2022 రౌండప్ – జాతీయ ఆర్థిక అంశాలు
వ్యవసాయ రంగం
పీఎంకేఎస్‌వై: ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజనను 2026 మార్చి వరకు పొడిగించారు. ఈ పథకం అమలుకు రూ.4600 కోట్లు కేటాయించారు. 2017 మే నెలలో ఈ పథకాన్ని ఎస్ఏఎంపీఏడీఏ (సంపద) అనే పేరుతో ప్రారంభించి ఆ తర్వాత పీఎంకేఎస్‌వై అని మార్చారు.
జీవ: సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు నాబార్డ్ జీవ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒక్కో హెక్టారుకు రూ.50,000 వ్యయం చేయనుంది.
పునరుత్పాదక శక్తి: వ్యవసాయ రంగంలో 2024 నాటికి పూర్తిగా పునరుత్పాదక శక్తిపైనే ఆధారపడాలని కేంద్రం నిర్ణయించింది. శిలాజేతర ఇంధనాల వాడకాన్ని పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
పెరిగిన పాల ఉత్పత్తి: గడిచిన ఎనిమిదేళ్లలో పాల ఉత్పత్తి 83 మిలియన్ టన్నులు పెరిగింది.
చక్కెర ఉత్పత్తి: ప్రపంచంలోనే చక్కెర ఉత్పత్తిలో భారత్ తొలి స్థానాన్ని దక్కించుకుంది. అలాగే చక్కెర ఎగుమతిలో రెండో స్థానంలో ఉంది.
కనీస మద్దతు ధరపై కమిటీ: కనీస మద్దతు ధరపై కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ నేతృత్వం వహిస్తున్నారు.
మౌలిక సదుపాయాలు
పొడవైన సొరంగ హైవే: హిమాచల్‌ప్రదేశ్‌లోని అటల్ టన్నెల్ (సొరంగ మార్గం)ను 10,000 అడుగుల ఎత్తులో ఉన్న వాటిలో అత్యంత పొడవైందిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ గుర్తించింది.
విద్యుత్ ఉత్పత్తిలో మిగులు: భారత్ మిగులు విద్యుత్ దేశంగా ఈ సంవత్సరం అవతరించింది. దేశం మొత్తాన్ని ఒక్క గ్రిడ్ కిందకు తీసుకొచ్చి, పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయనున్నారు. ప్రస్తుతం సరాసరి గ్రామీణ ప్రాంతాల్లో 22 గంటల పాటు, పట్టణ ప్రాంతాల్లో 23.5 గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు.
ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే: దేశంలో మొట్టమొదటి ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే 2023లో అందుబాటులోకి రానుంది. దీని పేరు ద్వారక ఎక్స్‌ప్రెస్. ఇది అమల్లోకి వస్తే ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్ మార్గంలో రహదారి రద్దీ తగ్గుతుంది.
ఇతరాలు
ఎయిర్ ఇండియా: ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ అప్పగించారు. గతేడాది ప్రారంభమైన ప్రక్రియ జనవరి 27తో పూర్తయ్యింది. ఎయిర్ ఇండియాను టాటా సంస్థే ప్రారంభించింది. 1950 దశకంలో దీన్ని జాతీయం చేశారు.
ఎన్ఐఎన్ఎల్: నీల్చల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌ను ప్రైవేటీకరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీన్ని కూడా టాటా సంస్థ కొనుగోలు చేసింది.
ఎల్ఐసీలో ఎఫ్‌డీఐలు: ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీలో 20% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
పెరిగిన తలసరి ఆదాయం: జాతీయ ఆహార భద్రతా చట్టం అమలు చేస్తున్నప్పటి నుంచి పోలిస్తే దేశంలో తలసరి ఆదాయం 33.4% పెరిగిందని కేంద్రం పేర్కొంది.
విండ్ టర్బైన్: దేశంలో అతిపెద్ద విండ్ టర్బైన్ ప్రాజెక్టును అదాని న్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌లో ఏర్పాటు చేసింది.
పెట్టుబడుల ఆకర్షణ: ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో పెట్టుబడుల ఆకర్షణలో తొలి స్థానంలో ఆంధప్రదేశ్, రెండో స్థానంలో ఒడిశా నిలిచాయని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ పేర్కొంది.
బులియన్ ఎక్సేంజ్: దేశంలోనే తొలి అంతర్జాతీయ బులియన్ ఎక్స్చేంజ్ను గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జూలై 29న ప్రారంభించారు. దీని పేరు ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్సేంజ్.
రైల్వే రంగం
సూరత్: దేశంలో తొలి బుల్లెట్ రైల్ స్టేషన్ సూరత్‌లో రానుంది. దీనికి జపాన్ దేశం ఆర్థిక, సాంకేతిక సాయం చేయనుంది.
రెజ్లింగ్ అకాడమీ: దేశంలోనే అతిపెద్ద రెజ్లింగ్ అకాడమీని భారత రైల్వే రంగం ఢిల్లీలోని కిషన్‌గంజ్‌లో ఏర్పాటు చేయనుంది. ఇందుకు రూ.30.76 కోట్ల వ్యయం చేయనున్నారు.
కవచ్: స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆటోమేటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ సిస్టమ్‌ను భారత రైల్వే అధికారులు విజయవంతంగా పరీక్షించారు. ఈ విధానంలో రైళ్లు ఢీకొనవు. సెన్సార్ల ద్వారా ఇది పనిచేస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 2000 కిలోమీటర్ల రైల్వే లైన్లను కవచ్ పరిధిలోకి తెస్తారు. ఆ తర్వాత ప్రతి ఏడు 4000 నుంచి 5000 కిలోమీటర్లు పెంచుకుంటూ మొత్తం 34,000 కిలోమీటర్ల వరకు కవచ్ పరిధిలోకి తెస్తారు.
గతిశక్తి కార్గో టెర్మినల్: భారత రైల్వేల్లో మొట్టమొదటి గతిశక్తి కార్గో టెర్మినల్‌ను తూర్పు రైల్వేలోని అసనాల్ డివిజన్లో అందుబాటులోకి తెచ్చారు.
బ్యాంకింగ్ రంగం
ద్రవ్యవిధానం: తాజా ద్రవ్య విధానాన్ని ఆర్బీఐ డిసెంబర్ తొలి వారంలో ప్రకటించింది. రెపోరేట్‌ను 35 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ సంవత్సరంలో రెపోరేట్‌ను పెంచడం వరుసగా ఇది ఐదో సారి. ప్రస్తుతం వివిధ విధాన రేట్లు, పాలసీ రేట్లను పరిశీలిస్తే- రెపోరేట్ 6.25%, రివర్స్ రెపోరేట్-3.35%, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్-6.50%, బ్యాంక్ రేటు-6.50%, నగదు నిల్వల నిష్పత్తి-4.50%, చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి-18%.
డిజిటల్ బ్యాంక్ యూనిట్లు: దేశ వ్యాప్తంగా 75 డిజిటల్ బ్యాంక్ యూనిట్లను ప్రధాని నరేంద్రమోదీ అక్టోబర్ 16న జాతికి అంకితం చేశారు. ఇందులో తెలంగాణలో ఖమ్మం, సిరిసిల్ల, జనగామలో డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు ఉన్నాయి.
డి-ఎస్ఐబీ (డి-సిబ్): దీని పూర్తి రూపం- డొమెస్టిక్ సిస్టమేటికల్లి ఇంపార్టెంట్ బ్యాంక్. ఈ ఏడాది కేవలం మూడు బ్యాంకులనే డి-సిబ్ బ్యాంకులుగా ప్రకటించింది. ఏ బ్యాంకులైతే విఫలమయ్యే అవకాశం తక్కువగా ఉంటుందో, వాటిని ఈ విభాగంగా ఆర్బీఐ ప్రకటిస్తుంది.
ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్: టెలికం రంగంలోని ఎయిర్టెల్, బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించింది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ షెడ్యూల్డ్ బ్యాంక్‌గా ఆర్బీఐ గుర్తించింది.
యూపీఐ123 డిజిసాథి: ఫీచర్ ఫోన్లలో కూడా ఆన్లైన్ చెల్లింపులు చేసేందుకు డిజిసాథి కార్యక్రమాన్ని ఆర్బీఐ ప్రారంభించింది. దీనికి పెట్టిన పేరు యూపీఐ123 డిజిసాథి.
ఎన్ఏబీఎఫ్ఐడీ: అఖిల భారత ఆర్థిక సంస్థగా ఎన్ఏబీఎఫ్ఐడీని ఆర్బీఐ గుర్తించింది. దీని పూర్తి రూపం-నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. దీనికి ముందు భారత్‌లో ఈ స్థాయిని కలిగి ఉన్న బ్యాంకులు ఎగ్జిమ్ బ్యాంక్, నాబార్డ్, ఎన్‌హెచ్‌బీ, సిడ్బీ
డిజిటల్ రూపాయి: డిజిటల్ రూపాయిని ప్రయోగాత్మకంగా ఆర్బీఐ నవంబర్ 1న ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. తొమ్మిది బ్యాంకులు ఇందులో పాల్గొంటాయి. అవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, యస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్ఎస్బీసీ.
ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీ: దేశంలో తొలిసారి ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీని ప్రవేశపెట్టిన బ్యాంక్‌గా హెచ్డీఎఫ్సీ నిలిచింది. నేషనల్ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఈ ప్రక్రియను హెచ్డీఎఫ్సీ పూర్తి చేసింది.
ఎఫ్ఎస్ఐబీ: బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో స్థానంలో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ)ను ఏర్పాటు చేశారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక వ్యవస్థల్లో ఉన్నత పదవుల్లో వ్యక్తుల ఎంపికకు బ్యాంక్స్ బోర్డ్ బ్యూరోను ఏర్పాటు చేశారు. దీనికి చట్టబద్ధత లేదని ఢిల్లీ హైకోర్ట్ తీర్పు చెప్పిన నేపథ్యంలో ఎఫ్ఎస్ఐబీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.
పరిశ్రమలు
డాబర్ సంస్థ: ప్లాస్టిక్ తటస్థ సంస్థగా డాబర్ అవతరించింది. ఈ ఘనతను దక్కించుకున్న భారత తొలి వినియోగ వస్తువుల సంస్థ ఇదే.
ఆర్‌ఏఎంపీ: దీని పూర్తి రూపం- రైజింగ్ అండ్ యాగ్జిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫామెన్స్. సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమల ప్రయోజనాల కోసం ప్రారంభించారు. ప్రపంచ బ్యాంక్ సాయంతో కేంద్రం దీన్ని అమలు చేయనుంది.
ద్రోణి: భారత్‌లో తయారైన కెమెరా డ్రోన్‌ను భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ప్రారంభించారు. దీనికి పెట్టిన పేరే ద్రోణి. దీన్ని గరుడ ఎయిర్ స్పేస్ రూపొందించింది.
సూచీలు
పోటీ తత్వ సూచీ: ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ దీన్ని రూపొందించింది. దీనిలో భారత్ 37వ స్థానంలో ఉంది. గతంలో 43వ స్థానంలో ఉంది. అగ్రస్థానంలో డెన్మార్క్ ఉంది.
ఇన్నోవేషన్ ఇండెక్స్: జెనీవా కేంద్రంగా పనిచేసే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ దీన్ని రూపొందించింది. భారత్ 40వ స్థానంలో ఉంది. తొలి స్థానంలో స్విట్జర్లాండ్ ఉంది.
మానవ అభివృద్ధి సూచీ: యూఎన్డీపీ దీన్ని విడుదల చేసింది. భారత్ 132వ స్థానంలో ఉంది.
సంతోష సూచీ: ఐక్యరాజ్య సమితికి చెందిన సస్టెయినబుల్ సొల్యూషన్స్ డెవలప్మెంట్ ఇండెక్స్ దీన్ని విడుదల చేసింది. మొత్తం 146 దేశాలకు భారత్ 136వ స్థానంలో ఉంది. అగ్రస్థానంలో ఫిన్లాండ్ ఉండగా చివరన అఫ్గానిస్థాన్ ఉంది. ఇదే సంస్థ విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో భారత్ 117వ స్థానంలో ఉండగా, స్వీడన్ అగ్రస్థానంలో నిలిచింది.
వ్యాపారానుకూలత సూచీ: ఈ సూచీని ప్రపంచ బ్యాంక్ రూపొందించింది. భారత్ 63వ స్థానంలో ఉంది. అగ్రస్థానంలో న్యూజిలాండ్ ఉంది.
ఆకలి సూచీ: ఇంటర్నేషనల్ పాలసీ రిసెర్చ్ సంస్థ విడుదల చేసే ఈ సూచీలో భారత్ 94వ స్థానంలో ఉంది.
లింగ అసమానతల సూచీ: న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే యూఎన్డీపీ దీన్ని విడుదల చేస్తుంది. ఇందులో భారత్ 123వ స్థానంలో ఉంది. తొలి స్థానంలో స్విట్జర్లాండ్ ఉంది.
వార్తల్లో వ్యక్తులు
మిసెస్ వరల్డ్
l మిసెస్ వరల్డ్-2022 కిరీటాన్ని భారత్‌కు చెందిన సర్గం కౌశల్ గెలుచుకుంది. అమెరికాలోని లాస్ వెగాస్‌లో డిసెంబర్ 18న ఈ పోటీలను నిర్వహించారు. పెండ్లయిన వారికి నిర్వహించే ఈ పోటీలో 63 దేశాల నుంచి అందగత్తెలు పాల్గొనగా, సర్గం కౌశల్ విజేతగా నిలిచింది. ఆమె భర్త ఆది కౌశల్ భారత నౌకాదళ అధికారిగా విశాఖపట్నంలో పనిచేస్తున్నారు. 21 ఏండ్ల తర్వాత భారత్‌కు మిసెస్ వరల్డ్ కిరీటం దక్కింది. 2001లో తొలిసారి భారత్‌కు చెందిన డాక్టర్ అదితి గోవిత్రికర్ ఈ కిరీటాన్ని దక్కించుకున్నారు. 1984 నుంచి ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.
మిస్ ఇంటర్నేషనల్
l 60వ మిస్ ఇంటర్నేషనల్-2022 కిరీటాన్ని జర్మనీకి చెందిన జాస్మిన్ సెల్‌బర్గ్ గెలుచుకుంది. 66 మంది పాల్గొన్న ఈ పోటీలను డిసెంబర్ 13న జపాన్‌లోని టోక్యోలో నిర్వహించారు. మొదటిసారి ఈ పోటీలు 1960లో జరిగాయి.
రిషి రాజ్పోపట్
l క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం (2500 ఏళ్ల) నుంచి అనేక మంది సంస్కృత పండితులకు కొరకరాని కొయ్యగా మారిన ఓ వ్యాకరణ సమస్యను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న భారత విద్యార్థి రిషి రాజ్పోపట్ (27) పరిష్కరించాడు. దీనికి సంబంధించిన రిసర్చ్ ‘ఇన్ పాణిని, వియ్ ట్రస్ట్: డిస్కవరింగ్ ది అల్గారిథమ్ ఫర్ రూల్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ ఇన్ ది అష్టాధ్యాయి’ డిసెంబర్ 15న ప్రచురితమయ్యింది. భాషాశాస్త్ర పితామహుడిగా పేరుగాంచిన పాణిని బోధించిన ఓ నియమానికి పరిష్కారం చూపడం ద్వారా ఈ ఘనత సాధించాడు. ఈ ఆవిష్కరణ విప్లవాత్మకమని సంస్కృత నిపుణులు భావిస్తున్నారని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పేర్కొంది. ఈ ప్రకారం పాణిని వ్యాకరణాన్ని కూడా కంప్యూటర్లో ఉపయోగించవచ్చని వెల్లడించింది.
l రెండు సమాన స్థాయి సూత్రాల మధ్య వైరుధ్యం ఏర్పడితే మొదటి దానికన్నా తర్వాతి దానికే ప్రాముఖ్యం ఇవ్వాలని ఇన్నాళ్లూ అందరూ భావిస్తూ వచ్చారు. కానీ ఇక్కడ చూడాల్సింది ముందు, వెనుక అని కాదు. ఎడమ, కుడిగా చూస్తే సమస్య పరిష్కారం అవుతుందని తేల్చాడు. దీనికి ఉదాహరణగా ‘జ్ఞానం దియతే గురునా’ అనే వాక్యాన్ని తీసుకొని సరికొత్త భాష్యం చెప్పాడు. ‘జ్ఞానం గురువు ద్వారా ఇవ్వబడుతుంది’ అని ఆ వాక్యానికి అర్థం. ఇక్కడ ‘ఇచ్చువాడు’ అనే అర్థంలో ‘గురునా’ను ఉపయోగించారు. ఇందులో ‘గురు’, ‘ఆ’ అనే ధాతువులున్నాయి. పాణిని సూత్రాన్ని సరిగా అర్థం చేసుకొంటే ఇక్కడ కుడివైపున ‘ఆ’ ఉంది. దానికి ముందు ‘న’ కారం చేరిస్తే ‘గురునా’ అనే పదం ఏర్పడుతుంది. జయాదిత్య, వామనులు తమ ‘కాశికావృత్తి’లో, పతంజలి ‘మహాభాష్యం’లో, కాత్యాయనుడు ‘వార్తికకార’లో ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నించి విఫలమయ్యారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?