Home
Competitive Exams
Group I Special – General Essay | కచ్ఛదీవు వివాదం.. భారత్, శ్రీలంక మధ్య వాగ్వాదం
Group I Special – General Essay | కచ్ఛదీవు వివాదం.. భారత్, శ్రీలంక మధ్య వాగ్వాదం
Group I Special – General Essay | నిన్న మొన్నటి వరకు పాఠ్యపుస్తకాల్లో భారతదేశ పటం కింద శ్రీలంక కనిపిస్తుంది. ఆ దేశం అంతగా అక్కున చేరిందంటే వేల ఏండ్ల నుంచి నెలకొన్న సాంస్కృతిక సంబంధాలు, విస్తృత రాకపోకలే కారణం. కానీ అదే సౌభ్రాతృత్వ భావనలో ఇంచుమించు 4 దశాబ్దాల క్రితం ఉదారంగా వదులుకున్న ఒక దీవి ఇప్పుడు సమస్యాత్మకం అయ్యింది. అదే కచ్ఛదీవు. దీని గురించి తెలుసుకుందాం..
- 14వ శతాబ్దంలో అగ్నిపర్వత పేలుడు కారణంగా పాక్ జలసంధి ప్రాంతంలో ఏర్పడిన ఈ దీవి సుమారు 285 ఎకరాలు ఉంటుంది. తమిళనాడులోని రామేశ్వరానికి ఈశాన్య దిక్కులో, శ్రీలకంలోని జాఫ్నాకు నైరుతి దిక్కులో ఈ దీవి ఉంది. ఈ దీవిలో ఎక్కడా మంచినీరు లేనందున నివాసయోగ్యం కాదు.
- ఇక్కడ కేవలం సెయింట్ ఆంథోని చర్చి మాత్రమే ఉంది. ఇసుక మేటలు ఉండటం, ఇతర కారణాల వల్ల పెద్దగా చేపల వేటకు కూడా పనికిరాదు. జాలర్లు వలలు ఆరబెట్టుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఈ దీవిని వినియోగిస్తున్నారు.
- ఈ ప్రాంతం మధ్యయుగ కాలంలో జాఫ్నా ప్రాంత రాజుల ఆధీనంలో, 17వ శతాబ్దంలో రామనాథపురం జమీందారు ఆధీనంలో ఉండేది. బ్రిటిష్ పాలనలో పాక్ జలసంధి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ల డీలిమిటేషన్ తర్వాత ఈ దీవి మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా మారింది. అయితే చేపల వేటకు ఈ ప్రాంతంపై హక్కు కోసం శ్రీలంక, భారతదేశాల మధ్య వివాదం కొనసాగుతుంది.
- 1974, 76లలో భారత్-శ్రీలంక మధ్య సరిహద్దు సయోధ్య కోసం 4 ఒప్పందాలు జరిగాయి. అప్పటి ఇరుదేశాల ప్రధానులు ఇందిరాగాంధీ, సిరిమావో బండారు నాయకే మధ్య జరిగిన ఈ ఒప్పందాల ఫలితంగా ‘ఇంటర్నేషనల్ మారిటైమ్ బౌండరీ లైన్’ను నిర్ధారించుకున్నారు. సాధారణంగా రెండు దేశాల మధ్య సమాన దూర ప్రాతిపదికన ఈ రేఖ నిర్ణయిస్తారు. కానీ శ్రీలంక, భారతదేశం మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రాతిపదికన ఈ అంతర్జాతీయ జల సరిహద్దు రేఖను నిర్ణయించారు.
- ఒప్పందంలో భాగంగా భారతదేశం కచ్ఛదీవు దీవి శ్రీలంకకు చెందినదిగా అంగీకారం తెలిపింది. భారత జాలర్లు ఆ దీవిలో వలలు ఆరబెట్టుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి సెయింట్ ఆంథోనీ చర్చి ఉత్సవాలప్పుడు వీసా అవసరం లేకుండా భారతీయులు ఆ దీవిలోకి ప్రవేశించడానికి సంబంధించి భారత్ హక్కులను కలిగి ఉంది. అంతేకాని భారత జాలర్లకు ఈ దీవి ప్రాంతంలో చేపలు పట్టే హక్కులు లేవు. అవి కేవలం శ్రీలంక జాలర్లకే సొంతం. అయినప్పటికీ 1983 వరకు నిరాటంకంగా ఇరుదేశాల జాలర్లు ఎప్పటి మాదిరిగానే ఈ ప్రాంతంలో సంచరించడం, చేపలు పట్టుకోవడం చేశారు.
- కానీ 1983లో శ్రీలంక సైన్యం-తమిళ టైగర్ల మధ్య అంతర్యుద్ధం ప్రారంభం కావడంతో జాఫ్నాకు-తమిళనాడుకు మధ్యగల ఈ దీవి ప్రాంతం కీలకంగా మారింది. ఎల్టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం)కి ఆహారం, ఆయుధాలు తదితర సప్లయ్లను కట్టడీ చేసేందుకు ఈ ప్రాంతంలో శ్రీలంక సైన్యం గస్తీని ముమ్మరం చేసింది. భారత జాలర్ల రాకపోకలపై ఆంక్షలు పెరిగాయి. 2009 నాటికి అంతర్యుద్ధం ముగిసినా భారత జాలర్లపై ఆంక్షలు తగ్గలేదు. శ్రీలంక ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన భారత జాలర్లను అరెస్టులు చేయడం, వారిపై కాల్పులు జరపడం, పడవలను స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. 1976 నాటి ఒప్పందం ఉల్లంఘిస్తుంది.
శ్రీలంక వాదన - సముద్ర గర్భాన్ని దేవేస్తున్న భారత జాలర్ల అధునాతన ట్రాలీ వలలు శ్రీలంక మత్స్యకారుల జీవనోపాధినే కాక శ్రీలంక ఖండతీరపు అంచు ప్రాంతాన్ని, పగడపు దిబ్బలను నాశనం చేస్తున్నాయని శ్రీలంక చెబుతుంది. దీనివల్ల పర్యావరణానికి కూడా భారత జాలర్ల వల్ల నష్టం వాటిల్లుతుందని శ్రీలంక వాదన.
భారతదేశ వాదన - శ్రీలంక గస్తీ దళాలు భారత జాలర్లను కచ్ఛదీవులోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం 1976 నాటి ఒప్పందాన్ని ఉల్లంఘించడమే కాకుండా సంప్రదాయకంగా భారత జాలర్లు ఏనాటి నుంచో కచ్ఛదీవు ప్రాంతంలో చేపల వేట సాగిస్తున్నారు. వారసత్వంగా ఇది జరుగుతుంది. 1976 ఒప్పందం తర్వాత కూడా ఇది కొనసాగుతుంది. భారత ఖండ తీరపు అంచు ప్రాంతం మునిగి మత్స్యసంపద తగ్గిపోవడం, జాలర్లకు సరిహద్దు రేఖల గురించి కచ్చితమైన అవగాహన లేకపోవడం వల్ల ఒక్కోసారి వారు సరిహద్దులను దాటి కచ్ఛదీవు ప్రాంతం వైపు వెళ్తున్నారు. అలాంటప్పుడు వారిని హెచ్చరించడం వంటి చర్యలు చేపట్టాలి గాని, కాల్పులు జరపడం, హింసించడం, పడవలను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలు ఇరుదేశ సంబంధాలనూ దెబ్బతీస్తాయంటుంది భారత్.
- కచ్ఛదీవు దీవులను తిరిగి తీసుకోవాలనే డిమాండ్లు కూడా రెండు దశాబ్దాల కాలంగా ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం, తమిళ జాలర్ల నుంచి. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీని సంప్రదించకుండానే అంతర్జాతీయ జల సరిహద్దు రేఖను నిర్ణయించడం, ఒక దీవిని దారాదత్తం చేయడం జరిగిందని ఆ రాష్ట్రం ఆరోపిస్తుంది. 1991లో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కచ్ఛదీవును తిరిగి తీసుకోవాలని అసెంబ్లీలో ఒక తీర్మానం చేసింది. 2012లో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో దావా కూడా దాఖలు చేసింది. తరచూ తమిళ జాలర్లను శ్రీలంక అరెస్టు చేసి, వేధింపులకు గురిచేస్తుండటంతో పార్టీలకు, ప్రభుత్వాలకు అతీతంగా తమిళనాడులో ఈ అంశం ప్రాధాన్యం పొందింది. ఇటీవల శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కచ్ఛదీవు దీవిని అప్పగించేవిధంగా చూడాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు.
పరిష్కార మార్గాలు - ఈ దీవిపై హక్కును ఒక అధికారిక ఒప్పందం ద్వారా బదలాయించారు. ఇరుదేశాల మధ్య జరిగిన ఈ ఒప్పందం ‘వియన్నా కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ట్రీటీస్ 1969’కు లోబడి ఉంటుంది. భారత్, శ్రీలంక రెండూ భాగస్వాములుగా ఉన్న అంతర్జాతీయ ఒడంబడిక ఇది. దీని ప్రకారం ఏ దేశమైనా మరో దేశంతో చేసుకున్న ఒప్పందం నుంచి తనకు తాను స్వతంత్రంగా విరమించుకోవడం/బయటకు రావడం, మార్పులు చేర్పులు చేయడం వీలు కాదు. భాగస్వామ్య దేశ పూర్తి సమ్మతి కావాల్సి ఉంటుంది. కాబట్టి భారతదేశం సామరస్య పూర్వకంగా సంప్రదింపుల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి.
- లేని పక్షంలో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం కోసం ‘ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ది లా ఆఫ్ ది సీస్ (ఐటీఎల్వోఎస్)’ను ఆశ్రయించాల్సి ఉంటుంది. సముద్ర సంబంధిత ఒప్పందాలకు సంబంధించిన వివాదాలపై అంతర్జాతీయ న్యాయస్థానం లాగా ఇది పనిచేస్తూ ఉంటుంది.
భారతదేశం ఐటీఎల్వోఎస్ను ఆశ్రయించినప్పుడు సముద్ర జలచరాలు, వనరుల పరిరక్షణ, పర్యావరణ సంబంధిత అంశాలు చర్చకు వస్తాయి. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటైన ‘జలావరణ (సముద్ర), జలచర వనరుల పరిరక్షణ (గోల్ 4)’ అనే అంశం శ్రీలంక వాదనలో కీలకాంశం అవుతుంది. - ఇప్పటికే పాక్ జలసంధి ప్రాంతంలో భారత్కు చెందిన అధునాతన యంత్ర మరపడవలు (మెకనైజ్డ్ మోటార్ ఫిషింగ్ వెసెల్స్) వేల సంఖ్యలో ఉన్నాయి. ఆధునిక వలలైన (ట్రాలీ వలలతో) జాలర్లు చేపల కోసం సముద్ర గర్భాన్ని తోడేస్తున్నారు. ఇది సముద్ర పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ అంశాలన్నీ భారత్కు ప్రతికూల తీర్పు రావడానికి దోహదపడేవే.
- అంతేకాకుండా భారతదేశ ‘నైబర్స్ ఫస్ట్’ పాలసీ వివాదాలను సుహృద్భావంతో పరిష్కరించుకోవాలని ఆశిస్తుంది.
- అదేవిధంగా భారతదేశంతో శ్రీలంక చిరకాల సాంస్కృతిక సంబంధం గల దేశం. భారత్ నుంచి ఆర్థిక, ఆహార, సైనిక సహాయాలను శ్రీలంక విరివిరిగా పొందింది. భారతదేశం నుంచి అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందుతుంది. 1983 నుంచి ఇప్పటివరకు సుమారు 250 మంది భారత మత్స్యకారులు శ్రీలంక నేవీ చేతిలో హతమయ్యారు. మరెంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. వారి పడవలు ధ్వంసమై జీవనోపాధిని కోల్పోయారు. ఈ అంశాలన్నింటికీ కూడా ఐటీఎల్వోఎస్ ముందు శ్రీలంక జవాబు చెప్పాల్సి ఉంటుంది. పైగా కచ్ఛదీవు ప్రాంతంలోకి భారత జాలర్లను విశ్రాంతి కోసం కూడా అనుమతించడం లేదు. కాబట్టి శ్రీలంక, భారత్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వానికి వెళ్లాలన్నా ఎవరి లొసుగులు వారికి ఉన్నాయి. కాబట్టి సమస్యను శాంతియుత చర్చలు, సత్సంబంధాలను నెలకొల్పుకోవడం ద్వారా పరిష్కరింంచుకోవాల్సి ఉంది.
- ఇరుపక్షాల మధ్య సయోధ్య కోసం భారతదేశం ఇదే దీవిని గతంలో స్వచ్ఛందంగా వదులుకొని సౌశీల్యం ప్రదర్శించింది.
- ఈ హుందాతనాన్ని ప్రదర్శించడం ఇప్పుడు శ్రీలంక వంతు.
మల్లవరపు బాలలత
సివిల్స్ ఫ్యాకల్టీ
సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ,
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?