పెరుగుదల పరిణామాత్మకం.. వికాసం గుణాత్మకం
పెరుగుదల, వికాసం
పెరుగుదల
- పెరుగుదల అనేది శరీరంలోని ఆకారంలో వచ్చే మార్పులను, అంతర్గత అవయవాల్లో వచ్చే మార్పు, ఎత్తు దేహదారుఢ్యం వంటి అంశాలను సూచిస్తుంది
- ఎత్తు, బరువు, పరిమాణంలో వచ్చే మార్పును పెరుగుదల అనవచ్చు.
- పెరుగుదల పూర్తిగా శారీరకమైన భావన. ఇది సంకుచితమైన భావన. ఇది అంతర్గతంగా, బహిర్గతంగా ఉంటుంది.
- పెరుగుదల పరిమాణాత్మకమైంది, దీన్ని కచ్చితంగా కొలవవచ్చు. పెరుగుదల జీవితాంతం కొనసాగదు. ఒక దశ వరకే కొనసాగుతుంది.
- పెరుగుదలను జైవిక, జన్యుపర, పోషక, ఇతర పరిసరాలు కూడా ప్రభావితం చేస్తాయి.
- వికాసానికి పెరుగుదల కూడా ఒక కారణం, వికాసం జరగాలంటే పెరుగుదల తప్పనిసరి కానీ పెరుగుదల ఉన్నంత మాత్రాన వికాసానికి దారితీస్తుందని కచ్చితంగా చెప్పలేం.
- పెరుగుదల అనే భావన ప్రత్యేక అంశానికి పరిమితమవుతుంది.
వికాసం
- వికాసం అనేది వ్యక్తుల్లో గుణాత్మకమైన మార్పులను తెలుపుతుంది. ఈ మార్పులన్నీ ఒక క్రమపద్ధతిలో సందర్భానుసారంగా నిర్ణీత దశలో జరుగుతాయి. వికాసం అనేది జీవితాంతం కొనసాగే ప్రక్రియ.
- అండర్సన్ ప్రకారం వికాసం అంటే ఆకారాలను, ప్రకార్యాలను సమైక్యం చేసే క్లిష్ట ప్రక్రియ.
- క్రైగ్ ప్రకారం వికాసం అనేది ఒక వ్యక్తిలో సంరచణ, ఆలోచన, ప్రవర్తనలో మార్పును చూపెడుతుంది.
- వికాసం అనేది జైవిక, పరిసరాల ప్రభావాన్ని తనపై కలిగి ఉంటుంది.
- వికాసం కంటికి కనిపించదు. కాబట్టి ఇది అమూర్తభావన. ఆలోచన, వివేచన, ప్రజ్ఞ, నైతికత, ఇలాంటివన్నీ వికాసానికి సంబంధించిన అంశాలే.
- వికాసం అనేది మానసిక, నైతిక ఉద్వేగ, సాంఘిక అంశాలకు సంబంధించింది. ఇది బయటకు కనపడదు. అంతర్గత అంశాలకు సంబంధించింది.
- వికాసం సమగ్రమైనది, విస్తృతమైనది. వ్యక్తిలో మానసిక, నైతిక, సాంఘిక, సంజ్ఞానాత్మక, ఉద్వేగపరమైన మార్పులను తెలుపుతుంది. పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం. వికాసాన్ని కచ్చితంగా మాపనం చేయలేం. కానీ అంచనా వేయగలం.
- వికాసంపై జైవ, సాంఘిక కారణాలతో పాటు శిక్షణ, అనుభవాలు, చుట్టూ ఉన్న పరిసరాలు కూడా ప్రభావాన్ని చూపుతాయి.
- వికాసం గతిశీలమైనది. క్రమబద్ధమైనది. వ్యక్తి ప్రవర్తన అతని వికాస స్థాయిపై ఆధారపడి ఉంటుంది. వ్యక్తులలో వికాసానికి పెరుగుదల అనేది పునాదిగా పనిచేస్తుంది.
- ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం వికాసం అనేది గుణాత్మక, పరిణామాత్మక మార్పు చూపెడుతుంది. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి.
వికాస నియమాలు లేదా సూత్రాలు
- వికాసం నిర్దిష్టమైన క్రమపద్ధతిలో జరుగుతుంది.
ఉదా : నడవడానికి ముందు నిలబడటం, మాట్లాడటానికి ముందు నత్తిగా మాట్లాడటం, అంకెలు నేర్చుకున్నాక వ్యవకలనం నేర్చుకోవడం - వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి.
ఉదా : కొంతమంది పిల్లలకు మాట్లాడటం, నడవటం సరైన సమయంలో వస్తాయి. కానీ మరికొంతమందికి సాధారణ సమయం కంటే ముందుగా కాని, ఆలస్యంగా కాని వస్తాయి. - వికాసం సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు లేదా సులభమైన అంశాల నుంచి జఠిలమైన అంశాలకు కొనసాగుతుంది.
ఉదా : నడిచే ముందు నిలబడటం, మెట్లెక్కేముందు నిలబడటం, సాధారణ ఉద్వేగం నుంచి ప్రత్యేక ఉద్వేగాలు వృద్ధిచెందడం. - వికాసం అన్ని దశల్లో ఒకే వేగంలో జరగదు.
ఉదా. శైశవం, బాల్యంలో శారీరక పెరుగుదల ఉంటుంది. కానీ కౌమార దశలో ఉన్నంత వేగంగా ఉండదు. - ప్రతి వికాస దశ తనదైన ప్రత్యేక లక్షణాలను, ఆటంకాలను కలిగి ఉంటుంది.
- వికాసంలో బాల్య అనుభవాలు కీలకమైనవి. ఒక దశలో సమస్యగా అనిపించిన ప్రవర్తన మరో దశలో సర్వసాధారనమే కావచ్చు.
- వికాసం సామాజిక, సాంస్కృతిక, జైవిక కారకాలతో ప్రభావితం చేయబడుతుంది.
- వికాసంలో మార్పులను ప్రాగుప్తీకరించవచ్చు.
- వికాసం 2 నిర్దిష్ట పోకడలలో జరుగవచ్చు.
ఎ. శిరోపాదాభి ముఖ వికాసం – తల నుంచి వికాసం ప్రారంభమై శరీరం కింది వైపునకు విస్తరించడం.
ఉదా. తల ఆడించిన తరువాత శరీరాన్ని ఆడించడం
బి. సమీప దూరస్త వికాసం – వికాసం దేహ మధ్యభాగాన ప్రారంభమై అన్ని శరీర భాగాలకు విస్తరించడం.
ఉదా. ఒక వస్తువును అందుకునేందుకు శిశువు ముందు భుజాలు తరువాత మోచేతులు, ఆ తరువాత చేతి వేళ్లు ఉపయోగిస్తారు. - వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే సమగ్ర ప్రక్రియ, వికాసం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది
- వికాసంపై అనువంశికత, పరిసరాల ప్రభావం ఉంటుంది
శారీరక పెరుగుదల నియమాలు
1. వికాస దిశ నియమం
ఉదా : ముందుగా శిరస్సు తరువాత మిగతా శరీర అవయవాలు వృద్ధి చెందుతాయి
2. లయ వికాస నియమం
ఉదా : శారీరక అభివృద్ధి లయబద్ధంగా జరుగుతుంది
3. అవిచ్ఛిన్న నియమం
ఉదా : శారీరక పెరుగుదల క్రమంగా కొనసాగుతుంది
4. స్వయం సిద్ధ నియమం
ఉదా : పెరుగుదల జన్యు రచన ఆధారంగా స్వయం సిద్ధంగా జరుగుతుంది
5. వికాస వేగ నియమం
మానవుని శరీర భాగాలు అన్ని ఒకే వేగంతో కాకుండా వేర్వేరు వేగాల్లో పెరుగుతాయి
వికాసం, పెరుగుదలను ప్రభావితం చేసే కారకాలు
- వికాసం, పెరుగుదల అనేది ఏ ఒక్క కారకం మీద ఆధారపడదు. ఇది సంస్కృతి, లింగ, నివాస ప్రదేశం, వారసత్వం, పోషణ, భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ రెండు ప్రధాన కారకాలుగా తెలుపవచ్చు.
1. అనువంశిక కారకాలు
2. పర్యావరణ కారకాలు
శిశు వికాసంలో అనువంశిక పాత్ర
- డగ్లస్, హ్యూలాండ్ల ప్రకారం అనువంశికత అంటే తల్లిదండ్రుల, వారి పూర్వీకుల నుంచి సంక్రమించే భౌతిక లక్షణాలు, రూపాలు, సామర్థ్యాలు.
- అనువంశికతకు మూలం జన్యువులు, ఇవి క్రోమోజోమ్‌లలో ఉంటాయి. శిశువుకు తల్లి నుంచి 23+X, తండ్రి నుంచి 23+X or Y జన్యువులు అందించబడ్డాయి, ఈ జన్యువుల ద్వారానే తల్లిదండ్రుల లక్షణాలు శిశువునకు అందించబడ్డాయి
- జన్యుశాస్త్ర పితామహుడైన జాన్ గ్రెగర్ మెండల్ కింది అనువంశిక సూత్రాలు తెలిపాడు.
1. సారూప్య సూత్రం లేదా లా ఆఫ్ సిమిలారిటీ
తల్లిదండ్రుల లక్షణాలను పిల్లలు,
యథాతథంగా కలిగి ఉండవచ్చు.
ఉదా : అందమైన తల్లిదండ్రులకు అందమైన పిల్లలు జన్మించడం
2. వైవిధ్య సూత్రం లేదా లా ఆఫ్ వేరియేషన్
ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లల మధ్యలో కూడా తేడాలుండవచ్చు
ఉదా. ఒకే తల్లిదండ్రులకు సంతానం మధ్యలో తేడాలుంటాయి
3. ప్రతిగమన నియమం– జన్యుపరమైన లోపాలతో జన్మించడం
ఉదా. రక్తసంబంధీకుల మధ్య వివాహం జరిగినప్పుడు ప్రతిగమన నియమం బయల్పడవచ్చు.
వికాసంపై అనువంశిక ప్రభావాన్ని బలపరిచే వాదనలు
ఎ. కెల్లాల్ దంపతులు తమ బిడ్డ డొనాల్డ్, అదే వయస్సు ఉన్న గుహ అనే చింపాంజీపై ప్రయోగాలు చేసి ఇద్దరికీ సమానమైన పరిస్థితులు కల్పించారు. డొనాల్డ్ మానవుడిగా ఎదగగా, గుహ మాత్రం చింపాంజీగా ఎదిగింది.
బి. గోడార్డ్ కల్లికాక్ కుటుంబంపై పరిశోధన చేసి అనువంశిక ప్రభావాన్ని నిరూపించాడు.
సి. ఫ్రాన్సిస్ గాల్టన్ 997 రాజకుటుంబాలను పరిశీలించి వికాసంలో జన్యువులదే కీలకపాత్ర అని తేల్చాడు. వీరు వీరి పరిశోధనా అంశాలను పొందుపరుస్తూ ‘హెరిడిటరి జీనియస్’ గ్రంథాన్ని రచిస్తారు.
డి. పీయర్సన్ అనే డార్విన్ కుటుంబంపై పరిశోధన చేసి వికాసంపై జన్యువుల ప్రభావం అధికమని నిరూపిస్తాడు.
ఇ. ఫ్రీమన్ కవలలు, దాయాదులపై పరిశోధన చేసి జన్యువుల ప్రభావాన్ని నిరూపించాడు
ఎఫ్. డగ్డేల్ అనే అతను మాక్స్, డ్యూక్స్ కుటుంబాలపై పరిశోధన చేసి వికాసంపై జన్యువులే అధికంగా ప్రభావాన్ని చూపిస్తాయని వివరించాడు.
వికాసంపై పరిసరాల పాత్ర-శాస్త్రవేత్తల వాదనలు
- జన్యువులు తప్ప వ్యక్తి వికాసంపై ప్రభావాన్ని చూపే ప్రతి అంశాన్ని కూడా పరిసరమే అని అంటారు. ఉడ్వర్త్ ప్రకారం వ్యక్తి పుట్టుక నుంచే అతనిపై ప్రభావాన్ని చూపే ప్రతి బాహ్య కారకం పరిసరమే, పరిసరాలు ప్రధానంగా 2 రకాలు.
1. జనన పూర్వ పరిసరాలు
2. జననాంతర పరిసరాలుగా ఉంటాయి
ఎ. న్యూమెన్ 19 జతల సమరూప కవలలపై పరిశోధన జరిపి వారి వికాసంపై పరిసరాల ప్రభావం అధికమని తేలుస్తారు.
బి. ప్రవర్తన అయిన వాట్సన్ పరిసరాలకు అధిక ప్రాధాన్యతనిచ్చాడు. నాకు 12 మంది శిశువులను ఇవ్వండి మీకు ఎలా కావాలంటే వారిని అలా రూపొందిస్తామని తెలిపాడు.
సి. బాగ్లే ప్రకారం విద్యాసౌకర్యాలకు, వికాసానికి చాలా దగ్గరి సంబంధం ఉందని తన ఎడ్యుకేషనల్ డెటర్మినిజం అనే గ్రంథంలో తెలిపాడు.
డి. ఫ్రీమన్ మిల్రెడ్, రూథ్ అనే కవలలపై పరిశోధన చేసి పర్యావరణ ప్రభావమే అధికమని తేలుస్తారు
ఇ. స్కోడాక్ ప్రజ్ఞా లబ్ధిపై పరిసరాల ప్రభావం అధికమని తేల్చాడు.
- పై వాదన ఆధారంగా శిశువు వికాసంపై అనువంశికత, పరిసరాల ప్రభావం రెండూ ఉంటాయి అని గమనించవచ్చు. ఇదే విషయాన్ని ఉడ్వర్త్ బలపర్చాడు.
ప్రాక్టీస్ బిట్స్
1. కింది వాటిలో సరికానిది గుర్తించండి.
ఎ) పెరుగుదల అన్ని అంశాలకు సంబంధించింది
బి) పెరుగుదల ప్రత్యేక అంశానికి సంబంధించింది
సి) పెరుగుదలను బహిర్గతంగా మాపనం చేయవచ్చు
డి) పెరుగుదల పరిమాణాత్మకం
2. కింది వాటిలో అంతర్గత అంశాలకు సంబంధించింది?
ఎ) వికాసం బి) పెరుగుదల
సి) కౌశలాలు
డి) చలన నైపుణ్యాలు
3. వికాసానికి సంబంధించి సరికానిది గుర్తించండి.
ఎ) మాపనం కచ్చితంగా చేయలేము
బి) మాపనం కచ్చితంగా చేయవచ్చు
సి) సమగ్ర భావన
డి) అమూర్త
4. కింది వాటిలో సరికానిది గుర్తించండి.
ఎ) పెరుగుదల తప్పనిసరిగా వికాసానికి దారి తీస్తుంది
బి) పెరుగుదల తప్పనిసరిగా వికాసానికి దారి తీయవచ్చు లేదా తీయలేకపోవచ్చు
సి) పెరుగుదల ప్రత్యేక అంశానికి పరిమితమైనది
డి) పెరుగుదల పరిణామాత్మకమైనది
5. తల ఆడించడం తర్వాత శరీరానికి కదలించడం అనేది దేన్ని సూచిస్తుంది?
ఎ) శిరోపాదాభి ముఖవికాసం
బి) సమీపదూరస్త వికాసం
సి) వికాస ఏకీకృత
డి) వికాస అవిచ్ఛిన్నత
6. శిశువు శారీరక భాగాలన్నీ ఒకే రకంగా కాకుండా వేర్వేరు రీతులలో వేర్వేరు వేగాలతో వృద్ధి చెందటాన్ని ఏమంటారు?
ఎ) లయవికాస నియమం
బి) వికాసవేగ నియమం
సి) స్వయంసిద్ధ నియమం
డి) వికాస దిశ నియమం
7. ప్రతిభావంతులైన తల్లిదండ్రులకు మందబుద్ధులైన శిశువులు జన్మించడాన్ని ఏమంటారు?
ఎ) ప్రతిగమన నియమం
బి) స్వయంసిద్ధ నియమం
సి) వైవిధ్య నియమం డి) ఎ, సి
మహాత్మాగాంధీ యూనివర్సిటీ నల్లగొండ సోషియాలజీ డిపార్ట్మెంట్ సౌజన్యంతో..
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?