TS Gurukulam PD Special | ప్రణాళికతో శిక్షణ.. గెలుపే లక్ష్యంగా ప్రదర్శన
క్రీడా శిక్షణలో కాలవ్యవధి- ప్రాముఖ్యం
TS Gurukulam Physical Director Special | క్రీడ ఏదైనా క్రీడాకారుల అంతిమ లక్ష్యం అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటడం. వారి దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేయడం. ఈ క్రమంలో క్రీడాకారులు చేసే శ్రమ అనిర్వచనీయం. క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన చేయాలంటే శిక్షకులు ప్రణాళికలను తయారు చేసి ఒక పద్ధతి ప్రకారం శిక్షణకు కార్యక్రమం రూపొందించుకుని దాన్ని అమలు పరుస్తారు.
- శిక్షణ అనేది నిర్దిష్ట పనికి సిద్ధం చేసే ప్రక్రియ. శిక్షణలో ఎటువంటి పద్ధతులు అవలంబించినా శిక్షకుడి అంతిమ ధ్యేయం క్రీడా పోటీల్లో క్రీడాకారులతో అత్యుత్తమ ప్రదర్శన చేయించడం. శిక్షణలో ముఖ్యమైనది కాల వ్యవధి (పీరియడైజేషన్). ఎల్.పి. మాట్వే ఈ సిద్ధాంతానికి పునాది వేశారు. కాల వ్యవధిలో ఉండే పద్ధతులను ప్రణాళికాబద్ధంగా అమలు చేసి క్రీడాకారులతో అత్యుత్తమ ప్రదర్శన చేయించడం శిక్షకులకు చాలా సులువైన పద్ధతి. దీనికి అందుబాటులో ఉన్న సమయం, క్రీడా క్యాలెండర్‌ను దృష్టిలో ఉంచుకుని శిక్షకులు ప్రణాళికను తయారు చేసుకుంటారు. క్రీడాకారులు పోటీల్లో విజయవంతమైన ప్రదర్శన చేయడానికి ఈ కాల వ్యవధి ప్రక్రియను రూపొందించి అమలు చేస్తున్నారు. క్రీడా పోటీల్లో క్రీడాకారుల అత్యుత్తమ ప్రదర్శన అనేది దీర్ఘకాలిక శిక్షణతోనే సాధ్యమవుతుంది. ఇది ఒక్క రాత్రిలోనో లేదా కొద్దిరోజుల్లోనో సాధ్యమయ్యే ప్రక్రియ కాదు.
ప్రాథమికంగా కాలవ్యవధిని మూడు భాగాలుగా విభజించారు.
1. సన్నాహక కాలం (ప్రిపరేటరీ పీరియడ్)
2. పోటీకాలం (కాంపిటీషన్ పీరియడ్)- కాంపిటీషన్
3. పరివర్తనా కాలం (ట్రాన్సిషన్ పీరియడ్)- క్రియాశీల విశ్రాంతి, రికవరీ అదేవిధంగా సన్నాహక కాలాన్ని తిరిగి మూడు భాగాలుగా విభజించారు.
1. సన్నాహక కాలం దశ (ప్రిపరేటరీ పీరియడ్ ఫేజ్)-1 (ప్రాథమిక శిక్షణ-ఫిట్నెస్, కండిషనింగ్)
2. సన్నాహక కాలం దశ (ప్రిపరేటరీ పీరియడ్ ఫేజ్)-2 (అధునాతన శిక్షణ-టెక్నికల్)
3. సన్నాహక కాలం దశ (ప్రిపరేటరి పీరియడ్ ఫేజ్)-3 (అధిక పనితీరు శిక్షణ -టాక్టికల్) - ప్రాథమిక శిక్షణలో ఫిజికల్ ఫిట్నెస్ 60 శాతం, టెక్నిక్ 30 శాతం, టాక్టిస్ 10 శాతం ఉంటాయి.
- అధునాతన శిక్షణలో ఫిజికల్ ఫిట్నెస్ 40 శాతం, టెక్నిక్ 40 శాతం, టాక్టిస్ 20 శాతం ఉంటాయి.
- అధిక పనితీరు శిక్షణలో ఫిజికల్ ఫిట్నెస్ 30 శాతం, టెక్నిక్ 40 శాతం, టాక్టిస్ 30 శాతం ఉంటాయి. క్రీడాకారులు అత్యుత్తమ స్థాయి ప్రదర్శన చేయాలంటే పై విధంగా శిక్షణ పొందాలి.
సన్నాహక కాలం
దశ-1
- మునుపటి శిక్షణా స్థితిని తిరిగి పొందడానికి ఈ దశ ఉపయోగపడుతుంది.
- తదుపరి శిక్షణా ప్రక్రియలో క్రీడాకారులను ఎక్కువ శిక్షణా భారం తీసుకునేలా సన్నద్ధం చేయడం.
- పోటీ కాలం దృష్టిలో ఉంచుకుని క్రీడాకారులను సంసిద్ధం చేయడం.
- స్పోర్ట్స్, గేమ్స్‌లో క్రీడాకారులు మంచిగా ప్రదర్శన ఇవ్వడానికి కావలసిన శారీరక దారుఢ్యాన్ని వారిలో అభివృద్ధి చేయడం.
- కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం ఈ దశలో జరుగుతుంది.
- ఈ దశలో తక్కువ వ్యూహాత్మక శిక్షణ జరుగుతుంది.
- శారీరక దృఢ కారకాలైన వేగం, సహనశీలత, సమన్వయాలను అభివృద్ధి చేస్తారు.
దశ-2 - ఈ దశలో ప్రదర్శనకు ఆధారమయ్యే కారకాల అభివృద్ధే ముఖ్య లక్ష్యం.
- పోటీలను దృష్టిలో ఉంచుకుని క్రీడాకారులను వ్యక్తిగతంగా మంచి ప్రదర్శన ఇచ్చేవిధంగా తీర్చిదిద్దడం.
- సాంకేతిక శిక్షణలో కచ్చితంగా పట్టు సాధించేలా శిక్షణ ఇవ్వడం.
- ఈ దశలో ప్రాథమిక, వ్యక్తిగత వ్యూహాలను అభివృద్ధి చేస్తారు.
దశ-3 - ఇది సన్నాహక కాలం దశల్లో చివరిది.
- దీనిలో వ్యూహాత్మక శిక్షణను పోటీల్లో ఎలా అమలుపరచాలన్నదే ముఖ్య ఉద్దేశం.
- విజయాల కోసం భిన్నమైన వ్యూహాలను రచించడం, వాటిని అమలుపరచడం ముఖ్య ఉద్దేశం.
పోటీకాలం (కాంపిటీషన్ పీరియడ్)
- దీర్ఘకాలిక శిక్షణ పొందిన తర్వాత శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలు, వ్యూహాత్మకాలను పోటీల్లో కచ్చితంగా అమలుపరచడం దీని ముఖ్య ఉద్దేశం.
- పోటీల తర్వాత నేర్చుకున్న అనుభవాలను ఉపయోగించి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం.
- మానసిక దృఢత్వం పెంపొందించడం ముఖ్య ఉద్దేశం.
పరివర్తనా కాలం
- తదుపరి పోటీలను దృష్టిలో ఉంచుకుని సరైన విశ్రాంతి తీసుకోవడం.
- నైపుణ్యం తగ్గిపోవడానికి సంబంధించిన కారకాలకు దూరంగా ఉండటం.
- వారంలో మూడు నుంచి నాలుగు సార్లు శిక్షణ పొందడం.
- వినోద కార్యక్రమాలపై దృష్టి సారించడం.
- గత ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకోవడం. దీనిలో భాగంగా..
సింగిల్ పీరియడైజేషన్: రాబోయే కాలంలో ఒక ప్రధానమైన పోటీని దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక తయారు చేస్తారు. దీనిలో సన్నాహక కాలం, పోటీ కాలం, పరివర్తనా కాలాలను ఉన్న సమయానికి అణుగుణంగా తయారు చేస్తారు.
డబుల్ పీరియడైజేషన్: దీనిలో రెండు పోటీలకు అనుగుణంగా ప్రణాళిక తయారు చేసుకుంటారు. దీనిలో ఉన్న సమయాన్ని కింది విధంగా విభజించుకుంటారు. - సన్నాహక కాలం-1, పోటీకాలం-1, సన్నాహక కాలం-2, పోటీకాలం-2, పరివర్తనా కాలం అంటే దీనిలో రెండు సన్నాహక కాలాలు, రెండు పోటీ కాలాలు, ఒక పరివర్తన కాలం ఉంటాయి.
ట్రిపుల్ పీరియడైజేషన్: దీనిలో మూడు పోటీలకు అనుగుణంగా ప్రణాళిక తయారు చేసుకుంటారు. దీనిలో ఉన్న సమయాన్ని కింది విధంగా విభజించుకుంటారు. - సన్నాహక కాలం-1, పోటీకాలం-1, సన్నాహక కాలం-2, పోటీకాలం-2, సన్నాహక కాలం-3, పోటీకాలం-3, ఒక పరివర్తనా కాలం అంటే దీనిలో మూడు సన్నాహక, పోటీకాలం, పరివర్తనా కాలాలు ఉంటాయి.
- సింగిల్, డబుల్, ట్రిపుల్ పీరియడైజేషన్లో ఏ కాలానికి ఎంత సమయం కేటాయించాలి అనేది శిక్షకుడు కాలాల నియమాలను అనుసరించి విభజిస్తాడు.
- కాలాల వ్యవధిలో క్రీడాకారుల ప్రదర్శనను ఉన్న సమయానికి అనుగుణంగా ప్రణాళిక వేసుకుని అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి సైకిల్ శిక్షణా పద్ధతి చాలా ముఖ్యమైనది. దీన్ని మూడు భాగాలుగా విభజించారు. అవి..
1. మైక్రో సైకిల్ 2. మీసో సైకిల్
3. మాక్రో సైకిల్
మైక్రో సైకిల్ - ఇది అతి చిన్న సైకిల్.
- దీన్ని రోజుల సైకిల్ అని కూడా అంటారు.
- పోటీలు మూడు నుంచి పది రోజుల లోపు ఉంటే దీన్ని అవలంబిస్తారు.
- దీని సాధారణ కాల వ్యవధి 5-10 రోజులు.
విశ్రాంతి, రికవరీ అనేది దీనిలో ముఖ్యమైనది.
మీసో సైకిల్ - పోటీల సమయం మధ్యస్థంగా ఉన్నప్పుడు దీన్ని అవలంబిస్తారు.
- దీని కాల వ్యవధి సాధారణంగా 3-6 వారాలు ఉంటుంది. (అంటే పోటీలు జరిగే తేదీ 3-6 వారాల మధ్య ఉంటే)
- దీని ముఖ్య ఉద్దేశం పోటీలు జరిగే సమయానికి క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చే విధంగా ప్రణాళిక తయారు చేసి అమలుపరచడం.
మాక్రో సైకిల్ - ఇది శిక్షణలో పొడవైన సైకిల్ దీన్ని ఒలింపిక్ సైకిల్ అని కూడా అంటారు.
- పోటీలు జరిగే సమయం 3-4 నెలల నుంచి 12 నెలలు ఉన్నప్పుడు దీన్ని అవలంబిస్తారు.
- ముఖ్యంగా దీన్ని ఒక ప్రధాన పోటీని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికను రూపొందించి క్రీడాకారుల నైపుణ్యాలను, ప్రదర్శనను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం దీని ముఖ్య ఉద్దేశం.
- దీనిలో సన్నాహక, పోటీ, పరివర్తనా కాలాలు ఉంటాయి. అవసరమైతే డబుల్, ట్రిపుల్ పీరియడైజేషన్కు కూడా ప్రణాళికను తయారు చేసుకోవచ్చు.
- పైన తెలిపిన విధంగా కాల వ్యవధి (పీరియడైజేషన్)ని ఉన్న సమయ వ్యవధుల సమన్వయంతో ప్రణాళికను రూపొందించి వాటిని అమలుపరిస్తే శిక్షకులు క్రీడాకారులతో అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడం ఖాయం.
ప్రాక్టీస్ బిట్స్
1. కాల వ్యవధి (పీరియడైజేషన్) సిద్ధాంతానికి మొదట పునాది వేసింది ఎవరు?
ఎ) హరిదయాల్ సింగ్
బి) ఎల్.పి. మాట్వే
సి) హరిహరన్
డి) విలియమ్స్
2. మీసో సైకిల్ కాల వ్యవధి?
ఎ) 3-6 రోజులు బి) 3-6 వారాలు
సి) 3-6 నెలలు డి) పైవేవీ కాదు
3. క్రీడా శిక్షణ కార్యక్రమాలు కాలాల శ్రేణుల ద్వారా అభివృద్ధి చేసింది?
ఎ) కాల వ్యవధి బి) పరివర్తనా కాలం
సి) సన్నాహక కాలం డి) పోటీ కాలం
4. సుదీర్ఘమైన శిక్షణ చక్రం ఏది?
ఎ) మైక్రో సైకిల్ బి) మాక్రో సైకిల్
సి) మీసో సైకిల్ డి) పైవన్నీ
5. సన్నాహక కాలం (ప్రిపరేటరీ పీరియడ్)ను ఎన్ని భాగాలుగా విభజించారు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 1
6. పోటీ కాలం ముఖ్య ఉద్దేశం?
ఎ) విశ్రాంతి కోసం బి) పోటీల కోసం
సి) శారీరక దారుఢ్యం కోసం
డి) పైవన్నీ
7. అతిచిన్న శిక్షణా చక్రం ఏది?
ఎ) మీసో సైకిల్ బి) మాక్రో సైకిల్
సి) మైక్రో సైకిల్ డి) పైవేవీ కాదు
8. మీసో సైకిల్ ముఖ్య ఉద్దేశం?
ఎ) విజయాల కోసం భిన్నమైన సాధన
బి) వినోదం కోసం వ్యాయామ కార్యక్రమాల రూపకల్పన
సి) జట్ల మధ్య పోటీల కోసం సాధన
డి) పైవన్నీ
9. మాక్రో సైకిల్‌కు మరో పేరు?
ఎ) ఒలింపిక్ సైకిల్
బి) వారాల సైకిల్
సి) నెలల సైకిల్ డి) పైవన్నీ
10. కాల వ్యవధి (పీరియడైజేషన్)ని ఎన్ని రకాలుగా విభజించారు?
ఎ) 3 బి) 2 సి) 1 డి) 4
11. సింగిల్ పీరియడైజేషన్లో ఉండే సన్నాహక కాలాల సంఖ్య?
ఎ) 2 బి) 4 సి) 3 డి) 1
12. ట్రిపుల్ పీరియడైజేషన్లో ఉండే పోటీకాలాల సంఖ్య?
ఎ) 3 బి) 4 సి) 2 డి) 1
13. తదుపరి పోటీలను దృష్టిలో ఉంచుకొని సరైన విశ్రాంతి తీసుకోవడం అనేది దేనిలో భాగమై ఉంటుంది?
ఎ) సన్నాహక కాలం బి) పోటీ కాలం
సి) పరివర్తనా కాలం డి) పైవన్నీ
14. ప్రధాన పోటీలకు అనుగుణంగా ఏ శిక్షణ చక్రంలో ప్రణాళిక రూపొందించుకుంటారు?
ఎ) మైక్రో సైకిల్ బి) మీసో సైకిల్
సి) మాక్రో సైకిల్ డి) పైవేవీ కాదు
15. సన్నాహక కాల దశ-1లో శిక్షణ ఏ అంశాలపై సాగుతుంది?
ఎ) ఫిట్నెస్ బి) బలం
సి) కండిషనింగ్ డి) ఎ, సి
16. అధిక పనితీరు శిక్షణలో టెక్నిక్ కోసం ఎంత భాగం కేటాయిస్తారు?
ఎ) 60 శాతం బి) 40 శాతం
సి) 30 శాతం డి) 50 శాతం
సమాధానాలు
1. బి 2. బి 3. ఎ 4. బి
5. బి 6. బి 7. సి 8. ఎ
9. ఎ 10. ఎ 11. డి 12. ఎ
13. సి 14. సి 15. డి 16. బి
డాక్టర్ సాతులూరి రాజు
అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,
హైదరాబాద్
ఫోన్: 8919150076.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?