వినూత్న ఆలోచనలు.. సంయుక్త వ్యూహాలు గ్లోబల్ సౌత్ సమ్మిట్
భారతదేశం సెప్టెంబర్, 2023లో జీ-20 కూటమి సదస్సుకు అధ్యక్షత వహించనుంది. ఈ సదస్సును జయప్రదం చేయడానికి భారతదేశానికి అన్ని సభ్య దేశాల సూచనలు కావాలి. అందుకు సంబంధించి అనేక అంశాలపై వివిధ దేశాలతో మమేకమై చర్చలు జరుపుతుంది. ఈ చర్చల్లో భాగంగా గ్లోబల్ సౌత్ సూచనల కోసం జనవరి 12, 13 తేదీల్లో వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ సదస్సు ఢిల్లీలో నిర్వహించారు.
పారిశ్రామిక విప్లవం తర్వాత ఆర్థికాభివృద్ధి, సామాజిక అభివృద్ధి సాధించిన దేశాలు (ఉత్తర అమెరికా దేశాలు, యూరోపియన్ దేశాలు) భౌగోళికంగా ఉత్తరార్ధగోళంలో ఉన్నాయి. మరోవైపు వలసవాద, సామ్రాజ్య వాద పీడిత అత్యల్ప సామాజిక, ఆర్థికాభివృద్ధి కలిగిన దేశాలు, వర్ధమాన దేశాలు ప్రధానంగా దక్షిణార్ధ గోళంలో ఉన్నాయి. ఈ కారణంగా ఆయా దేశాల సమూహాలను గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్‌గా వ్యవహరిస్తారు.
వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ సమ్మిట్ ప్రాథమిక అంశం-ఆనో భద్ర క్రతవోయంతు విశ్వతహః అనగా ‘గొప్ప కీర్తి కలిగిన ఆలోచనలు ప్రపంచ నలుమూలల నుంచి రానివ్వాలి’ అని ఆచరణాత్మకమైన రాజకీయ వ్యవస్థకు సంబంధించి గ్లోబల్ సౌత్ ఆలోచనలను కొత్త పంథాలో తీసుకొచ్చి దక్షిణ-దక్షిణ సహకారాన్ని ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లాలని, వర్ధమాన దేశాల వ్యూహాలు సంయుక్తంగా ఉండాలని, వీటితో పాటు గ్లోబల్ సౌత్‌లో ఉన్న ఆర్థిక శక్తులను అనుసంధానించి ముందుకు వెళ్లాలనేది ఈ సదస్సు ముఖ్య లక్ష్యం.
జీ-20లో భారత్ ప్రవేశపెట్టే ప్రణాళికలు, గ్లోబల్ సౌత్‌లో ఉన్న వివిధ దేశాల వద్ద వారి సూచనలు తీసుకున్న తరువాతే వాటికి ఒక రూపు రాబోతుంది. భారత్‌కు పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌తో పాటు, ఆగ్నేయాసియాలో ఉన్న కంబోడియా, వియత్నాం, ఆఫ్రికాలోని మొజాంబిక్, సెనెగల్, దక్షిణఅమెరికాలోని గయానా వంటి 120 దేశాలకు చెందిన 134 మంది ప్రతినిధులు వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ సమ్మిట్‌కు హాజరయ్యారు.
వర్చువల్‌గా జరిగిన ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. ఉత్తరార్ధ, దక్షిణార్ధ గోళంలో ఉన్న దేశాల మధ్య అంతరాన్ని తగ్గించడం, విభజన తగ్గించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఉత్తర-దక్షిణ విభజన అనే అంశం చూసినట్లయితే, ఆర్థికాభివృద్ధిలో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో, ఆకలి సూచీల్లో, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనలో గ్లోబల్ నార్త్ దేశాలు గ్లోబల్ సౌత్ దేశాల కన్నా ముందంజలో ఉన్నాయి. గ్లోబల్ సౌత్ దేశాలు వివిధ రంగాల్లో వెనుకబడటం, పేదరికం ఎక్కువగా ఉండడం, అసమానతలతోపాటు వాతావరణ మార్పుల ప్రభావం ఈ దేశాలపై పడుతున్నాయి.
వర్చువల్‌గా జరిగిన వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ సమ్మిట్‌లో భారత ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. వర్ధమాన దేశాలు రాజకీయంగా, ఆర్థికంగా, పరిపాలనలో మార్పు ఏవిధంగా తీసుకురావాలి, గ్లోబల్ సౌత్‌కు, గ్లోబల్ నార్త్‌కు ఉన్న అసమానతలను ఏ విధంగా తొలగించాలో వివరించారు. ఈ సదస్సులో కొత్త వ్యవస్థల ప్రస్తావన తీసుకొచ్చారు.
గ్లోబల్ సౌత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గురించి మాట్లాడుతూ గ్లోబల్ సౌత్‌లో ఉన్న ఉత్తమ పద్ధతులను మిగతా దేశాలు కొన్ని మార్పులతో అనుకరించాలని సూచించారు. ఉదాహరణకు: కుటుంబ కార్యక్రమాన్ని వేరే దేశాల్లో ప్రవేశపెట్టడం, అదే విధంగా ఇతర దేశాల్లో ఉన్న కార్యక్రమాలను భారత్‌లో ప్రవేశపెట్టడానికి గ్లోబల్ సౌత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక పరిశోధన కేంద్రంగా భవిష్యత్తులో పని చేస్తుంది. గ్లోబల్ సౌత్ స్కాలర్షిప్స్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ కార్యక్రమం అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వడానికి ఉద్దేశించింది. (కొలంబో ప్రణాళిక ద్వారా ఇంకా స్కాలర్షిప్లను భారత్ ఇవ్వాలనుకొంటుంది.)
గ్లోబల్ సౌత్ డిప్లొమాట్స్ ఫోరమ్‌ను వర్ధమాన దేశాల్లో ఉన్న యువ అధికారులను అనుసంధానం చేయడం ద్వారా దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడం కోసం ప్రతిపాదించారు. భారతదేశం మూడో ప్రపంచ దేశంగా ప్రస్థానం ప్రారంభించింది. దక్షిణార్ధగోళంలో ఉన్న భారత్ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో శక్తిగా ఎదగాలి. చైనాను ఎదుర్కోవాలన్నా, రష్యా, అమెరికా దృష్టిలో భారత్ గట్టి శక్తిగా ఎదగాలన్నా భారతదేశం మూడో ప్రపంచ దేశాలను ముందుండి నడిపించాలి. గ్లోబల్ సౌత్‌లో భారత్ తన అనుసంధానాన్ని ఇతర దేశాల్లో పెంచుకుంటే గ్లోబల్ నార్త్‌లో నుంచి బేరసారాలను అన్ని రకాల విషయాల్లో నిర్వహించగలదు.
ప్రపంచ జనాభాలో మూడు వంతులు మూడో ప్రపంచంలో ఉన్న అభివృద్ధి ఫలాలు ఆ దేశాలకు అందడం లేదని భారత ప్రధాని నాలుగు ‘R’లతో కూడిన ఎజెండాను ముందుకు తీసుకొచ్చారు. అవి స్పందించడం, గుర్తించడం, గౌరవించడం, సంస్కరణలు.
స్పందించడం: గ్లోబల్ సౌత్‌ను కలుపుకొని, సంతులనంగా అభివృద్ధి చేయడాన్ని ప్రాధాన్యంగా పెట్టుకోవాలి.
గుర్తించడం: పర్యావరణ పరంగా ప్రపంచంలో అన్ని దేశాలకు ఒక బాధ్యత ఉంది. కాని అభివృద్ధి చెందిన దేశాలు వర్ధమాన దేశాల కన్నా ఎక్కువ బాధ్యత తీసుకోవాలి.
గౌరవించడం: చిన్న దేశాలు కూడా తమ సార్వభౌమాధికారాన్ని గౌరవించుకోవాలి. దేశాల మధ్య ఉన్న సంఘర్షణలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి.
సంస్కరణలు: ఐక్యరాజ్యసమితి వంటి సంస్థల్లో సంస్కరణల ద్వారా ఎక్కువ కలుపుగోలుతనం ఉండేటట్లు చేయాలి.
వర్థమాన దేశాలు, పేద దేశాల మధ్య సహకారం చాలా ఎక్కువ అవసరం. ముఖ్యంగా కొవిడ్-19, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఆహార, క్రూడాయిల్ సంక్షోభం తలెత్తడంతో పాటు వస్తు సరఫరాలో చాలా అడ్డంకులు వచ్చాయి. మూడో ప్రపంచ దేశాలు స్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో చాలా వెనకబడి ఉన్నాయి. (పేదరికం, ఆకలి సూచీలు) ఆర్థిక సహకారం, సాంకేతిక మార్పిడి అభివృద్ధి చెందిన దేశాల నుంచి భారత్‌కు రావడం లేదు. ప్రపంచీకరణ అనేది పేద, వర్థమాన దేశాల్లో వాతావరణ సంక్షోభం, ఆర్థిక సంక్షోభాలను సృష్టించకూడదు.
ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత భారత్ దక్షిణార్ధగోళంలో ఉన్న దేశాలతో సంబంధాలు తగ్గించిందని అలీనోద్యమ ప్రారంభ దేశంగా ఉండి కూడా భారత్ ఉద్యమానికి దూరమవుతుందనే అభియోగం ఉంది. అదే సమయంలో ఆర్థికంగా శక్తిమంతమైన దేశాలతో సంబంధాలను పెంచుకుంది. బహుళ ధ్రువ దిశగా ప్రపంచం పయనిస్తున్నప్పుడు భారత్ కేవలం గ్లోబల్ నార్త్పైన ఆధారపడొద్దని, గ్లోబల్ సౌత్ కూడా నాయకత్వ పాత్ర పోషిస్తూ అన్ని దేశాలను కలుపుకొని ముందుకు వెళ్లాలని విదేశీ విధానం నిపుణులు ఎం.కె.నారాయణన్ వంటి వారు కూడా అన్నారు.
ఉక్రెయిన్ యుద్ధం, మయన్మార్‌లో అధికారంలో ఉన్న సైనిక ప్రభుత్వం, తాలిబన్ మొదలగు విషయాల్లో భారత్ తటస్థ వైఖరి పాటిస్తుందని విమర్శలు ఎదుర్కొంటుంది. ప్రాంతీయంగా మంచి శక్తిమంతమైన దేశంగా భారత్ దూకుడుగా వ్యవహరిస్తూ ఒక కచ్చితమైన నిర్ణయం తీసుకోవడం వల్ల తన పరపతి పెరుగుతుంది.
ఇటీవల భారత్‌లో తయారైన దగ్గు ఔషధం తాగి కొన్ని మూడో ప్రపంచ దేశాల్లో చిన్నారులు చనిపోయారు. ఇలాంటి సంఘటనలు భారత్ కీర్తికి భంగం కలిగిస్తాయి. భారతదేశం అందించే స్కాలర్‌షిప్‌లతో విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చు. కాని భారత విద్యా సంస్థలను ప్రపంచ స్థాయి విద్యా సంస్థలతో పోల్చినప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి పరిశోధనాభివృద్ధిలో భారత్ స్థానం ఆశించిన స్థాయిలో లేదు.
గ్లోబల్ సౌత్‌లో ఆఫ్రికాపై ఇప్పటికి చిన్న చూపే ఉంది. లాటిన్ అమెరికాలో భారత ప్రధాని మూడు సంవత్సరాల కిందట 16 దౌత్య కార్యాలయాలను ప్రారంభిస్తామని చెప్పారు. కాని ఇంకా పూర్తి స్థాయిలో ఆచరణలోకి రాలేదు. భారత్‌కు లాటిన్ అమెరికా దేశాలతో సరైన అనుసంధానం లేదు. దౌత్యపరమైన సంబంధాలు కూడా పూర్తి స్థాయిలో లేవు. ఆఫ్రికాలో భారత్ కన్నా చైనాకు ఎక్కువ పరస్పర సంబంధాలు ఉన్నాయి. గ్లోబల్ సౌత్‌లో చాలా దేశాలు వలసవాదం, సామ్రాజ్యవాదంలో మగ్గినవే. ఇప్పుడు బహుళ జాతి సంస్థల తాకిడితో పాటు నయా వలసవాదం, నయా సామ్రాజ్యవాదం ఈ ప్రాంతాన్ని కబళిస్తుంది.
గ్లోబల్ సౌత్ సదస్సు భారత్‌కు నాయకత్వ పాత్రలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. జనవరి 26న రిపబ్లిక్ దినోత్సవం ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడిని ఆహ్వానించారు. (ఈజిప్ట్ అలీనోద్యమ కూటమి ప్రారంభ దేశం). ఇది భారత్ మళ్లీ గ్లోబల్ సౌత్‌లో అనుసంధానం కావడాన్ని సూచిస్తుంది.
రష్యా, అమెరికా, చైనా లాంటి దేశాలు అధికార రాజకీయాల్లో నిమగ్నమై ఉంటే భారత్ కొవిడ్ సమయంలో ప్రపంచానికి టీకాలను అందించి నాయకత్వ లక్షణాలను ప్రదర్శించడం వల్ల గ్లోబల్ సౌత్‌లోని దేశాలు కూడా భారతదేశం నుంచి ప్రత్యేకంగా వివిధ రంగాల్లో సహకారాన్ని ఆశిస్తాయి. ఆరోగ్యమిత్ర అనే కార్యక్రమంలో భాగంగా ఏదైనా దేశం మానవతా సంక్షోభంలో ఉన్నా ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రభావం చెందితే అత్యవసర మందుల సహాయాన్ని భారత్ అందిస్తుంది.
ఆఫ్రికాపై భారత్ ప్రత్యేకంగా దృష్టి పెడుతుండటంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో సార్క్ దేశాలకు ఉపయోగకరంగా ఉండేందుకు సార్క్ శాటిలైట్‌ను ప్రయోగించి ఉపయోగంలోకి తీసుకొని వచ్చింది. ప్రపంచ వాణిజ్య సంస్థలో భారత్ నాయకత్వ పాత్రను పోషిస్తుంది. బ్రెట్టన్ ఉడ్స్ సంస్థల్లో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారు చేయడం కోసం బ్రిక్స్ న్యూడెవలప్‌మెంట్ బ్యాంకును ఏర్పాటు చేసింది. వ్యవసాయ సబ్సిడీలకు సంబంధించి పీసీ క్లాజ్పైన భారత్ సంతకం చేసింది.
చిన్న దేశాలకు కష్టం వచ్చినప్పుడు భారత్ ముందుండి వాటిని ఆదుకుంది.
ఉదాహరణకు: నేపాల్ భూకంప సమయంలో, మాల్దీవుల్లో నీటి సంక్షోభం వచ్చినప్పుడు ఆపరేషన్ నీర్‌ను ప్రారంభించింది. జీ-4 కూటమిలో భాగంగా ఉండి ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో సంస్కరణల కోసం భారత్ ప్రయత్నిస్తుంది. వాతావరణ సంక్షోభం, న్యూక్లియర్ వాణిజ్య విషయాల్లో భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక నాయకురాలిగా కనిపిస్తుంది. శక్తిమంతమైన దేశాలు, జీ-7 దేశాలు ఒక ఎత్తైతే, అత్యధిక దేశాల సమూహంగా ఉన్న జీ-77 కూటమిని (ప్రారంభంలో 77 సభ్య దేశాలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 134కు చేరింది) అలీనోద్యమంను భారత్ తక్కువ అంచనా వేయకూడదు. అంతేకాకుండా వీటికి దూరంగా ఉండకూడదు.
ఎంతో శక్తిమంతమైన అమెరికా, చైనాలతో పాటు చిన్న, చిన్న దేశాలకు కూడా ఒక ప్రత్యేక స్థానం అంతర్జాతీయ సంబంధాల్లో ఉంది. వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ అనేది జీ-77కు, అలీనోద్యమానికి ప్రత్యామ్నాయం అని.. ప్రస్తుత సంస్థలను గౌరవిస్తూనే గ్లోబల్ సౌత్ స్వరాన్ని వినిపించడమే ముఖ్య ఉద్దేశమని భారత ప్రధాని వివరించారు.
రాజ్యాంగ సవరణలు
1వ సవరణ 1951: భూసంస్కరణలకు సంబంధించి ప్రకరణలు 31ఎ, 31బి, రూపేణ రెండు కొత్త అంశాలను 9వ షెడ్యూల్లో చేర్చారు.
7వ సవరణ,1956: రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా ఎ,బి,సి రకం రాష్ర్టాలను తొలగించి ఎ,బి రాష్ట్రాలను ఒకే రకంగా పరిగణిస్తూ సి రకం రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా పరిగణించింది.
15వ సవరరణ,1963: హైకోర్టు జడ్జీల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62కు పెంచారు.
21వ సవరణ, 1967 : 8వ షెడ్యూల్‌ను సవరించి సింధీ భాషను చేర్చారు.
24వ సవరణ,1971: పార్లమెంట్‌కు రాజ్యాంగంలో ఏ భాగాన్ని అయినా సవరించే అధికారాన్ని ఇచ్చింది.
26వ సవరణ,1971: రాజులకు గల ప్రత్యేక గుర్తింపును, వారికి ఇచ్చే భరణాలను ఉపసంహరించడం జరిగింది.
31వ సవరణ,1973: లోక్‌సభ సభ్యుల సంఖ్య 525 నుంచి 545కు పెంచారు.
32వ సవరణ, 1973 : ప్రకరణ 371ని సవరించి 371డి ని చేర్చి ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ప్రాంతం వారికి కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించారు.
36వ సవరణ,1975: సిక్కింకు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించారు.
42వ సవరణ,1976: ప్రవేశికలో సామ్యవాదం, లౌకికం, సమగ్రత అనే పదాలు చేర్చారు. మంత్రి మండలి నిర్ణయాన్ని రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి. ప్రాథమిక విధుల చేరిక, ట్రిబ్యునళ్లు ఏర్పాటు.
44వ సవరణ, 1978 : ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు.
52వ సవరణ,1985: ప్రకరణలు
101,102,190,191 లను సవరించి 10వ షెడ్యూల్లో రాజకీయ పార్టీల ఫిరాయింపు నిరోధక చట్టం చేర్చారు.
61వ సవరణ, 1989: ప్రకరణ 326ను సవరించి ఓటరు వయో పరిమితిని 21ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారు.
73వ సవరణ,1992: పంచాయతీరాజ్ వ్యవస్థ మౌలిక లక్షణాలకు సంబంధించి దేశమంతటా ఒకే విధానాన్ని రూపొందించారు.
-మల్లవరపు బాలలత ,సివిల్స్ ఫ్యాకల్టీ
సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ, హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?