Current Affairs | ఏ దేశాన్ని ఇటీవల ఆఫ్రికన్ యూనియన్ బహిష్కరించింది?
1. ఏ దేశాన్ని ఇటీవల ఆఫ్రికన్ యూనియన్ బహిష్కరించింది?
1. యూనివర్సిటీలకు సంబంధించి కొత్త ర్యాంకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని నిర్ణయించిన కూటమి కింది వాటిలో ఏది? (4)
1) నాటో 2) సార్క్
3) బిమ్స్టెక్ 4) బ్రిక్స్
వివరణ: బ్రిక్స్ అనేది ఐదు దేశాల కూటమి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా ఇందులో భాగం. ఈ కూటమిలోని విద్యా శాఖ మంత్రుల సమావేశం ఇటీవల దక్షిణాఫ్రికాలోని పుమలంగా అనే ప్రావిన్స్‌లో నిర్వహించారు. యూనివర్సిటీలకు సంబంధించి కొత్త ర్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. సంబంధిత సమాచారాన్ని శాస్త్రీయ పద్ధతిలో క్రోడీకరించాలని కూడా ప్రతిపాదించారు. విశ్వవ్యాప్తంగా ఇలాంటి సమాచారం సేకరించాల్సిన అవసరాన్ని రష్యా విద్యా శాఖ మంత్రి మోగివెల్స్కి తెలిపారు. దీనివల్ల యూనివర్సిటీ విద్యా వ్యవస్థల్లో మార్పులు తీసుకు రావచ్చని అభిప్రాయపడ్డారు.
2. ఏ దేశంలో కలరా విజృంభణ చిన్నారుల్లో అధికంగా ఉందని ఇటీవల యునిసెఫ్ నివేదిక ఇచ్చింది?(2)
1) బ్రూనై
2) డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో
3) పాకిస్థాన్ 4) అల్జీరియా
వివరణ: 2017 నుంచి సంఘర్షణ, స్థానభ్రంశం ఉన్న నేపథ్యంలో ఆఫ్రికాలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కలరా విజృంభిస్తుందని న్యూయ్యార్క్ కేంద్రంగా పనిచేసే యునిసెఫ్ పేర్కొంది. ఆ దేశంలో అంతర్గతంగా 6.3 మిలియన్ల మంది స్థానభ్రంశం చెందారని వెల్లడించింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కలరా ఇంకా ఎక్కువగానే ఉందని, ఏటా 2.9 మిలియన్ల కేసులు వస్తుండగా, 95,000 మరణాలు కూడా సంభవిస్తున్నాయని తెలిపింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఏటా 1,89,000 కేసులు నమోదవుతున్నాయి. 2023లో తొలి అయిదు నెలల్లోనే 31,342 కేసులు నమోదయ్యాయి దాదాపు 230 మరణాలు కూడా సంభవించాయని, తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం లేకపోవడం వల్లే ఇలాంటివి సంభవిస్తాయని యునిసెఫ్ తెలిపింది.
3. ఏ దేశంలో తీవ్ర స్థాయిలో జల సంక్షోభం ఉందని ఇటీవల ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ పేర్కొంది? (3)
1) కెన్యా 2) దక్షిణాఫ్రికా
3) అఫ్గానిస్థాన్ 4) ఫిజీ
వివరణ: అఫ్గానిస్థాన్‌లోని ప్రజల్లో 79% మంది ప్రజలు నీళ్లు లేక తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ వెల్లడించింది. గడిచిన 30 సంవత్సరాల్లో ఇలాంటి సంక్షోభం ఎన్నడూ లేదని కూడా పేర్కొంది. అత్యవసరాలకు కూడా నీరు దొరకని పరిస్థితితో 2.3 మిలియన్ల అఫ్గాన్ పౌరులు తీవ్ర కష్టాలు పడుతున్నారని, వీరిని ఆదుకొనేందుకు దాదాపు 33 మిలియన్ డాలర్లను సమీకరించాలని వెల్లడించింది. ఆ దేశంలోని మొత్తం 34 ప్రావిన్సుల్లో 25 కరువు కోరల్లో ప్రస్తుతం ఉన్నట్లు తెలిపింది.
4. గ్లోబల్ ఇనీషియేటివ్ ఆన్ డిజిటల్ హెల్త్ అమలుకు భారత్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? (4)
1) ప్రపంచ బ్యాంక్
2) ప్రపంచ వాణిజ్య సంస్థ
3) ఐక్యరాజ్య సమితి మానవ
హక్కుల సంఘం
4) ప్రపంచ ఆరోగ్య సంస్థ
వివరణ: గ్లోబల్ డిజిటల్ హెల్త్ అమలుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత జీ-20 నాయకత్వ వ్యవస్థలు సంయుక్తంగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ప్రజలందరికీ డిజిటల్ ఆరోగ్యాన్ని అందించేందుకు ఉద్దేశించింది ఇది. ఇందుకు 2020-25 కాలానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ డిజిటల్ ఆరోగ్య విధానాన్ని కూడా ఇప్పటికే ప్రకటించింది.
5. రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్‌కు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చిన తొలి దేశం ఏది? (2)
1) యూకే 2) యూఎస్ఏ
3) ఆస్ట్రేలియా 4) ఇజ్రాయెల్
వివరణ: గర్భంలోని శిశువుల రక్షణకు తొలిసారిగా రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ రాకుండా ఫైజర్ సంస్థ వ్యాక్సిన్‌ను రూపొందించింది. దీనికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి లభించింది. ఈ వైరస్ వల్ల గతంలో చాలామంది చిన్నారులు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చేది. ఈ వ్యాక్సిన్ ద్వారా ఆ ఇబ్బందులు తప్పుతాయి. చిన్నపిల్లలకు కూడా ఈ వైరస్ సోకుతుంది. అయితే నవజాత శిశువులకు మాత్రం ఇది సోకితే తీవ్ర రూపాన్ని దాల్చుతుంది.
6. ఏ దేశంలో పిరిప్కురా గిరిజన జాతి ఉంది? (3)
1) దక్షిణాఫ్రికా 2) సూడాన్
3) బ్రెజిల్ 4) పెరూ
వివరణ: బ్రెజిల్ దేశంలో అమెజాన్ అటవీ ప్రాంతంలో కనిపించే గిరిజన జాతి పిరిప్కురా. ప్రస్తుతం ఇందులో ముగ్గురు మాత్రమే ఉన్నట్లు భావిస్తున్నారు. ఇటీవల తమండు అనే పేరు గల వ్యక్తి కనిపించాడు. సాధారణంగా ఈ గిరిజనులు కనిపించడం అరుదు. బాహ్య ప్రపంచంతో పెద్దగా సంబంధాలను కలిగి ఉండేందుకు ఆసక్తి చూపరు. తమ ప్రాచీన జీవన విధానాన్నే నేటికీ కొనసాగిస్తున్నారు. అయితే వీరి జనాభా ప్రస్తుతం ఎంత ఉంది, గతంలో ఎంత ఉందన్న విషయం కూడా ఎక్కడా స్పష్టత లేదు. అమెజాన్ అడవుల్లో, అత్యధికంగా జీవ వైవిధ్యం ఉన్న ప్రాంతాల్లో వీళ్లు నివసిస్తారు.
8. ప్రైమా ఈటీ11 అంటే ఏంటి? (2)
1) ఉద్యోగాల కల్పనకు కొత్త పథకం
2) ఈ-ట్రాక్టర్
3) విద్యుత్‌తో నడిచే సైకిల్
4) ఏదీకాదు
వివరణ: సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎంఈఆర్ఐ) రూపొందించిందే ప్రైమా ఈటీ 11. ఇది ఈ-ట్రాక్టర్. భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి ఈ-ట్రాక్టర్ ఇదే. సీఎంఈఆర్ఐ ప్రధాన కేంద్రం దుర్గాపూర్‌లో ఉంది. 1958, ఫిబ్రవరి 26న స్థాపించారు. సీఎస్ఐఆర్కు అనుబంధంగా ఉండే ఈ సంస్థ ఈ-ట్రాక్టర్‌ను తయారు చేసింది.
9. జొహాన్నెస్‌బర్గ్‌లో నిర్వహించిన బ్రిక్స్ సమావేశంలో మోదీ ఇచ్చిన ప్రసంగానికి సంబంధించి కింది వాటిలో సరైనదేది? (3)
1) ప్రపంచంలో అతి త్వరలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలువనుంది
2) అణ్వాయుధాల్లో అగ్రస్థానం
3) రానున్న సంవత్సరాల్లో అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్
4) రానున్న సంవత్సరాల్లో 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్
వివరణ: ప్రస్తుతం ప్రపంచానికి భారత్ వృద్ధి ఇంజిన్‌గా ఉందని ప్రధాని మోదీ అన్నారు. దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్‌బర్గ్‌లో నిర్వహించిన బ్రిక్స్ ప్రభుత్వాధినేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రానున్న సంవత్సరాల్లో భారత్ అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అతి వేగంగా వృద్ధి చెందుతుంది భారతే అని అన్నారు. పలు పథకాలను ఉదహరించారు. ప్రత్యక్ష నగదు బదిలీతో అవినీతి తగ్గడంతో పాటు పారదర్శకత పెరిగిందని, లబ్ధిదారులకు సేవలు వేగంగా అందుతున్నట్లు వెల్లడించారు. యూపీఐ అన్ని వ్యవస్థలకు వెళ్లిందని, వీధి వ్యాపారులకు కూడా చేరువ చేసినట్లు చెప్పారు.
10. 20వ ఆసియాన్-భారత్ ఆర్థిక మంత్రుల సమావేశం ఏ నగరంలో నిర్వహించారు? (4)
1) నామ్‌ఫెన్ 2) బ్యాంకాక్
3) హవాయ్ 4) సెమరంగ్
వివరణ: 20వ ఆసియాన్-భారత ఆర్థిక మంత్రుల సమావేశం ఇండోనేషియాలోని సెమరంగ్లో ఆగస్టు 21న నిర్వహించారు. ఆసియాన్ కూటమిలోని పది దేశాలు ఇందులో పాల్గొన్నాయి. తైమూర్ దేశం పరిశీలక హోదాలో హాజరయ్యింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్-ఆసియాన్ దేశాల మధ్య 131.5 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. ఇతర ప్రపంచంతో భారత వాణిజ్యంలో ఆసియాన్ దేశాల వాటా 11.3% ఉంది. ఇరుప్రాంతాల మధ్య వాణిజ్యం మరింత పెంపొందించాలని నిర్ణయించారు. 2009లో ఇరుప్రాంతాల మధ్య ఆసియాన్-ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ కుదిరింది. దీనిపై విస్తృతంగా చర్చించారు.
11. లూనా-25 ఏ దేశ ప్రయోగం? (2)
1) అమెరికా 2) రష్యా
3) ఆస్ట్రేలియా 4) జపాన్
వివరణ: చంద్రుడిపైకి రష్యా చేపట్టిన ప్రయోగమే లూనా-25. అయితే చంద్రుడిపై కాలు మోపకుండానే ఇది కుప్పకూలిపోయింది. దీనికి కారణాలను ఇంకా వెల్లడించలేదు. విశ్లేషణ దశలోనే ఉంది. నిజానికి ఇది ఆగస్టు 21న చంద్రుడిపై కాలు మోపాల్సి ఉంది. దీనికి మొదట పెట్టిన పేరు లూనా-గ్లోబ్ ల్యాండర్. ఆగస్టు 10న దీన్ని ప్రయోగించారు. లూనా-24ను రష్యా దేశం 1976లో ప్రయోగించింది. ఇది దాదాపు 30 కేజీలు ఉన్న శాస్త్ర సాంకేతిక పరికరాలను తనతో తీసుకెళ్లింది.
12. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన చంద్రయాన్-3 ఏ తేదీన చంద్రుడిపై కాలుమోపింది? (3)
1) ఆగస్టు 21 2) ఆగస్టు 22
3) ఆగస్టు 23 4) ఆగస్టు 24
వివరణ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతమయ్యింది. ఆగస్టు 23న సాయంత్రం 6:04 నిమిషాలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు మోపింది. ఈ ప్రయోగాన్ని జూలై 14న చేపట్టారు. 41 రోజుల పాటు ప్రయాణించిన చంద్రయాన్-3 ఎలాంటి ఇబ్బందులు లేకుండా చంద్రుడిపై దిగింది. దక్షిణ ధ్రువంపై కాలు పెట్టిన తొలి దేశంగా భారత్ రికార్డ్ సృష్టించింది. అలాగే ఉపగ్రహంపై కాలు పెట్టిన నాలుగో దేశం. ఇంతకు మునుపు అమెరికా, యూఎస్ఎస్ఆర్, చైనా దేశాలు ఈ ఘనతను సాధించాయి. పద్నాలుగు రోజుల పాటు చంద్రయాన్-3 వివిధ అంశాలను పరిశీలించనుంది. ఎల్వీఎం-3 ఉపగ్రహ వాహక నౌకను వినియోగించి ఈ ప్రయోగాన్ని చేపట్టారు.
13. చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు? (2)
1) సోమ్‌నాథ్ 2) వీరముత్తువేల్
3) ముత్తయ్య వనిత
4) మైల్స్వామి అన్నాదురై
వివరణ: చంద్రయాన్-3 ప్రాజెక్టుకు వీరముత్తువేల్ నేతృత్వం వహించారు. ప్రస్తుతం ఇస్రో చైర్మన్‌గా సోమ్‌నాథ్ ఉన్నారు. భారత్ చంద్రయాన్-1ను 2008లో విజయవంతంగా పూర్తి చేసింది. ఆ ప్రాజెక్ట్‌కు మైల్స్వామి అన్నాదురై నేతృత్వం వహించారు. ఆయనను మూన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. చంద్రయాన్-2 ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ముత్తయ్య వనిత వ్యవహరించారు. తొలి చంద్రయాన్ సమయంలో ఇస్రో చైర్మన్‌గా మాధవన్ నాయర్, రెండో సందర్భంలో కే శివన్ ఉన్నారు. ప్రస్తుతం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌కు ఉన్నికృష్ణన్ నాయర్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ కేంద్రమే జీఎస్ఎల్వీ మార్క్-3ని తయారు చేసింది. ఉపగ్రహ రూపకల్పనలో కీలక పాత్ర పోషించింది యూఆర్ రావు. ఉపగ్రహ కేంద్రానికి ప్రస్తుతం శంకరన్ నేతృత్వం వహిస్తున్నారు
14. ఏ దేశాన్ని ఇటీవల ఆఫ్రికన్ యూనియన్ బహిష్కరించింది? (4)
1) సూడాన్ 2) జింబాబ్వే
3) బుర్కినా ఫాసో 4) నైగర్
వివరణ: ఆఫ్రికన్ యూనియన్ 55 దేశాల కూటమి. అన్ని ఆఫ్రికా ఖండంలోనివే. ఇటీవల ఈ కూటమి నుంచి నైగర్ దేశాన్ని సస్పెండ్ చేశారు. ఆ దేశంలో తిరుగుబాటు జరిగింది. పౌర ప్రభుత్వాన్ని కూలదోశారు. ఇప్పటికే ఆ దేశంపై యూరోపియన్ యూనియన్ పలు ఆంక్షలు విధించింది. తాజాగా ఆఫ్రికన్ యూనియన్ నైగర్‌ను సస్పెండ్ కూడా చేసింది. ఈ కూటమిని అధికారికంగా 2002లో ఏర్పాటు చేశారు. 1963 నుంచి 1999 వరకు ఇది ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ అనే పేరుతో కొనసాగింది.
7. యసునీ జాతీయ పార్క్ ఏ దేశంలో ఉంది? (1)
1) ఈక్వెడార్ 2) అర్జెంటీనా
3) పనామా 4) జింబాబ్వే
వివరణ: యసునీ జాతీయ పార్క్ ఈక్వెడార్ దేశంలో ఉంది. భూమధ్య రేఖకు అత్యంత పశ్చిమాన ఉన్న దేశం ఇది. ఈ దేశ రాజధాని క్యోటో. దీనికి ప్రపంచంలో రెండో అత్యంత ఎత్తయిన రాజధానిగా పేరుంది. యసునీ జాతీయ పార్క్ ఇటీవల కాలంలో వార్తల్లో ఉంది. చమురు కోసం డ్రిల్లింగ్ చేపట్టేందుకు రెఫరెండం నిర్వహించగా, స్థానికులు తిరస్కరించారు. ఇక్కడ ఉండే జీవ వైవిధ్యం దెబ్బతింటుందంటూ ప్రజలు నిర్ణయించి, రెఫరెండంలో పాల్గొని తమ ప్రాంతాన్ని కాపాడుకున్నారు. ఈ జాతీయ పార్క్‌ను 1989లో యునెస్కో వారసత్వ సంపద జాబితాలో చేర్చారు. ఇది సుమారుగా 9820 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది.
15. ధోల్పూర్-కరౌలీ రిజర్వ్ ఏ రాష్ట్రంలో రానుంది? (3)
1) మధ్యప్రదేశ్ 2) ఉత్తరాఖండ్
3) రాజస్థాన్ 4) ఛత్తీస్‌గఢ్
వివరణ: ధోల్పూర్-కరౌలీ అనేది భారత్‌లో రానున్న కొత్త పులుల రిజర్వ్. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. దీంతో భారతదేశంలో పులుల రిజర్వ్ సంఖ్య 54కు చేరనుంది. రాజస్థాన్‌లో ఇప్పటికే నాలుగు ఉన్నాయి. అవి.. రామ్‌ఘర్ విష్ధారి, ముకంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్, రణథంబోర్ టైగర్ రిజర్వ్, సర్సికా టైగర్ రిజర్వ్. కొత్తగా ధోల్పూర్-కరౌలీ టైగర్ రిజర్వ్‌ను ఏర్పాటు చేయడానికి జాతీయ పులుల పరిరక్షణ ప్రాధికార సంస్థ అనుమతి ఇచ్చింది. కొత్త పులుల రిజర్వ్ 1058 చదరపు కిలోమీటర్లలో విస్తరించనుంది. ఇందులో 368 చదరపు కిలోమీటర్లు కోర్ ఏరియాగా, మరో 690 చదరపు కిలోమీటర్లు బఫర్ ఏరియాగా ఉండనుంది.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
21st సెంచరీ ఐఏఎస్
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?