భారత్ ఏ దేశం నుంచి చిరుతలను తెచ్చుకోనుంది?
1. 2023 జనవరి చివరి వారంలో భారత్‌లో సబ కొరోసి పర్యటించారు. ఆయన ఎవరు? (3)
1) ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్
2) భద్రతా మండలి అధ్యక్షుడు
3) ఐక్యరాజ్య సమితి సాధారణ సభ
అధ్యక్షుడు
4) సామాజిక-ఆర్థిక మండలి చైర్మన్
వివరణ: 2023 జనవరి చివరి వారంలో సబ కొరోసి పర్యటించారు. ఆయన ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 77వ సెషన్‌కు అధ్యక్షుడు. హంగేరి దేశానికి చెందినవాడు. సాధారణ సభలో సభ్య దేశాల సంఖ్య 193. ఏటా సెప్టెంబర్ మూడో మంగళవారం నుంచి తర్వాతి సంవత్సరం మూడో సోమవారం వరకు ఈ సభ సమావేశాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం 77వ సెషన్ కొనసాగుతుంది. ఇప్పటికే భారత్ ఇందులో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది, ఆమోదం కూడా లభించింది. ప్రజాస్వామ్య బలోపేతానికి విద్యను వినియోగించాలన్న ఉద్దేశంతో భారత్ ఆ తీర్మానం ప్రవేశపెట్టింది. భారత్ ఇప్పటి వరకు ఒక సెషన్‌కు అధ్యక్షత వహించింది. అది ఎనిమిదోది. భారత తొలి ప్రధాని నెహ్రూ సోదరి విజయలక్ష్మీ పండిట్ దానికి నేతృత్వం వహించారు. భారత్ తరఫున అధ్యక్షత వహించిన ఒకే ఒక వ్యక్తి కావడంతో పాటు యూఎన్జీఏకు నేతృత్వం వహించిన తొలి మహిళ.
2. ఏ దేశానికి ఇటీవల పెట్ పావెల్ అధ్యక్షుడు అయ్యాడు? (4)
1) వెనెజులా 2) బ్రెజిల్
3) పపువా న్యూ గినియా 4) చెక్ రిపబ్లిక్
వివరణ: యూరప్‌లోని చెక్ రిపబ్లిక్ దేశానికి కొత్త అధ్యక్షుడిగా పెట్ పావెల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన నాటో మిలిటరీ కమిటీ చైర్మన్‌గా పని చేశారు. చెక్ రిపబ్లిక్ బహుళ పార్టీ వ్యవస్థ కలిగిన ఒక ప్రజాస్వామ్య దేశం. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉంటుంది. ఆ దేశ అధ్యక్ష ఎన్నికల బరిలో పావెల్ 58 శాతానికి పైగా ఓట్లను దక్కించుకున్నారు. అండ్రెజ్ బబిస్ ఓడిపోయారు. పావెల్ యూరోపియన్ యూనియన్‌తో పాటు నాటోకు చాలా సందర్భాల్లో మద్దతుగా నిలిచారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలోనూ ఉక్రెయిన్ దేశానికి సహకరించారు.
3. భారత్‌లో అతి ఎక్కువ విశ్వవిద్యాలయాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? (3)
1) కర్ణాటక 2) కేరళ
3) రాజస్థాన్ 4) పశ్చిమబెంగాల్
వివరణ: దేశంలో అత్యధిక సంఖ్యలో విశ్వవిద్యాలయాలు రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నాయి. వీటి సంఖ్య 92గా ఉంది. ఆ తర్వాత 84 విశ్వవిద్యాలయాలతో ఉత్తరప్రదేశ్, తర్వాత గుజరాత్ (83) నిలిచాయి. కళాశాలల సంఖ్యా పరంగా అగ్రస్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ 2020-21 అఖిల భారత ఉన్నత విద్య సర్వేను విడుదల చేసింది. 2011 నుంచి ఏటా ఈ నివేదికను విడుదల చేస్తున్నారు. 2014-15 నుంచి విశ్వవిద్యాలయాల సంఖ్యలో 46.4% పెరుగుదల కనిపించింది. సంఖ్యా పరంగా 353గా చెప్పుకోవచ్చు. జాతీయ ప్రాధాన్యం ఉన్న ఇన్స్టిట్యూషన్లు 2014-15లో 75 ఉండగా, 2020-21 నాటికి 149కి చేరింది.
4. ఏ వ్యవస్థ ఏర్పాటు చేసి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా రూ.75 నాణేన్ని విడుదల చేశారు? (1)
1) ఎన్సీసీ 2) సీఎస్ఐఆర్
3) ఇక్రిశాట్ 4) ఇస్రో
వివరణ: 1948లో ఎన్సీసీని ఏర్పాటు చేశారు. దీని పూర్తి రూపం నేషనల్ క్యాడెట్ కార్ప్స్. ఈ ఏడాదితో ఈ వ్యవస్థ ఏర్పాటై 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రూ.75 నాణేన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ విడుదల చేశారు. ఎన్సీసీ అనేది పదాతి, నావిక, వాయు దళాలకు సంబంధించిన పాఠశాల, కళాశాలల్లో ఉండే యువ వ్యవస్థ. దీని ప్రధాన కేంద్రం ఢిల్లీలో ఉంది. 1948, జూలై 16న ఏర్పాటు చేశారు. హెచ్ఎన్ కుంజ్రు సూచన మేరకు ఎన్సీసీ ఏర్పాటయ్యింది.
5. ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్‌ను అరినా సబలెంకా గెలుచుకుంది. ఆమె ఏ దేశానికి చెందింది? (3)
1) కజకిస్థాన్ 2) సెర్బియా
3) బెలారస్ 4) రష్యా
వివరణ: ఆస్ట్రేలియా ఓపెన్ 2023 మహిళల సింగిల్స్ విజేత అరినా సబలెంకా. ఆమె బెలారస్ దేశానికి చెందింది. తుదిపోరులో ఆమె కజకిస్థాన్‌కు చెందిన ఎలెనా రిబకినాను ఓడించింది. గ్రాండ్ టైటిల్‌ను గెలవడం అరినాకు ఇదే తొలిసారి. మరో వైపు పురుషుల సింగిల్స్‌ను నొవాక్ జకోవిచ్ గెలుచుకున్నాడు. తుదిపోరులో ఆయన స్టెఫానోస్ సిట్సిపాస్‌ను ఓడించాడు. జకోవిచ్ ఆస్ట్రేలియా సింగిల్స్ గెలవడం ఇది పదోసారి. అలాగే ఇప్పటి వరకు జకోవిచ్ 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలిచాడు. అతడు సెర్బియా దేశానికి చెందిన క్రీడాకారుడు.
6. తొలి టీ-20 అండర్-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న జట్టు ఏది? (4)
1) దక్షిణాఫ్రికా 2) ఇంగ్లండ్
3) ఆస్ట్రేలియా 4) భారత్
వివరణ: అండర్-19 మహిళల టీ-20 ప్రపంచ కప్‌ను భారత జట్టు గెలుచుకుంది. ఈ కప్‌ను సాధించిన తొలి జట్టుగా భారత్ కొత్త రికార్డు సృష్టించింది. తుదిపోరులో భారత్ ఇంగ్లండ్‌ను ఓడించింది. ఈ పోటీని ఆస్ట్రేలియాలో జనవరి 14 నుంచి 29 వరకు నిర్వహించారు. మొత్తం ఇందులో 16 జట్లు పాల్గొన్నాయి. తుది పోరులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ టీటీ సాధుకు లభించింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ ఇంగ్లండ్‌కు చెందిన గ్రేస్ స్క్రివెన్స్కు దక్కింది. భారత జట్టుకు షఫాలి వర్మ నేతృత్వం వహించారు.
7. హాకీ వరల్డ్ కప్‌ను ఏ జట్టు గెలుచుకుంది? (2)
1) బెల్జియం 2) జర్మనీ
3) భారత్ 4) సింగపూర్
వివరణ: హాకీ పురుషుల ప్రపంచకప్‌ను జర్మనీ గెలుచుకుంది. ఈ టోర్నీని ఆ జట్టు గెలవడం ఇది మూడో సారి. తుదిపోరులో బెల్జియం జట్టును జర్మనీ ఓడించింది. ఈ పోటీని భారత్‌లోని భువనేశ్వర్‌లో నిర్వహించారు. ఉత్తమ ప్లేయర్‌గా జర్మనీకి చెందిన నిక్లస్ వెలెన్ ఎంపికయ్యాడు. ఉత్తమ గోల్‌కీపర్‌గా విన్సెంట్ వనస్చ్ (బెల్జియం) నిలిచాడు.
8. నిఖత్ జరీన్ ఏ క్రీడతో ముడిపడి ఉన్నారు? (3)
1) రన్నింగ్ 2) షాట్‌పుట్
3) బాక్సింగ్ 4) వెయిట్ లిఫ్టింగ్
వివరణ: నిఖత్ జరీన్ బాక్సింగ్ క్రీడాకారిణి. ఆమె తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందింది. ఆమె నవరత్న సంస్థగా పేరున్న ఎన్ఎండీసీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యింది. ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరింది. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలవడంతో పాటు 2022లో బర్మింగ్‌హాంలో జరిగిన కామన్వెల్త్ క్రీడాపోటీల్లో కూడా విజేతగా నిలిచింది. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌ను గెలిచిన అయిదో భారత మహిళ ఆమె. గతంలో మేరీకోం, సరితా దేవి, ఆర్ఎల్ జెన్నీ, కేసీ లేఖ విజేతలుగా ఉన్నారు.
9. భారత్ ఏ దేశం నుంచి చిరుతలను తెచ్చుకోనుంది? (1)
1) దక్షిణాఫ్రికా 2) నమీబియా
3) నైజీరియా 4) లిబియా
వివరణ: దక్షిణాఫ్రికా నుంచి భారత్ 12 చిరుతలను తెచ్చుకోనుంది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య జనవరి 27న అవగాహన ఒప్పందం కుదిరింది. రానున్న ఎనిమిది నుంచి పది సంవత్సరాల్లో ఏటా చిరుతలను తెచ్చుకోవాలని కూడా ఇరు పక్షాలు చర్చలు జరిపాయి. 50 చిరుతలను దేశంలోని వేర్వేరు జాతీయ పార్కుల్లో వదిలిపెడతారు. నిజానికి భారత్‌లో ఈ జంతువులు 1947లో అంతరించాయి. అయితే అధికారికంగా 1952లో ప్రకటించారు. 2022 సెప్టెంబర్ 17న ఎనిమిది చిరుతలను నమీబియా దేశం నుంచి తీసుకొచ్చారు.
10. ఏ అంశానికి సంబంధించి భారత్ ఇటీవల పాకిస్థాన్‌కు నోటీస్ ఇచ్చింది? (2)
1) పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎన్నికల నిర్వహణ
2) సింధూ నదీ జలాల ఒప్పంద సమీక్ష
3) సీమాంతర ఉగ్రవాదం
4) పైవేవీ కాదు
వివరణ: ఆరు దశాబ్దాల కిందట కుదిరిన సింధూ నదీ జలాల ఒప్పందానికి సంబంధించి సమీక్షను కోరుతూ పాకిస్థాన్‌కు భారత్ నోటీస్ ఇచ్చింది. 1960 సెప్టెంబర్ 19న ఈ ఒప్పందం కుదిరింది. ప్రపంచ బ్యాంక్ దీనికి మధ్యవర్తిగా వ్యవహరించింది. ఇటీవల ఆ బ్యాంక్ ఈ ఒప్పందానికి సంబంధించి మైఖేల్ లినో అనే వ్యక్తిని కూడా మధ్యవర్తిగా నియమించింది. దీనిపై సంతకం చేసిన భారత ప్రధాని నెహ్రూ, పాకిస్థాన్ అధ్యక్షుడు మహ్మద్ అయూబ్ ఖాన్. దీని ప్రకారం సట్లెజ్, బియాస్, రావి నదుల నీటిని భారత్‌కు కేటాయించారు. సింధూ, జీలం, చీనాబ్ నదుల నీటిని పాకిస్థాన్‌కు ఇస్తారు.
11. ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అబ్దెల్ ఫతా ఎల్-సిసి హాజరయ్యారు. ఆయన ఏ దేశానికి చెందినవారు? (2)
1) గయానా 2) ఈజిప్ట్
3) క్యూబా 4) గ్రీక్
వివరణ: ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు ఈజిప్ట్‌కు చెందిన అబ్దెల్ ఫతా ఎల్-సిసి హాజరయ్యారు. జనవరి 24 నుంచి 26 వరకు అధికారికంగా భారత్‌లో పర్యటించారు. ప్రసార భారతితో ఒప్పందం కూడా కుదిరింది. ఆ దేశానికి చెందిన ప్రభుత్వాధినేత భారత్‌లో జరిగే గణతంత్ర వేడుకలకు హాజరు కావడం ఇదే తొలిసారి. గతేడాది ఆగస్ట్ 18 నాటికి భారత్, ఈజిప్ట్‌ల మధ్య 75 సంవత్సరాల దౌత్య సంబంధాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆ దేశం ఒక స్మారక నాణేన్ని కూడా విడుదల చేసింది.
12. ‘అమృత్ ఉదయన్’ ఏ నగరంలో ఉంది? (3)
1) హైదరాబాద్ 2) ముంబై
3) ఢిల్లీ 4) అమృత్ సర్
వివరణ: ఢిల్లీలో రాష్ట్రపతి భవనంలో ఉన్న మొఘల్ గార్డెన్స్ పేరును ఇటీవల కేంద్ర ప్రభుత్వం మార్చింది. దీనికి అమృత్ ఉదయన్ అని పేరు పెట్టింది. భారత్ స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తుంది. అందులో భాగంగా పేరు మార్పు నిర్ణయాన్ని ప్రకటించారు. ఇటీవల రాజ్‌పథ్ పేరును కర్తవ్య పథ్‌గా, ఉత్తరప్రదేశ్‌లోని ముందేరా పేరును చౌరాచౌరీగా, దౌలతాబాద్ కోట పేరును దేవగిరి కోటగా మార్చారు.
13. ఏ దేశంలో ఒడెసా అనే నగరం ఉంది? (1)
1) ఉక్రెయిన్ 2) రష్యా
3) అజర్బైజాన్ 4) అర్మేనియా
వివరణ: ఒడెసా అనే నగరం ఉక్రెయిన్‌లో ఉంది. ఇదో చరిత్రాత్మక నగరం. ఇటీవల దీన్ని యునెస్కో సాంస్కృతిక అంశాల జాబితాలో చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రమాదంలో ఉన్న సాంస్కృతిక ప్రదేశాల జాబితాలో కూడా చేర్చారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ నగరానికి ఎలాంటి నష్టం వాటిల్లరాదని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
14. టీ+1 సెటిల్మెంట్ దేనికి సంబంధించింది? (1)
1) స్టాక్ మార్కెట్
2) అంతరిక్ష పరిశోధన
3) డిజిటల్ ఏర్పాటు
4) జన్యు శాస్త్ర పరిశోధన
వివరణ: టీ+1 స్టాక్ మార్కెట్‌కు సంబంధించింది. ఈ ఏడాది జనవరి 27 నుంచి సెబీ దీన్ని అందుబాటులోకి తెచ్చింది. టీ+1 పూర్తి రూపం ట్రేడ్ +1. ఈ తరహా విధానానికి వచ్చిన ప్రపంచ రెండో దేశం భారత్. తొలి దేశం చైనా. షేర్లు అమ్మినా, కొన్నా, 24 గంటల్లో ప్రక్రియ పూర్తి కావడమే దీని ప్రత్యేకత. అంటే షేర్లు కొన్న వ్యక్తికి కొన్న సమయం నుంచి 24 గంటల్లో వాటిని అప్పగించాలి. అలాగే అమ్మిన వ్యక్తికి 24 గంటల్లో డబ్బు సమకూర్చాలి. అయితే విదేశీ మదుపర్లు ఈ విధానం పట్ల అభ్యంతరం చెబుతున్నారు. సమయాల్లో తేడా, విదేశీ మారక నిల్వలు తదితర సమస్యలను వాళ్లు ప్రస్తావిస్తున్నారు.
15. ఇండియా-యూకే అచీవర్స్ ఆనర్స్ ఇచ్చే జీవన సాఫల్య పురస్కారం ఎవరికి ఇచ్చారు? (3)
1) సునీల్ లాంబ
2) ముకుంద్ నరవణె
3) మన్మోహన్ సింగ్ 4) శశిథరూర్
వివరణ: మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు జీవన సాఫల్య పురస్కారం లభించింది. లండన్‌కు చెందిన ఇండియా-యూకే అచీవర్స్ ఆనర్స్ అనే సంస్థ ఈ అవార్డును ప్రకటించింది. ఆర్థిక, రాజకీయ రంగాలకు ఆయన చేసిన కృషికి ఈ అవార్డు దక్కింది. భారత్ క్లిష్ట ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో భారత ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వహించిన మన్మోహన్ సింగ్, భారత ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు తీసుకొచ్చారు. సంస్కరణల పథంలో నడిపించారు. యూపీఏ 2004లో విజయం సాధించాక, ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించారు. పది సంవత్సరాల పాటు ప్రధానిగా సేవలు అందించారు. ఆర్థిక శాఖమంత్రి కాక ముందు ఆర్బీఐ గవర్నర్‌గా కూడా మన్మోహన్ సింగ్ పనిచేశారు.
వి. రాజేంద్ర శర్మ ఫ్యాకల్టీ: 9849212411
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు