పృథ్వీ.. అగ్ని..ఆకాశ్ ( మిస్సైల్ భారత్) పోటీ పరీక్షల ప్రత్యేకం
శత్రువులను దీటుగా ఎదుర్కోవడం కోసం భారత్ బాలిస్టిక్ , క్రూయిజ్ క్షిపణులతో కూడిన బళ అంచెల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసింది. భారత బలగాల అవసరాలు, అభివృద్ధి, పరిశోధనా కార్యక్రమాలను రక్షణ మంత్రిత్వ శాఖలోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ డిపార్ట్మెంట్ పర్యవేక్షిస్తుంది. DRDD ఆధ్వర్యంలో డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)తోపాటు 52 ల్యాబొరేటరీల్లో ఈ అభివృద్ధి, పరిశోధన కార్యక్రమాలు జరుగుతాయి. డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ల్యాబొరేటరీ (DRDL) భద్రతాదళాల కోసం వివిధ క్షిపణులను అభివృద్ధి చేసి, విజయవంతంగా పరీక్షించింది. వాటిలో కొన్ని క్షిపణుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
త్రిశూల్
ఈ క్షిపణి ఉపరితలం నుంచి గగతలంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఈ షార్ట్ రేంజ్ , లో లెవల్ , క్విక్ రియాక్షన్ మిస్సైల్ తక్కువ ఎత్తులో ఎగురుతున్న శత్రుదేశాల ఆబ్జెక్ట్‌ను ధ్వంసం చేయగలదు. ఇది ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలా త్రివిధ దళాలకు ఉపయుక్తంగా ఉంటుంది. ఐదు మీటర్ల నుంచి 9 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఈ క్షిపణి సొంతం. త్రిశూల్ క్షిపణి పరీక్షను చాలాసార్లు మొబైల్ లాంచర్స్ నుంచి నిర్వహించారు
ఆకాశ్
ఈ క్షిపణి ఆధునిక మల్టీటార్గెట్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ . చమురు సంస్థల వంటి భారీ సముదాయాలపై గగనతలం నుంచి శత్రుదేశాలు చేసే దాడులను తిప్పికొట్టడమే లక్ష్యంగా ఈ క్షిపణిని డిజైన్ చేశారు. 25 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఈ క్షిపణి సొంతం. 1990, ఆగస్టు 15న ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఆకాశ్ క్షిపణికి చెందిన న్యూక్లియర్ క్యాపబుల్ వెర్షన్ ను 2007, డిసెంబర్ 21న మొబైల్ లాంచర్ నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఈ పరీక్ష సందర్భంగా మానవరహిత ఎయిర్ క్రాఫ్ట్‌ను ధ్వంసం చేశారు.
ఇంటర్ సెప్టార్
భారత్ 2009, మార్చి 6న ఒడిశా తీరంలోని వీలర్ ఐలాండ్ నుంచి ఇంటర్ సెప్టార్ క్షిపణిని పరీక్షించింది. ఇది శత్రు దేశాల క్షిపణులను మార్గమధ్యంలోనే అడ్డుకుని ధ్వంసం చేసే సామర్థ్యం కలిగి ఉంది. పరీక్ష సందర్భంగా ఇంటర్ సెప్టార్ క్షిపణి ధనుష్ క్షిపణిని కూల్చివేసింది. బంగాళాఖాతంపై 80 కిలోమీటర్ల ఎత్తున ఇంటర్ సెప్టార్ .. ధనుష్ క్షిపణిని నేరుగా ఢీకొట్టి ధ్వంసం చేసింది.
శౌర్య
ఒడిశాలోని బాలాసోర్ లోగల చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుంచి .. మొదటి సారి సర్ఫేస్ టు సర్ఫేస్ లక్ష్యాలను ఛేదించే శౌర్య క్షిపణిని భారత్ పరీక్షించింది. 2008 నవంబర్ 12న ఈ క్షిపణి పరీక్ష నిర్వహించారు. ఇది 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను విజయవంతంగా ఛేదించగలదు. ఈ అణు సామర్థ్య హైపర్ సోనిక్ శౌర్య క్షిపణికి అడ్వాన్స్డ్ వెర్షన్ ను 2020, అక్టోబర్ 3న ప్రయోగించారు. దీని పరిధి 750 కిలోమీటర్లు.
సాగరిక
2008, ఫిబ్రవరి 26న విశాఖపట్నం తీరంలో పాంటూన్ బోట్ నుంచి సాగరిక క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఈ పరీక్షతో నీటి లోపలి నుంచి కూడా క్షిపణి పరీక్షలు నిర్వహించగల సామర్థ్యం భారత్ కు ఉన్నదని శాస్త్రవేత్తలు నిరూపించారు. సాగరిక క్షిపణి 6.5 మీటర్ల పొడవు, 7 టన్నుల బరువు ఉంటుంది. 500 కేజీల బరువున్న పేలోడ్ ను ఇది మోసుకెళ్లగలదు. ఈ క్షిపణిని అండర్ వాటర్ నుంచేగాక ఉపరితలం నుంచి, మొబైల్ లాంచర్స్ నుంచి కూడా ప్రయోగించవచ్చు.
పృథ్వీ
ఇది భారతదేశపు తొలి స్వదేశీ క్షిపణి. దీన్ని ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదించడానికి ప్రయోగించవచ్చు. వివిధ వార్ హెడ్ లను మోసుకెళ్తూ 150 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. ఈ క్షిపణిని మొదటిసారి 1988, ఫిబ్రవరి 25న శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. 1993, మే 21న దీన్ని ఇండియన్ ఆర్మీలో ప్రవేశపెట్టారు. తర్వాత ఈ క్షిపణిని న్యూక్లియర్ క్యాపబుల్ సర్ఫేస్ టు సర్ఫేస్ బాలిస్టిక్ మిస్సైల్ పృథ్వీ-2గా అప్ గ్రేడ్ చేశారు. దీన్ని 2010, మార్చి 28న ఒడిశా తీరంలోని వీలర్ ఐలాండ్ నుంచి విజయవంతంగా పరీక్షించారు.
నాగ్
ఇది ఫైర్ అండ్ ఫర్గెట్ రకానికి చెందిన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ (ATGM). దీని పరిధి 4 నుంచి 7 కిలోమీటర్లు. యుద్ధట్యాంకుల రక్షణ కోసం ఈ నాగ్ క్షిపణులను అభివృద్ధి చేశారు. ప్రపంచ దేశాల్లోని ఈ తరహా క్షిపణుల్లో నాగ్ క్షిపణి అత్యంత అడ్వాన్స్డ్ వెర్షన్ . నాగ్ క్షిపణిని మొట్టమొదటి సారి 1988లో పరీక్షించారు.
అస్త్ర
ఇది దేశీయంగా తయారైన క్షిపణి. శత్రు దేశాలు దాడికి ప్రయత్నించినప్పుడు 110 కిలోమీటర్ల దూరం వరకుగల లక్ష్యాలను కూడా ఛేదించగల సామర్థ్యం ఈ క్షిపణి సొంతం. గగతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణిని 2010, జనవరి 11న విజయవంతంగా పరీక్షించారు. రెండు క్షిపణులను ఏకకాలంలో పరీక్షించగా రెండూ విజయవంతమయ్యాయి. బాలాసోర్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ క్షిపణి పరీక్షలు నిర్వహించారు.
ధనుష్
ఇది ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యంగల బాలిస్టిక్ క్షిపణి. ఈ క్షిపణి షిప్ బేస్డ్ యాంటీ సర్ఫేస్ మిస్సైల్ గా కూడా ఉపయోగపడుతుంది. దీన్ని 2009, డిసెంబర్ 13న నేవీ విజయవంతంగా పరీక్షించింది. INS సుభద్ర నుంచి ఈ క్షిపణి పరీక్ష నిర్వహించారు. ఈ ధనుష్ క్షిపణి 350 కిలోమీటర్ల ఎత్తువరకు వెళ్లి.. వేగంగా కిందకు దూసుకొస్తూ బంగాళాఖాతంలోని లక్షాన్ని కచ్చితంగా ఛేదించగలదు.
సూర్య
ఇది తొలి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణి. చైనా దాడిని ఎదుర్కోవడానికి 1994 నుంచి డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ ఈ క్షిపణిని అభివృద్ధి చేస్తున్నది. ఈ క్షిపణిలో రెండు రకాలున్నాయి. అవి.. సూర్య-1, సూర్య-2. సూర్య-1 పరిధి 10 వేల కిలోమీటర్లు. సూర్య-2 పరిధి 20 వేల కిలోమీటర్లు. ఈ క్షిపణులు 10 వరకు మల్టిపుల్ ఇండిపెండెంట్ రీ ఎంట్రీ వెహికిల్స్‌ను (MIRVs) మోసుకెళ్లగలవు.
అగ్ని-1
ఇది ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదించగల మధ్యశ్రేణి బాలిస్టిక్ న్యూక్లియర్ మిస్సైల్ . ఈ క్షిపణి పరిధి 700 కిలోమీటర్లు. దీన్ని ఒడిశా తీరంలోని వీలర్ ఐలాండ్ నుంచి 2010, మార్చి 28న పరీక్షించారు. ఈ క్షిపణి పరీక్షను మొదటిసారి 1989, మే 22న నిర్వహించారు. అగ్ని-1 క్షిపణి పరీక్ష విజయవంతం కావడంతో ప్రపంచంలో ఈ తరహా క్షిపణిని కలిగి ఉన్న ఐదో దేశంగా భారత్ నిలిచింది. అంతకుముందు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా దగ్గర మాత్రమే ఈ తరహా క్షిపణులు ఉన్నాయి.
అగ్ని-2
ఈ అణు సామర్థ్య క్షిపణి అగ్ని-2ను 2010, మే 17న ఒడిశాలోని లాంచ్ ప్యాడ్ నుంచి పరీక్షించారు. ఈ క్షిపణిని స్వదేశీయంగా రూపొందించారు. ఇది 2000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంది.
అగ్ని-3
ఇది అణుసామర్థ్య బాలిస్టిక్ క్షిపణి. 3,500 కిలోమీటర్ల కంటే దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా విజయవంతంగా ఛేదించగల సామర్థ్యం ఈ క్షిపణి సొంతం. దీన్ని 2008, మే 7న ఒడిశా తీరంలోని వీలర్ ఐలాండ్ నుంచి విజయవంతంగా పరీక్షించారు. తొలిసారి 2006, జూలై 9న ఈ క్షిపణి పరీక్ష నిర్వహించగా.. డిజైన్ లోపంవల్ల విఫలమైంది. అయితే, ఆ తర్వాత 2007 ఏప్రిల్ లో, 2008 మేలో ఈ క్షిపణి పరీక్షలు విజయవంతమయ్యాయి.
అగ్ని-4
ఇది భారతదేశపు మోస్ట్ అడ్వాన్స్డ్ లాంగ్ రేంజ్ క్షిపణి. అగ్ని-4 క్షిపణిని 2011, నవంబర్ 15న విజయవంతంగా పరీక్షించారు. ఈ క్షిపణి 3000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోని లక్ష్యాలను సైతం కేవలం 20 నిమిషాల్లో ఛేదించగలదు. ఇది న్యూక్లియర్ వార్ హెడ్ లను మోసుకెళ్లగలదు. దీన్ని మొదట అగ్ని-2 ప్రైమ్ పేరుతో పిలిచేవారు.
అగ్ని-5
ఇది సుదూర లక్ష్యాలను ఛేదించగల న్యూక్లియర్ మిస్సైల్. ఒడిశా తీరం నుంచి 2012, ఏప్రిల్ 19న ఈ అగ్ని-5 క్షిపణిని పరీక్షించారు. 2013, సెప్టెంబర్ 15న మరోసారి ఈ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఈ క్షిపణి మూడు దశల రాకెట్ మోటార్లను కలిగి ఉంటుంది. ఇది 5000 వేల కిలోమీటర్ల కంటే దూరంలోగల లక్ష్యాలను కూడా సునాయాసంగా ఛేదించగల సామర్థ్యం కలిగి ఉన్నది.
- Tags
- competitive exams
- TSPSC
- upsc
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?