అటవీ సంరక్షణతోనే జీవకోటి పరిరక్షణ (పోటీ పరీక్షల ప్రత్యేకం)
అడవులు సకల జీవరాశులకు నిలయం. అడవుల నరికివేత, వన్యప్రాణు ల వేట వల్ల జీవ జాతులు అంతరించి పోయి జీవవైవిధ్యం దెబ్బ తింటుంది. దీంతో జీవుల మనుగడపై ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అటవీ సంరక్షణకు వివిధ చట్టాలను రూపొందించింది. అటవీ సంరక్షణ చట్టాల గురించి పోటీ పరీక్షల్లో ప్రశ్నలు తప్పనిసరిగా వస్తున్నా యి. ఈ చట్టాల్లోని నిబంధనలు, వాటి అమలు గురించి తెలుసుకుందాం..
అటవీ సంరక్షణ చట్టం-1980
భారతేదేశంలో 1927లోనే అటవీ చట్టం ఉన్నప్పటికీ అటవీ సంబంధ చట్టాలు 1980లో అటవీ సంరక్షణ చట్టం పేరుతో అమల్లోకి వచ్చాయి. అటవీ ప్రాంతాన్ని అరణ్యేతర అవసరాలకు వాడటాన్ని నియంత్రించడానికి, అడవుల పరిరక్షణకు ఈ చట్టాన్ని రూపకల్పన చేశారు. దీని కింద అటవీ ప్రాంతాన్ని ఏ అరణ్యేతర అవసరాలకు వాడుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది. అటవీ సంరక్షణ చట్టం 1980ని సవరించి 1987 నుంచి 1989 వరకు వివిధ సవరణలు చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు.
చట్టం లక్ష్యాలు
ఎ. అటవీ పరిరక్షణ, సంరక్షణ
బి. అటవీ ఉత్పత్తులను వివేకంగా వినియోగించుకోవడం
అడవి: వృక్షాలు, పొదలు కలిగి ఉన్న జైవిక సముదాయం.
అటవీ ఉత్పత్తి: అడవి నుంచి సేకరించిన కలప, కొయ్య, బెరడు, బొగ్గు, నూనె, సహజ వార్నిష్, విత్తనాలు మొదలైనవి.
రిజర్వు అడవుల విజ్ఞాపన: అటవీ సంరక్షణ చట్టంలోని 3వ సెక్షన్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక అటవీ ప్రాంతాన్ని, బంజరు భూమిని అధికార గెజిట్ ప్రకటన ద్వారా రిజర్వు అడవిగా ప్రకటించవచ్చు.
# 4వ సెక్షన్ కింద ఏ ప్రాంతాన్నైనా రిజర్వు అడవిగా ప్రకటించే నిర్ణయం తీసుకోవచ్చు.
#ఆ ప్రాంతం సరిహద్దు, పరిస్థితిని నిర్దేశించవచ్చు.
అటవీ అధికారి నియామకం: ఈ చట్టంలోని 4వ సెక్షన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురి కన్నా ఎక్కువ కాకుండా అటవీ సెటిల్మెంట్ అధికారులను నియమించవచ్చు.
#6వ సెక్షన్ ప్రకారం ప్రతిపాదిత అడవి సరిహద్దులను, పరిస్థితిని నిర్దేశించవచ్చు.
# అడవిని రిజర్వు చేయడానికి కారణాలను వివరించవచ్చు.
# మూడు నెలలకన్నా ఎక్కువ వ్యవధిలో ఎవరైనా అటవీ ప్రాంతంపై తన హక్కులను తెలియజేస్తూ, రావాల్సిన నష్టపరిహారాన్ని సూచిస్తూ అటవీ సెటిల్మెంట్ అధికారికి రాతపూర్వకంగా తెలియజేయవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు
# సెక్షన్ 5 కింద అటవీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ముందస్తు అనుమతితో ఒక రిజర్వు అడవిలో పబ్లిక్ లేక ప్రైవేటు దారిని, నీటి ప్రవాహాన్ని, ప్రత్యామ్నాయ దారులను నిలిపివేయవచ్చు.
# సెక్షన్ 29 కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రభుత్వ గెజిట్ ప్రకటన ద్వారా రిజర్వు అడవిలో కలపని అటవీ ప్రాంతాన్ని కాని, బంజరు భూమిని అడవిలో కలపడానికి తమ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రకటించవచ్చు. దీంతో ఆ ప్రాంతాన్ని రక్షిత అడవిగా పరిగణిస్తారు.
# సెక్షన్ 32 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి రక్షిత అటవీ ప్రాంతానికి నిబంధనలు చేసే అధికారం ఉంటుంది.
# సెక్షన్ 30 కింద రాష్ట్ర ప్రభుత్వం అధికార గెజిట్ ద్వారా రక్షిత అడవిలోని ఏ చెట్టునైనా రిజర్వుడుగా ప్రకటించవచ్చు. రక్షిత అడవిలో రాళ్లను తవ్వడం, సున్నపురాయిని కాల్చడం, బొగ్గును తయారు చేయడం, అటవీ ఉత్పత్తులను సేకరించడం లేదా తొలగించడం నిషేధించవచ్చు.
# సెక్షన్ 35 కింద రాష్ట్ర ప్రభుత్వం అధికార గెజిట్ ప్రకటన ద్వారా అడవి, రిజర్వుడు ప్రాంతం, బంజరు భూమిలో పశువులను మేపడం, గడ్డిని తొలగించడం నిషిద్ధం.
చట్టం అతిక్రమణ-శిక్షలు
#ఈ చట్టంలోని 33వ సెక్షన్ కింద ఎవరైనా ఈ చట్టంలోని వ్యవస్థలను అతిక్రమించినప్పుడు ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.500 వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
# రిజర్వుడు అడవిలో చెట్లను నరికినా, కాల్చినా, ధ్వంసం చేసినా నేరమే.
#రక్షిత అడవిలో వ్యవసాయం కోసం భూమిని విభజించడం నిషేధం.
#రిజర్వు చేసిన చెట్లకు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా నిప్పు పెట్టినా, మంటలు వ్యాపింపజేసినా నేరం.
#అడవిలోని రాళ్లను తవ్వినా, సున్నపురాయిని లేదా బొగ్గును కాల్చినా, అటవీ ఉత్పత్తులను సేకరించినా, తొలగించినా శిక్షార్హం.
#రిజర్వు అడవిలోని చెట్లను పశువులు నాశనం చేయడం నేరం.
# సెక్షన్ 32లోని నిబంధనలు అతిక్రమించినా నేరమే.
ముఖ్యమైన సవరణలు
#1998లో చట్టాన్ని అతిక్రమించేవారిని కఠినంగా శిక్షించేందుకు అటవీ(పరిరక్షణ) చట్టం-1980కి సవరణలు చేశారు. అందులో కొన్ని ముఖ్యమైనవి.
#ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఏ వన్య ప్రాంతాన్నైనా ఇతర వ్యక్తులకు, సంస్థలకు లీజుకు ఇవ్వకూడదు.
# కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా అటవీ ప్రాంతాన్ని కానీ అందులోని కొంతభాగంలో కానీ సహజంగా పెరిగిన చెట్లను తొలగించకూడదు.
#అరణ్యేతర అవసరాలను టీ, కాఫీ, మసాలా దినుసులు, రబ్బరు, ఔషధ మొక్కలు వంటి వాటిని వాణిజ్య పంటల పరిధికి విస్తరించారు.
అటవీ, పర్యావరణ శాఖ-1985
కేంద్ర ప్రభుత్వం 1985లో పర్యారణం, అటవీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసింది. ఇది పర్యావరణం, అడవులకు సంబంధించిన కార్యక్రమాల అమలుకు అటవీశాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.
అటవీ చట్టం-1992కు సవరణ
#1992లో ఈ చట్టానికి కొన్ని సవరణలు చేశారు. అందులో పరిమితంగా చెట్లను నరకడం, కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి తీసుకోవడం వంటివి ఇందులో చేర్చారు. ప్రసార తీగలను ఏర్పాటు చేయడం, సిస్మిక్ సర్వేలు, పరిశోధనలు, డ్రిల్లింగ్, జల విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం వల్ల పెద్ద ఎత్తున చెట్లను నరకాల్సి ఉంటుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
# కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో, జాతీయ పార్కుల్లో పరిశోధనలు, సర్వేలు చేయడం నిషేధం.
#అరణ్యేతర కార్యకలాపాల్లో టీ, కాఫీ, మసాలా దినుసులు, రబ్బరు మొక్కలు మొదలైన వాణిజ్య పంటలు పండించడం చేర్చారు. అయితే ఈ కార్యకలాపాలను రిజర్వుడ్ అడవుల్లో అనుమతించరు.
#అటవీ ప్రాంతంలో గిరిజనులు సాగించే టుస్సార్ వ్యవసాయం(ఒకరకమైన సిల్కును ఇచ్చే కీటకాల పెంపకం) వారి జీవనం కోసం చేస్తారు. కాబట్టి దీన్ని అటవీ కార్యకలాపం కిందనే పరిగణించారు.
#పట్టు పురుగుల కోసం మల్బరీ మొక్కలను పెంచడాన్ని అరణ్యేతర కార్యకలాపం కిందనే పరిగణిస్తారు.
#గనులను తవ్వడం అరణ్యేతర కార్యకలాపం కాబట్టి దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అవసరం. ఈమేరకు సుప్రీం కోర్టు 1997లో ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం కేంద్రం అనుమతి లేకుండా అటవీ ప్రాంతంలో గనులను తవ్వడం తక్షణం నిలిపివేయాలి.
వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972
# 1972లో అమలులోకి వచ్చిన ఈ చట్టం వన్యప్రాణుల సంరక్షణ చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలింది. వన్యప్రాణి సంరక్షణను రాష్ట్ర జాబితా నుంచి కేంద్ర ప్రభుత్వానికి 1976లో బదిలీ చేయడంతో ఇందుకు సంబంధించిన చట్టం రూపకల్పనలో కేంద్రానికి అధికారం లభించింది.
#మనదేశంలో 1952లో భారత వన్యప్రాణి మండలిని స్థాపించారు. ఇది వన్యప్రాణి పరిరక్షణ చట్టం తదుపరి జాతీయ పార్కులు, సంరక్షణ కేంద్రాలు స్థాపించడంలో క్రియాశీల పాత్రను పోషించింది.
1. ఇది వన్యప్రాణికి సంబంధించిన పరిభాషను నిర్వచిస్తుంది.
2. వన్యప్రాణి సలహా మండలిని నియమించడం, వన్యప్రాణి వార్డెన్ను నియమించడం, అతడి అధికారాలు, విధులు నిర్ణయించడం చేస్తుంది.
3. ఈ చట్టం కింద ప్రప్రథమంగా అంతరించిపోతున్న జీవజాతులను ఒక జాబితాగా రూపొందించడం, ఆ జీవజాతులను వేటాడటాన్ని నిషేధించడం చేసింది.
4. ఈ చట్టం కింద అంతరించిపోతున్న కొన్ని మొక్కలను కూడా పేర్కొన్నారు.
5. జాతీయ పార్కులను, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది.
6. కేంద్ర జూ అధికారి నియామకం చేపట్టింది.
7. కొన్ని జీవ జాతుల విక్రయానికి, బదిలీకి లైసెన్సులను కల్పించడానికి సంబంధించిన వ్యవస్థలను ఏర్పాటు చేసింది.
భారతదేశంలోని యునెస్కో సహజ ప్రపంచ వారసత్వ ప్రదేశాలు
వారసత్వ ప్రదేశం రాష్ట్రం గుర్తించిన సంవత్సరం
కజిరంగా నేషనల్ పార్కు అసోం 1985
కియోలాడియో ఘనా నేషనల్ పార్కు రాజస్థాన్ 1985
మనస్ వన్యప్రాణుల అభయారణ్యం అసోం 1985
నందాదేవి నేషనల్ పార్కు ఉత్తరాఖండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ 1988, 2005
సుందర్బన్స్ నేషనల్ పార్కు పశ్చిమబెంగాల్ 1987
పశ్చిమ కనుమలు మాహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తమిళనాడు, కేరళ 2017
గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్కు హిమాచల్ప్రదేశ్ 2014
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?