ఈశాన్యంలో అత్యల్పం.. ఉత్తరాదిన అత్యధికం
లోక్‌సభలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు
- ఆర్టికల్ 330 ప్రకారం లోక్‌సభలో ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపదికపై సీట్లను కేటాయించారు.
- మొదట్లో ఈ రిజర్వేషన్లను 10 సంవత్సరాల వరకు (1960 వరకు) పొందుపరిచనప్పటికీ తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు వాటిని పొడిగించడమైంది.
- 2009లో చేసిన 95వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఈ రిజర్వేషన్లను 2020 వరకు పొడిగించడం జరిగింది. 2019లో చేసిన 104వ రాజ్యాంగ సవరణ చట్టం ఆధారంగా లోక్‌సభలో ఎస్సీ, ఎస్టీల స్థానాలకు రిజర్వేషన్లను 25 జనవరి, 2030 వరకు పొడిగించారు.
- ఈ రిజర్వేషన్లు రాష్ట్ర శాసన సభలకు కూడా వర్తిస్తాయి.
- 2003లో 87వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఎస్సీ, ఎస్టీల లోక్‌సభ స్థానాలను 2001 జనాభా లెక్కల ప్రకారం పునర్ వ్యవస్థీకరించారు. దీంతో ఎస్సీ, ఎస్టీల లోక్‌సభ స్థానాలు పెరిగాయి. ప్రస్తుతం లోక్‌సభలో ఎస్సీలకు 84 స్థానాలు (గతంలో 79 స్థానాలు), ఎస్టీలకు 47 స్థానాలు (గతంలో 41 స్థానాలు) ఉన్నాయి.
- ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి 6 సార్లు రాజ్యాంగాన్ని సవరించారు.
1) 8వ రాజ్యాంగ సవరణ – 1960
2) 23వ రాజ్యాంగ సవరణ – 1969
3) 45వ రాజ్యాంగ సవరణ -1980
4) 62వ రాజ్యాంగ సవరణ – 1989
5) 79వ రాజ్యాంగ సవరణ – 1999
6) 95వ రాజ్యాంగ సవరణ – 2009 - లోక్‌సభలో సీట్ల సంఖ్య ఆ రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది.
పార్లమెంట్ సభ్యుల అర్హతలు
- భారతీయ పౌరుడై ఎండాలి.
- మూడో షెడ్యూల్లో పేర్కొన్న విధంగా ఎన్నికల కమిషన్ సూచించిన అథారిటీ ముందు ప్రమాణం చేయాలి.
- దివాళా తీసి ఉండరాదు, నేరారోపణ రుజువై ఉండరాదు.
- లోక్‌సభ సభ్యత్వానికి కనిష్ఠ వయోపరిమితి 25 సంవత్సరాలు, రాజ్యసభ సభ్యత్వానికి 30 సంవత్సరాలు ఉండాలి.
- దేశంలో ఏదో ఒక నియోజక వర్గంలో ఓటరుగా నమోదు చేసుకుని ఉండాలి.
- పార్లమెంట్ నిర్దేశించిన ఇతర అర్హతలు ఉండాలి.
- రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థి ఏ రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్నాడో ఆ రాష్ట్రంలో సాధారణ ఓటరై ఉండాలి.
- కానీ 2003లో ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951ను అనుసరించి దేశంలో ఎక్కడ ఓటరుగా ఉన్నప్పటికీ అర్హుడిగా పరిగణిస్తూ చట్టం చేశారు.
షరతులు
- అభ్యర్థి లేదా తన ప్రపోజర్ నామినేషన్ పత్రాలను దాఖలు చేయాలి.
- అభ్యర్థి నామినేషన్ పత్రంతోపాటు సెక్యూరిటీ డిపాజిట్ (ధరావతు)గా రూ.25,000 చెల్లించాలి. నగదు అయితే రిటర్నింగ్ అధికారికి లేదా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి, నగదు కాకపోతే రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లేదా ట్రెజరీలో చెల్లించాలి.
పదవీ ప్రమాణ స్వీకారం
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే సెక్యూరిటీ డిపాజిట్ రూ.12,500 చెల్లించాలి అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసినా, ఒకే సెక్యూరిటీ డిపాజిట్ సరిపోతుంది. ప్రతి అభ్యర్థి తను సమర్పించే ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు, అప్పులు, బాండ్స్, క్రైమ్ రిపోర్ట్స్, ఫ్యామిలీ వివరాలు ఉండాలి. ఆర్టికల్ 99 ప్రకారం పార్లమెంట్ సభ్యులతో రాష్ట్రపతి లేదా అతని తరఫున మరొకరు గాని ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
- ప్రమాణ స్వీకారం చేయకుండా పార్లమెంట్ కార్యకలాపాల్లో పాల్గొనడం, సభా హక్కులు అనుభవించడానికి గానీ అవకాశం లేదు.
పార్లమెంట్ సభ్యుల జీతభత్యాలు
- భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 106 ప్రకారం పార్లమెంట్ నిర్దేశించిన విధంగా పార్లమెంట్ సభ్యుల జీతభత్యాలు నిర్ణయిస్తారు. ఇండియాలో ప్రతి 5 స.లకు ఒకసారి శాసన సభ్యుల వేతనాలు ద్రవ్యోల్బణ ధరల సూచిక ప్రకారం పెరుగుతాయి.
- పార్లమెంట్ సభ్యుల జీతభత్యాల కోసం వేతనం, భత్యం, పెన్షన్ల చట్టం1954లో చేశారు. 2018లో చేసిన సవరణ చట్టం అయిన ఫైనాన్స్ చట్టం ప్రకారం ప్రతి 5 సం.లకు ఒకసారి పార్లమెంట్ సభ్యుల జీతభత్యాలు, పెన్షన్లు పెంచాలని నిర్ణయించారు.
లోక్‌సభ, రాజ్యసభల కాలపరిమితి
రాజ్యసభ కాలపరిమితి
- రాజ్యసభ శాశ్వతసభ ఇది లోక్‌సభ వలే రద్దు కాదు
- రాజ్యాంగంలో రాజ్యసభ కాలపరిమితికి సంబంధించి ఎటువంటి నిబంధన లేదు.
- కానీ ప్రజా ప్రాతినిధ్య చట్టం- 1951 ప్రకారం రాజ్యసభ కాలపరిమితి ఆరేళ్లుగా నిర్ణయించారు.
- రాజ్యసభ సభ్యులు ఆరేళ్ల కాలపరిమితికి ఎన్నికయ్యి ప్రతి రెండేళ్లకు 1/3 వంతు మంది సభ్యులు పదవీ విరమణ చేస్తారు. ఇందుకు సంబంధించిన నిబంధనలను పార్లమెంట్ రూపొందిస్తుంది. కాబట్టి రాజ్యసభకు జరిగే ఎన్నికలను ద్వివార్షిక ఎన్నికలు అంటారు.
- ఈ విధంగా సభ నిరంతరంగా కొనసాగుతుంది. కాబట్టి దీన్ని శాశ్వత సభ అని, నిరంతర సభ అని అంటారు.
లోక్‌సభ కాలపరిమితి
- ఆర్టికల్ 85(2) ప్రకారం మొదటిసారిగా సమావేశమైన తేదీ నుంచి లోక్‌సభ కాలపరిమితి 5 సంవత్సరాలు. ఐదేళ్ల వ్యవధి పూర్తయిన వెంటనే లోక్‌సభ రద్దు అయినట్లుగా పరిగణిస్తారు. అయితే ఈ లోపు లోక్‌సభ రద్దయితే ఈ నిబంధన వర్తించదు.
- కానీ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్న సమయంలో ప్రత్యేక శాసనాల ద్వారా లోక్‌సభ కాలపరిమితిని పొడిగించ వచ్చు.(ఒకసారికి సంవత్సరానికి మించి పొడిగించరాదు) అత్యవసర పరిస్థితి రద్దు అయిన తర్వాత 6 నెలల కంటే ఎక్కువ కాలం పొడిగించడానికి వీల్లేదు.
- 1976లో 42వ రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు లోక్‌సభ కాలపరిమితిని 6 సంవత్సరాలకు పెంచారు. అయితే 1978లో జరిగిన 44వ రాజ్యాంగ సవరణ లోక్‌సభ పదవీకాలాన్నీ తిరిగి 5 సంవత్సరాలకు తగ్గించింది. అంటే దీని అర్థం లోక్‌సభ పూర్తికాలం కొనసాగి తీరాలని కాదు. పూర్తి కాలపరిమితి తేదీ లోగా ప్రధాని అభ్యర్థన మేరకు రాష్ట్రపతి ఎప్పుడైనా లోక్‌సభను రద్దు చేయవచ్చు.
లోక్‌సభ రద్దు
- రాజ్యసభ శాశ్వత సభ కాబట్టి రద్దు చేయడం కుదరదు. లోక్‌సభ తాత్కాలిక సభ కాబట్టి ఆర్టికల్ 85(2)(బి) ప్రకారం 2 రకాలుగా రద్దు చేయవచ్చు.
1) 5 సం.ల కాలపరిమితి ముగిసిన తర్వాత సాధారణ పద్ధతిలో రద్దు చేయడం
2) ప్రధాని సలహా మేరకు 5 సం.ల కాలపరిమితికి ముందే రద్దు చేయడం.
3) లోక్‌సభ రద్దయినప్పుడు దాని పరిశీలనలో ఉన్న అన్ని రకాల బిల్లులు, తీర్మానాలు, నోటీసులు పిటిషన్లు రద్దవుతాయి.
5) అయితే ప్రభుత్వ హామీల కమిటీ పరిశీలనలో ఉన్న బిల్లులు, హామీలు రద్దు కావు.
6) లోక్‌సభ రద్దయినప్పుడు వివిధ బిల్లుల విషయంలో కింది పరిస్థితులు ఏర్పడవచ్చు.
I) లోక్‌సభ రద్దుతో రద్దయ్యే బిల్లులు
ఎ) లోక్‌సభలో ప్రవేశ పెట్టబడి, పరిశీలనలో ఉన్న బిల్లులు.
బి) లోక్‌సభ ఆమోదించి, రాజ్యసభ పరిశీలనలో ఉన్న బిల్లులు.
సి) రాజ్యసభ ఆమోదించి, లోక్‌సభలో పరిశీలనలో ఉన్న బిల్లులు.
డి) రాజ్యసభలో ప్రవేశ పెట్టి ఆమోదం పొందిన బిల్లులు, లోక్‌సభకు పంపిన మార్పులను సూచిస్తూ తిరిగి రాజ్యసభకు పంపిన బిల్లులు.
II) లోక్‌సభ రద్దుతో రద్దుకాని బిల్లులు
ఎ) ఉభయ సభలు పరిశీలించిన ఒక బిల్లును ఒక సభ ఆమోదించినప్పుడు ఆ మేరకు రాష్ట్రపతి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయడానికి నోటీసులు జారీ చేసిన తర్వాత లోక్‌సభ రద్దయితే ఆ బిల్లు రద్దు కాదు.
బి) రాజ్యసభ పరిశీలనలో బిల్లు ఉండి లోక్‌సభ పరిశీలన కోసం బిల్లు ఇంకా పంపనప్పుడు ఆ బిల్లులు రద్దు కావు.
సి) ఉభయ సభలు ఆమోదించి రాష్ట్రపతికి పంపగా ఆ బిల్లు రాష్ట్రపతి పరిశీలనలో ఉండగా లోక్‌సభ రద్దయితే ఆ బిల్లు రద్దు కాదు.
డి) పార్లమెంట్ ఉభయ సభలు బిల్లును ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపగా, రాష్ట్రపతి ఆ బిల్లును పునఃపరిశీలన కోసం తిప్పి పంపినపుడు ఆ బిల్లు రద్దు కాదు.
పార్లమెంటు సభ్యుల అనర్హతలు
- భారత రాజ్యాంగంలో ఉదహరించిన విధంగా కింద పేర్కొన్న ప్రాతిపదికలపై పార్లమెంట్ సభ్యత్వం రద్దవుతుంది.
- పార్లమెంట్ సభ్యుల అనర్హతల గురించి ఆర్టికల్ 102 తెలియజేస్తుంది.
- లాభదాయక ప్రభుత్వ పదవిని చేపట్టినప్పుడు.
- మానసికంగా స్థిమితంగా లేరని న్యాయస్థానం పేర్కొన్నప్పుడు
- దివాళాకోరు అని ప్రకటించడం
- భారత పౌరసత్వం పోవడం, పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడం లేదా విదేశాలకు విధేయుడై ఉంటానని ప్రకటించడం
- పార్లమెంట్ చట్టం ద్వారా ఇతర అనర్హతలను నిర్దేశించవచ్చు పార్లమెంట్ ప్రజా ప్రాతినిధ్య చట్టం -1951 ఆధారంగా కింది అనర్హతలను నిర్దేశించింది.
1) ఎన్నికల్లో నేరాలకు పాల్పడినప్పుడు
2) రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు నిర్బంధంలో ఉండటం. అయితే నిరోధక నిర్బంధ చట్టాల ఆధారంగా నిర్బంధిస్తే ఇది వర్తించదు.
3) ఎన్నికల ఖర్చులకు సంబంధించిన ఖాతాలను నిర్ణీత కాల పరిమితిలోగా ఎన్నికల సంఘానికి సమర్పించడంలో విఫలమైనప్పుడు.
4) ప్రభుత్వ కాంట్రాక్ట్‌లు పొందినప్పుడు.
5) ఏదైనా కనీసం 25 శాతం ప్రభుత్వ వాటా కలిగిన ప్రభుత్వ రంగ సంస్థలో డైరెక్టర్లుగా, మేనేజింగ్ ఏజెంట్లుగా పని చేస్తున్నప్పుడు.
6) అవినీతి, రాజ్యం పట్ల అవిధేయత కారణంగా ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించినప్పుడు.
7) సమాజంలోని విభిన్న వర్గాల మధ్య విభేదాలను సృష్టించినప్పుడు.
8) సామాజిక నేరాలను ప్రోత్సహించడం, ఆ నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించినప్పుడు.
- పై అనర్హతల ఆధారంగా ఎన్నికల సంఘాన్ని సంప్రదించి ఒక పార్లమెంట్ సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది.
- ఈ విషయంలో ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలి.
– విన్నర్స్ పబ్లికేషన్స్ సౌజన్యంతో..
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు