current affairs | కరెంట్ అఫైర్స్
తెలంగాణ
ఐఎస్బీ
- ఫైనాన్సియల్ టైమ్స్ (ఎఫ్టీ) ఫిబ్రవరి 13న వెలువరించిన గ్లోబల్ ఎంబీఏ-2023 ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్‌లోని ఐఎస్బీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) భారతదేశంలో మొదటి ర్యాంకులో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 39వ ర్యాంకు, ఆసియా దేశాల్లో 6వ ర్యాంకు సాధించింది. ఐఎస్బీ పీజీపీ (పీజీ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్) కోర్సును హైదరాబాద్, మొహాలీ క్యాంపస్‌లలో అందిస్తున్నారు.
అవగాహన ఒప్పందం
- రాష్ట్రంలోని చారిత్రక మెట్ల బావుల పరిశోధన, డాక్యుమెంటేషన్‌కు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ), హైదరాబాద్ డిజైన్ ఫోరమ్ (హెచ్డీఎఫ్) మధ్య అవగాహన ఒప్పందం ఫిబ్రవరి 14న కుదిరింది. మాసబ్‌ట్యాంక్‌లోని జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌కుమార్, హెచ్డీఎఫ్ ప్రతినిధి మహేశ్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. రాష్ట్రంలోని 5 ప్రధాన టైపాలాజీల్లో 110 చారిత్రక మెట్లబావుల భౌతిక క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహించి ఫొటోలు, ఇంటర్వ్యూల ద్వారా వివరాలను సేకరించి, వాటిని డాక్యుమెంటేషన్ చేస్తారు.
రామకృష్ణకు పురస్కారం
- ప్రముఖ కవి, సాహితీవేత్త, కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ డా. కే రామకృష్ణ జాతీయ భారత్ భాషా భూషణ్ అవార్డును ఫిబ్రవరి 17న అందుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ అవార్డును మధ్యప్రదేశ్ వైద్య విద్య పునరావాస శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్, ప్రముఖ కవులు సత్యమూర్తి పద్మావతి, యతేంద్రనాథ్, రామ్వల్లభ్ ఆచార్య ప్రదానం చేశారు. సందర్భంగా ఈ అవార్డును మధ్యప్రదేశ్ వైద్య విద్య పునరావాస శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్, ప్రముఖ కవులు సత్యమూర్తి పద్మావతి, యతేంద్రనాథ్, రామ్వల్లభ్ ఆచార్య ప్రదానం చేశారు.
జాతీయం
చాట్‌జీపీటీ
- దేశంలో మొదటిసారి చాట్‌జీపీటీ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్‌ను వెలాసిటీ అనే సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీన్ని లెక్సీ పేరుతో తీసుకువచ్చామని వెలాసిటీ సంస్థ కో ఫౌండర్ అశిరూప్ మెధేకర్ ఫిబ్రవరి 13న ప్రకటించారు. వెలాసిటీ ఒక ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థ. ఇది ఈ-కామర్స్ వ్యాపారులకు వారి వ్యాపారాలపై విశ్లేషణలు అందిస్తుంది. రోజువారీ నివేదికలు పంపిస్తుంది.
గవర్నర్లు
- కేంద్ర ప్రభుత్వం 13 రాష్ర్టాలకు కొత్త గవర్నర్లను ఫిబ్రవరి 12న నియమించింది. ఆంధ్రప్రదేశ్‌కు జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్, అరుణాచల్‌ప్రదేశ్‌కు కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్, అసోంకు గులాబ్‌చంద్ కటారియా, ఛత్తీస్‌గఢ్‌కు బిశ్వభూషణ్ హరించదన్ (ఏపీ నుంచి బదిలీ), లఢక్‌కు బీడీ మిశ్రా (అరుణాచల్‌ప్రదేశ్ నుంచి బదిలీ), బీహార్‌కు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ (హిమాచల్‌ప్రదేశ్ నుంచి బదిలీ), నాగాలాండ్‌కు లా గణేశన్ (మణిపూర్ నుంచి బదిలీ), మేఘాలయకు ఫాగు చౌహాన్ (బీహార్ నుంచి బదిలీ), మణిపూర్‌కు సుశీ అనసూయ ఉయికే (ఛత్తీస్‌గఢ్ నుంచి బదిలీ), మహారాష్ట్రకు రమేష్ బైస్ (జార్ఖండ్ నుంచి బదిలీ), సిక్కింకు లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, హిమాచల్ ప్రదేశ్‌కు శివప్రతాప్ శుక్లా, జార్ఖండ్‌కు సీపీ రాధాకృష్ణన్ గవర్నర్లుగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా సేవలందించి గవర్నర్‌గా నియమితులైన రెండో వ్యక్తి జస్టిస్ అబ్దుల్ నజీర్. గతంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీ సదాశివం 2014లో కేరళ గవర్నర్‌గా నియమితులయ్యారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం జరిపిన తొలి గవర్నర్ నియామకం కూడా అదే.
హైడ్రోజన్ ప్లాంట్
- దేశంలోనే తొలి ఘన వ్యర్థాల హైడ్రోజన్ ప్లాంట్‌ను పుణెలో ఏర్పాటు చేయనున్నట్లు అక్కడి మున్సిపల్ అధికారులు ఫిబ్రవరి 14న వెల్లడించారు. ఈ ప్లాంట్ 30 ఏళ్ల నిర్వహణ కోసం ది గ్రీన్ బిలియన్స్ లిమిటెడ్ (టీజీబీఎల్) పుణె మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్లాంట్‌కు రూ.430 కోట్లు కేటాయించారు. ప్రతిరోజు 350 టన్నుల ఘన వ్యర్థాలను శుద్ధి చేయనున్నట్లు టీజీబీఎల్ చైర్మన్, ఫౌండర్ ప్రతీక్ కనకియా వెల్లడించారు.
వార్తల్లో వ్యక్తులు
షహబుద్దీన్ చుప్పూ
- బంగ్లాదేశ్ 22వ అధ్యక్షుడిగా మహ్మద్ షహబుద్దీన్ చుప్పూ ఎన్నికయినట్లు ఆ దేశ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఫిబ్రవరి 13న వెల్లడించింది. అవామీ లీగ్ పార్టీ తరఫున ఆయన పోటీ చేశారు. ప్రత్యర్థులు ఎవరూ లేకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 74 ఏళ్ల వయస్సు ఉన్న ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ న్యాయమూర్తి.
శివ్ నందన్
- కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నూతన చైర్మన్‌గా శివ్ నందన్ ఫిబ్రవరి 13న బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లోని జలసౌధలో ఉన్న బోర్డు కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇంతకుముందు సింధూ నది బేసిన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజినీర్‌గా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవోగా పనిచేశారు.
సుచీంద్ర కుమార్
- ఆర్మీ కొత్త వైస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఎంవీ సుచీంద్ర కుమార్ ఫిబ్రవరి 16న నియమితులయ్యారు. లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు స్థానం లో ఆయన మార్చి 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. సుచీంద్ర కుమార్ ప్రస్తుతం ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌లో ఆర్మీ స్టాఫ్ (స్ట్రాటజీ) డిప్యూటీ చీఫ్‌గా ఉన్నారు.
నీల్ మోహన్
- ప్రముఖ సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్‌కు నూతన సీఈవోగా భారత-అమెరికన్ నీల్ మోహన్ ఫిబ్రవరి 16న నియమితులలయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న సూసన్ వొజిసి పదవి నుంచి వైదొలిగారు. నీల్ మోహన్ ప్రస్తుతం యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన గూగుల్‌లో 2008లో చేరారు.
అంతర్జాతీయం
వరల్డ్ రేడియో డే
- ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ఫిబ్రవరి 13న నిర్వహించారు. రేడియో ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇటాలియన్ సైంటిస్ట్ గుగ్లియెల్మో మార్కోని 1890లో రేడియో లేదా వైర్లెస్ టెలిగ్రాఫ్‌ను అభివృద్ధి చేశారు. స్పానిష్ రేడియో అకాడమీ 2010, సెప్టెంబర్‌లో రేడియో దినోత్సవం ఉండాలని యునెస్కోకు విన్నవించింది. దీంతో 36వ జనరల్ అసెంబ్లీ సమావేశంలో రేడియోను ప్రారంభించిన ఫిబ్రవరి 13 (1946)ను రేడియో దినోత్సవంగా నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి 2012లో నిర్ణయించింది. ఈ ఏడాది దీని థీమ్ ‘రేడియో అండ్ పీస్’.
- అదేవిధంగా అంతర్జాతీయ మూర్ఛ దినోత్సవాన్ని ఫిబ్రవరి 13న నిర్వహించారు. ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండో సోమవారం నిర్వహిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి 13న జరుపుకొన్నారు. దీన్ని 2015 నుంచి నిర్వహిస్తున్నారు.
ధర్మ గార్డియన్
- నాలుగో ఎడిషన్ ధర్మ గార్డియన్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఫిబ్రవరి 17న ప్రారంభమయ్యింది. ఈ వ్యాయామం భారత్-జపాన్ సైన్యాలు జపాన్‌లోని ఇమజు క్యాంప్‌లో మార్చి 2 వరకు నిర్వహిస్తాయి. మిడిల్ ఆర్మీ ఇన్ఫాంట్రీ రెజిమెంట్, భారత్‌కు చెందిన గర్వాల్ రైఫిల్ రెజిమెంట్ ఈ ఎక్సర్సైజ్లో పాల్గొంటున్నాయి.
చిరుధాన్యాల ప్రదర్శన
- ఐక్యరాజ్యసమితిలో భారత్ ఏర్పాటు చేసిన మిల్లెట్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్ రిసెర్చ్ అండ్ అవేర్నెస్ (ఎంఐఐఆర్ఏ)ను ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ ఫిబ్రవరి 13న ప్రారంభించారు. ఐక్యరాజ్యసమితి 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. భారత్ చొరవతో సీడ్ మనీని తీసుకువచ్చారు. సీడ్ మనీ లక్ష్యం.. మిల్లెట్ పరిశోధన కార్యక్రమానికి సహకారం అందించడం, వివిధ దేశాలు భాగస్వాములు కావడం, ప్రపంచ వ్యాప్తంగా మిల్లెట్ వినియోగాన్ని పెంపొందించడం, మిల్లెట్ పరిశోధనకు నిధులు సమకూర్చడం ఎంఐఐఆర్ఏ ఉద్దేశం. సీడ్ మనీ అంటే జీ20 సభ్యులు సభ్యత్వ రుసుమును చెల్లించి, మిల్లెట్స్ అవసరాలను వృద్ధి చేయడానికి ఖర్చు చేయడం.
పంగోలిన్ డే
- వరల్డ్ పంగోలిన్ డేని ఏటా ఫిబ్రవరి నెలలోని మూడో శనివారం నిర్వహిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న నిర్వహించారు. ఇది 12వ ఎడిషన్. పొలుసులుగా, చిన్నగా ఉండే పంగోలిన్ అనే క్షీరదాల సంఖ్య క్షీణతపై అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇది ఫోలిడోటా క్రమానికి చెందినది. ఇవి ఎక్కువగా ఆఫ్రికా, ఆసియాలో ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపిస్తాయి. పర్యావరణ వ్యవస్థను సమతుల్యం చేయడానికి ఇవి చాలా ముఖ్యమైనవి. ఆహార గొలుసులో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఒక్కో పంగోలిన్ 70 మిలియన్ కీటకాలను తింటుంది.
క్రీడలు
గిల్
- భారత క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ’జనవరి 2023)గా ఫిబ్రవరి 13న ఎంపికయ్యాడు. శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్‌లలో కలిపి 567 పరుగులు చేశాడు.
మహిళల విభాగంలో ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (జనవరి 2023)గా ఇంగ్లండ్‌కు చెందిన గ్రేస్ స్క్రీవెన్స్ ఎంపికయ్యింది.
సానియా మీర్జా
- ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో పాల్గొనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మెంటార్‌గా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వ్యవహరించనున్నదని ఆర్సీబీ ఫిబ్రవరి 15న వెల్లడించింది. సానియా గత నెలలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో గ్రాండ్‌స్లామ్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన ఆమె చివరగా ఈ నెలలో ఏటీపీ దుబాయ్ ఓపెన్ టోర్నీలో ఆడనుంది. డబ్ల్యూపీఎల్ మార్చి 4 నుంచి నిర్వహించనున్నారు.
తులసీదాస్ బలరాం
- భారత దిగ్గజ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, ఒలింపియన్ తులసీదాస్ బలరాం (87) ఫిబ్రవరి 16న మరణించాడు. ఈయన 1936, అక్టోబర్ 4న సికింద్రాబాద్‌లోని బొల్లారంలో జన్మించాడు. 1962లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన భారత జట్టులో సభ్యుడు. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. భారత ఫుట్‌బాల్ దిగ్గజాలు చునీ గోస్వామి, పీకే బెనర్జీలతో కలిసి తులసీదాస్ ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. వీరి త్రయాన్ని హోలి ట్రినిటీ అని పిలిచేవారు. 1962లో తులసీదాస్ అర్జున అవార్డు అందుకున్నారు.
ఆసియన్ ప్రెసిడెంట్స్ కప్
- ప్రతిష్ఠాత్మక ఆసియన్ ప్రెసిడెంట్స్ కప్ టోర్నీని భారత మహిళల హ్యాండ్‌బాల్ జట్టు తొలిసారి గెలిచి చరిత్ర సృష్టించింది. ఆసియా హ్యాండ్‌బాల్ సమాఖ్య ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16న జోర్డాన్‌లో జరిగిన ఈ ఈవెంట్లో శైలజ శర్మ నాయకత్వంలోని భారత జట్టు ఆడిన ఆరు మ్యాచ్‌లు గెలిచి ఓవరాల్‌గా 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆతిథ్య జోర్డాన్ జట్టు 8 పాయింట్లతో రన్నరప్‌గా ఉంది. జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు తెలంగాణకు చెందిన అర్శనపల్లి జగన్మోహన్రావు.
Previous article
Current affairs | భారత్‌లోని ఏ నగరంలో తొలిసారి ఎలక్ట్రిక్ ఏసీ డబుల్ డెక్కర్ బస్సును తెచ్చారు?
Next article
Biology | అన్నదాతకు ఆదాయ వనరు.. చౌకగా పోషకాహారం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?