అనే యాప్‌ను ఆవిష్కరించారు. అలాగే 6జీని కూడా 2030 నాటికి అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. కాల్ బిఫోర్ యూ డిగ్ అనే యాప్ ద్వారా వివిధ ప్రభుత్వ వ్యవస్థల మధ్య సమన్వయాన్ని నెలకొల్పేందుకు తీసుకొచ్చింది. ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా భూ తవ్వకానికి సంబంధించించి అయితే అక్కడ ఉండే ఇతర కేబుల్స్ లేదా నీటి పైప్లైన్లకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఈ తరహా సమన్వయం లేకపోవడం మూలంగా ఏటా రూ.3000 కోట్లు వృథా అవుతున్నాయి.
10. ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ వర్క్ నాలుగు అంశాల ఆధారంగా సమావేశం జరిగింది. ఇందులో భారత్ ఏ అంశంలో పాల్గొనలేదు? (1)
1) వాణిజ్యం 2) సప్లయ్ చైన్
3) పరిశుభ్ర ఆర్థిక వ్యవస్థ
4) న్యాయమైన ఆర్థిక వ్యవస్థ
వివరణ: ఐపీఈఎఫ్ విస్తరణ రూపం- ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ వర్క్. ఈ వ్యవస్థకు సంబంధించిన సమావేశం ఇండోనేషియాలోని బాలిలో మార్చి 13 నుంచి 19 వరకు నిర్వహించారు. ఇందులో 14 దేశాలు పాల్గొన్నాయి. ఐపీఈఎఫ్‌కు సంబంధించిన నాలుగు మూలస్తంభ అంశాలు ఉన్నాయి. అవి వాణిజ్యం, సప్లయ్ చైన్, పరిశుభ్ర ఆర్థిక వ్యవస్థ (పర్యావరణానికి హాని లేకుండా), న్యాయమైన ఆర్థిక వ్యవస్థ (పన్నులకు సంబంధించింది, అలాగే అవినీతి రహితంగా) అంశాలపైన చర్చలు జరిగాయి. ఇందులో వాణిజ్యం మినహా మిగతా అన్నింటిలో భారత్ భాగస్వామిగా ఉంది. ఇందులో పాల్గొన్న 14 దేశాలు- ఆస్ట్రేలియా, బ్రూనై, ఫిజీ, భారత్, ఇండోనేషియా, జపాన్, దక్షిణ కొరియా, మలేషియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, యూఎస్, వియత్నాం
11. ఇటీవల భారత్‌ను సందర్శించిన ఫ్యుమియో కిషిదా ఏ దేశ ప్రధాని? (4)
1) దక్షిణ కొరియా 2) వియత్నాం
3) ఫిలిప్పీన్స్ 4) జపాన్
వివరణ: జపాన్ ప్రధాన మంత్రి ఫ్యుమియో కిషిదా మార్చి 19 నుంచి 22 వరకు భారత్‌లో పర్యటించారు. ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం అయ్యారు. ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్వే ప్రాజెక్ట్‌కు 300 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ఇవ్వనున్నారు. జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీలో భాగంగా వీటిని ఇవ్వనున్నారు. అలాగే ఈ ఏడాది మే నెలలో జీ7 దేశాల సమావేశం జపాన్‌లో జరగనుంది. ఇందులో భారత్‌కు సభ్యత్వం లేదు. అయినా భారత్‌ను జపాన్ ప్రధాని ఆహ్వానించారు. ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో-పసిఫిక్ పాలసీకి కూడా జపాన్ ప్రధాని ప్రతిపాదించారు.
12. యూకేలోని భారత రాయబార కార్యాలయంపై దాడి జరిగింది. భారత కార్యాలయానికి రక్షణ ఇవ్వకపోవడం ఏ ఒప్పంద ఉల్లంఘన కిందకు వస్తుంది? (3)
1) హేగ్ ఒప్పందం 2) జెనీవా ఒప్పందం
3) వియన్నా ఒప్పందం
4) న్యూయార్క్ ఒప్పందం
వివరణ: ఖలిస్థాన్ డిమాండ్‌తో పలువురు యూకేలోని భారత రాయబార కార్యాలయంపై దాడి చేశారు. భారత జాతీయ జెండాను కిందకు దించారు. ఈ అంశాన్ని భారత్ తీవ్రంగా పరిగణించింది. ఇది వియన్నా ఒప్పంద ఉల్లంఘనగా పేర్కొంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ఇవ్వాలని కోరింది. అంతర్జాతీయ దౌత్యపరమైన అంశాలకు సంబంధించి అన్ని దేశాలు కలిసి వియన్నాలో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇది 1961లో జరిగింది. 1964 ఏప్రిల్ 24 నుంచి అమలులోకి వచ్చింది.
13. పీఈఎన్సీఐఎల్ దేనికి సంబంధించింది? (1)
1) బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన
2) అక్షరాస్యత పెంపు
3) మహిళలకు భద్రత అంశాలు
4) పైవేవీ కాదు
వివరణ: నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టులో భాగంగా పీఈఎన్సీఐఎల్ను ప్రారంభించినట్లు ఇటీవల కేంద్రం రాజ్యసభలో ప్రకటించింది. పీఈఎన్సీఐఎల్ని విస్తరిస్తే.. ప్లాట్‌ఫాం ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్. బాల కార్మిక చట్టాన్ని సమర్థంగా అమలు చేసేందుకు ప్రత్యేకంగా తీసుకొచ్చిన పోర్టల్ ఇది. ఇందులో చైల్డ్ ట్రాకింగ్ సిస్టమ్, కైంప్లెంట్ కార్నర్, రాష్ట్ర ప్రభుత్వం, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ తదితర వ్యవస్థలు అంతర్లీనంగా ఉంటాయి.
14. ఏ రాష్ట్రంలో అడ్వకేట్ల రక్షణ బిల్లును తీసుకొచ్చారు? (4)
1) మహారాష్ట్ర 2) మేఘాలయ
3) కేరళ 4) రాజస్థాన్
వివరణ: దేశంలో తొలిసారిగా అడ్వకేట్ల రక్షణ బిల్లును రాజస్థాన్ రాష్ట్రం ఆ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టింది. ఈ తరహా బిల్లును ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఇదే. ఆరోగ్యాన్ని హక్కుగా ఇస్తూ చట్టాన్ని చేసిన తొలి రాష్ట్రం కూడా రాజస్థానే. అడ్వకేట్ల రక్షణ బిల్లు, ఆ వృత్తిలోని వాళ్లను రక్షించేందుకు ఉద్దేశించింది.
15. ఎబెల్ ప్రైజ్ దేనికి సంబంధించింది? (3)
1) అంతర్జాతీయ సంబంధాలు
2) ఆర్థిక అంశాలు 3) గణితం 4) క్రీడలు
వివరణ: ఎబెల్ ప్రైజ్ గణితానికి సంబంధించింది. గణితంలో దీన్ని నోబెల్‌గా వ్యవహరిస్తారు. ఈ ఏడాది ఈ అవార్డును అర్జెంటీనా-అమెరికా దేశానికి చెందిన టూయిస్ కఫారెల్లికి ప్రకటించారు. ఆయన యూఎస్ఏలోని టెక్సాస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. ‘పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్’లో ఆయన నిపుణుడు. ఈ సమీకరణాలను ఇంజినీరింగ్, భౌతిక శాస్త్రం, ఆర్థిక, జీవ శాస్ర్తాల్లోనూ వినియోగిస్తారు. వేర్వేరు అంశాల్లో వచ్చే మార్పులను గణించేందుకు ఉద్దేశించింది ఇది.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?