వ్యవసాయాభివృద్ధిలో ‘రైతుబంధు’పాత్రను చర్చించండి?
దేశంలోని రోడ్డు రవాణా విధానాన్ని వివరించండి?
- సామాన్య ప్రజల జీవనంతో ఎక్కువగా ముడిపడి ఉన్నది రవాణా. 2017, మార్చి 31 నాటికి భారత్ మొత్తం 59.98 లక్షల కి.మీ. పొడవైన రోడ్డు మార్గాలను కలిగి యూఎస్ఏ తర్వాత 2వ స్థానాన్ని కలిగి ఉంది. దేశవ్యాప్తంగా జరిగే మొత్తం సరకు రవాణాలో 60 శాతం, ప్రయాణికుల రవాణాలో 85 శాతం రోడ్డు మార్గాల ద్వారా జరుగుతుంది.
- 1943లో ఏర్పాటు చేసిన ‘నాగపూర్ రోడ్డు ప్రణాళిక’ దేశంలోని రోడ్డు మార్గాలను 4 రకాలుగా విభజించారు. అవి.. 1) జాతీయ రహదారులు
2) రాష్ట్ర రహదారులు
3) జిల్లా రహదారులు
4) గ్రామీణ రహదారులు
జాతీయ రహదారులు
- దేశంలోని రాష్ట్రాల రాజధానులు, పారిశ్రామిక, సాంస్కృతిక కేంద్రాలు, ప్రధాన ఓడరేవులను అనుసంధానం చేసే రోడ్లను జాతీయ రహదారులు అని పిలుస్తారు.
- జాతీయ రహదారుల నిర్వహణ, అభివృద్ధి కోసం పార్లమెంట్ చట్టం ద్వారా 1988లో ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా)ను ఏర్పాటు చేశారు. 1995 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
- జాతీయ రహదారుల నిర్మాణం, వాటి పర్యవేక్షణ,
మరమ్మతు పనులు మొదలైనవి కేంద్ర ప్రభుత్వ విభాగమైన సీపీడబ్ల్యూడీ (సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్) ఆధ్వర్యంలో చేపడతారు. - దేశంలోని మొత్తం రోడ్డు మార్గాల్లో జాతీయ రహదారులు 1.94 శాతం కలిగి 40 శాతం రవాణాను నిర్వహిస్తున్నాయి.
- దేశంలో ప్రస్తుతం 1,14,158 కి.మీ. పొడవైన జాతీయ రహదారులుండగా ఇందులో ఉత్తరప్రదేశ్ (7,818 కి.మీ.), రాజస్థాన్ (7,130 కి.మీ.), మధ్యప్రదేశ్ (5064 కి.మీ.), తమిళనాడు (4,953 కి.మీ.) రాష్ర్టాలు పొడవైన జాతీయ రహదారులను కలిగి ఉన్నాయి.
- రాష్ట్ర రహదారులు
- రాష్ట్ర రాజధానిని జిల్లా ప్రధాన కేంద్రాలతో ఇతర ముఖ్య పట్టణాలతో కలిపే రహదారులు. ఇవి మొత్తం దేశ రోడ్డు నెట్‌వర్క్‌లో 2.97 శాతం కలిగి ఉన్నాయి. ఇవి 1,75,036 కి.మీ.ల పొడవును కలిగి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించబడతాయి. రోడ్డు నెట్వర్క్ ఎక్కువగా గల రాష్ర్టాలు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు.
జిల్లా రహదారులు
- ఇవి జిల్లా ప్రధాన కేంద్రాన్ని, మండల ప్రధాన కేంద్రాలతో, ముఖ్యమైన గ్రామాలతో కలుపుతాయి. దేశంలోని మొత్తం రోడ్డు నెట్‌వర్క్‌లో ఇవి దాదాపు 9.94 శాతం కలిగి ఉన్నాయి. ఇవి 5,86,181 కి.మీ.ల పొడవు ఉన్నాయి. వీటి నిర్వహణ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉంటుంది.
గ్రామీణ రహదారులు
- మండల కేంద్రాలను, జిల్లాల రహదారులతో కలిపే మార్గాలు. దేశంలోని మొత్తం రోడ్డు నెట్‌వర్క్‌లో దాదాపు 70.65 శాతం కలిగి 41,66,916 కి.మీ.ల పొడవును కలిగి ఉన్నాయి. వీటి నిర్వహణ జిల్లా పరిషత్ ఆధీనంలో ఉంటుంది. ఈ రహదారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 2000లో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకాన్ని ప్రారంభించింది.
దేశంలో పట్టణ ప్రాంత వరదలకు గల కారణాలను వివరిస్తూ ఇటీవల సంభవించిన వరదలను పేర్కొనండి?
- ఇటీవల కాలంలో దేశంలో వాతావరణంలో సంభవించే మార్పుల కారణంగా, అభివృద్ధి పేరుతో మానవుడు చేపట్టే బహుళ అంతస్తుల నిర్మాణాల కారణంగా కుండపోత వర్షాలు సంభవించి వరదలకు దారితీస్తున్నాయి.
పట్టణ వరదలకు గల కారణాలు
1) జలాశయ ప్రాంతాల ఆక్రమణ
2) భూ వినియోగ రీతుల్లో మార్పులు రావడం
3) డ్రైనేజీ వ్యవస్థలు సరిగ్గా లేకపోవడం
4) సరైన పట్టణ ప్రణాళికలు అమలు చేయకపోవడం
5) మౌలిక సదుపాయాలు లోపించడం నగరాలు లేదా పట్టణాలకు ఎగువన ఉన్న ఆనకట్టల నుంచి నీటిని ఆకస్మికంగా విడుదల చేయడం
6) తీర ప్రాంత పట్టణాల్లో తుఫాను ప్రభావం వల్ల ఏర్పడే ఉప్పెనలు పట్టణ వరదలకు కారణమవుతున్నాయి.
7) ఘన వ్యర్థాలను ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలను విచక్షణారహితంగా జలాశయాల్లోకి వదలడం.
- గత దశాబ్ద కాలం నుంచి భారతదేశ పట్టణాలు తరచూ వరద ప్రభావానికి లోనవుతున్నాయి. దీనికి నిదర్శనమే ముంబైలో సంభవించిన వరదలు, 2015లో చెన్నై, గురుగ్రామ్, బెంగళూరు, ముంబైలో వచ్చిన వరదలు, 2006లో సూరత్ వరదలు, 2014లో సంభవించిన కశ్మీర్ వరదలు, 2017, ఆగస్టులో కోల్‌కతా, శ్రీనగర్, సూరత్, నాగపూర్ వంటి ఇతర నగరాల్లో సంభవించిన వరదలు, 2018 కేరళ వరదలు, 2019 అసోం వరదలు మొదలైనవి.
- భారతదేశ పట్టణ ప్రాంత వరదలకు కారణాలు భిన్నమైనవిగా ఉన్నాయి. అలాగే వాటిని ఎదుర్కోవడానికి సరైన వ్యూహాలు రూపొందించాలని 2010లో జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్డీఎంఏ) పట్టణ వరద నిర్వహణపై జాతీయ మార్గదర్శకాలను రూపొందించింది. ఇందులో ముఖ్యమైనవి ఉపశమన, సన్నాహక చర్యలుగా పేర్కొన్నారు.
పట్టణ వరదల నిర్వహణకు ఎన్డీఎంఏ కార్యాచరణ
1) పట్టణ వరదల నిర్వహణకు, నిర్మూలనకు కొన్ని
కీలకమైన చర్యలను తక్షణమే నిర్వహించాల్సిన అవసరం ఉంది.
2) రుతుపవనాలకు ముందు ఎప్పటికప్పుడు మురుగు కాల్వల్లోని పూడికను పూర్తిగా తొలగించాలి.
3) కాల్వల్లోకి ఘన వ్యర్థాల విడుదలను అరికట్టాలి.
4) లోతట్టు ప్రాంతాల్లో జనావాసాలను తొలగించాలి.
వరదలకు గురికాని ప్రాంతాల్లో వీరికి పునరావాసం కల్పించాలి.
5) చెరువులు, కొలనులు, సరస్సుల దురాక్రమణను అడ్డుకోవడమే కాకుండా వాటి పరీవాహక ప్రాంతాల్లో సాధ్యమైనంత వరకు శాశ్వత కట్టడాలను అనుమతించొద్దు.
6) లోతట్టు ప్రాంతాల్లో, నది పరీవాహక ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిగా అడ్డుకోవాలి.
7) రాజకీయ నిబద్ధత లేనిదే పట్టణ వరద నివారణ, నిర్మూలన, నియంత్రణ కార్యక్రమాలను నిర్వహించడం సాధ్యం కాదు. కాబట్టి వార్డు మెంబర్, కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ నియోజకవర్గాల్లో మాత్రమే అధికారుల్లో అప్రమత్తత పెరిగి నిర్మూలన కార్యక్రమాలు వేగంగా నిర్వహించబడతాయి.
8) వరదల ద్వారా ప్రభావితమవుతున్న ప్రాంత ప్రజల భాగస్వామ్యం ద్వారా మాత్రమే పట్టణ వరదలకు సత్వర పరిష్కారం లభిస్తుంది. అధికారులు నిర్వహించే నివారణ కార్యక్రమాల్లో వీరి భాగస్వామ్యం అవసరం.
9) అదేవిధంగా గుర్తింపు పొందిన ఎన్జీవోలు కూడా ఈ రకమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి.
డెల్టాలు, ఎస్టూరిస్ల మధ్య తేడాలను పేర్కొనండి?
డెల్టాలు
- నదీ ముఖద్వారాల నది నిక్షేపణా చర్యల వల్ల ఏర్పడే త్రిభుజాకృతిలోని సారవంతమైన మైదానాలే డెల్టాలు.
- నదులు తమ ముఖ ద్వారాల వద్ద నది భారాన్ని మోయలేక భిన్న శాఖలుగా విడిపోయి సముద్రంలో కలుస్తాయి. ఈ ప్రాంతంలో నదితో పాటు రవాణా అయిన ఒండ్రు మట్టి లాంటి శిథిలాలు నది పాయల మధ్య నిక్షేపించబడటం వల్ల ఏర్పడే డెల్టా ఆకృతిలోని సారవంతమైన మైదానాలనే డెల్టాలు అని పిలుస్తారు.
- డెల్టాలు తీర మైదాన ప్రాంతాల్లో పోటులు తక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఏర్పడుతాయి.
- దేశంలో తూర్పు దిశలో ప్రవహించే గంగ, బ్రహ్మపుత్ర, కృష్ణా, గోదావరి, కావేరి, మహానది తమ ముఖద్వారాల ద్వారా డెల్టాలను ఏర్పరుస్తున్నాయి.
- డెల్టాలు వ్యవసాయాభివృద్ధికి ముఖ్యమైన
- భూ స్వరూపాలు. ఎస్టూరిస్లు
- అంటే ఉప్పునీటి కయ్యలు.
- నదులు సముద్రాల్లో కలిసే చోట భిన్న శాఖలుగా విడిపోకుండా నేరుగా సముద్రంలో కలిసే చోట డెల్టాలకు బదులు ఉప్పునీటి కయ్యలు ఏర్పడతాయి.
- ఎస్టూరిస్ అనేవి ఏ నది ముఖద్వారాల వద్ద అయితే సముద్రాల్లోని ఉప్పునీరు, నదిలోని మంచినీరు కలుసుకునే చోట ఏర్పడే క్షార స్వభావం గల ఉప్పునీటి కయ్యలు.
- తీర ప్రాంతాల్లో సముద్రపు పోటులు ఎక్కువగా ఉండే చోట ఏర్పడతాయి.
- పగులు లోయల గుండా ప్రవహించే నదులు డెల్టాలకు బదులు వాటి నది ముఖద్వారాల వద్ద ఎస్టూరిస్ను ఏర్పరుస్తాయి. కారణం పగులు లోయ అడుగు భాగమంతా అనేక బీటలు, పగుళ్లను కలిగి ఉండటం వల్ల, తమతో రవాణా చేసే ఒండ్రుమట్టి లాంటి శిథిల పదార్థమంతా బీటలు, భ్రంశాల్లో నిక్షేపణం చెందడం వల్ల.
- దేశంలో పశ్చిమంగా ప్రవహించే నర్మద, తపతి వంటి నదులన్నీ వాటి నదీ ముఖద్వారాల వద్ద డెల్టాలకు బదులు ఎస్టూరిస్ను కలిగి ఉన్నాయి.
- ఎస్టూరిస్ అనేవి మాంగ్రూవ్ వృక్ష సంపద పెరుగుదలకు, మత్స్య పరిశ్రమ అభివృద్ధికి నిలయమైన ప్రాంతాలు.
రాష్ట్ర వ్యవసాయాభివృద్ధిలో రైతుబంధు పథకం పాత్రను చర్చించండి?
- ఇది రైతు సాధికారత పంట పెట్టుబడి సహాయ పథకం. వడ్డీ వ్యాపారుల చేతిలో చిక్కుకోకుండా ఉపశమనం కలుగజేసే పథకం. ఈ పథకాన్ని 2018, మే 1 నుంచి ప్రారంభించారు. మొదట కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ మండలంలోని చేల్పూర్ గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.
- ఈ పథకం కింద పట్టాదారు (భూ యజమానులు) రైతులకు ఎకరానికి రూ.4,000 చొప్పున పంట పెట్టుబడి అందించారు. 2019లో సీజనుకు ఎకరానికి రూ.5,000, ఏడాదికి రూ.10,000 చొప్పున అందిస్తుంది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్లో 75.4 శాతం కేటాయించగా అది రాష్ట్ర బడ్జెట్లో 7.7 శాతంగా ఉంది.
ప్రయోజనాలు
1) పట్టాదారు రైతులకు నేరుగా బ్యాంక్ అకౌంట్లో నగదు జమ చేయడం. ఈ పథకం 4.94 ఎకరాల కంటే తక్కువ ఉన్న చిన్న, సన్నకారు రైతులకు చాలా ప్రయోజనం చేకూర్చుతుంది.
2) ఈ నగదు బదిలీ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం సకాలంలో అందడం వల్ల రైతులు ఎరువులు, పురుగు మందులు, యంత్ర పరికరాలు కొనుగోలు చేయడం ద్వారా అధిక ఉత్పత్తి సాధిస్తున్నారు.
3) ఈ పథకం ముఖ్య ఉద్దేశం రైతుల ఆదాయాన్ని పెంచడం, గ్రామీణ అభివృద్ధిని సాధించడం
4) రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో రైతుబంధు పథకం ప్రయోజనం పొందిన రైతుల్లో నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో సంగారెడ్డి, ఖమ్మం, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి.
5) ఈ పథకం అమలుకు 2018 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 12 వేల కోట్ల రూపాయలు కేటాయించగా, 2022 జూన్ 28న తొమ్మిదో విడత రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ ప్రారంభమైంది.
6) ఈ వానాకాలం సీజన్‌కు 68.94 లక్షల మంది రైతులకు రూ.7,654.43 కోట్లు పంపిణీ చేశారు. ఈ సీజన్ పంపిణీతో ఇప్పటి వరకు అందించిన సాయం రూ.58,102 కోట్లకు చేరింది.
7) కేంద్ర ప్రభుత్వం కూడా 2019, ఫిబ్రవరిలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజనను ప్రారంభించింది. దీని కింద రైతులకు రూ.6,000 పంట పెట్టుబడి కోసం సాయం అందిస్తుంది. ఇది కూడా రైతుబంధు పథకం వంటిదే.
ప్రపంచ దేశాల్లో రైతుల అభివృద్ధి కోసం చేపట్టిన వినూత్న కార్యక్రమాల్లో ఐక్యరాజ్యసమితి ఎంపిక చేసిన 20 పథకాల్లో రైతుబంధు ఒకటి. 2018, నవంబర్ 20 నుంచి 23 వరకు రోమ్‌లో జరిగిన ‘వ్యవసాయాభివృద్ధిలో వినూత్న ఆవిష్కరణలు’ అనే అంతర్జాతీయ సదస్సులో తెలంగాణ రైతుబంధు, రైతు బీమా పథకాలను ఎంపిక చేశారు.
జీ గిరిధర్ సివిల్స్ ఫ్యాకల్టీ బీసీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ 9966330068
- Tags
- capitals
- cpwd
- industrial
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు