కష్టించి సాధించు కానిస్టేబుల్..
రాష్ట్రప్రభుత్వ పరిధిలో వేలల్లో ఉద్యోగాలను భర్తీచేసే శాఖల్లో పోలీస్ మొదటిది. ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదివితే పోలీస్ ఉద్యోగం అందినట్టే. గతంలో 18 వేల కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన భర్తీ ప్రక్రియ విజయవంతమైంది. ఇప్పుడు ప్రభుత్వం 16 వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టులకు మరో నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల అనుభవాలతోపాటు కొత్తగా ప్రిపేరయ్యే విద్యార్థులు లేదా అభ్యర్థులకు సూచనలు, సలహాలు అందిస్తున్నాం.
-ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వరుసగా పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసింది. 2016 లో సుమారు 9వేల ఉద్యోగాలు, 2018లో 18 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది ఇప్పుడు మరో 16 వేల ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. గత ఫలితాలలో కొద్దిపాటి మార్కులతో మిస్ అయిన విద్యార్థులు కూడా ఆత్మైస్థెర్యం కోల్పోకుండా మళ్లీ ప్రిపరేషన్ కొనసాగించాలి.
కానిస్టేబుల్ ఎంపికకు 3 స్టేజెస్లు ఉంటాయి.
1. ప్రిలిమినరీ పరీక్ష
2. ఫిజికల్ ఈవెంట్స్
3. మెయిన్ ఎగ్జామ్
-ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష దాదాపుగా ఒకే విధంగా ఉంటుంది. 200 ప్రశ్నలకు 200 మార్కులతో నెగటివ్ మార్కులు లేకుండా క్వాలిఫై మాత్రమే అయ్యేటట్లు ప్రిలిమ్స్ నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, చరిత్ర, జాగ్రఫి, పాలిటి, ఎకనామిక్స్, కరెంట్ అఫైర్స్ లపై ప్రశ్నలు అడుగుతారు. ఇందులో క్వాలిఫై (వారి వారి రిజర్వేషన్లకు అనుగుణంగా) అయిన అభ్యర్థులు ఫిజికల్ పరీక్షకు అర్హులు. ఫిజికల్ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్ పరీక్షకు అర్హులు.
-ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయితే సరిపోతుంది. కానీ ఫిజికల్ టెస్ట్‌లో వారి నైపుణ్యం ఆధారంగా మార్కులు నిర్ణయిస్తారు. అవి ఉద్యోగం రావడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇక పోలీసు పరీక్ష రాసే అభ్యర్థులను ఎక్కువగా (ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులను) భయాందోళనకు గురి చేసే సబ్జెక్ట్ అర్థమెటిక్. ముందుగా ఇందులో ఏ అంశాలు ఉంటాయి, రాబోవు నోటిఫికేషన్లు, నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఎక్కువ మార్కులు ఏ విధంగా స్కోర్ చేయాలో పరిశీలిద్దాము.
గణితంపై పట్టు
-మ్యాథ్స్.. ఏరంగంలోనైనా దూసుకుపోగల సబ్జెక్ట్. ఇదివరకు టెట్, డీఎస్సీ, కానిస్టేబుల్, ఎస్సై, బ్యాంక్ పీఓ తదితర పోటీ పరీక్షల్లో అత్యంత కీలక పాత్ర మ్యాథమెటిక్స్ది. నాన్‌మ్యాథ్స్ అభ్యర్థులు గణితంపై పూర్తి అవగాహన సాధించాలంటే ప్రాధమిక ప్రక్రియలైన సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగహారాలపై పట్టు ఉండాలి. 20 వరకు ఎక్కాలు, 1 నుంచి 30 వరకు అంకెల వర్గాలు, ఘణాలు, 100లోపు ప్రధాన సంఖ్యలు. వ్యాపార గణితం, క్షేత్రగణితంలోని ముఖ్యమైన సూత్రాలపై పట్టు సాధించాలి. పోలీస్ పరీక్షలో ఉన్న అర్ధమెటిక్ అంశాలను చూద్దాం. అంశాలవారీగా వాటిని పరిశీలిద్దాం.
1. అంకగణితం
-ఇందులో గుణిజాలు, కారణాంకాలు, ప్రధాన సంఖ్యలు, 2, 3, 4, 5, 9, 11 సంఖ్యలచే భాజనీయత సూత్రాలు సహజ సంఖ్యలు. అకరణీయ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు, వర్గమూలం, దశాంశభిన్నం, కాలందూరం, కాలం-పని, శాతాలు, బారువడ్డీ, చక్రవడ్డీ, లాభ నష్టాలు, నిష్పత్తి అనుపాతం, సంవర్గమానాలు అనే అంశాలను చేర్చారు.
-ఏ పోటీ పరీక్ష తీసుకున్నా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మ్యాథ్స్ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకుని ప్రశ్నలు అడుగుతారు. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు గణితం కష్టమని పూర్తిగా వదిలేస్తుంటారు. ప్రశ్నపత్రంలోని సమస్యలన్నీ దాదాపు నిజజీవితంలో తారసపడేవే. కొద్దిపాటి మెళకువల సహాయంతో నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కూడా 100శాతం మార్కులను సాధించవచ్చు.
-ఈ అధ్యాయంలో ప్రశ్నలన్నీ ప్రతి పోటీపరీక్షలో ఉండే అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ సంఖ్యావాదంపై ఆధారపడినవి. కొద్దిపాటి ప్రిపరేషన్‌తో ఈ అధ్యాయం నుంచి వచ్చే సుమారు 20 ప్రశ్నలను తేలికగా గుర్తించవచ్చు. అందుకుగాను సంఖ్యావ్యవస్థ దాని ధర్మాలు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, ప్రధానసంఖ్యలపై ఆధార పడిన కవల ప్రధాన సంఖ్యలు, షష్ఠ్యంతర ప్రధాన సంఖ్యలు, కచక లేక వికటకవి ప్రధాన సంఖ్యలపై పూర్తి అవగాహన కలిగి ఉండి 100లోపు ప్రధాన సంఖ్యలను గుర్తుపట్టగలగాలి. ఎక్కువగా మూడంకెల సంఖ్య ప్రధాన సంఖ్య అవుతుందా కాదా? అనే అంశాన్ని చాలా పోటీపరీక్షల్లో అడిగారు. కావున దానిపైన పూర్తి పట్టుసాధించాలి. ఇక వ్యాపార గణిత విషయానికి వస్తే అవి నిత్య జీవితంలో తారసపడే ప్రశ్నలే. కొద్దిపాటి ప్రిపరేషన్‌తో వాటిపై పూర్తి అవగాహన సాధించవచ్చు.
2. క్షేత్రగణితం
-త్రిభుజం, చతుర్భుజం, చతురస్రం, సమాంతర చతుర్భుజం, వత్తాల వైశాల్యాలు, ధీర్ఘఘణ చతురస్ర ఉపరితల వైశాల్యం, ఘణపరిమాణం, శంఖువు ఉపరితల వైశాల్యం, ఘణపరి మాణం, గోళం ఉపరితల వైశాల్యం, ఘణపరిమాణం.
-జ్యామితీయ పటాల చుట్టుకొలతలు, వైశాల్యాలు, ఘణప రిమాణాల గురించి అధ్యయనం చేసే గణితశాస్త్ర విభాగాన్నే క్షేత్రగణితం అంటారు. వీటిలో ఎక్కువగా ప్రశ్నలు త్రిభుజం, చతుర్బుజ వైశాల్యాలపైన అడుగుతుంటారు.
మెళకువలు
1. అర్థం అయితే గణితం చాలా సులువు. తరగతులవారీగా సిలబస్‌ను చదవకుండా చాప్టర్స్వారీగా ప్రిపేర్ అయితే మంచిది. ఉదాహరణకు రేఖాగణితం అనే అధ్యాయనాన్ని 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న అన్ని అంశాలను ఒకేసారి ప్రిపేర్ కావడం.
2. అకడమిక్ పరీక్షలకు, పోటీ పరీక్షలకు చాలా తేడా ఉంది. అకడమిక్ పరీక్షలో పాస్ మార్క్‌లు సాధిస్తే సరిపోతుంది. కాని పోటీ పరీక్షలో 0.001 మార్కు తేడాతో కూడా ఉద్యోగ అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రణాళికాబద్ధంగా రోజుకు కనీసం 5 గంటలు ప్రాక్టీస్ చేయాలి.
3. ప్రతి పోటీ పరీక్షకు పోటీ తీవ్రంగా ఉండటం వల్ల ఎక్కువ మంది అభ్యర్థులను ఫిల్టర్ చేయడానికి ప్రశ్నపత్రం రూపొందిచేవారు సులభమైన ప్రశ్నలను కూడా వివిధ కోణాల్లో అడిగే అవకాశం ఉంది.
4. అభ్యర్థులు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారో ఆ పోటీ పరీక్షకు సంబంధించిన మోడల్ పేపర్లలోని గణిత ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం వల్ల నేర్చుకున్న విషయాలు బాగా గుర్తుండటంతో పాటు తప్పుగా గుర్తించిన సమాధానాలను వెంటనే నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పరీక్ష రాసేవారు అకుంఠిత దీక్షతో ప్రిపరేషన్ కొనసాగించాలి.
5. సిలబస్‌లో పేర్కొన్న అన్ని అధ్యాయాలను అందులోని ప్రతి భావనను బట్టీపట్టకుండా నేర్చుకోవాలి. ముఖ్యమైన సూత్రాలను ఒకచోట రాసుకోవాలి. చివరగా అభ్యర్థులు ఒత్తిడికి లోను కాకుండా ప్రిపరేషన్ కొనసాగిస్తే ప్రతి పోటీపరీక్షలో ముందంజలో ఉండవచ్చు.
ప్రణాళికబద్ధంగా చదివా
-మాది పరిగి. నేను ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తి చేశాను. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా గత రెండేండ్ల నుంచి ప్రణాళికాబద్ధంగా చదువుతున్నాను. ఇంటర్ నుంచి మ్యాథ్స్‌తో సంబంధం లేకపోవడంతో మొదట అర్ధమెటిక్, రీజనింగ్‌లకు ప్రాధాన్యత ఇచ్చాను. ప్రారంభంలో చాలా కష్టం అనిపించినప్పటికీ కోచింగ్ తీసుకోవడంతోపాటు ప్రతిరోజు 5-7 గంటలు మ్యాథ్స్‌కు కేటాయించి అర్ధమెటిక్పై పట్టుసాధించాను. ఉద్యోగం రావడంలో అది కీలక పాత్ర పోషించింది. దీనికి ఫలితంగా సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాను.
-ఎన్.సంగీత సివిల్ కానిస్టేబుల్
నా చిన్ననాటి కల
-మాది మొరంగపల్లి. మా నాన్న ఒగ్గు మల్లయ్య. నేను సిటీ క్యాడర్లో కానిస్టేబుల్‌కు ఎంపికయ్యాను. పోలీస్ అధికారి కావాలని నా చిన్ననాటి నా కల. 2018లో నోటిఫికేషన్ విడుదలైనప్పుడు నేను డిగ్రీ సెకండియర్ చదువుతున్నాను. ఎలాగైనా కానిస్టేబుల్ జాబ్ కొట్టాలన్న లక్ష్యంతో డిగ్రీని కూడా పక్కనపెట్టి ప్రతిరోజూ పది నుంచి పన్నెండు గంటల వరకు ఏడాదిపాటు శ్రమించాను. నేను మ్యాథ్స్ స్టూడెంట్ను కావడంతో కొన్ని రోజులు స్పెషల్ అర్థమెటిక్, రీజనింగ్‌లో శిక్షణ తీసుకుని పూర్తిగా పట్టు సాధించాను. తెలంగాణ ఉద్యమ చరిత్ర మొదలైన వాటికి సంబంధించి సిలబస్‌లో పేర్కొన్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదివాను. వాటిలో ముఖ్యమైన పాయింట్లను నోట్ చేసుకుని నా గదిలో అతికించుకున్నాను. సమయం ఉన్నప్పుడు వాటిని చూస్తూ నేర్చుకున్నాను. ఓపెన్ డిగ్రీ పూర్తిచేసి ఎస్ఐ ఉద్యోగం సాధిస్తాను.
-ఒగ్గు శివకుమార్ యాదవ్ ఏఆర్ కానిస్టేబుల్
నాన్న కోరిక తీరింది
-మా నాన్న పోలీస్. తనలా నాకు కూడా పోలీస్ కావాలనే కోరిక కలిగింది. నేను డిగ్రీ సెకండియర్ చదువుతూనే కానిస్టేబుల్ పరీక్షకి ప్రిపేరయ్యాను. నాన్న సలహా, మా అక్కల సూచనతో ఈవెంట్స్‌లో మెరిట్ సాధించాను. మెయిన్స్ పరీక్ష కోసం 6 నెలల పాటు శిక్షణ తీసుకోవడంతోపాటు తెలంగాణ ప్రభుత్వం పథకాలు, కరెంట్ అఫైర్స్‌ను ప్రతిరోజూ చదివాను. ముఖ్యమైన అంశాలను నోట్స్‌లో రాసుకున్నాను. ప్రతిరోజూ 6 నుంచి 8వతరగతి వరకు మ్యాథ్స్‌ను ప్రాక్టీస్ చేశాను. అలా లెక్కలపై పట్టుసాధించాను. సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికవడం చాలా ఆనందంగా ఉంది.
– జి. దివ్యసివిల్ కానిస్టేబుల్
ఆత్మవిశ్వాసంతో విజయం సాధించా
-మాది ఎన్కతల గ్రామం. పోలీస్ అవ్వాలన్నది నా చిన్ననాటి కల. గత నోటిఫికేషన్లో ఒక మార్కుతో ఉద్యోగం చేజారింది. మాది గ్రామీణ కుటుంబం. తల్లితండ్రులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఉద్యోగం కోసం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా నా ప్రిపరేషన్‌ను కొనసాగించి ఏఆర్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాను. ఇంకా ఉన్నత స్థానాన్ని చేరుకుంటానని నమ్మకం కలిగింది.
-ఆలంపల్లి శ్రీధర్ ఎన్కతల, మెదక్
మొదటి ప్రయత్నంలోనే
-మాది తాండూర్ మండలంలోని సంకిరెడ్డిపల్లి. డిగ్రీ ఫైనలియర్ చదువుతూనే సాయంత్రం సమయంలో కోచింగ్‌కు వెళ్ళేవాడిని. అలా మొదటి ప్రయత్నంలోనే సివిల్ కానిస్టేబుల్ సాధించడంతోపాటు డిగ్రీలో 9.4 గ్రేడ్‌పాయింట్లు సాధించాను. ఏడాదిపాటు శిక్షణ పొంది తెలంగాణ ఉద్యమం, జీకే, కరెంట్ ఆఫైర్స్పై పట్టు సాధించాను. నేను మ్యాథ్స్ విద్యార్థిని కావడంతో అర్ధమెటిక్, రీజనింగ్ విభాగాల్లో 80 శాతం ప్రశ్నలను సాధించగలిగాను. భవిష్యత్‌లో ఐపీఎస్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.
– ఎం. పవన్ కుమార్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?