జ్యుడీషియల్ అకౌంటబిలిటీ అంటే ఏమిటి?
ఇటీవల కేంద్ర, రాష్ట్ర సంబంధాలను ప్రభావితం చేస్తున్న అంశాలను పేర్కొని, కేంద్ర, రాష్ట్ర సంబంధాల బలోపేతం కోసం పూంచీ కమిషన్ సూచించిన సిఫారసులను వివరించండి?
పరిచయం
రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగాన్ని సిద్ధాంతపరమైన సమాఖ్యగా కాకుండా కేవలం పరిపాలనాపరమైన సమాఖ్యగానే రూపొందించారు. అందువల్ల కేంద్ర, రాష్ట్ర సంబంధాలు తరచూ ఘర్షణకు లోనవుతున్నాయి. రాజ్యాంగం ప్రకారం కేంద్రానికే ఎక్కువ అధికారాలు ఉండటం వల్ల తరచూ సమాఖ్య వ్యవస్థ ఒడిదొడుకులకు లోనవుతూ ఉంది.
కేంద్ర, రాష్ట్ర సంబంధాలను ప్రభావితం చేసే అంశాలు
1) గవర్నర్ వ్యవస్థ
రాష్ర్టాలపై కేంద్ర అజమాయిషీ అధికారికంగా చెలాయించడానికి గవర్నర్ వ్యవస్థ ఏర్పడింది. అయితే గవర్నర్ల నియామకంలో రాష్ర్టాలను సంప్రదించకపోవడం, కేంద్రం ఆదేశాలను రాష్ర్టాలు బలవంతంగా అమలయ్యేలా గవర్నర్ ప్రవర్తించడం, రాష్ర్టాల నిర్ణయాలను గవర్నర్ ఆమోదించకుండా కాలయాపన చేయడం వంటివి కేంద్ర, రాష్ట్ర సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి. ఉదా: పశ్చిమబెంగాల్, తమిళనాడు, తెలంగాణ, కేరళలో ఇటీవల జరుగుతున్న ముఖ్యమంత్రి వర్సెస్ గవర్నర్ వివాదం.
2) ఆర్థిక వనరుల పంపిణీ
రాజ్యాంగంలోని 12వ భాగంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాల ఆర్థిక వనరుల గురించి స్పష్టంగా విభజన చేశారు. అదేవిధంగా కేంద్ర, రాష్ర్టాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీకి సంబంధించి సిఫారసులు చేయడానికి కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. తమకు అనుకూలంగా ఉన్న రాష్ర్టాలకు ఒకలా, ప్రతిపక్షాలకు మరోలా నిధులు కేటాయించడం, ప్రత్యేక ఆర్థిక సహాయం, ప్రత్యేక హోదా కల్పించడంలో వివక్ష చూపడం వంటివి సమాఖ్య వ్యవస్థను దెబ్బ తీస్తున్నాయి.
3) కేంద్ర ఆర్థిక సంఘం సిఫారసులు
ఇటీవల 2021-26 కాలానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన సిఫారసులకు 1971 జనాభా లెక్కలకు బదులు 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకోవడం వల్ల జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ర్టాల కంటే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ర్టాలకు నిధుల కేటాయింపులో అన్యాయం జరిగింది. ఈ విధమైన సంస్కరణలు కూడా కేంద్ర, రాష్ట్ర సంబంధాలను బలహీనపరుస్తున్నాయి.
4) జాతీయ భాష వివాదం
జాతీయ విద్యావిధానం-2020 ముసాయిదా రూపకల్పనలో మాతృభాషతో పాటు హిందీని కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలనే నిబంధన మీద తమిళనాడు, కేరళ వంటి దక్షిణాది రాష్ర్టాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. తరచూ హిందీ వివాదం కేంద్రం వర్సెస్ దక్షిణాది రాష్ర్టాలుగా మారుతుండటం ఆందోళనకర అంశం.
5) ఒకే దేశం, ఒకే విధానం
2014 నుంచి జాతీయవాదాన్ని బలపరిచే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే విధానం అనే ట్రెండ్‌ను అనుసరిస్తుంది. ఇటీవలి జీఎస్టీ విధానం, ఒకే దేశం ఒకే రాజ్యాంగం విధానం, ఒకే దేశం ఒకే ఎన్నికల విధానం వంటివి రాష్ర్టాల అధికారాలను, సమాఖ్య వ్యవస్థలో వాటి పాత్రను పరిమితం చేసేలా ఉన్నాయి.
కేంద్ర, రాష్ట్ర సంబంధాల బలోపేతం కోసం పూంచీ కమిషన్ సిఫారసులు
1) తీవ్రవాద సమస్యకు గురైన ప్రాంతాలను పరిమిత కాలం పాటు కేంద్ర ప్రభుత్వం పాలనలోకి తెచ్చేందుకు అధికరణలు 355, 356లను సవరించాలి.
2) అధికరణ 356 కింద రాష్ట్రపతి పాలనను రాష్ట్రం మొత్తం విధించకుండా సమస్యాత్మక, రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందిన ప్రాంతాల్లో మాత్రమే విధించాలి.
3) రాష్ట్రపతి పాలన మూడు నెలలు మించకుండా ఉండాలి.
4) రాష్ర్టాల మంత్రిమండలి సలహాకు వ్యతిరేకంగా ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతించే హక్కుగవర్నర్లకు ఉండాలి.
5) విశ్వవిద్యాలయాలకు చైర్మన్లుగా గవర్నర్లను నియమించకూడదు.
6) గవర్నర్ పదవీకాలాన్ని ఐదేండ్లుగా నిర్ణయించాలి.
7) రాష్ట్రపతి మహాభియోగ తీర్మానం పద్ధతిలోనే గవర్నర్లను తొలగించాలి.
8) ఏడాదికోసారి జాతీయ భద్రతామండలి సమావేశమవ్వాలి.
ముగింపు: దేశంలో ఇటీవల కాలంలో మారుతున్న రాజకీయ వాతావరణ పరిస్థితులు కేంద్ర, రాష్ట్ర సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో రాష్ర్టాల అధికారాలను మరింత సుస్థిరం చేయాల్సిన అవసరం కూడా ఉంది.
జ్యుడీషియల్ అకౌంటబిలిటీ (న్యాయవ్యవస్థ జవాబుదారీతనం) అంటే ఏమిటి? భారతదేశంలో న్యాయవ్యవస్థ జవాబుదారీతనాన్ని పెంచడానికి గల అవసరాన్ని చర్చించండి?
పరిచయం: న్యాయమూర్తులు తాము తీసుకునే నిర్ణయాలు, వారి వ్యాఖ్యలు, ప్రవర్తనకు బాధ్యత వహించడాన్ని న్యాయ వ్యవస్థ జవాబుదారీతనం అని అంటారు. 2021లో ఒడిశా హైకోర్టు దాని పనితీరుకు సంబంధించి వార్షిక నివేదికను ప్రచురించడం జ్యుడీషియల్ అకౌంటబిలిటీకి ఒక మార్గదర్శకత్వంగా నిలిచింది.
దేశంలో జ్యుడీషియల్ అకౌంటబిలిటీ ఫ్రేమ్‌వర్క్
1) రాజ్యాంగపరమైన ఫ్రేమ్‌వర్క్
- ఎ. అధికరణ 124(4)- అసమర్థత, దుష్ప్రవర్తన అనే కారణాల వల్ల పార్లమెంట్ అభిశంసన తీర్మానం ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించడం
- బి. అధికరణ 217(1)బి- అసమర్థత, దుష్ప్రవర్తన అనే కారణాల వల్ల పార్లమెంట్ అభిశంసన తీర్మానం ద్వారా హైకోర్టు న్యాయమూర్తులను తొలగించడం
- సి. అధికరణ 235- సబార్డినేట్ కోర్టులను హైకోర్టు
నియంత్రించడం
2) చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్
ఎ. న్యాయమూర్తుల విచారణ చట్టం-1968: సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల అసమర్థత, దుష్ప్రవర్తనకు సంబంధించిన సాక్ష్యాలను రుజువు చేయడానికి, న్యాయమూర్తులను విచారించడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది.
బి. రీ స్టేట్మెంట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ జ్యుడీషియల్ లైఫ్- 1997: 1997లో సుప్రీంకోర్టు ఈ చార్టర్‌ను ఆమోదించింది. దీనిలో న్యాయమూర్తుల ప్రవర్తనకు సంబంధించిన
ప్రమాణాలు, మార్గదర్శకాలు ఉన్నాయి. దేశంలోని అన్ని
హైకోర్టులు కూడా వీటిని అమలు చేస్తున్నాయి.
సి. సుప్రీంకోర్టు తీర్మానం-1999: 1997 చార్టర్లో ప్రస్తావించిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించే న్యాయమూర్తులపై చర్య తీసుకోవడానికి ‘ఇన్-హౌజ్ ప్రొసీజర్’ అవలంబించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
న్యాయవ్యవస్థ జవాబుదారీతనాన్ని ప్రశ్నార్థకం చేసిన ఘటనలు
1) గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ వ్యవహారంలో జడ్జిలు ముడుపులు అందుకోవడం
2) సీజేగా వ్యవహరించిన బాలకృష్ణన్‌పై వచ్చిన
అవినీతి ఆరోపణలు 3) జస్టిస్ కర్ణన్ వివాదం
4) వివాదాస్పద మెడికల్ స్కామ్‌కు సంబంధించిన సీజేను సంప్రదించకుండానే చలమేశ్వర్ ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయడం
5) ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు
6) జస్టిస్ దీపక్ మిశ్రాపై చలమేశ్వర్ నేతృత్వంలోని నలుగురు జడ్జిల బహిరంగ విమర్శలు
న్యాయ జవాబుదారీతనాన్ని పెంచాల్సిన అవసరం
1) న్యాయమూర్తుల సమర్థతను, నాణ్యమైన తీర్పులను మెరుగుపరచడానికి ఉదా: ఇటీవల బాంబే హైకోర్టు న్యాయమూర్తి స్కిన్ టు స్కిన్ సంబంధం లేకుండా పిల్లలను తాకడం పోక్సో చట్టం పరిధిలోకి రాదని బాధ్యతారాహిత్య తీర్పివ్వడం లాంటివి తగ్గుతాయి.
2) నిష్పాక్షిక పనితీరును న్యాయవ్యవస్థలో పెంచడం. ఉదా: మాజీ సీజే జస్టిస్ రంజన్ గొగోయ్‌పై లైంగిక ఆరోపణలు వచ్చినప్పుడు ఫిర్యాదుదారుని వైపు నుంచి న్యాయవాది మాట్లాడటానికి అనుమతివ్వకుండానే క్లీన్‌చీట్ ఇవ్వడం లాంటివి నిరోధించబడతాయి.
3) కోర్టులు తమ పనితీరును ప్రజలకు తెలియజేయడానికి వార్షిక నివేదికలు ప్రచురించడం. ఉదా: మద్రాస్, హిమాచల్‌ప్రదేశ్, త్రిపుర, ఒడిశా హైకోర్టులు మాత్రమే ఈ పని చేశాయి.
4) కేసుల సత్వర పరిష్కారం పెరిగి, పెండింగ్ కేసులు తగ్గుతాయి.
5) న్యాయమూర్తుల ఎంపికలో కొలీజియం వ్యవస్థపై గల అనేక అనుమానాలు
6) న్యాయమూర్తుల వ్యక్తిగత ఆస్తులు, ఆదాయాల
వివరాలను ప్రకటించడానికి అవకాశం ఇవ్వడం.
ముగింపు: ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని ఆర్టీఐ పరిధిలోకి తెస్తూ సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించడం న్యాయవ్యవస్థ జవాబుదారీతనాన్ని పెంచడంలో కీలక సంస్కరణ. అయితే కొలీజియం, అభిశంసన వంటి సంక్లిష్ట సమస్యలను పరిష్కరించకపోతే అకౌంటబిలిటీ అనేది గాలిలో దీపం కావచ్చు.
జ్యుడీషియల్ అకౌంటబిలిటీ అమలులో గల సవాళ్లు, దానిని కొనసాగించడానికి కొన్ని సముచిత మార్గాలు
సవాళ్లు
1) న్యాయవ్యవస్థ స్వతంత్రత: న్యాయవ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచడంలో ప్రధాన అవరోధం న్యాయవ్యవస్థ స్వతంత్రత. రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖ వేరు చేయబడి సర్వ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. న్యాయమూర్తుల నియామకం, తొలగింపు, జీతభత్యాలు వంటివన్నీ రాజ్యాంగ భద్రతను కలిగి ఉన్నాయి. కాబట్టి న్యాయవ్యవస్థ స్వతంత్రత, జవాబుదారీతనాన్ని సమతుల్యం చేయడం చాలా కష్టం.
2) సుదీర్ఘమైన తొలగింపు ప్రక్రియ: రాజ్యాంగం ప్రకారం అసమర్థత, దుష్ప్రవర్తన కలిగిన న్యాయమూర్తులను పార్లమెంట్ తీర్మానం ద్వారా తొలగించడం సుదీర్ఘమైన, సంక్లిష్టమైన ప్రక్రియ. ఈ విధానంతో ఇప్పటివరకు రామస్వామి, జేబీ పార్థివాలా, పీడీ దినకరన్, సౌమిత్ర సేన్ వంటి వారిపై ప్రయోగించినా పూర్తికాలేదు.
3) కోర్టు ధిక్కరణ అధికారం: కోర్టు ధిక్కరణ చట్టం-1971 ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టులు తమమీద వ్యతిరేకంగా ఆరోపణలు చేసేవారిని, తమ స్వతంత్రతకు భంగం కలిగించే వారిమీద చర్యలు తీసుకునే అధికారం ఉంది. అదే సందర్భంలో వివిధ ప్రభుత్వ/శాసన నిర్ణయాల మీద వ్యాఖ్యానించే అధికారం ఉండటం కూడా జవాబుదారీతనానికి అవరోధంగా ఉంది.
జవాబుదారీ పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు
1) న్యాయస్థానాలు తమ పనితీరుకు సంబంధించి వార్షిక నివేదికను ప్రచురించేలా చట్టం చేయడం
2) జ్యుడీషియల్ స్టాండర్డ్స్ అండ్ అకౌంటబిలిటీ బిల్లు-2010ను తిరిగి ప్రవేశపెట్టి ఆమోదించడం
3) న్యాయమూర్తులపై వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి కేంద్ర స్థాయిలో శాశ్వత క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేయడం
4) న్యాయవ్యవస్థను సమగ్రంగా సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావడం
5) న్యాయవ్యవస్థను స్వీడన్ వంటి దేశాల్లో అమల్లో ఉన్నట్లుగా లోక్‌పాల్ పరిధిలోకి తీసుకురావడం
6) న్యాయమూర్తుల సాధారణ పనితీరును గ్రేడింగ్ చేయడానికి సమగ్ర మూల్యాంకన వ్యవస్థను ప్రారంభించడం
సుమారు మూడు దశాబ్దాల ర్వాత కూడా 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా ఏర్పడిన స్థానిక ప్రభుత్వాలు ఇప్పటికీ అసంపూర్ణంగా, అసమర్థంగా ఉన్నాయి. చర్చించండి?
పరిచయం: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భాగస్వామ్య ప్రజాస్వామ్యం ద్వారా ప్రజాస్వామ్య, పరిపాలన, అభివృద్ధి, అధికార వికేంద్రీకరణను స్థాపించి దేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలన్న లక్ష్యంతో 1992లో 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించారు.
స్థానిక ప్రభుత్వాలు – సమస్యలు
1) పాక్షిక అధికార వికేంద్రీకరణ: రాజ్యాంగం ఆశించిన అధికార వికేంద్రీకరణ స్థానిక సంస్థల్లో జరగడం లేదు. ప్రతి స్థానిక సంస్థలోనూ విపరీతమైన రాజకీయ జోక్యం పెరిగిపోయింది. స్థానిక సంస్థలకు తగినన్ని ఆర్థిక గ్రాంట్లను కేటాయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైన జాప్యాన్ని ప్రదర్శిస్తున్నాయి.
2) నేరమయ రాజకీయాలు: క్రిమినల్ నేపథ్యం ఉన్నవారే స్థానికంగా రాజకీయాల్లో, కాంట్రాక్ట్ వ్యవహారాల్లో చక్రం తీప్పుతున్నారు. వీరు స్థానిక రాజకీ, పరిపాలనా వ్యవహారాలను డబ్బుతో ప్రభావితం చేస్తున్నారు.
3) సమాంతర ప్రభుత్వాలు: బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వంటి రాష్ర్టాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ స్థానిక నాయకుల నాయకత్వంలో సమాంతర ప్రభుత్వాలను నడిపిస్తున్నాయి. ఇవి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయి.
4) తక్కువ సాంకేతిక పరిజ్ఞాన వినియోగం: మెజారిటీ స్థానిక సంస్థలు బలహీనమైన కార్యాలయ వ్యవస్థను కలిగి ఉన్నాయి. అల్పసాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పటికీ ప్రజలకు మెరుగైన సేవలను అందించడంలో బాగా వెనుకబడి ఉన్నాయి.
5) అల్ప పన్నుల వ్యవస్థ: చాలా స్థానిక సంస్థల్లో పన్నుల వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది. ఇప్పటికీ కొన్ని స్థానిక సంస్థల్లో పన్నుల వసూలు వ్యవస్థీకృతంగా జరగడం లేదు. తద్వారా అవి నిధుల సమస్యలతో సతమతమవుతున్నాయి.
స్థానిక పాలనను సమర్థవంతం చేయాలంటే తీసుకోవాల్సిన చర్యలు
1) గ్రామ, పట్టణ ప్రాంతాల్లో వార్డులు, వార్డు కమిటీలను సంస్కరించాలి.
2) గ్రామసభల నిర్వహణకు సంబంధించి చట్టబద్ధ నిబంధనలను రూపొందించాలి.
3) గ్రామ, పట్టణ పంచాయతీల్లో ఉద్యోగ సిబ్బందికి ప్రజా వ్యవహారాల్లో తగిన శిక్షణ కల్పించి, నైపుణ్యాలను పెంచాలి.
4) దిగువ స్థాయి అధికారులకు మరిన్ని అధికారాలను బదిలీ చేయాలి.
5. సోషల్ ఆడిట్ పకడ్బందీగా చేపట్టాలి.
6. ఆదాయ పన్ను వసూళ్లలో కొంత మొత్తాన్ని స్థానిక సంస్థలకు కేటాయించాలి.
7. బడ్జెట్లో ప్రత్యేకంగా స్థానిక సంస్థల గ్రాంట్‌ను కేటాయించాలి. దానికి చట్టబద్ధత కల్పించాలి.
8. స్థానిక సంస్థల మౌలిక సదుపాయాల బలోపేతానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని అనుసంధానం చేయాలి.
9. స్థానికంగా మరిన్న పన్నులు విధించి, వసూలు చేసుకునేలా స్థానిక ప్రభుత్వాలకు అధికారాలను బదలాయించాలి.
10. గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి.
ముగింపు
- దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా స్థానిక ప్రభుత్వాలు అనుకున్న మేర విజయవంతం కాలేదు. ఈ నేపథ్యంలో సమగ్రమైన సామాజిక అభిప్రాయాల ద్వారా, చట్టబద్ధమైన సంస్కరణలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ప్రజల్లో భాగస్వామ్య ప్రజాస్వామ్యం పట్ల మరింత అవగాహన పెరిగేలా చర్యలు తీసుకోవాలి.
పీ శ్రీరామ్‌చంద్ర గ్రూప్-1 మెంటార్ హైదరాబాద్:8008356825
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు