జీవిత బీమా.. నష్ట భయానికి రక్షణ
బీమా- నిర్వచనం-పరిణామ క్రమం- భావనలు – సూత్రాలు
బీమా అనేది ఒక ఆర్థిక కార్యకలాపం, వ్యాపారం
ఆధునిక ఆర్థిక వ్యవస్థలో సేవా రంగంలో బీమా వ్యవస్థ ఒక ప్రధాన భాగం.
బీమా(ఇన్సూరెన్స్) ఒక సాంఘిక భద్రత సౌకర్యం.
బీమా నష్టభయాన్ని తగ్గించడానికి/ తొలగించడానికి ఉపకరించే ఒక సాధనం.
బీమా అనేది ‘Good Faith – Hide Nothing అనే సూత్రంపై పని చేస్తుంది.
బీమా అనేది బీమా పథకాల ద్వారా నిర్వహించబడుతుంది.
బీమా వ్యాపారం పొదుపు, పెట్టుబడులను ప్రోత్సహిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. అందుకే ఆధునిక ఆర్థికవ్యవస్థలో ఆర్థికాభివృద్ధిలో ప్రముఖపాత్ర నిర్వహిస్తుంది.
బీమా సౌకర్యం కల్పించుటకు బీమా సంస్థలు ఉంటాయి.
వీటిని Insurer/ Assurer అంటారు.
బీమా కల్పించిన వ్యక్తిని / ఆస్తిని Insured/ Assured అంటారు.
మానవ జీవితంలో కొన్ని విపత్తులు సంభవించినప్పుడు వ్యక్తికి ఆరోగ్య నష్టం గాని, ప్రాణ నష్టం గాని, ఆస్తి నష్టంగాని జరగవచ్చు. ఇలాంటి నష్ట భయానికి రక్షణ కల్పించేది బీమా.
ఖాతాదారులు, తమకు కలిగిన నష్టాల నుంచి లేదా ప్రమాదాల నుంచి ఆర్థికంగా రక్షణ పొందేందుకు ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని బీమా అంటారు.
నష్టభయాన్ని తగ్గించే చర్య / తొలగించే చర్య లేదా బదిలీ చేసే చర్యను బీమా అంటారు.
కొంతమంది వ్యక్తులు నష్ట భయం భరించే సంసిద్ధత కలిగి ఉండవచ్చు. వారిని నష్టభయ ప్రియులు అంటారు.
కొంతమంది వ్యక్తులు నష్టభయాన్ని తప్పించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు. వారిని నష్టభయ తిరస్కారులు అంటారు.
కొంతమంది నష్టభయానికి తటస్థంగా ఉంటారు. వీరిని నష్ట భయస్థులు అంటారు. వీరు పరిస్థితులకు అనుకూలంగా ఉండే నష్టభయాన్ని ఎదుర్కోవడానికి ప్రాధాన్యం ఇస్తారు.
ప్రాచీన కాలంలో బీమా ఆచరణలో ఉండేది
మొదటి బీమా ఒప్పందం 1347లో ఐరోపాలో అంకురార్పణ జరిగింది.
ఐరోపాలో ప్రధాన వ్యాపారం నౌకాయానం
నౌకాయాన వ్యాపారం చేసే ఐరోపా దేశాలు బీమా ఒప్పందం ద్వారా నౌకాయాన బీమా చేసుకోవడం జరిగింది.
ప్రపంచంలో మొదట ‘లాయిడ్స్ బీమా కంపెనీ’ 1688లో ఏర్పడింది. అంటే 18వ శతాబ్దంలో ఐరోపాలో బీమాను ప్రవేశ పెట్టింది లాయిడ్స్ బీమా కంపెనీయే.
18వ శతాబ్దంలో భారతదేశంలో రుగ్వేదంలో ఉపయోగించిన యోగక్షేమ అనే పదం వల్ల భారతదేశంలో కూడా బీమా అనే భావన ప్రచారంలో ఉందని బావించవచ్చు.
క్రీ.పూ. 1000 సంవత్సరంలో ఆర్యులు బీమా అనుసరించినట్లు నమ్మకం
ప్రాచీన కాలంలో మనుస్మృతిలో బీమా ప్రస్తావన ఉంది.
యాజ్ఞవల్క్యుడి ధర్మశాస్త్రంలోను, కౌటిల్యుడి అర్థశాస్రంలోను దీని గురించి ప్రస్తావన ఉంది. అంటే ద్రవ్య వనరులను సమీకరించి అగ్ని ప్రమాదం, వరదలు, అంటువ్యాధుల వ్యాప్తి, కరువు సమయాల్లో పంచి పెట్టడం గురించి ఈ గ్రంథాల్లో రాసి ఉంది. అంటే ఆధునిక బీమాకు ఇది పూర్వ భావన అయి ఉంటుంది.
ఐరోపా దేశీయులు భారతదేశంలో మొదటి ఆధునిక జీవిత బీమా సంస్థను 1818లో కలకత్తాలో ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పేరుతో స్థాపించారు. అయితే ఈ సంస్థ 1834లో విఫలమైంది. ఎందుకంటే ఇది ఐరోపా దేశస్థుల జీవితాలకు మాత్రమే బీమా చేసేది.
1870లో బాంబే మ్యూచువల్ ఇన్సూరెన్స్ సొసైటీ మొదటి భారతీయ జీవితబీమా సంస్థను నెలకొల్పింది.
1870లో మొదటి బీమా సంస్థను నెలకొల్పారు.
1871లో బాంబే మ్యూచువల్స్, 1874లో ఓరియంటల్, 1897లో ఎంపైర్ ఆఫ్ ఇండియా సంస్థలు స్థాపించారు. అయితే ఆల్బర్ట్ లైఫ్ ఇన్సూరెన్స్, రాయల్ లైఫ్ ఇన్సూరెన్స్, లివర్‌పూల్ అండ్ లండన్ గ్లోబల్ ఇన్సూరెన్స్ అనే విదేశీ సంస్థలు మనదేశ బీమా వ్యాపారం, సంస్థలపై ఆధిపత్యం వహించాయి.
1896లో కొంతమంది జాతీయ వాదులు బారల్ ఇన్సూరెన్స్ కంపెనీని స్థాపించారు.
1905-07 మధ్య స్వదేశీ ఉద్యమ స్పూర్తితో దేశంలోని వివిధ ప్రాంతాల్లో బీమా సంస్థలను స్థాపించారు.
ఉదా: 1906లో మద్రాస్‌లో యునైటెడ్ ఇండియా 1907లో కలకత్తాలో హిందుస్థాన్ కో ఆపరేటివ్ కంపెనీని
ప్రారంభించారు.
అయితే వీటిలో అనేక లోపాలు ఉండటం, వీటిపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం మొదలైన కారణాల వల్ల అంత ప్రాచుర్యం పొందలేదు.
భారతదేశంలో బీమా వ్యాపారాన్ని క్రమ బద్ధం చేయాలనే లక్ష్యంతో 1912లో భారత ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ చట్టాన్ని ప్రవేశ పెట్టింది.
1912 చట్టంలో కొన్ని లోపాలు ఉండటం వల్ల ఈ చట్టం స్థానంలో సమగ్ర లైఫ్ ఇన్సూరెన్స్ చట్టాన్ని 1938లో ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.
1956 జనవరి 19న దేశంలో పనిచేస్తున్న జీవిత బీమా కంపెనీలన్నింటినీ ప్రభుత్వ యాజమాన్యం కిందికి తెస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేసింది.
1956 జూన్19న పార్లమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చట్టాన్ని ఆమోదించింది.
1956 సెప్టెంబర్ 1 నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎల్ఐసీ) ఒక ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థగా పనిచేయడం ప్రారంభించింది.
భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)ను 1956 సెప్టెంబర్ 1న రూ. 5 కోట్ల మూల ధనంతో స్థాపించారు.
జీవిత బీమా సంస్థ 154 భారతీయ, 16 భారతీయేతర బీమా సంస్థలతోపాటు 75 ప్రావిడెంట్ సొసైటీలను కలిపి మొత్తం 245 బీమా సంస్థలను స్వాధీనం చేసుకొని విలీనం చేసి ఎల్ఐసీని ఏర్పాటు చేశారు.
ఎల్ఐసీ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఎల్ఐసీకి 1956లో కార్పొరేటు కార్యాలయం కాకుండా 5 జోనల్ కార్యాలయాలు 33 డివిజనల్ కార్యాలయాలు 212 బ్రాంచ్ కార్యాలయాలు ఉన్నాయి.
ఎల్ఐసీ 1956 నుంచి ఇప్పటి వరకు అంటే 2022 వరకు అనేక మైలురాళ్లను దాటింది, జీవిత బీమా వ్యాపారంలోని వివిధ అంశాలలో అపూర్వమైన పనితీరు రికార్డులను నెలకొల్పింది.
ఎల్ఐసీ ప్రస్తుతం అంటే 2022 మార్చి 31 నాటికి 8 జోనల్ కార్యాలయాలు అవి ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, హైదరా బాద్, కాన్పూర్, భోపాల్, పాట్నా 113 డివిజనల్ కార్యాలయాలు, 2048 బ్రాంచ్ కార్యాలయాలు, 1564 శాటిలైట్ కార్యాలయాలు 1170 మినీ కార్యాలయాలు ఉన్నాయి.
ఎల్ఐసీ జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా బీమా మార్కెట్లోకి ప్రవేశించి ఇంగ్లండ్, మారిషస్, ఫిజీలలో కూడా కార్యాలయాలను ప్రారంభించింది.
1956లో కేవలం జీవితబీమా సంస్థ మాత్రమే కాకుండా 1972లో జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ చట్టం ఆమోదించి 1973 జనవరి 1న జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నెలకొల్పడం జరిగింది.
ఇద్దరు వ్యక్తుల మధ్య కుదుర్చుకున్న న్యాయపరమైన ఒప్పందం బీమా.
ఇద్దరిలో ఒకరు బీమా చేయించిన వారు (Insurer), మరొకరు బీమా చేసిన వారు (Insured / Assured).
బీమా చేయించిన సంస్థకు బీమా
చేయించుకున్న వ్యక్తికి మధ్య ఒప్పందం బీమా.
ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా ఒక వ్యక్తికి, సంస్థకు మధ్య ఒప్పందం కలిగిన పత్రాన్ని బీమా ఒప్పందం అంటారు.
బీమాలో రెండు అంశాలు ఉన్నాయి. అవి బీమా చేయించుకున్న వ్యక్తి దృక్పథం
మరణం, ప్రమాదం, దొంగతనం, అగ్ని ప్రమాదం మొదలైన పరిస్థితుల వల్ల కలిగే ద్రవ్య నష్టం నుంచి పాలసీదారుడికి లేదా పాలసీదారుడి మీద ఆధారపడి ఉన్నవారికి రక్షణ కల్పించడం జరుగుతుంది.
బీమా సంస్థ దృక్పథం
బీమా పాలసీ కొన్ని సందర్భల్లో దానిలో సూచించిన సంఘటన జరగనట్లయితే పాలసీదారుడి నుంచి కొద్ది ప్రీమియం మాత్రమే వసూలు చేసినప్పటికీ అంతకంటే ఎన్నోరెట్లు ఎక్కువ అయిన హామీ మొత్తాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది.
1. నష్టపరిహార సూత్రం
బీమా నష్టాన్ని మాత్రమే పరిహరిస్తుంది. అంటే పాలసీదారుడు బీమా చేసిన నష్టాన్ని పొందితే నష్టానికి సమానమైన మొత్తం మాత్రమే అతనికి చెల్లిస్తుంది.
2. మంచినమ్మకం/ నమ్మకం సూత్రం
బీమాదారుడుగాని, బీమా సంస్థగాని ఒకరినొకరు సరైన సంపూర్ణమైన సమాచారం ఇచ్చి పుచ్చుకోవాలి అంటే ఒప్పందం అనేది అత్యంత విశ్వాసంపైన జరగాలి అని అర్థం.
3. ప్రత్యామ్నాయ రుణదాత సిద్ధాంతం
ఈ సిద్ధాంతం ప్రకారం పాలసీదారుడికి చెల్లించిన నష్టపరిహారాన్ని లేదా బీమా మొత్తాన్ని నష్టానికి కారణమైన నిర్లక్ష్యం చూపిన మూడో వ్యక్తి నుంచి వసూలు చేసుకునే అధికారం బీమా సంస్థ కలిగి ఉంటుంది.
4. ప్రత్యక్ష వ్యాజ్యం సూత్రం
బీమాదారుడు నష్టాన్ని ప్రత్యక్షంగా అనుభవించి ఉండాలి. అలాంటి నష్టం బీమా చేసి ఉండాలి.
5. బీమా చేయదగిన ప్రయోజన సూత్రం
l ఒక వ్యక్తి తన ప్రాణాన్నిగాని, ఆస్తిని గాని పోగొట్టుకొన్నప్పుడు అతని ఆర్థిక పరిస్థితి మారుతుంది. కాబట్టి అతనికి తన ప్రాణం వల్లగాని, ఆస్తివల్లగాని ప్రయోజనం ఉంది అని చెప్పవచ్చు.
ప్రాక్టీస్ బిట్స్
1. బీమా ఏ రంగంలో భాగం
ఎ) వ్యవసాయ రంగం
బి) పారిశ్రామిక రంగం
సి) సేవా రంగం డి) పైవన్నీ
2. బీమా అనేది?
ఎ) ఆర్థిక కార్యకలాపం
బి) వ్యాపారం
సి) సామాజిక భద్రత సౌకర్యం
డి) పైవన్నీ
3. బీమా అంటే ?
ఎ) నష్టభయాన్ని తగ్గించే చర్య
బి) నష్టభయాన్ని తొలగించే చర్య
సి) నష్టభయాన్ని బదిలీ చేసే చర్య
డి) పైవన్నీ
4. బీమాకు అంకురార్పణ ఎక్కడ జరిగింది?
ఎ) ఆసియా దేశాలు బి) ఐరోపా దేశాలు
సి) ఆస్ట్రియా దేశాలు
డి) మధ్య ఆసియా దేశాలు
5. ప్రపంచంలో మొదట బీమాను ప్రవేశపెట్టిన కంపెనీ ఏది?
ఎ) లాయిడ్స్ బీమా కంపెనీ
బి) ఐలాండ్ బీమా కంపెనీ
సి) ఓరియంటల్ బీమా కంపెనీ
డి) యునైటెడ్ బీమా కంపెనీ
6. 1818లో కలకత్తాలో ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని స్థాపించినది?
ఎ) భారతీయులు బి) ఐరోపా దేశస్థులు
సి) ఆస్ట్రేలియన్లు డి) అమెరికన్లు
7. బీమా అనేది ఏ సూత్రంపై పనిచేస్తుంది?
ఎ) Good Faith – Hide Nothing
బి) Good Faith – Hide Thing
సి) Good Thing – Hide Thing
డి) Good Faith – Hide Faith
8. భారత జీవిత బీమా సంస్థ ఎప్పుడు ప్రారంభమైంది.
ఎ) 1956 జనవరి 19
బి) 1956 జూన్ 19
సి) 1956 సెప్టెంబర్ 1
డి) 1956 అక్టోబర్ 2
9. ఎల్ఐసీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) న్యూఢిల్లీ బి) ముంబై
సి) కోల్‌కతా డి) చెన్నై
10. ఎల్ఐసీకి మొదట, ప్రస్తుతం ఎన్ని జోనల్ కార్యాలయాలు ఉన్నాయి?
ఎ) మొదట 5 ప్రస్తుతం 8
బి) మొదట 5 ప్రస్తుతం 12
సి) మొదట 2 ప్రస్తుతం 6
డి) మొదట 6 ప్రస్తుతం 16
11. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1972 జనవరి 1
బి) 1973 జనవరి 1
సి) 1974 జనవరి 1 డి) 1975 జనవరి 1
12. బీమా భావనకు సంబంధించి రుగ్వేదంలో ఉపయోగించిన పదం ఏది?
ఎ) వ్యక్తి క్షేమ బి) ఆస్తి క్షేమ
సి) యోగ క్షేమ డి) సమాజ క్షేమ
సమాధానాలు
1-సి 2-డి 3-డి 4-బి
5-ఎ 6-బి 7-ఎ 8-సి
9-బి 10-ఎ 11-బి 12-సి
రచయిత
పానుగంటి కేశవ రెడ్డి , వైష్ణవి పబ్లికేషన్స్ ,గోదావరిఖని 9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు