Current Affairs | కేశవానంద భారతి కేసు తీర్పు వెలువడి ఎన్నేండ్లు అయ్యింది?
1. ఎంఐసీఏ (మికా) ఇటీవల వార్తల్లో ఉంది. ఇది దేనికి సంబంధించింది? (3)
1) ఐక్యరాజ్య సమితి
2) ప్రపంచ బ్యాంక్
3) యూరోపియన్ యూనియన్
4) అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ
వివరణ: క్రిప్టోకరెన్సీని తమ నియంత్రణ పరిధిలోకి తీసుకొస్తూ 27 సభ్య దేశాల కూటమి యూరోపియన్ యూనియన్ నిర్ణయం తీసుకుంది. దీన్నే ‘మార్కెట్స్ ఇన్ క్రిప్టో అసెట్స్ (ఎంఐసీఏ) అని పిలుస్తున్నారు. ఈ కరెన్సీని నియంత్రణ పరిధిలోకి తీసుకురావడం ఇదే ప్రథమం. 2022లో క్రిప్టో కరెన్సీ అనేక ఒడుదొడుకులకు గురయ్యింది. కొన్ని సందర్భాల్లో కుంభకోణాలకు కూడా దారి తీసింది. నియంత్రణ అన్ని తరహా క్రిప్టోలకు వర్తిస్తుంది. డిజిటల్ రూపంలో ఉన్న కరెన్సీనే క్రిప్టో కరెన్సీ అని పిలుస్తారు.
2. ఆపరేషన్ కావేరి దేనికి సంబంధించింది? (2)
1) కావేరి నదీ జలాల శుద్ధి
2) సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకురావడం
3) ఉక్రెయిన్‌లో చిక్కుకున్న
భారతీయులను తీసుకురావడం
4) కావేరి జల నాలాల్లో ఆక్రమణలను తొలగించడం
వివరణ: సూడాన్‌లో అంతర్యుద్ధం మొదలయ్యింది. ఆ దేశ సైన్యం, పారా మిలిటరీ దళాల మధ్య తీవ్ర స్థాయిలో పోరు జరుగుతుంది. అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను క్షేమంగా తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్‌కు ఆపరేషన్ కావేరి అని పేరు పెట్టారు. గతంలో ఉక్రెయిన్ నుంచి కూడా ఆపరేషన్ గంగా పేరుతో భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చారు. కావేరి నది దక్షిణ భారత దేశంలోని కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల్లో ప్రవహిస్తుంది. నదిని కావేరి మాతగా కొలుస్తారు.
3. వైబ్రెంట్ విలేజ్ అనే కార్యక్రమాన్ని ఎందులో విలీనం చేయాలని ఇటీవల నిర్ణయించారు? (3)
1) నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్
2) ఉపాధి హామీ పథకం
3) పీఎం గతిశక్తి 4) పైవేవీ కాదు
వివరణ: చైనాతో సరిహద్దు కలిగి ఉన్న గ్రామాల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు ఉద్దేశించిన వైబ్రెంట్ విలేజ్ కార్యక్రమాన్ని గతంలో ప్రారంభించారు. తాజాగా దీన్ని పీఎం గతిశక్తి పథకంలో విలీనం చేయాలని నిర్ణయించారు. పీఎం గతిశక్తి అంటే 16 మంత్రిత్వ శాఖలతో విలీనం అయిన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా మొట్ట మొదటగా కిబితు అనే గ్రామంలో అభివృద్ధి పనులను చేపట్టారు. ఇది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. వైబ్రెంట్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా 2968 గ్రామాలను అభివృద్ధి చేయాలని గతంలో నిర్ణయించారు. ఇవి 19 సరిహద్దు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ రాష్ర్టాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం అయిన లఢక్‌లోనూ ఇవి ఉన్నాయి.
4. కింది ఏ రుగ్మతను ‘నోటిఫైబుల్’గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? (4)
1) కరోనా 2) రేబిస్
3) టీబీ 4) మలేరియా
వివరణ: మలేరియా జ్వరాన్ని నోటిఫైబుల్గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఈ జ్వరంతో వచ్చిన వారి వివరాలను సంబంధిత వైద్యులు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. 2027 నాటికి మలేరియా రహిత దేశంగా మారాలని లక్ష్యంతో పాటు 2030 నాటికి పూర్తిగా మలేరియా లేకుండా చేయాలని భారత్ నిర్ణయించింది. ఆ దిశగానే తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మలేరియా భారత్‌లో ఈశాన్య రాష్ర్టాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ర్టాల్లో మొత్తం 200 జిల్లాల్లో ఎక్కువగా ఉంది.
5. కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి? (4)
ఎ. షార్జా స్టేడియంలోని స్టాండ్‌కు ‘సచిన్ టెండూల్కర్’ పేరు పెట్టారు
బి. సిడ్నీలోని గేట్‌కు సచిన్ టెండూల్కర్ పేరును పెట్టారు
1) ఎ 2) బి
3) ఏదీకాదు 4) రెండూ సరైనవే
వివరణ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1973 ఏప్రిల్ 24న సచిన్ జన్మించాడు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్ మైదానంలో ఒక గేటుకు సచిన్ పేరు పెట్టారు. అలాగే మరో గేట్‌కు వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ బ్రియాన్ లారా పేరు పెట్టారు. ఇదే గ్రౌండ్లో లారా 30 సంవత్సరాల కిందట 277 పరుగులు చేశాడు. అలాగే యూఏఈలోని షార్జాలో స్టాండ్‌కు సచిన్ టెండూల్కర్ పేరు పెట్టారు. సచిన్ ఎన్నో రికార్డులను సృష్టించాడు. భారతరత్న అవార్డ్‌ను పొందిన తొలి క్రీడాకారుడు.
6. ఏ నగరంలో వృథా నుంచి బయోడీజిల్‌ను తయారు చేసే ప్లాంట్‌ను బెల్జియం ప్రారంభించనుంది? (3)
1) ఇండోర్ 2) అమృత్సర్
3) అయోధ్య 4) హైదరాబాద్
వివరణ: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో బయో డీజీల్ తయారీ ప్లాంట్ రానుంది. బెల్జియం దేశానికి చెందిన విటో అనే సంస్థ దీన్ని ప్రారంభించనుంది. ప్లాస్టిక్ వృథా నుంచి బయోడీజిల్‌ను తయారు చేయనున్నారు. త్వరలో అయోధ్య రామాలయం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భక్తులు దర్శనానికి వస్తారు. అధికంగా వృథా పోగయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నారు.
7. తొలి నీటి మెట్రో ఏ రాష్ట్రంలో తీసుకొచ్చారు? (2)
1) మహారాష్ట్ర 2) కేరళ
3) ఉత్తరప్రదేశ్ 4) ఉత్తరాఖండ్
వివరణ: కేరళలో వాటర్ మెట్రోను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. అలాగే డిజిటల్ సైన్స్ మ్యూజియం నిర్మాణ పనులకు కూడా శ్రీకారం చుట్టారు. ఈ రెండు కూడా భారత్‌లో వస్తున్న మొట్ట మొదటి వ్యవస్థలే. వాటర్ మెట్రో కొచ్చి నగరంలో అందుబాటులోకి వచ్చింది. ఇది కొచ్చి చుట్టూ ఉన్న పది దీవులను కలుపుతుంది. రూ.1136. 83 కోట్లతో దీన్ని నిర్మించనున్నారు. కేరళ ప్రభుత్వంతో పాటు జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ కూడా దీనికి ఆర్థిక సాయం చేయనుంది.
8. ఎస్డబ్ల్యూఏజీఏటీ (స్వాగత్) ఏ రాష్ర్టానికి సంబంధించింది? (4)
1) అరుణాచల్ ప్రదేశ్ 2) మణిపూర్
3) పంజాబ్ 4) గుజరాత్
వివరణ: ఎస్డబ్ల్యూఏజీఏటీ అంటే స్టేట్ వైడ్ అటెన్షన్ ఆన్ గ్రెవియన్సెస్ బై అప్లికేషన్ ఆఫ్ టెక్నాలజీ అని అర్థం. గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నరేంద్రమోదీ దీన్ని ప్రారంభించారు. దీన్ని ప్రారంభించి 20 సంవత్సరాలు అయిన సందర్భంగా నిర్వహించిన వేడుకకు ఆయన వర్చువల్ పద్ధతిలో పాల్గొన్నారు. పౌరులు, ముఖ్యమంత్రి మధ్య నేరుగా అనుసంధానం చేసేందుకు ఉద్దేశించిన పరిపాలన విధానమే స్వాగత్. ప్రజలు తమ ఇబ్బందులను తెలియజేయవచ్చు. అధికారులు ఆయా సమస్యలకు నిర్ణీత సమయంలో పరిష్కారాలను చూపుతారు. పెండింగ్‌లో ఉన్న వాటికి సంబంధించి ముఖ్యమంత్రి నేరుగా సమీక్ష జరుపుతారు.
9. నాస్కామ్ ప్రెసిడెంట్‌గా ఎవరు నియమితులయ్యారు? (3)
1) రామేశరన్ 2) అవస్తీ రావు
3) అనంత్ మహేశ్వరి 4) రామశ్యామ్
వివరణ: భారత్‌లో మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడిగా ఉన్న అనంత్ మహేశ్వరి నాస్కామ్ అధ్యక్షుడిగా ఏప్రిల్ 25న బాధ్యతలు స్వీకరించారు. 2023-24కు ఆయన నాస్కామ్కు నేతృత్వం వహించనున్నారు. ఇది ఒక లాభాపేక్ష లేని సంస్థ. ఐటీ పరిశ్రమకు సంబంధించి అత్యున్నతమైన సంస్థగా చెప్పవచ్చు. 1988లో దీన్ని స్థాపించారు. 2030 నాటికి భారత ఐటీ పరిశ్రమ 500 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని సాధించాలని లక్ష్యంగా ఎంచుకుంది. ప్రస్తుతం దీని పరిమాణం 245 బిలియన్ డాలర్లుగా ఉంది. లక్ష్యాన్ని చేరేందుకు అనంత్ మహేశ్వరి కీలక పాత్ర పోషించాల్సి ఉంది.
10. 2023, ఏప్రిల్ 24కు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి? (4)
1) పంచాయతీ వ్యవస్థ ఏర్పాటై 30 సంవత్సరాలు పూర్తి
2) కేశవానంద భారతి కేసు తీర్పు వెలువడి 50 సంవత్సరాలు పూర్తి
3) ఇంటర్నేషనల్ డే ఆఫ్ మల్టీలేటరలిజమ్ అండ్ డిప్లమసీ ఫర్ పీస్ (బహుళత్వపు రోజుతో పాటు శాంతి కోసం దౌత్యం)
4) పైవన్నీ సరైనవే
వివరణ: 1973 ఏప్రిల్ 24న కేశవానంద భారతి కేసు తీర్పు వెలువడింది. దేశంలో తొలిసారి మౌలిక నిర్మాణం అనే ప్రతిపాదనను ఈ కేసులోనే సుప్రీంకోర్ట్ ప్రస్తావించింది. అలాగే పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పాటై 30 సంవత్సరాలు పూర్తయ్యింది. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని రాజ్యాంగంలో చేర్చారు. తొమ్మిదో భాగంతో పాటు, పంచాయతీ విధులను 11వ షెడ్యూల్లో చేర్చారు. అలాగే ఏప్రిల్ 24న బహుళత్వపు రోజుగా నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ తీర్మానాన్ని ఆమోదించింది.
11. ఇటీవల భారత్ మరో రెండు దేశాలతో కలిసి త్రైపాక్షిక కూటమిని ఏర్పాటు చేసింది. ఆ రెండు దేశాలు ఏవి? (1)
1) అర్మేనియా, ఇరాన్
2) ఇరాన్, ఉజ్బెకిస్థాన్
3) అర్మేనియా, అజర్బైజాన్
4) అర్మేనియా, ఉజ్బెకిస్థాన్
వివరణ: భారత్, ఇరాన్, అర్మేనియాలు ఒక కొత్త త్రైపాక్షిక కూటమిని ఏర్పాటు చేశాయి. శక్తి, రవాణా, వాణిజ్యం, పెట్టుబడులు తదితర రంగాల్లో పరస్పర సహకారానికి ఈ కొత్త కూటమి కృషి చేస్తుంది. మూడు దేశాల ప్రతినిధులు సమావేశాన్ని కూడా నిర్వహించాయి. అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ (ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్)ను కూడా చర్చించారు. అలాగే ఆర్థిక సంబంధాలు బలోపేతం చేస్తూ అనుసంధాన మార్గాలను అన్వేషించాలని కూడా త్రైపాక్షిక కూటమిలో చర్చించారు. ఇటీవల భారత్, అర్మేనియాల మధ్య రక్షణ ఒప్పందం కూడా కుదిరింది.
12. 2023 ఏప్రిల్ మూడో వారంలో వెలువడిన ‘న్యూడిల్లీ ప్రకటన’ దేనికి సంబంధించింది? (3)
1) భద్రతా మండలికి సంబంధించి
2) జీ-20 నిర్ణయాలు
3) బౌద్ధమతం 4) జైనమతం
వివరణ: బౌద్ధ మతానికి సంబంధించి రెండు రోజుల పాటు అంతర్జాతీయ సమావేశం న్యూఢిల్లీలో నిర్వహించారు. ఏప్రిల్ 20, 21 తేదీల్లో ఇది జరిగింది. శాంతి, సామరస్యం, విశ్వశాంతిని కాంక్షిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. అన్ని దేశాలు, అన్ని వ్యవస్థలు, వ్యక్తులు శాంతి కోసం కృషి చేయాలని, సంఘర్షణ, హింస, యుద్ధం లేని సమాజాన్ని తీసుకువస్తూ పర్యావరణాన్ని కాపాడాలని కూడా ఇందులో తీర్మానించారు.
13. 2022-23 కు భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఏది? (2)
1) రష్యా 2) యూఎస్ఏ
3) ఫ్రాన్స్ 4) యూకే
వివరణ: 2022-23 కు భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. రెండు దేశాల మధ్య 2021-22తో పోలిస్తే, ఆ తర్వాత ఆర్థిక సంవత్సరం 7.65% ద్వైపాక్షిక వాణిజ్యం అభివృద్ధి చెందింది. 2020-21లో 80.51 అమెరికన్ డాలర్ల వ్యాపారం, 2021-22 మధ్య 119.5 అమెరికన్ డాలర్లు, అలాగే 2022-23 మధ్య 128.55 అమెరికన్ డాలర్ల వాణిజ్యం అనేది అభివృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అమెరికాకు ఎగుమతులు భారత్ నుంచి 2.81 శాతం పెరిగాయి.
14. ఏఐఐబీ బ్యాంక్ తన తొలి విదేశీ శాఖను ఏ దేశంలో ప్రారంభించనుంది? (4)
1) రష్యా 2) ఇరాన్
3) ఫిలిప్పీన్స్ 4) యూఏఈ
వివరణ: ఆసియా మౌలిక సదుపాయాలు పెట్టుబడుల బ్యాంక్ చైనాలోని బీజింగ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇది తన తొలి విదేశీ శాఖను అబుధాబీలో ప్రారంభించనుంది. ఈ బ్యాంక్‌లో చైనా అత్యధిక వాటాను కలిగి ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది. ఏఐఐబీ బహుళ సభ్య దేశాల బ్యాంక్‌గా చెప్పొచ్చు. దీన్ని 2016లో ఏర్పాటు చేశారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తుంది. ఇప్పటికే ఈ బ్యాంక్‌లో 100కు పైగా దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి.
15. దేశంలో అతి ఎక్కువగా జలభాగాలను కలిగి ఉన్న రాష్ట్రం ఏది? (3)
1) జమ్ముకశ్మీర్ 2) ఉత్తరాఖండ్
3) పశ్చిమబెంగాల్ 4) ఉత్తరప్రదేశ్
వివరణ: దేశం మొత్తంలో 24,24,540 జల వ్యవస్థలు ఉన్నట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇందులో 97.1% అంటే 23,55,055 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. 69,485 (2.9%) పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. జలభాగాల్లో పశ్చిమబెంగాల్ అగ్రస్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో 47 లక్షల నీటి రిజర్వాయర్లు ఉన్నాయి.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?