Current affairs | భారత్‌లోని ఏ నగరంలో తొలిసారి ఎలక్ట్రిక్ ఏసీ డబుల్ డెక్కర్ బస్సును తెచ్చారు?
1. ప్రపంచ సంతోష సూచీలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? (3)
1) 84 2) 127 3) 136 4) 94
వివరణ: ప్రపంచ సంతోష సూచీ-2023లో భారత్ 136వ స్థానంలో ఉంది. ఐక్యరాజ్యసమితికి చెందిన సస్టెయినబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ సంస్థ ఈ సూచీని విడుదల చేసింది. మొత్తం 150 దేశాలకు ర్యాంకులను కేటాయించింది. తొలి ఐదు స్థానాల్లో.. ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ నిలిచాయి. భారత్‌కు పొరుగున ఉన్న నేపాల్ 84వ స్థానంలో, బంగ్లాదేశ్ 94వ స్థానంలో, పాకిస్థాన్ 121వ స్థానంలో, 127వ స్థానంలో శ్రీలంక ఉన్నాయి. అఫ్గానిస్థాన్ 146వ స్థానంలో ఉంది. జీడీపీ తలసరి ఆదాయం, సామాజిక ప్రోత్సాహం, జీవిత కాలం, సామాజిక స్వేచ్ఛ, అవినీతి లేకుండా ఉండటం తదితర అంశాల ఆధారంగా ఈ సూచీని రూపొందిస్తారు.
2. ఐఐటీ విద్యార్థులు దుబాయిలోని ప్రపంచ ప్రభుత్వ సదస్సులో ఏ అంశానికి అవార్డు పొందారు? (2)
1) వాతావరణ అంచనా యాప్ రూపకల్పన
2) బ్లాక్ బిల్ యాప్
3) వైట్ మనీ యాప్ 4) పైవేవీ కాదు
వివరణ: ఐఐటీ ఇండోర్‌కు చెందిన నియతి టొటలా, నీల్ కల్పేష్‌కుమార్ పరీఖ్ బ్లాక్ బిల్ యాప్‌ను రూపొందించినందుకు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి బహుమతిని అందజేశారు. ఫిబ్రవరి 13న దుబాయిలో ప్రపంచ ప్రభుత్వాల సదస్సు జరిగింది. బ్లాక్ బిల్యాప్ అనేది బ్లాక్ చెయిన్ సాంకేతికతతో పనిచేస్తుంది. డిజిటల్ రిసీట్లను ఇది అందిస్తుంది. ఈ సదస్సును యూఏఈ నిర్వహించింది. విద్యార్థులు, పరిశోధకులు, ప్రభుత్వ విభాగాలకు ఈ అవార్డును ఇస్తుంది. ఈ సదస్సు ‘ప్రభుత్వాల భవిత రూపకల్పన (షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్)’ అనే ఇతివృత్తంతో ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు నిర్వహించారు.
3. జీ-20 కూటమికి చెందిన వ్యవసాయ ప్రతినిధుల సమావేశం ఏ నగరంలో నిర్వహించారు? (3)
1) భోపాల్ 2) బెంగళూర్
3) ఇండోర్ 4) కోల్‌కతా
వివరణ: జీ-20 కూటమికి ప్రస్తుతం భారత్ నేతృత్వం వహిస్తుంది. 2022, డిసెంబర్ 1న బాధ్యతలను స్వీకరించింది. 2023, నవంబర్ 30 వరకు భారత నాయకత్వంలో ఈ కూటమి ఉంటుంది. వ్యవసాయ ప్రతినిధుల సమావేశం ఫిబ్రవరి 14న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రారంభించారు. ముఖ్యంగా నాలుగు అంశాలపై చర్చించారు. అవి.. 1. ఆహార భద్రత, పోషణ 2. పర్యావరణ అనుకూలంగా సుస్థిర వ్యవసాయం 3. సమ్మిళిత వ్యవసాయం 4. ఆహార వ్యవస్థల డిజిటలీకరణ, వ్యవసాయ పరివర్తనం. అనంతరం జీ-20 ప్రతినిధులు ధార్ జిల్లాలోని సిలోటియా గ్రామాన్ని సందర్శించారు. అక్కడ పాలిహౌస్‌లో చేస్తున్న సేంద్రియ వ్యవసాయాన్ని పరిశీలించారు.
4. ఏ దేశంలో ఇటీవల గాబ్రియెల్ తుఫాన్ సంభవించింది? (1)
1) న్యూజిలాండ్ 2) చిలీ
3) అర్జెంటీనా 4) ఫిలిప్పీన్స్
వివరణ: గాబ్రియెల్ తుఫాను న్యూజిలాండ్ దేశంపై విరుచుకుపడింది. దీంతో ఆ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. ఆ దేశంలో ఉత్తర ద్వీపంలో తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఆ దేశంలో అత్యవసర పరిస్థితి విధించడం ఇది మూడోసారి. 2011లో తొలిసారి భూకంపం సంభవించినప్పుడు విధించారు. అప్పట్లో 6.3 తీవ్రతతో క్రైస్ట్ చర్చ్ కేంద్రంగా భూకంపం సంభవించింది. ఆ తర్వాత కొవిడ్-19 వైరస్ వేగంగా విస్తరిస్తున్న ప్రారంభంలోనే అత్యవసర పరిస్థితిని ప్రకటించి, వ్యాప్తి జరగకుండా అడ్డుకున్నారు.
5. బీఐఎంఏఆర్‌యూ (బీమారు) లేని రాష్ట్రం? (4)
1) బీహార్ 2) మధ్యప్రదేశ్
3) ఉత్తరప్రదేశ్ 4) మహారాష్ట్ర
వివరణ: బీఐఎంఏఆర్‌యూ అనేది సంక్షిప్త రూపం. దీని విస్తరణ రూపం- బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. అధిక జనాభా, తక్కువ ఆర్థిక అభివృద్ధి ఉన్న నేపథ్యంలో ఆ రాష్ర్టాలను బీమారుగా పేర్కొంటారు. మొదట ఈ పదాన్ని వినియోగించింది ఆశిష్ బోస్. ఇటీవల ప్రధాని ఈ పదాన్ని ప్రస్తావించడంతో ఇది వార్తల్లో నిలిచింది. నిరక్షరాస్యత తక్కువ ఉండటంతో పాటు పోషకాహారం లేకపోవడం, అధిక జనాభా, జనసాంద్రత తదితర సమస్యలు ఈ రాష్ర్టాల్లో నెలకొన్నాయి.
6. పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడకుండా కొత్తగా చట్టం చేసిన రాష్ట్రం ఏది? (3)
1) ఉత్తరప్రదేశ్ 2) గుజరాత్
3) ఉత్తరాఖండ్ 4) మధ్యప్రదేశ్
వివరణ: పోటీ పరీక్షల్లో అభ్యర్థులు ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఉండేందుకు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఆర్డినెన్స్ రూపంలో దీన్ని తీసుకొచ్చింది. పరీక్ష గదిలో కాపీయింగ్‌కు పాల్పడినా లేదా ప్రశ్నపత్రం లీక్ చేసినా శిక్షకు గురవుతారు. అలాంటి వాళ్లకు మూడు సంవత్సరాల జైలుశిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తారు. జరిమానా విధించకపోతే మరో తొమ్మిది నెలలు జైలులోనే ఉండాలి. రెండోసారి తప్పుచేస్తే 10 సంవత్సరాల జైలుశిక్ష, రూ.10 లక్షల జరిమానా విధిస్తారు. కట్టలేని పక్షంలో మరో 30 నెలలు జైలులో ఉండాలి.
7. మహిళ ఐపీఎల్ వేలంలో భాగంగా ఏ క్రీడాకారిణికి అత్యధికంగా వెచ్చించనున్నారు? (2)
1) ఆష్లే గార్డ్నర్ 2) స్మృతి మంధాన
3) నటాలి స్కివర్ 4) దీప్తి శర్మ
వివరణ: ప్రతిభావంతులైన మహిళా క్రీడాకారిణులకు ఫ్రాంచైజీలు అత్యధిక మొత్తాన్ని చెల్లించి దక్కించుకున్నాయి. భారత స్టార్ ఓపెనర్‌గా పేరున్న స్మృతి మంధాన అందరికంటే అత్యధికంగా రూ.3.5 కోట్లు పొందనుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్టులో ఆమె చేరనుంది. మొత్తం 448 క్రీడాకారిణుల కోసం వేలం ప్రక్రియ జరుగగా, వేర్వేరు ఫ్రాంచైజీలు 87 మంది క్రీడాకారిణులను తమ జట్టులోకి చేర్చుకున్నారు. రెండో స్థానంలో ఆష్లే గార్డ్నర్ (ఆస్ట్రేలియా) ఉంది. అలాగే మూడో స్థానంలో నటాలి స్కివర్ నిలిచింది. నాలుగోస్థానంలో భారత్‌కు చెందిన మరో క్రీడాకారిణి దీప్తి శర్మ ఉంది.
8. ఏ దేశంలో మార్బర్గ్ వైరస్ వ్యాప్తి ఉన్నట్లు ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది? (1)
1) ఈక్వటోరియల్ గినియా 2) ఈజిప్ట్
3) పపువా న్యూగినియా
4) బెలారస్
వివరణ: మార్బర్గ్ వైరస్ వ్యాప్తి ఈక్వటోరియల్ గినియా దేశంలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇది ఆఫ్రికా ఖండంలోని దేశం. దీన్ని కలిగించే వైరస్‌ను మార్బర్గ్ వైరస్ అని పిలుస్తారు. తొలిసారి ఈ వైరస్‌ను 1967లో గుర్తించారు. అతిథేయిగా ఆఫ్రికన్ ఫ్రూట్ బ్యాట్ (గబ్బిలం) ఉంటుంది.
9. సౌదీ అరేబియా నుంచి తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లనున్న మహిళ ఎవరు? (2)
1) హసీనా 2) రయానా బర్నవి
3) షమీమ్ 4) షాహీన్
వివరణ: సౌదీ అరేబియాకు చెందిన రయానా బర్నవి త్వరలో అంతరిక్షంలోకి అడుగు పెట్టనుంది. ఈ ఘనతను సాధించనున్న తొలి అరబ్ మహిళ ఆమె. అలీ అల్-ఖర్ని అనే మరో అంతరిక్ష వ్యోమగామితో కలిసి ఆమె ప్రయాణం చేయనుంది. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా వారు అంతరిక్షంలోకి చేరనున్నారు. ఫ్లోరిడా నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ఇస్లాం మత రాజ్యాల్లో సాధారణంగా మహిళలపై అధిక స్థాయిలో కట్టుబాట్లు ఉంటాయి. సౌదీ అరేబియా ఇటీవల కాలంలో సంస్కరణల దిశగా వెళుతుంది. సమాన అవకాశాలను ఇచ్చే ప్రక్రియను చేపట్టింది.
10. కొత్తగా కేంద్రం జియో హెరిటేజ్ బిల్లును ప్రవేశపెట్టింది. దీని ప్రకారం భౌగోళిక వారసత్వ ప్రదేశాల పరిరక్షణ ఎవరికి వెళ్లనుంది? (1)
1) జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
2) ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
3) ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు
4) స్థానిక ప్రభుత్వాలకు
వివరణ: భౌగోళిక వారసత్వ ప్రదేశాలు భారతదేశంలో 34 ఉన్నాయి. వీటిని పరిరక్షించేందుకు కేంద్రం చట్టం తీసుకురానుంది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును విడుదల చేసింది. భౌగోళిక సాంస్కృతి ప్రదేశాలు అంటే అందులో శిలాజాలు లేదా అవక్షేపణ శిలలు, సహజ నిర్మాణాలు ఉండొచ్చు. ఈ బిల్లు ఆమోదం పొందితే ఇలాంటి ప్రదేశాల పరిరక్షణ బాధ్యత జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు వెళ్తుంది. ఈ సంస్థను బ్రిటిష్ వాళ్లు 1851లో ఏర్పాటు చేశారు. అయితే అధికారాన్ని కేంద్రీకృతం చేయడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
11. ఇటీవల కనన్ ప్రహరీ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇది దేనికి ఉద్దేశించింది? (2)
1) అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు
2) అక్రమ మైనింగ్‌ను అడ్డుకొనేందుకు
3) స్మగ్లింగ్‌లకు సంబంధించి ఫిర్యాదుకు
4) రహదారి సమస్యల కోసం
వివరణ: అక్రమ మైనింగ్‌ను అడ్డుకొనేందుకు కేంద్రం కనన్ ప్రహరీ అనే ఒక కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, మేఘాలయ, తమిళనాడు తదితర రాష్ర్టాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా కొంతమంది అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. వీరిపై ఫిర్యాదు చేసేందుకు సైతం కొంతమంది జంకుతారు. ఈ నేపథ్యంలో కేంద్రం కనన్ ప్రహరీ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రజలు కూడా దీనిపై ఫిర్యాదు చేసేందుకు వీలుంటుంది.
12. భారత్‌లోని ఏ నగరంలో తొలిసారి ఎలక్ట్రిక్ ఏసీ డబుల్ డెక్కర్ బస్సును తెచ్చారు? (3)
1) పుణె 2) నాగ్‌పూర్
3) ముంబై 4) ఢిల్లీ
వివరణ: దేశంలో తొలిసారిగా విద్యుత్‌తో నడిచే ఏసీ డబుల్ డెక్కర్ బస్సు ముంబైలో అందుబాటులోకి వచ్చింది. ఈ బస్సు కుర్లా బస్ డిపో నుంచి బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ వరకు వెళ్తుంది.
13. సీతారామ, సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్‌లు ఏ జిల్లాలకు ప్రయోజనం? (4)
1) ఖమ్మం 2) భద్రాద్రి కొత్తగూడెం
3) మహబూబాబాద్ 4) పైవన్నీ
వివరణ: సీతమ్మ సాగర్ బ్యారేజీ, సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రూ.18,900 కోట్ల వ్యయంతో సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను కేంద్రానికి సమర్పించింది. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. 3.29 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 3.45 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యం అవుతుంది. తాజాగా సవరించిన సమగ్ర నివేదికను కేంద్రానికి ఇచ్చింది.
14. ఏ రంగంలో పరిశోధనకు ఫ్లాండర్స్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది? (2)
1) కృత్రిమ మేధ 2) జీవశాస్త్రం
3) రోబోటిక్స్ 4) ఎలక్ట్రానిక్స్
వివరణ: జీవశాస్త్రంలో పరిశోధనకు తెలంగాణ ప్రభుత్వం, ఫిట్ (ఎఫ్ఐటీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎఫ్ఐటీ పూర్తి రూపం- ఫ్లాండర్స్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడ్ అని అర్థం. ఇది బెల్జియం దేశానికి సంబంధించింది. ఫ్లాండర్స్ అనేది బెల్జియంలో ఒక స్థానిక ప్రభుత్వం. ఈ ప్రాంతానికి జీవశాస్త్ర పరిశ్రమలకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో పేరు ఉంది.
15. భారత దేశపు జాతీయ మెట్రో రైల్ నాలెడ్జ్ సెంటర్‌ను ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నారు? (3)
1) లఢక్ 2) వడోదర
3) ఢిల్లీ 4) సూరత్
వివరణ: భారత దేశపు తొలి మెట్రో రైల్ నాలెడ్జ్ సెంటర్ ఢిల్లీలో రానుంది. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో దీన్ని అందుబాటులోకి తేనున్నారు. జీఏ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దీన్ని అందుబాటులోకి తేనుంది. ఢిల్లీలోని విశ్వవిద్యాలయా మెట్రో స్టేషన్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. మెట్రో రైల్ వ్యవస్థలకు సంబంధించి ఒక సృజనాత్మక, పరిశోధన వేదికగా ఇది పని చేయనుంది. ఈ తరహా వ్యవస్థ తొలిసారి భారత్‌లో అందుబాటులోకి రానుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?