Career Guidance For Engineering | బ్రాంచీలు భళా.. ఎంపిక ఇలా!
ఎంసెట్ ఫలితాలు విడుదలైన తరుణంలో అటు విద్యార్థులు ఇటు తల్లిదండ్రులు కౌన్సెలింగ్‌కు సన్నద్ధమవుతున్నారు. ఈ సందర్భంలో ఎటువంటి కళాశాలను ఎంపిక చేసుకోవాలి? ఏ కోర్సును ఎంచుకోవాలి? అని కొందరు ఆలోచిస్తుంటే.. అసలు ఏ కళాశాలను ఏ ప్రమాణాలతో పరిగణనలోకి తీసుకోవాలి? ఏ అంశాలను పరిశీలించి సంబంధిత కోర్సు కోసం కళాశాలను ఎంపిక చేసుకోవాలి? అని సందిగ్ధంలో ఉన్న తల్లిదండ్రులకు అవగాహన కలిగించేందుకు ఓయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్, ఎగ్జామినేషన్ కంట్రోల్ ఇన్చార్జి డా. శ్రీరామ్ వేంకటేశ్ అందించిన వివరాలు మీ కోసం..
ఎటువంటి కళాశాలను ఎంపిక చేసుకోవాలి?
- పేరున్న కళాశాలను పరిగణనలోకి తీసుకునే ముందు, ఆ కళాశాల రెప్యుటేషన్‌ను, ముఖ్యంగా ఆ కళాశాల ప్లేస్‌మెంట్స్ ఏ విధంగా ఉంది? ఎలాంటి ఫ్యాకల్టీతో బోధన జరుగుతుంది? మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి? అనేవి పరిశీలించి ఎంపిక చేసుకోవాలి.
బ్రాంచీనా? కళాశాల ప్రధానమా? - ఇదే ప్రధానం అని నిర్దేశించి చెప్పలేం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఫ్యాకల్టీ, ప్లేస్‌మెంట్స్, మౌలిక వసతులు, అలాగే NAAC, NBA గుర్తింపు పొందిన కళాశాలకు ప్రథమ ప్రాముఖ్యం ఇవ్వాలి.
మేజర్… మైనర్.. హానర్స్ - నేడు విద్యార్థులకు మంచి సౌలభ్యం ఉంది. అనుకున్న బ్రాంచీలో సీటు రాలేదని దిగులు చెందాల్సిన పనిలేదు. అందుకు చక్కటి వెసులుబాటు ఉంది. అదేంటంటే సీఎస్‌ఈపై మక్కువ ఉంది. కానీ ర్యాంకు రీత్యా అనుకున్న కాలేజీలో, కోర్సులో సీటు రాలేదు.
- కాలేజీ మంచిదైతే ర్యాంకును అనుసరించి వచ్చిన బ్రాంచీలో చేరి నచ్చిన బ్రాంచీని కూడా చేసే అవకాశాన్ని గత సంవత్సరం నుంచి ప్రవేశపెట్టాం. ఉదాహరణకు మెకానికల్‌లో సీటు వచ్చింది. కానీ కంప్యూటర్ సైన్స్‌లో చేరాలని ఇష్టం ఉంది.
- అప్పుడు సివిల్ మేజర్‌గా చదువుకొని, మైనర్ (20 క్రెడిట్స్) సీఎస్ఈ చదువుకొనే అవకాశం ఉంది. దీంతో రెండు డిగ్రీలు (డ్యూయెల్ డిగ్రీ) పొందవచ్చు. దీనివల్ల విద్యార్థి అసంతృప్తితో కాకుండా ఆనందంగా విద్యనభ్యసించి సివిల్‌తో పాటు కంప్యూటర్స్ రంగంలో కూడా ఉద్యోగాన్ని సంపాదించే అవకాశాన్ని ఓయూ, జేఎన్టీయూ, ఎన్ఐటీ వరంగల్ కల్పిస్తున్నాయి.
- అదేవిధంగా ఒకవేళ విద్యార్థికి వేరే ఏ సబ్జెక్ట్‌వైపు మొగ్గు చూపించకుండా మెకానికల్నే పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే వారికి కూడా అవకాశం ఉంది. అదే ‘హానర్స్’.
- చెప్పినట్టు 20 క్రెడిట్స్‌ను ఇతర బ్రాంచీలను తీసుకోకుండా మెకానికల్లోనే మరికొన్ని సబ్జెక్టులను తీసుకుని చదివితే ‘బీఈ మెకానికల్ ఇంజినీరింగ్ హానర్స్’ అని ఇస్తారు.
- సాధారణంగా విద్యార్థులు 160 క్రెడిట్స్ పొందితే సరిపోతుంది. అధికంగా 20 క్రెడిట్స్ సంబంధిత సబ్బెక్ట్ను అభ్యసించి మిగిలిన వారికంటే ఎక్కువ జ్ఞానాన్ని, అవగాహనను సంపాదించడం వల్ల హానర్స్ అందిస్తున్నాం.
- దీని వల్ల ఉద్యోగావకాశాల సమయంలో ఇటు కంపూటర్స్ వైపు, అటు మెకానికల్ వైపు వెళ్లవచ్చు.
ఏ విషయంలో కళాశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి - నేడు ఐటీ రంగానికి చాలా ప్రాధాన్యం ఉంది. దీంతో ఎక్కువ శాతం కంప్యూటర్ కోర్సును ఎంపిక చేసుకుంటున్నారు.
- సీఎస్ఈ కోరుకుంటే పైన చెప్పిన అంశాలున్న కళాశాలలో కోర్సుకు తగిన అర్హత ర్యాంకు సాధిస్తే.. కోర్సుకే ప్రాధాన్యం ఇచ్చి చేరవచ్చు. ఒకవేళ అలా కాకుండా కోర్సు కోరుకున్నది రాకపోయినా రెండో ప్రాధాన్యంగా సివిల్/మెకానికల్ కోర్సును ఎంచుకుంటే వాటికి అర్హత ఉంటే చేరవచ్చు. పైన పేర్కొన్న అంశాల వల్ల విద్యార్థి భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
- అలాకాకుండా కోరుకున్న కోర్సు మంచి కళాశాలలో రాలేదని పట్టుబట్టి ఆ కోర్సునే ప్రధానంగా చేసుకొని మరో కళాశాలను ఎంపిక చేసుకునే క్రమంలో ఆ కళాశాల భవన నిర్మాణాలు, పైపై మెరుగులు చూసి చేరితే భవిష్యత్తుకు ఎలాంటి ప్రయోజనం ఉండదు.
- నేడు చాలామంది ముందుగానే నిశ్చయించుకుంటున్నారు ఫలానా కోర్సు మాత్రమే అని. పైన చెప్పినట్లు కంప్యూటర్ సైన్స్ కోర్సు కావాలనుకున్న వారికి.. మంచి కళాశాలలో ఆ కోర్సులో సీటు సంపాదించే ర్యాంకు రానప్పుడు సెకండ్ అప్షన్‌గా ఉన్న మెకానికల్, సివిల్‌లో కూడా చేరవచ్చు. ఎందుకంటే నేడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేది ఒక గ్రూప్‌నకు మాత్రమే పరిమితం అనలేం. ప్రతి రంగంలోనూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగిస్తున్నారు.
ఇంజినీరింగ్ అంటే ఐటీ మాత్రమే కాదు - ఈమధ్యకాలంలో ఎటుచూసినా అనేక సంస్థల్లో రెసిషన్ వల్ల ఎంతోమంది నిరుద్యోగులవుతున్నారు. స్టార్టప్ సంస్థల నుంచి అమెజాన్ వంటి దిగ్గజ సంస్థల వరకు ఉద్యోగాలకు భద్రత లేకుండా పోతుంది. ప్రస్తుతం సాఫ్ట్వేర్ బూమ్‌లో ఉందని, వాటిలో ఉద్యోగావకాశాలు ఉన్నాయని అటువైపు వెళ్తున్నారు. కానీ రానున్న కాలంలో సాఫ్ట్వేర్ రంగం డౌన్‌ఫాల్‌ను ఎదుర్కొంటుందని స్పష్టమవుతుంది.
మ్యానుఫ్యాక్చరింగ్ వైపు మొగ్గు చూపాలి - చాలామంది నాలుగో సంవ్సతరం ముగిసిన వెంటనే పెద్ద మొత్తంలో ప్యాకేజీ ఉన్న ఉద్యోగాల వేటలో పడుతున్నారు. ఐటీ రంగంలో ఇలాంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. వెంటనే ఉద్యోగం ఆపై ఇంక్రిమెంట్ ఇలా సాఫ్ట్వేర్ ప్రపంచంలో ఉండే సౌలభ్యాలను దృష్టిలో పెట్టుకొని కొంతమంది చేరుతుంటే.. మరికొంతమంది ఉత్సుకతతో, కోర్ సబ్జెక్ట్‌పై మక్కువతో చేరుతున్నారు.
- ఇలా అధిక శాతం విద్యార్థులు సర్వీస్ సెక్టార్ వైపు మొగ్గు చూపడం వల్ల క్రమేనా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కొరత ఏర్పడుతుంది. ఇది ఇలాగే కొనసాగితే కొరత మరింత తీవ్రంగా మారి ఉత్పత్తి రంగంలో వెనుకబడే అవకాశం ఉంది.
- మెకానికల్, సివిల్ రంగాలపై చాలామందిలో ఉన్న అపోహ, వెనుకడుగు వేయడానికి కారణం ఐటీ రంగంలో ఉన్నవారి వలే రిలీవ్ అయిన వెంటనే భారీ ప్యాకేజీలతో ఉద్యోగావకాశాలు రావని. కానీ ఈ రంగంలో ఓర్పుగా ఉంటే అనుభవం ఉన్నవారికి అందుకు తగిన భారీ ప్యాకేజీ లభిస్తుంది.
- నేడు ఒక రంగం గొప్పది మరో రంగం తక్కువది అని నిర్ణయించలేం. ఏ రంగం ఎంచుకున్నా అందుకు తగిన అవకాశాలున్నాయి. కాబట్టి ఐటీ ఒక్కటే కాకుండా మిగిలిన బ్రాంచీలు, వాటిలోని ఉద్యోగావకాశాల గురించి తెలుసుకొని చేరాలి.
ఫ్యాకల్టీ, మౌలిక వసతులు, ప్లేస్‌మెంట్స్ - నచ్చిన, మెచ్చిన కోర్సు, అందుబాటులో ఫీజు ఉందని, కళాశాల బాగుందని చేరవద్దు. అది ప్రభుత్వ కళాశాల అయినప్పటికీ అందులో తగినన్ని సీట్లు ఉన్నా సరైన ఫ్యాకల్టీ లేనపోతే వ్యర్థమే. మంచి ఫ్యాకల్టీ ఉందా? లేదా? అని పరిశీలించాలి. ఎందుకంటే కొన్ని కళాశాలలు కాంట్రాక్ట్ పద్ధతిన నియమించుకొని బోధన సాగిస్తున్నాయి. కాబట్టి నచ్చిన కోర్సులో చేరినా సరైన ఫ్యాకల్టీ లేకపోతే ఇన్నేళ్లు కష్టపడినదంతా వృథా అవుతుంది.
- మౌలికవసతులు అంటే చాలామంది బెంచీలు, బోర్డు, కుర్చీలు అనుకొని అంతటితో వదిలేస్తారు. కానీ మౌలిక వసతుల్లో ప్రధానంగా గమనించాల్సింది ల్యాబ్. థియరీ నాలెడ్జ్ ఎంత అవసరమో ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అంతే అవసరం. ల్యాబ్స్, వర్క్‌షాప్స్ మొదలైనవి మౌలికవసతుల్లోకి వస్తాయి. సాధారణంగా ప్రతి కాలేజీలో వీటిని పేర్కొంటారు. ప్రతి కాలేజీ వాటిని తప్పకుండా వినియోగిస్తాయని చెప్పలేం. కాబట్టి వాటిని నిశితంగా పరిశీలించి కాలేజీలో చేరాలి.
- పై వాటితో పాటు మరో ముఖ్యమైన అంశం ప్లేస్‌మెంట్స్. ప్లేస్‌మెంట్స్ ఏ విధంగా, ఎలా జరుగుతున్నాయి? ఎంతమందికి ప్లేస్‌మెంట్స్ కల్పిస్తున్నారు? అనేది కూడా గమనించాలి.
- కాబట్టి ఫ్యాకల్టీ, మౌలిక వసతులు, ప్లేస్‌మెంట్స్ ఈ మూడింటిని పరిగణనలోకి తీసుకొని కళాశాలను ఎంచుకోవాలి.
అటానమస్ కాలేజీ ఎంపిక ఎలా? - ర్యాంకును బట్టి యూనివర్సిటీలో సీటు వస్తే తప్పకుండా మొదటి ప్రాధాన్యం యూనివర్సిటీలకే ఇవ్వాలి. రెండో ఆప్షన్‌గా అటానమస్ కాలేజీలను ఎంచుకోవాలి. అటానమస్ కాలేజీలు కూడా మంచి బోధనను అందిస్తున్నాయి. అంతేకాదు ఉన్నత స్థాయి మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నాయి. ఇవి NAAC, NBA వంటి అక్రెడిటేషన్ గుర్తింపు పొందుతున్నాయంటే వాటి పనితనం అర్థం చేసుకోవచ్చు.
నూతన ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరవచ్చా? - ఈమధ్య స్థాపించిన ఇంజినీరింగ్ కళాశాలలను పరిగణనలోకి తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఎందుకంటే అవి కొత్తవి కాబట్టి వాటిలోని ఫ్యాకల్టీ మిగిలిన కళాశాలలతో పోల్చితే అంత మంచిగా ఉండకపోవచ్చు. అంతేకాకుండా ల్యాబ్స్, వర్క్‌షాప్స్ వంటి విషయాల్లో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. నాలుగు, ఐదు బ్యాచ్‌లు గడిచిన తరువాత వీటిని పరిగణనలోకి తీసుకోవాలి.
అవసరాల వెంకట సాయిఈశ్వర్
Previous article
SBI FLC Recruitment | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 194 పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం