Digital India | పురవాసుల నుంచి పూరిగుడిసెల దాకా..
- దేశవ్యాప్తంగా, పట్టణ ప్రాంతాలకే పరిమితం అయిన అంతర్జాల సంబంధ మౌలిక వసతులను గ్రామీణ ప్రాంతాలకూ చేరువ చేసి భవిష్యత్ భారతాన్ని డిజిటలీకరించేందుకు డిజిటల్ ఇండియా కార్యక్రమం 2015 జూలై 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
- డిజిటల్ ఇండియా కార్యక్రమంలో 3 ప్రధాన భాగాలు ఉన్నాయి.
1. డిజిటల్ మౌలిక వసతుల కల్పన
2. ప్రభుత్వ సేవలను డిజిటల్ మాధ్యమంగా అందించడం
3. డిజిటల్ అక్షరాస్యత
1. డిజిటల్ మౌలిక వసతుల కల్పన
- ఇందుకు పౌరసేవలను సత్వరం అందించేందుకు ప్రధాన మాధ్యమంగా వేగవంతమైన అంతర్జాల సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం
- ప్రతి పౌరుడికీ ఆజన్మాంతం ఏకైక డిజిటల్ గుర్తింపును అందించడం, నాణ్యమైన, ఉన్నత ప్రమాణాలు కలిగిన ఆన్లైన్ సౌకర్యాలు కల్పించడం
- డిజిటల్, ఆర్థిక కార్యకలాపాలను చేపట్టేందుకు దేశ ప్రజల మొబైల్ ఫోన్, బ్యాంక్ అకౌంట్ల అనుసంధానతను ఆధారంగా చేసుకోవడం.
ఉదా. జన్‌ధన్ యోజన -ఆధార్-మొబైల్ - ఉమ్మడి సేవా కేంద్రాల ఫలాలను సులభంగా అందుకొనేలా చూడటం
- పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితం చేసుకోవడంలో ప్రజలకు అవగాహన పెంచడం
ఉదా. డిజిలాకర్ - సురక్షితమైన, భద్రతతో కూడిన సైబర్ కార్యకలాపాల నిర్వహణ
2. ప్రభుత్వ సేవలను డిజిటల్ మాధ్యమంగా అందించడం
- వివిధ ప్రభుత్వ విభాగాలు (లేదా) న్యాయ విభాగాల సేవలన్నింటిని ఒకచోట చేర్చి వాటి సేవలు సజావుగా అందేలా చూడటం
- ఆన్లైన్, మొబైల్ ఫోన్లు మాధ్యమంగా వాస్తవంగా అందాల్సిన సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడం
- క్లౌడ్ వేదికల్లో నిక్షిప్తం చేసిన వ్యక్తిగత డాక్యుమెంట్లను ఏ ప్రాంతంనుంచైనా పొందేలా అందుబాటులో ఉంచడం.
- డిజిటల్ మాధ్యమాల్లోకి రూపాంతరం చెందించిన సేవల ద్వారా వ్యాపార నిర్వహణను అభివృద్ధిచేయడం సులభతరం చేయడం.
- ఆర్థిక లావాదేవీలను ఎలక్ట్రానిక్ మాధ్యమంగా అందించడం, నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించడం
- Geospatial Information Systems- GIS వంటి వ్యవస్థలను విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో, అభివృద్ధి కార్యక్రమాల్లో వినియోగించడం.
3. డిజిటల్ అక్షరాస్యత
- సార్వత్రిక డిజిటల్ అక్షరాస్యత సాధించడం
- దేశ ప్రజలందరికీ వినియోగపడేలా సార్వత్రికంగా డిజిటల్ వనరులను అభివృద్ధి చేయడం
- డిజిటల్ వనరులను/ సేవలను అన్ని భారతీయ భాషల్లో అందుబాటులో ఉండేలా చూడటం
- ప్రభుత్వ పాలనను అందుకొనే క్రమంలో డిజిటల్ వేదికల మధ్య పరస్పర సహకారాన్ని సాధించడం, భారత పౌరులు ఎవరైనా ప్రభుత్వ డాక్యుమెంట్లు (లేదా) సర్టిఫికెట్లను భౌతికంగా సమర్పించాల్సిన అవసరం లేని డిజిటల్ వేదికలు అభివృద్ధి చేయడం.
- ప్రభుత్వ పాలనలో పారదర్శకత, వేగాన్ని పెంచడం, సత్వర నిర్ణయాలు తీసుకోవడంలో, పథకాల అమలులో లబ్ధిదారుల ఎంపిక, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో వాటిని సమీక్షించడంలోనూ ప్రజలందరినీ డిజిటల్ విప్లవం వైపునకు అడుగులు వేయించడంలో, సురక్షితమైన ఆన్లైన్ వేదికల ద్వారా ప్రజానీకం తమ దైనందిన అవసరాలు తీర్చుకోవడం వంటి వాటన్నింటినీ సాకారం చేసుకొంటూ భారతదేశాన్ని శక్తిమంతమైన డిజిటల్ సమాజంగా రూపొందించే క్రమంలో డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
- ప్రజాసేవల వ్యవస్థను మరింత పారదర్శకంగా నిర్వహించడానికి సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దేశ ముఖచిత్రాన్ని మార్చే క్రమంలో 1990 నుంచి దేశంలో e-governance ప్రయత్నాలు మొదలయ్యాయి. కానీ, ఆ కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు. ప్రస్తుతం భారత ప్రభుత్వం రూపొందించిన డిజిటల్ ఇండియా కార్యక్రమంలో అటువంటి ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ కార్యక్రమాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చి ప్రజలకు మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన పాలనను అందించగలుగుతున్నాయి. దీనికోసం 9 మూల స్తంభాలను లక్ష్యాలుగా గుర్తించి డిజిటల్ ఇండియాను ఆవిష్కరించే క్రమంలో వాటిని సాధించాలని నిర్దేశించుకొన్నారు.
అవి…
1. బ్రాడ్‌బ్యాండ్ హైవేస్
- ఇందులో 3 విభాగాలు ఉన్నాయి.
(ఎ) గ్రామీణ ప్రాంతాల వారందరికీ బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం కల్పించడం – - దేశవ్యాప్తంగా 2,50,000 గ్రామ పంచాయతీలను నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా అనుసంధానిస్తారు. దీనికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ సంస్థ నోడల్ డిపార్ట్మెంట్గా పనిచేస్తుంది.
(బి) పట్టణ ప్రాంతాల వారందరికీ బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం కల్పించడం- - పట్టణప్రాంతాల అభివృద్ధిలో, భవనాల నిర్మాణ సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో, సేవల బట్వాడా, సమాచార సంబంధ మౌలిక వసతులను కల్పించడంలో వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్స్ ప్రధాన భూమిక వహిస్తారు.
(సి) నేషనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ – - దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న నెట్వర్క్, క్లౌడ్ సేవలకు సంబంధించి మౌలిక వసతులను అనుసంధానిస్తారు. ఫలితంగా గ్రామ పంచాయతీల నుంచి వివిధ ప్రభుత్వ విభాగాలన్నింటి మధ్య వేగవంతమైన అనుసంధానత, క్లౌడ్ వేదికల నుంచి అవసరమైన సహాయ, సహకారాలు అందించడానికి వీలవుతుంది. దీనికోసం కింద పేర్కొన్న నెట్‌వర్క్‌లు ఉపయోగపడుతాయి.
- State Wide Area Network (SWAN)
- National Knowledge Network (NKN)
- National Optical Fibre Network (NOFN)
- Government User Network (GUN)
- The Meghraj Cloud
- స్థూలంగా చెప్పాలంటే, పైన పేర్కొన్న సమాచార, ప్రసార సాంకేతికతల మౌలిక వనరుల్లో భాగమైన పై అన్నింటినీ సమన్వయపరుస్తుంది. తద్వారా 100, 50, 20, 5 సంఖ్యల్లో వివిధ ప్రభుత్వ కార్యాలయాలను / సేవల కేంద్రాలను రాష్ట్ర, జిల్లా, బ్లాక్, పంచాయతీ స్థాయిల్లో సమాంతరంగా అనుసంధానించడానికి వీలవుతుంది. ఈ కార్యక్రమాలకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నోడల్ డిపార్ట్మెంట్గా పనిచేస్తుంది.
2. దేశ ప్రజలందరికీ మొబైల్ కనెక్టివిటీ
- దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల వారికి మొబైల్ సర్వీస్‌లను అందించడానికి అనుసంధాన సౌకర్యాలు లోపించిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది.
- సమాచార సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పుల వల్ల ప్రపంచమే ఒక కుగ్రామంగా మారుతున్న తరుణంలో దేశంలో సుమారు 55,619 గ్రామాలకు నేటికీ మొబైల్ సేవలు అందడం లేదు. ఈశాన్య ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ సదుపాయాలు లేని గ్రామాల్లో మొబైల్ సేవలను అందజేయాలని ప్రతిపాదించారు. ఈశాన్యేతర ప్రాంతాల్లో ఇటువంటి గ్రామాలకు దశలవారీగా మొబైల్ సేవలు అందించనున్నారు.
- కార్యకలాపాలు నిర్వర్తించడానికి నోడల్ డిపార్ట్మెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ పనిచేస్తుంది. ఇందుకు 2014-18 మధ్య కాలంలో సుమారు 16,000 కోట్ల రూపాయలను వెచ్చించారు.
3. ప్రజలందరికీ అంతర్జాలం అందుబాటు కార్యక్రమం
- ప్రపంచవ్యాప్తంగా అంతర్జాల సేవలూ, వాటితో పాటు అంతర్జాల వినియోగం గణనీయంగా పెరుగుతుంది. వివిధ ప్రభుత్వ శాఖలు ఆన్లైన్ వేదికల ద్వారా తమ వినియోగదారుల డాక్యుమెంట్ల పరిశీలన జరుపుతున్నాయి. దీనికి RTA- Mobile Application ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రజలు తమ దైనందిన అవసరాలకు కావలసిన డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా ఇంటి ముంగిట్లోనే వాటిని పొందే అవకాశాన్ని అంతర్జాలం
అందిస్తుంది. ఇటువంటి సేవలను అంతర్జాల మాధ్యమంగా అందించే క్రమంలో ఈ కార్యక్రమాన్ని రెండు విభాగాలుగా చేపడుతున్నారు.
అవి.. - ఉమ్మడి సేవా కేంద్రాలు – గ్రామ పంచాయతీ పరిధిలో వీటిని ఏర్పాటు చేసి బలోపేతం చేస్తూనే వీటి సంఖ్యను 2,50,000కు పెంచనున్నారు. బహుళ సేవలను అందించేలా ప్రభుత్వ, వాణిజ్య సేవలు అన్నీ ఒకే కేంద్రంలో లభించేలా ఈ ఉమ్మడి సేవా కేంద్రాలను తీర్చిదిద్దుతున్నారు. దీనికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.
- బహుళ సేవా కేంద్రాలుగా పోస్టాఫీస్‌లు
- దేశంలోని 1,50,000 పోస్టాఫీస్‌లను బహుళ సేవాకేంద్రాలుగా మార్చాలని ప్రతిపాదించారు. దీనికోసం నోడల్ డిపార్ట్మెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ పనిచేస్తుంది.
4. e-Governance
- సాంకేతిక సహాయంతో ప్రభుత్వ పాలనలో సంస్కరణలు తేవడానికి కింది చర్యలు చేపడుతున్నారు.
- లబ్ధిదారులను ఎంపిక చేయడానికి నింపవలసిన దరఖాస్తు ఫారాలను సరళీకరించడం, అందరికీ అర్థమయ్యేలా డిజైన్ చేయడం, అవసరమైనంత, సాధ్యమైనంత తక్కువ సమాచారం సేకరించి అర్హులను ఎంపిక చేసేలా చూడటం
- పూర్తిచేసిన దరఖాస్తుల పరిస్థితిని ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పరిశీలించుకోవచ్చు.
- సర్టిఫికెట్లు, విద్యాసంబంధ డిగ్రీలు, గుర్తింపు పత్రాలు వంటి ముఖ్యమైన పత్రాలు ఆన్లైన్ రెపోసిటోరీస్లో నిక్షిప్తం చేసుకోవచ్చు. దీని మూలంగా పత్రాలను భౌతికంగా సమర్పించాల్సిన అవసరం ఉండదు.
డిజిటల్ ఇండియా
భారత్‌లో డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా దేశపథాన్ని ఎలా మార్చగలమో కింది సమీకరణం
తెలియజేస్తుంది. భారత ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువచేసే సదుద్దేశంతో భారత ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టింది. అంతర్జాల అనుసంధానతను పెంచి దేశాన్ని సాంకేతిక రంగం సాయంతో మరింత శక్తిమంతంగా మార్చడం, తద్వారా ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా పౌర సేవలను ప్రజలకు చేరువ చేయడం ఈ కార్యక్రమ లక్ష్యాలుగా ఉన్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు