Indian History | ‘సంధి’ సహకారం.. యుద్ధాలకు పరిష్కారం
ఆంగ్లో-మైసూర్ యుద్ధాలు
- భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు ప్రారంభించిన యుద్ధాల ద్వారా, రాజ్యవ్యాప్తి విధానానికి బెంగాల్ తర్వాత దక్షిణా పథంలోని మైసూర్ రాజ్యం గురైంది. హైదర్అలీ, అతని కుమారుడు టిప్పు సుల్తాన్ ఆంగ్లేయులతో నాలుగు మైసూర్ యుద్ధాలు చేశారు.
మొదటి మైసూర్ యుద్ధం 1767-69
- 18వ శతాబ్దపు మొదటి దశలో విజయనగర సామ్రాజ్య పునాదులపై వెలసిన స్వాతంత్య్ర రాజ్యమే మైసూర్ రాజ్యం. దీని స్థాపకుడు హైదర్అలీ వడయార్ వంశపు రాజైన చిన్న కృష్ణరాజు సోదరులు దేవరాజు, నంజరాజుల నుంచి సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు.
- హైదర్అలీ మైసూర్ సింహాసనం ఆక్రమించక ముందు 1755 నాటికి మైసూర్ రాజు చిన్న కృష్ణరాజు వడయార్‌చే డిండిగల్లు ఫౌజ్‌దారుగా నియమించబడ్డాడు. మైసూర్ ప్రధాని నంజరాజును బంధించి చంపించాడు. చిన్న కృష్ణరాజు సోదరులను నామమాత్రం చేసి తానే సర్వాధికారాలు చెలాయించడం ప్రారంభించాడు.
- ఆంగ్లేయులు హైదర్‌అలీని అంతం చేయాలని భావించడానికి కారణం, కర్ణాటక నవాబు మహమ్మద్ అలీ శత్రువైన మవూజ్ఖాన్కు హైదర్అలీ ఆశ్రయం ఇవ్వడం,
- హైదర్అలీ చాందాసాహెబ్ కొడుకైన రాజాసాహెబ్‌కు తన రాజ్యంలో ఉద్యోగం ఇవ్వడం.
- మైసూర్ పాలకునికి సంబంధించిన వెల్లూరులో ఆంగ్లేయుల సైన్యాలు నిలపగా దీన్ని హైదర్అలీ వ్యతిరేకించాడు.
- దీంతో ప్రత్యక్ష యుద్ధం 1767లో ప్రారంభమైంది. జయాపజయాల మధ్య చివరికి ఆంగ్లేయులకు హైదర్అలీకి 1769 ఏప్రిల్ 4న మద్రాసు సంధి జరిగింది.
రెండో మైసూర్ యుద్ధం (1780-84) - హైదర్అలీ అధికారంలో ఉన్న మలబార్ కోస్తాలోని మహి అనే రేవు పట్టణాన్ని ఫ్రెంచివారు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. ఫ్రెంచివారి శత్రువులైన ఆంగ్లేయులు హైదర్అలీతో యుద్ధానికి సిద్ధమయ్యారు.
- ఇంగ్లిష్ అధికారి సర్ ఐర్‌కూట్ షోలింగర్ వద్ద హైదర్‌అలీని ఓడించి, నాగపట్నం దగ్గర ఉన్న ట్రింకోమలైను కూడా
గెలుచుకున్నాడు. - ఇదే సమయంలో యుద్ధం ముగియకుండానే హైదర్అలీ క్యాన్సర్ వ్యాధితో 1782, డిసెంబర్ 7న మరణించాడు.
- ఈ సమయంలో హైదర్అలీ తర్వాత కుమారుడు టిప్పు సుల్తాన్ ఆంగ్లేయులతో యుద్ధం చేస్తూ చివరికి 1784లో
మంగుళూరు సంధి చేసుకున్నాడు.
మూడో మైసూర్ యుద్ధం (1780-84)
- 1784లో రూపొందించిన పిట్స్ ఇండియా చట్టంలోని సెక్షన్ 34 ప్రకారం మంగళూరు సంధి షరతులను తిరస్కరించి, టిప్పుకు వ్యతిరేకంగా ఆంగ్లేయులు 1790లో మరాఠాలతో, నిజాంతో ఒక రహస్య త్రైపాక్షిక కూటమిని ఏర్పాటు చేశారు.
- ఈ పరిణామాలను గమనిస్తున్న టిప్పు సుల్తాన్ భవిష్యత్తులో జరిగే యుద్ధంలో ఆంగ్లేయ సైన్యాలను ఎదుర్కోవడానికి 1787లో ఫ్రాన్సుకు రాయబారం పంపాడు. కానీ సహాయం అందలేదు.
- ఇలాంటి పరిస్థితుల్లో టిప్పు సుల్తాన్ చాలా కాలం నుంచి తమకు మిత్రరాజ్యంగా ఉన్న తిరువాన్కూర్ సంస్థానంపై దాడి చేసి 1789, డిసెంబర్ 29న ముట్టడించాడు. వెంటనే ఆంగ్లేయులు తిరువాన్కూర్కు సహకరించారు. ఇదే మూడో మైసూర్ యుద్ధానికి కారణమైంది.
- బెంగాల్ గవర్నర్ జనరల్ కారన్వాలిస్ ఆధ్వర్యంలో ఇంగ్లిష్ సేనలు శ్రీరంగపట్నం వద్ద టిప్పు సైన్యాలను ఓడించాయి. టిప్పు శ్రీరంగపట్నం సంధికి ఒప్పుకోవలసి వచ్చింది.
నాలుగో మైసూర్ యుద్ధం (1799) - నాలుగో మైసూర్ యుద్ధం ఆంగ్లేయులకు మైసూర్ సేనలకు జరిగిన చివరి యుద్ధం. శ్రీరంగపట్నం సంధి ప్రకారం తాను
కోల్పోయిన భూభాగాలను ఆక్రమించాలని టిప్పు సుల్తాన్ తలంచాడు. - ఇందులో ఆంగ్లేయులకు శత్రువులైన ఫ్రాన్స్‌లోని జాకోబిన్ క్లబ్లో సభ్యత్వం పొందాడు. నెపోలియన్ బోనపార్టీ
సహాయాన్ని కోరాడు. - అప్పటి బెంగాల్ గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లీ టిప్పుకు ఎవరూ సహకరించకుండా జాగ్రత్త పడ్డాడు. లార్డ్ వెల్లస్లీ సోదరుడు ఆర్థర్ వెల్లస్లీ నాయకత్వంలో బ్రిటిష్ సైన్యం శ్రీరంగపట్నానికి 40 మైళ్ల దూరంలో ఉన్న సిద్ధేశ్వర్ కనుమ దగ్గర 1799, మార్చి 5న జరిగిన యుద్ధంలో, మాలవల్లి దగ్గర 1799, మార్చి 27న జరిగిన యుద్ధంలోనూ టిప్పు సేనలను ఓడించింది. చివరికి టిప్పును చంపేశారు. దీంతో నాలుగో మైసూర్ యుద్ధం ముగిసింది.
- మైసూర్ రాజ్యాన్ని వడయార్ వంశానికి చెందిన కృష్ణరాజ వడయార్‌కు ఆంగ్లేయులు అప్పగించారు. ఇతడు వెల్లస్లీ సైన్యసహకార సంధిని అంగీకరించాడు. ఆంగ్లేయుల మిత్ర రాజ్యంగా మైసూర్ కొనసాగింది.
- మైసూర్ రాజ్యాన్ని వడయార్ 1947లో భారత్‌లో విలీనం చేశాడు.
ఆంగ్లో-మరాఠా యుద్ధాలు - ఈస్ట్ ఇండియా కంపెనీ బొంబాయి అధికారులు మరాఠావారి ఆధీనంలో ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి వ్యూహ రచన చేశారు. దీని ఫలితమే 1775-1818 మధ్య కాలంలో జరిగిన ఆంగ్లేయ-మరాఠా యుద్ధాలు, అమెరికా స్వాతంత్య్ర పోరాటం జరుగుతున్న కాలంలోనే ఈ మరాఠా యుద్ధాలు జరిగాయి.
మొదటి ఆంగ్లో-మహారాష్ట్ర యుద్ధం (1775-82)
- మొదటి మహారాష్ట్ర యుద్ధం బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ ఆధ్వర్యంలో జరిగింది.
- మహారాష్ట్ర పీష్వాలలో మొదటి మాధవరావు మరణానంతరం నారాయణరావు పీష్వా పదవిని అలంకరించాడు. కానీ మాధవరావు పినతండ్రి రఘునాథరావు నారాయణరావును చంపించి పీష్వా పదవి పొందాలనుకున్నాడు.
- రఘునాథరావు ఇంగ్లిష్‌వారికి సూరత్ సంధి 1775 ద్వారా సాల్సెట్టి, బస్సైన్లు ఇచ్చి వారి సహకారంతో పీష్వా పదవిని పొందడానికి సిద్ధమయ్యాడు.
- ఇదే సమయంలో నారాయణరావు భార్య గంగాబాయి మగశిశువును ప్రసవిస్తుంది. ఇతడే రెండో మాధవరావు. ఇతడి కోసం బాలాజీ పండిట్ (నానా ఫడ్నవీస్) బారాబాయి కూటమిని ఏర్పరచి రఘునాథరావు, ఆంగ్లేయుల సైన్యాలతో యుద్ధం చేస్తాడు.
- చివరికి రెండో మాధవరావు ఇంగ్లిష్ వారితో సాల్బే సంధి 1782 ద్వారా బ్రోచ్ అనే రేవును ఇంగ్లిష్ వారికి ఇచ్చి పీష్వా పదవిని అలంకరిస్తాడు.
- రఘోబాకు సాలీనా మూడు లక్షల రూపాయలు ఇవ్వటానికి ఒప్పుకున్నాడు.
రెండో ఆంగ్లో-మహారాష్ట్ర యుద్ధం (1803-05) - మహారాష్ర్టులతో వెల్లస్లీ చేసిన యుద్ధం రెండో మహారాష్ట్ర యుద్ధం. మహారాష్ర్టుల ఐక్యతకు కృషి చేసిన మరాఠా నాయకుడు నానా ఫడ్నవీస్ మరణించడంతో మహారాష్ర్టులు బలహీన పడ్డారు.
- మరాఠా సంస్థానాధీశులకు తనకు మధ్య నెలకొన్న విభేదాల వల్ల పీష్వా రెండో బాజీరావు వెల్లస్లీతో సైన్యసహకార సంధి
కుదుర్చుకున్నాడు. - ఈ పరిణామాన్ని అప్రతిష్ఠగా భావించిన సింధియా, హోల్కర్, భోంస్లే, వెల్లస్లీతో తలపడ్డారు. ఇదే రెండో మహారాష్ట్ర యుద్ధం.
- సింధియా, భోంస్లేను ఓడించిన వెల్లస్లీ, సింధియాలతో సూర్జి అర్జున్ గోన్ సంధి ద్వారా, బోంస్లేతో దేవగాన్ సంధితో సైన్య సహకార ఒప్పందానికి ఒప్పించాడు.
- హోల్కర్‌తో యుద్ధం కొనసాగింది. ఈ దశలో వెల్లస్లీ అనుసరిస్తున్న ఉగ్రవాదానికి భీతిల్లిన కంపెనీ ప్రభుత్వం వెల్లస్లీతో పదవీ విరమణ చేయించింది.
మూడో ఆంగ్లో-మహారాష్ట్ర యుద్ధం (1817-18)
- ఆంగ్లేయులకు, మరాఠాలకు మధ్య చివరి యుద్ధం లార్డ్ హేస్టింగ్స్ కాలంలో ప్రారంభమైంది. ఈ కాలం నాటికి పీష్వాగా రెండో బాజీరావు ఉన్నాడు.
- అమీఖాన్ పిండారీలు, మహారాష్ర్టులు కూటమిగా చేరి కంపెనీవారిని ఎదిరించ దలచారు. 1813-1823లో గవర్నర్
జనరల్‌గా ఉన్న హేస్టింగ్స్ తగిన చర్యలు చేపట్టాడు. 1817, జూన్ 13న పూనా సంధితో పీష్వా అధికారాలు తగ్గిపోయాయి. పీష్వా మహారాష్ర్టుల నాయకత్వం కోల్పోయాడు. అంతేగాక లార్డ్ హేస్టింగ్స్ పీష్వా పదవిని కూడా రద్దు చేశాడు. - పీష్వాకు బ్రిటిష్ సేనలకు ఖిర్కి వద్ద జరిగిన యుద్ధంలో పీష్వా ఓడిపోయాడు. 1818లో రెండో బాజీరావు సాలీనా 8 లక్షల రూపాయల పింఛన్‌తో కాన్పూర్ వద్ద బితార్లో గడిపాడు. అతని భూభాగం బ్రిటిష్ నియంత్రణలోకి వచ్చింది. దీంతో మూడో మరాఠా ఆంగ్లేయ యుద్ధం ముగిసింది.
సింధూ ఆక్రమణ-1843 - సింధూ ప్రాంతాన్ని ‘అమీర్లు’ పాలించేవారు. సింధూపై రష్యా దాడి చేస్తుందన్న అనుమానంతో ఆంగ్లేయులు సింధు
ప్రాంతాన్ని ఆక్రమించటానికి ప్రయత్నించారు. - ‘ఎలెన్ బరో’ గవర్నర్ జనరల్‌గా ఉన్న కాలంలో సింధూ ఆక్రమణకు సేనాని ‘చార్లెస్ నేపియర్’ను పంపించాడు.
నేపియర్ అమీర్లను ఓడించి, సింధూ ప్రాంతాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు.
ఆంగ్లో-సిక్కు యుద్ధాలు - సిక్కు నాయకుడు చివరి సిక్కు గురువు గురుగోవింద్ సింగ్ సొంత బందా అయిన బందా మరణానంతరం పంజాబ్ 12 మిసిలీలుగా ఏర్పడింది. అందులో ఒక మిసిల్ అయిన ‘సుఖర్చకియా’కు పాలకుడు రంజిత్‌సింగ్. ఈయన మిగిలిన మిసిలీలను ఆక్రమించి పంజాబ్‌ను తన ఆధీనంలోకి తీసుకొచ్చాడు.
- రంజిత్ సింగ్ శక్తిమంతుడు కావడంతో ఆంగ్లేయులు ఆయనతో మైత్రిని కోరారు. 1806లో ఆంగ్లేయ సేనాని రంజిత్‌సింగ్‌తో సట్లెజ్ సరిహద్దు ఒప్పందాన్ని 1809లో లార్ట్మింట్ అమృత్సర్ సంధిని చేసుకున్నారు.
- ఈ సంధి ప్రకారం సట్లెజ్ కుడివైపు ప్రాంతాలు రంజిత్ సింగ్ పాలించగా, ఎడమవైపు ప్రాంతాలు ఆంగ్లేయుల పర్యవేక్షణలో రక్షణ ప్రాంతాలుగా ఉంచారు.
- రంజిత్‌సింగ్ పర్షియా పాలకుడు షాహుజేకు సహాయం చేసి అతని నుంచి 1813లో కోహినూర్ వజ్రాన్ని పొందాడు.
- అలెగ్జాండర్ బర్న్ అనే ఆంగ్లేయ అధికారి అప్పటి గవర్నర్ జనరల్ బెంటిక్ తరపున రంజిత్‌సింగ్‌కు విలువైన కానుకలు సమర్పించటమే కాకుండా మరోసారి ఒప్పందం కుదుర్చుకున్నారు.
- రంజిత్ సింగ్ కుమారుడు దిలీప్‌సింగ్ చిన్నవాడు కావటంతో రాణి జిందాన్ అతనికి సంరక్షుకురాలిగా వ్యవహరించింది.
మొదటి ఆంగ్లో-సిక్కు యుద్ధం (1845-46) - 1809లో చేసుకున్న సంధిని కాదని, పంజాబ్‌ను ఆక్రమించటానికి ఆంగ్లేయులు ప్రయత్నించడంతో ఈ యుద్ధం
ప్రారంభమైంది. - సిక్కు సేనలకు తేజ్‌సింగ్ నాయకత్వం వహించాడు. ఆంగ్లేయులకు ‘కల్నల్ హ్యూగోస్’ సేనాధిపతి.
- ఓటమి చెందిన సిక్కులు ఆంగ్లేయులతో 1846లో లాహోర్ సంధి చేసుకున్నారు. ఈ సంధి ప్రకారం నష్టపరిహారం కింద రూ.50 లక్షలు, కశ్మీర్ ప్రాంతాన్ని ఆంగ్లేయులకు ఇవ్వాల్సి వచ్చింది.
రెండో సిక్కు యుద్ధం (1848-49) - ముల్తాన్ గవర్నర్ మూలరాజ్, సర్దార్ షేర్ సింగ్‌లు ఆంగ్లేయుల ప్రాబల్యాన్ని తగ్గించాలని ప్రయత్నించటంతో ఈ యుద్ధం ప్రారంభమైంది.
- గవర్నర్ జనరల్ డల్హౌసీ యుద్ధాన్ని ప్రకటించాడు. రామ్‌నగర్, చిలియన్‌వాలా, చీనాబ్ యుద్ధంలో సిక్కులు ఓడిపోవడం తో ఆంగ్లేయులు పంజాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
- అప్పుడు జరిగిన సంధి ప్రకారం హెన్రీ జాన్ లారెన్స్ కోహినూర్ వజ్రాన్ని గవర్నర్ జనరల్ డల్హౌసీకి అప్పగించాడు. 1850లో దీన్ని అతడు అత్యంత భద్రత మధ్య లండన్‌కు చేర్చి రాణి విక్టోరియాకు సమర్పించాడు. ఆ వజ్రం ప్రస్తుతం టవర్ ఆఫ్ లండన్ హౌస్ అనే రాజసౌధంలో ఉంది.
- దిలీప్‌సింగ్ భరణం పొంది లండన్‌కు, రాణి జిందాన్ వారణాసికి పంపేయబడ్డారు.
- ఆంగ్లేయులు పంజాబ్ పాలనకు ప్రత్యేక బోర్డు నియమించి దాని కమిషనర్‌గా సర్ జాన్ లారెన్స్‌ను నియమించారు.
ప్రాక్జీస్ బిట్స్
1. 1809లో ఇంగ్లిష్వారితో అమృత్సర్ సంధి కుదుర్చుకున్నదెవరు?
1. గురు గోవింద్ సింగ్
2. రంజిత్ సింగ్
3. గురునానక్
4. గురు రామ్‌దాస్
2. పంజాబ్ కేసరి బిరుదాంకితుడెవరు?
1. గురు గోవింద్ సింగ్
2. రంజిత్ సింగ్
3. గురునానక్ 4. గురు రామ్‌దాస్
3. లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన ఏ విధానం యుద్ధం వల్ల ఝాన్సీ ప్రాంతం బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిసింది?
1. రాజ్య సంక్రమణ సిద్ధాంతం
2. గంగాధరరావుతో యుద్ధం
3. మూడో మైసూర్ యుద్ధం
4. ఏదీ కాదు
4. ఇంగ్లిష్ వారితో యుద్ధానికి టిప్పు సుల్తాన్ ఎవరి సాయం తీసుకున్నాడు?
1. పోర్చుగీస్ 2. స్పానిష్
3. డచ్ 4. ఫ్రెంచ్
5. టిప్పు సుల్తాన్ రాజధాని ఏది?
1. శ్రీరంగపట్నం 2. గుల్బర్గా
3. హంపి 4. ఏదీ కాదు
6. ఇంగ్లిష్‌వారు రైత్వారీ పద్ధతిని ఎక్కడ ప్రవేశపెట్టారు?
1. బెంగాల్ ప్రాంతం
2. మద్రాసు ప్రాంతం
3. బొంబాయి
4. మద్రాసు, బొంబాయి
సమాధానాలు
1. 2 2. 2 3. 1 4. 4
5. 1 6. 4
జీబీకే పబ్లికేషన్స్
హైదరాబాద్, 8187826293
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు