Current Affairs | తులసీఘాట్ పునరుద్ధరణ ప్రాజెక్టును ఏ దేశంలో ప్రారంభించారు?
1. ఏ దేశ శాస్త్రవేత్తలు ఇటీవల యురేనియానికి చెందిన కొత్త ఐసోటోప్‌ను కనుగొన్నారు? (3)
1) ఆస్ట్రేలియా 2) దక్షిణ కొరియా
3) జపాన్ 4) తజికిస్థాన్
వివరణ: యురేనియానికి సంబంధించి కొత్త ఐసోటోప్‌ను జపాన్ దేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. ఒకే మూలకానికి చెంది, సమాన సంఖ్యలో ప్రోటాన్లు ఉంటూ, వేర్వేరు న్యూట్రాన్లను కలిగి ఉంటే వాటిని ఐసోటోప్లు అంటారు. యురేనియం సహజంగా లభించే ఒక రసాయనం. దీని పరమాణు సంఖ్య 92. రేడియో ధార్మికతను కలిగిన ఒక భార లోహం. దీనికి చాలా ఐసోటోప్లు ఉన్నాయి. అందులో విరివిగా లభించేది యూ-238. యురేనియాన్ని అణు విద్యుత్ ఉత్పత్తిలో వినియోగిస్తారు.
2. టీఈఎంపీవో (టెంపో) ఇటీవల వార్తల్లో ఉంది. ఇది ఏంటి? (4)
1) ప్రవర్తన తీరును చెప్పే చాట్‌బోట్
2) కొత్త కంప్యూటర్ వైరస్
3) కొత్త రకం టెలిస్కోప్
4) వాయునాణ్యత కోసం ఉద్దేశించిన వస్తువు
వివరణ: టెంపో అనే పేరుతో ఒక కొత్త పరికరాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. వాయు నాణ్యతను పరిశీలించడంతో పాటు వాయు కాలుష్యాన్ని ఇది పర్యవేక్షిస్తుంది. టీఈఎంపీవో పూర్తి రూపం- ట్రోపోస్ఫియరిక్ ఎమిషన్స్ మానిటరింగ్ ఆఫ్ పొల్యూషన్. ప్రస్తుతం ఈ తరహా ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్‌లో ప్రయోగించారు. అయితే టెంపోను మాత్రం భూ స్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
3. ఏ సంవత్సరంలో యూఎన్ డెమోక్రసీ ఫండ్‌ను ఏర్పాటు చేశారు? (3)
1) 2003 2) 2004
3) 2005 4) 2006
వివరణ: ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని పెంపొందించేందుకు 2005లో యూఎన్ డెమోక్రసీ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. దేశాలు స్వచ్ఛందంగా దీనికి విరాళాలు ఇవ్వాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ఈ నిధులను స్వచ్ఛంద సంస్థలకు ఇస్తారు. మానవ హక్కులు, వివిధ రాజకీయ వ్యవస్థలో పౌరుల పాత్ర పెరిగేలా ఆయా సంస్థలు కృషి చేస్తాయి. నిధి పర్యవేక్షణకు 19 మంది సభ్యులతో కూడిన ఒక సలహా బోర్డు ఉంటుంది. ఇందులో భారత్‌కు కూడా సభ్యత్వం ఉంది. ఈ వ్యవస్థ ఏర్పాటులో భారత్, అమెరికా క్రియాశీల పాత్రను పోషిస్తున్నాయి.
4. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్‌ను కిబితు అనే గ్రామంలో ఇటీవల అమిత్ షా ప్రారంభించారు. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? (2)
1) సిక్కిం 2) అరుణాచల్ ప్రదేశ్
3) ఉత్తరాఖండ్ 4) హిమాచల్ ప్రదేశ్
వివరణ: అరుణాచల్ ప్రదేశ్‌లోని కిబితు అనే సరిహద్దు గ్రామంలో ఏప్రిల్ 7న వైబ్రెంట్ విలేజ్ అనే కార్యక్రమాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. సరిహద్దు గ్రామాల్లో మౌలిక సదుపాయాల వృద్ధితో పాటు ఆయా గ్రామీణ ప్రాంతాలను స్వయం స్వావలంబన సాధించే దిశగా మార్చేందుకు ఉద్దేశించిన కార్యక్రమం ఇది. కిబితు గ్రామం సముద్ర మట్టానికి 9000 అడుగుల ఎత్తులో ఉంటుంది. భారత్‌లో అత్యంత తూర్పున ఉన్న గ్రామాల్లో ఇది కూడా ఒకటి. ఇప్పటి వరకు విద్యుత్, వైద్యం, రహదారులు తదితర ముఖ్య వసతులు ఈ గ్రామానికి లేవు.
5. స్పర్ష రహిత బయో మెట్రిక్ వ్యవస్థ అభివృద్ధికి యూఐడీఏఐ ఎవరితో చేయి కలిపింది? (1)
1) ఐఐటీ బాంబే 2) ఐఎన్ఎస్సీ
3) ఇస్రో 4) సీఎస్ఐఆర్
వివరణ: స్పర్ష రహిత బయోమెట్రిక్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఐఐటీ బాంబేతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎక్కడైతే నమోదు తప్పనిసరి అవుతుందో, అక్కడ వినియోగించుకొనేందుకు వీలుగా దీన్ని అభివృద్ధి చేయనున్నారు. యూఐడీఏఐ అనే వ్యవస్థను జనవరి 28, 2009లో ప్రారంభించారు. ఇది ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖలో భాగంగా పనిచేస్తుంది. పౌరులకు ఆధార్ కార్డును జారీచేసే వ్యవస్థ ఇది.
6. బిల్లుల జారీకి సంబంధించి గవర్నర్‌కు సూచనలు చేయాలని ఇటీవల తీర్మానాన్ని ఆమోదించిన రాష్ట్రం? (3)
1) కేరళ 2) తెలంగాణ
3) తమిళనాడు 4) పశ్చిమబెంగాల్
వివరణ: రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులపై సంతకాలు చేయాలని గవర్నర్‌కు రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం సూచించాలంటూ తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజమన్నార్ కమిటీ సిఫారసులను ఉటంకించారు. గవర్నర్ పదవి రాజకీయాలకు కేంద్రంగా మారుతుందని, అందుకే ఈ పదవిని రద్దు చేయాలని కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్ర శాసన వ్యవస్థలోని సభలో ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించాలి. అయితే తిరస్కరించే అధికారం కూడా ఉంటుంది. కానీ ఇది సస్పెన్సివ్ వీటోలా వినియోగించాలి. అలాగే ఒక బిల్లును రాష్ట్రపతికి కూడా పంపేందుకు వీలుంటుంది.
7. ఏ భాషలో భారత రాజ్యాంగాన్ని రచించి ఏప్రిల్ 10న విడుదల చేశారు? (2)
1) బోడో 2) డోగ్రీ
3) మైథిలీ 4) సంథాల్
వివరణ: డోగ్రీ భాషలో భారత రాజ్యాంగాన్ని ఏప్రిల్ 10న అందుబాటులోకి తెచ్చారు. ఇది తొలి ఎడిషన్. డోగ్రీ భాషను జమ్ము కశ్మీర్లో ప్రధానంగా మాట్లాడుతారు. ఇది రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో భాగంగా ఉంటుంది. మూల రాజ్యాంగంలో లేదు. కానీ 92వ రాజ్యాంగ సవరణ ద్వారా బోడో, సంథాల్, డోగ్రీ, మైథిలీలను రాజ్యాంగంలో చేర్చారు. మూల రాజ్యాంగంలో కేవలం 14 భాషలు మాత్రమే ఉండేవి. 21, 71, 92 సవరణలతో మరో ఎనిమిది భాషలను చేర్చడంతో ఎనిమిదో షెడ్యూల్లో భాషల సంఖ్య 22గా మారింది. ఆయా భాషల్లో రాజ్యాంగ రచనకు యత్నిస్తున్నారు.
8. కుట్టంపెరూర్ నది ఏ రాష్ట్రంలో ఉంది? (4)
1) తమిళనాడు 2) కర్ణాటక 3) ఒడిశా 4) కేరళ
వివరణ: కుట్టంపెరూర్ నది కేరళ రాష్ట్రంలోని అలపుజా జిల్లాలో ఉంది. నదిలోకి నీరు వచ్చే మార్గాలను ఆక్రమించుకోవడంతో పాటు పరిశ్రమలు తమ వ్యర్థాలను ఇందులోకి విడుదల చేసేవి. ప్రభుత్వం, స్థానికుల కృషితో నదిని తిరిగి పునరుద్ధరించారు. 7.2 కిలోమీటర్లు ఉండే ఈ నది 2005లో కనుమరుగైంది. తాజాగా మళ్లీ ప్రవహిస్తుంది. దీనివల్ల పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. గతంలోనూ పలు నదుల పునరుద్ధరణ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే సింగపూర్ నది, థేమ్స్ నది పునరుద్ధరణ, భారత్‌లో గంగా పునరుద్ధరణ ప్రాజెక్ట్ అమలులో ఉంది.
9. ప్రస్తుతం దేశంలో జాతీయ పార్టీలు ఎన్ని? (3)
1) 9 2) 10 3) 6 4) 8
వివరణ: దేశంలో ప్రస్తుతం ఆరు జాతీయ పార్టీలు ఉన్నాయి. అవి.. భారతీయ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ. మూడు పార్టీలకు ఉన్న జాతీయ హోదాను ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది. అవి.. తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఒక రాజకీయ పార్టీకి గుర్తింపునకు సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంటుంది.
10. గ్రామీణ భారత దేశంలో నీటిని శుద్ధిచేసే అతిపెద్ద ప్లాంట్ తెలంగాణలో ఏ జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేశారు? (4)
1) మెదక్ 2) సంగారెడ్డి
3) రంగారెడ్డి 4) సిద్దిపేట
వివరణ: గ్రామీణ భారతదేశంలోనే అతిపెద్ద తాగునీటి శుద్ధి కేంద్రాన్ని సిద్దిపేట జిల్లాలోని మంగోల్ వద్ద నిర్మించారు. దీని సామర్థ్యం 540 ఎంఎల్డీలు, 50 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా దీన్ని నిర్మించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందులో వినియోగించారు. ఏడు జిల్లాల్లోని 10 నియోజకవర్గాల పరిధిలో ఉన్న 16 మున్సిపాలిటీలతో పాటు 1922 గ్రామాలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
11. తులసిఘాట్ పునరుద్ధరణ ప్రాజెక్టును ఏ దేశంలో ప్రారంభించారు? (2)
1) నేపాల్ 2) ఉగాండా
3) బంగ్లాదేశ్ 4) కెన్యా
వివరణ: ఆఫ్రికాలోని ఉగాండా దేశంలో తులసిఘాట్ పునరుద్ధరణ ప్రాజెక్టును కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ప్రారంభించారు. ఏప్రిల్ 10 నుంచి ఆయన మూడు రోజుల పాటు ఉగాండాలో పర్యటించారు. నైలు, గంగా నదుల సంస్కృతులను ఆయన పోల్చారు. 2022 నుంచి 2025 మధ్య కాలంలో అలీన ఉద్యమానికి ఉగాండా దేశం నాయకత్వం వహిస్తుంది. ఈ కూటమికి నాయకత్వ బాధ్యతలు రొటేషన్ పద్ధతిలో ఉంటాయి. ఏప్రిల్ 13 నుంచి 15వ తేదీ వరకు జయశంకర్ మొజాంబిక్ దేశంలో పర్యటించారు.
12. అడ్వాన్స్డ్ వెపన్స్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ ఏ ఐఐటీతో ఒప్పందం కుదుర్చుకుంది? (3)
1) ఐఐటీ బాంబే 2) ఐఐటీ ఖరగ్‌పూర్
3) ఐఐటీ కాన్పూర్ 4) ఐఐటీ మద్రాస్
వివరణ: స్టార్టప్ సంస్థలకు సాయం చేయడంతో పాటు ఇంక్యుబేషన్లకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే ఉద్దేశంతో అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌తో ఐఐటీ కాన్పూర్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థకు ఇది కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగం చేయనుంది. ఐఐటీలోని స్టార్టప్ ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్లో ఈ ఒప్పందం జరిగింది.
13. భారత దేశంలో తొలి సౌరశక్తి ఆధారిత నౌక ఏ రాష్ట్రంలో తీసుకొచ్చారు? (2)
1) మహారాష్ట్ర 2) కేరళ
3) గుజరాత్ 4) తమిళనాడు
వివరణ: సూర్యాంశు అనే పేరుతో సౌరశక్తితో నడిపే ఒక నౌకను కేరళ రాష్ట్రం ఇన్లాండ్ నావిగేషన్ కార్పొరేషన్ ప్రారంభించింది. ఇది 27 కిలోవాట్ల శక్తిని ఉత్పత్తి చేయగలుగుతుంది. ఇందులో జనరేటర్ కూడా ఉంటుంది. నౌకకు అవసరమైన శక్తిలో 75% సౌరశక్తి ద్వారా లభిస్తుంది. మిగతాది జనరేటర్ సాయంతో పొందుతారు.
14. ఎల్ఐజీవో (లిగో) ఇటీవల వార్తల్లో ఉంది. ఇది ఏంటి? (1)
1. గురుత్వ తరంగాలను అధ్యయనం చేసే ప్రయోగశాల
2) స్టార్టప్‌లను ప్రోత్సహించే ఇంక్యుబేటర్
3) సౌరశక్తితో నడిచే కొత్త కంప్యూటర్
4) పైవేవీ కాదు
వివరణ: లిగో అనేది భారత్‌లో మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్న కొత్త ప్రయోగశాల. ఎల్ఐజీవో అనేది సంక్షిప్త రూపం. దీని పూర్తి రూపం.. లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ. నిజానికి ఏడు సంవత్సరాల కిందటే ఈ ప్రయోగశాల ఏర్పాటుకు ఆమోదం లభించింది. తాజాగా నిధులను కేటాయించారు. దీని ఏర్పాటుకు రూ.2600 కోట్లు వ్యయం చేయనున్నారు. విశ్వంలోని గురుత్వ తరంగాలను అధ్యయనం చేసే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు.
15. ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అవార్డును గెలుచుకుంది ఎవరు? (3)
1) ఎస్ఎం వినోద్ 2) పుష్పగిరి
3) సీఆర్ రావు 4) ఎవరూకాదు
వివరణ: స్టాటిస్టిక్స్‌లో నోబెల్ ప్రైజ్‌గా భావించే ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ సీఆర్ రావు 2023కు గెలుచుకున్నారు. ఆయన భారతీయ-అమెరికన్ గణిత శాస్త్రవేత్త. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ బఫెలోలో పరిశోధన ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. కేవలం గణాంక శాస్త్రంలోనే కాకుండా ఆయన చేసిన పరిశోధనలు ఆర్థిక శాస్త్రం, జన్యుశాస్త్రం, మానవ, భూగర్భ శాస్ర్తాలతో పాటు జాతీయ ప్రణాళిక, జనాభా, బయోమెట్రీ, వైద్య రంగంలో కూడా ప్రయోజనకరంగా ఉన్నాయని అవార్డును ప్రకటించిన అకాడమీ పేర్కొంది.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?