డోని పోలో విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది?
1. ఐసీఏఆర్-షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్కు డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు? (3)
1) నలతంబి తలైసెల్వి 2) టెస్సీ థామస్
3) హేమ ప్రభ 4) రేణు సింగ్
వివరణ: ఐసీఏఆర్-షుగర్‌కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్కు మహిళా డైరెక్టర్‌గా హేమప్రభ నియమితులయ్యారు. ఈ సంస్థకు నేతృత్వం వహించనున్న తొలి మహిళ ఆమె. 2024 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ సంస్థను 111 సంవత్సరాల కిందట స్థాపించారు. చెరకుకు సంబంధించి హేమ ప్రభ ఎన్నో పరిశోధనలు చేశారు. 34 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్లో ఆమె 27 రకాలను అభివృద్ధి చేశారు. నలతంబి తలైసెల్వి ప్రస్తుతం సీఎస్ఐఆర్కు నేతృత్వం వహిస్తున్నారు. దీనికి నేతృత్వం వహిస్తున్న తొలి మహిళ కూడా ఆమెనే. భారత క్షిపణి మహిళగా పేరున్న వ్యక్తి టెస్సీ థామస్. రేణు సింగ్ ప్రస్తుతం ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్కు నేతృత్వం వహిస్తున్నారు.
2. ఏ నగరంలో జాతీయ గిరిజన మూడో నృత్యోత్సవాన్ని నిర్వహించారు? (2)
1) జంషెడ్పూర్ 2) రాయ్‌పూర్
3) మండ్ల 4) రాంచీ
వివరణ: జాతీయ గిరిజన మూడో నృత్యోత్సవాన్ని ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో నిర్వహించారు. నవంబర్ 1 నుంచి 3 వరకు ఇది కొనసాగింది. అలాగే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడి, ఈ ఏడాది నవంబర్ 1 నాటికి 23 సంవత్సరాలు పూర్తయ్యింది. దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి గిరిజనులు ఈ నృత్యోత్సవంలో పాల్గొన్నారు. అలాగే మంగోలియా, టోంగో, రష్యా, ఇండోనేషియా, మాల్దీవులు, మొజాంబిక్ దేశాల్లోని గిరిజనులు సైతం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దాదాపు 1500 మంది గిరిజన కళాకారులు నృత్యప్రదర్శన నిర్వహించారు. వివిధ విభాగాల్లో మొత్తం రూ.20 లక్షల విలువైన బహుమతులను కూడా అందించారు.
3. మవ్లు గుహ ఏ రాష్ట్రంలో ఉంది? (3)
1) సిక్కిం 2) హిమాచల్ ప్రదేశ్
3) మేఘాలయ 4) అరుణాచల్ ప్రదేశ్
వివరణ: మేఘాలయ రాష్ట్రంలో తూర్పు ఖాసి కొండల్లో మవ్లు గుహ ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఇది ఇటీవల గుర్తింపు పొందింది. యునెస్కోలో శాస్త్ర విభాగంగా ఉన్న ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ జియోలాజికల్ సైన్సెస్ ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక వారసత్వ ప్రదేశాలను గుర్తించింది. వివిధ దేశాల్లో 100 ప్రదేశాలను ఇందుకు ఎంచుకుంది. భారత్ నుంచి ఇందులో స్థానం పొందిన ఏకైక ప్రదేశమే మవ్లు గుహ. భారత ఉపఖండంలో ఇది నాలుగో పొడవైనది. 7.2 కిలోమీటర్లు ఉంటుంది.
4. ఉత్తర భారతదేశంలో తొలి డేటా సెంటర్‌ను
ఏ నగరంలో ప్రారంభించారు? (1)
1) గ్రేటర్ నోయిడా 2) ఇండోర్
3) ఢిల్లీ 4) గురుగ్రామ్
వివరణ: ఉత్తర భారతదేశంలోనే తొలి డేటా సెంటర్ ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఏర్పాటు చేశారు. ఇందుకు ఆ రాష్ట్రం రూ.5000 కోట్లు వెచ్చించింది. 30,000 చదరపు అడుగుల్లో అది విస్తరించింది. రానున్న అయిదేళ్లలో రూ.39,000 కోట్ల వ్యయానికి రాష్ట్ర ప్రభుత్వానికి, హిరన్డాన్ గ్రూప్‌నకు మధ్య అవగాహన ఒప్పందం కూడా కుదిరింది. దేశంలో డేటాను స్టోరేజ్ చేసే సామర్థ్యం ఈ కేంద్రం వల్ల పెరుగుతుంది. భారత్‌లో 1.5 బిలియన్ మొబైల్ ఫోన్లు, 650 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదార్లు ఉన్నారు. దీనికి సంబంధించి కేవలం 20% మాత్రమే డేటాను స్టోర్ చేయగలుగుతున్నారు. మిగతా దాని కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తుంది. ఈ సమస్యను అధిగమించేందుకు నోయిడాలో కొత్తగా డేటా కేంద్రాన్ని నిర్మిస్తున్నారు.
5. ఏ దేశానికి లులా డ సిల్వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? (2)
1) అర్జెంటీనా 2) బ్రెజిల్
3) చిలీ 4) పరాగ్వే
వివరణ: బ్రెజిల్ కొత్త అధ్యక్షుడిగా లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వ ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ఆ దేశానికి జెయిర్ బోల్సోనోరో అధ్యక్షుడిగా వ్యవహరించారు. లులా డ సిల్వకు కేవలం 1.8% ఓట్లు అధికంగా దక్కాయి. బ్రెజిల్ అధ్యక్ష తరహా ప్రజాస్వామ్య దేశం. రాజ్యధినేతగా, ప్రభుత్వాధినేతగా అధ్యక్షుడే వ్యవహరిస్తారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో లులా డ సిల్వా సంవత్సరం జైలు జీవితం గడిపారు. తనపై జరిగిన కుట్రగా మొత్తం అంశాన్ని ప్రజల ముందు పెట్టి వారిని ఒప్పించడంతో ఎన్నికల్లో విజేతగా నిలిచారు.
6. డోని పోలో విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? (3)
1) నాగాలాండ్ 2) మిజోరం
3) అరుణాచల్ ప్రదేశ్ 4) మణిపూర్
వివరణ: అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఈటానగర్‌లో హోల్లోంగి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్. దీని పేరును డోని పోలో విమానాశ్రయంగా మారుస్తూ ఇటీవల కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో సూర్య చంద్రులను డోని, పోలో అనే పదాలతో సూచిస్తారు. ఈ విమానాశ్రాయాన్ని రూ.646 కోట్ల వ్యయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
7. ఇలా రమేశ్ భట్ ఏ రంగంతో ముడిపడి ఉన్నారు? (2)
1) పర్యావరణం 2) మహిళల హక్కులు
3) శాస్త్ర-సాంకేతిక అంశాలు 4) క్రీడలు
వివరణ: ఇలా రమేశ్ భట్, మహిళా హక్కుల కార్యకర్త. ఎస్ఈడబ్ల్యూఏ (సేవ) వ్యవస్థాపకురాలు. సేవ పూర్తి రూపం- సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్. ఈ సంస్థ ద్వారా లక్షలమంది మహిళల జీవన గమ్యాన్ని నిర్దేశించారు. సూక్ష్మ రుణాలను ఇవ్వడం ద్వారా వారికి జీవనోపాధి కల్పించారు. 1972లో ఈ సంస్థను స్థాపించారు. మహిళల కోసం పనిచేస్తున్న పెద్ద సహకార వ్యవస్థల్లో ఇది కూడా ఒకటి. 18 రాష్ర్టాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు విస్తరించి ఉన్నాయి. అలాగే మహాత్మాగాంధీ, అనసూయా బాయి స్థాపించిన మజూర్ మహాజన్ సంఘ్‌లోని మహిళా విభాగానికి ఆమె నేతృత్వం వహించారు. నవంబర్ 2న ఆమె మరణించారు. పద్మభూషణ్, రామన్ మెగసెసె అవార్డ్‌లతో పాటు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ప్రైజ్ కూడా పొందారు.
8. విద్యా రంగంపై ఇటీవల యునెస్కో ఇచ్చిన నివేదిక ప్రకారం భారత్‌లో..? (1)
1) ప్రైవేట్ విద్యారంగం విస్తరిస్తుంది
2) ప్రభుత్వ విద్యారంగం విస్తరిస్తుంది
3) ప్రభుత్వ రంగంలో ఎక్కువ పాఠశాలలు ఉన్నాయి 4) ఏదీకాదు
వివరణ: గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్-2022ను యునెస్కో విడుదల చేసింది. గడిచిన 30 సంవత్సరాల్లో దక్షిణాసియా విద్యావ్యవస్థ ఎన్నో మార్పులకు గురైందని నివేదిక పేర్కొంది. అలాగే గడిచిన ఎనిమిది సంవత్సరాల్లో భారత్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన 10 పాఠశాలల్లో ఏడు ప్రైవేట్‌వే అని వెల్లడించింది. అలాగే భారత్‌లో మూడో వంతు మంది ప్రైవేట్ విద్యావ్యవస్థలోనే ఉన్నారని చెప్పింది. 2014 నుంచి భారత్‌లో మొత్తం 97,000 పాఠశాలలు ఏర్పాటు చేయగా అందులో 67,000 ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసినవే. అలాగే 2020లో సుమారుగా 29,600 గుర్తింపు లేని పాఠశాలల్లో 3.8 మిలియన్ల మంది చిన్నారులు చదువుతున్నారు. అలాగే ట్యూషన్ వ్యవస్థ కూడా భారత్‌లో బాగా బలపడుతుందని నివేదిక వెల్లడించింది. పాఠశాలల్లో నాణ్యమైన చదువు లేకపోవడంతో 61 శాతం మంది ట్యూషన్లకు వెళ్తున్నట్లు పేర్కొన్నారని నివేదిక ఉటంకించింది.
9. యూఎన్ఆర్డబ్ల్యూఏ ప్రధాన కేంద్రం
ఎక్కడ ఉంది? (3)
1) న్యూయార్క్ 2) వాషింగ్టన్
3) అమ్మాన్ 4) జెరూసలేం
వివరణ: ‘యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీన్ రెఫ్యూజీస్’కు సంక్షిప్త రూపమే యూఎన్ఆర్డబ్ల్యూఏ. దీని ప్రధాన కేంద్రం జోర్డాన్‌లోని అమ్మాన్లో ఉంది. 2022-23 సంవత్సరానికి ఈ సంస్థకు భారత్ 2.5 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందించింది. 2018 నుంచి ఈ సంస్థకు భారత్ నుంచి 20 మిలియన్ డాలర్ల సాయం అందింది. పాలస్తీనాలోని శరణార్థులను ఆదుకోవడం కోసం దీన్ని 1949లో ఏర్పాటు చేశారు. ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ ఈ సంస్థను ఏర్పాటు చేసింది. జోర్డాన్, లెబనాన్, సిరియా, గాజా స్ట్రిప్, తూర్పు జెరూసలేంలలో ఇది శరణార్థులకు తన సేవలను అందిస్తుంది.
10. ఏ రోజును జోజిలా డే గా నిర్వహిస్తారు? (4)
1) నవంబర్ 4 2) నవంబర్ 3
3) నవంబర్ 2 4) నవంబర్ 1
వివరణ: ఏటా నవంబర్ 1ని జోజిలా రోజుగా నిర్వహిస్తారు. జోజిలా అనేది ఒక కనుమ. ఇది కశ్మీర్ లోయను, లడఖ్‌లోని సింధులోయతో కలుపుతుంది. 434 కిలోమీటర్ల శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారి దీనిగుండా వెళుతుంది. 1948లో పాకిస్థాన్ దీన్ని ఆక్రమించుకుంది. ఆపరేషన్ బైసన్ పేరుతో నవంబర్ 1న తిరిగి దీన్ని భారత్ స్వాధీనం చేసుకుంది. ఈ విజయానికి గుర్తుగా జోజిలా డేగా ప్రతి నవంబర్ 1న నిర్వహిస్తారు. ఈ కనుమ 3528 మీటర్ల ఎత్తులో ఉంటుంది. శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై ఇది రెండో అత్యంత ఎత్తులో ఉంటుంది. ప్రథమ స్థానంలో ఉన్నది ఫోతు లా. సాధారణంగా చలికాలంలో ఈ కనుమను మూసివేస్తారు.
11. భారత్‌లో ప్రస్తుతం ఆదాయపు పన్ను రిటర్న్ ఫామ్‌లు ఎన్ని రకాలు ఉన్నాయి? (4)
1) 4 2) 5 3) 6 4) 7
వివరణ: భారత్‌లో ప్రస్తుతం ఏడు రకాల ఐటీఆర్ (ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్) ఫామ్‌లు ఉన్నాయి. ఇవి అన్ని పన్ను చెల్లింపుదారులకు సంబంధించినవి. ఒక దేశం.. ఒక ఐటీఆర్ ఫామ్‌ను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ ప్రతిపాదించింది. లాభాపేక్షలేని సంస్థలు, ట్రస్ట్‌లు మినహా అందరికీ ఒకే తరహా ఉండాలన్నది తాజా ప్రతిపాదన. ప్రస్తుతం ఐటీఆర్-1 సహజ్- ఇది చిన్న, మధ్య తరహా పన్ను చెల్లింపుదారులకు సంబంధించింది. రూ.50 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వారికి సంబంధించింది. ఐటీఆర్-2 రెసిడెన్షియల్ ప్రాపర్టీకి సంబంధించింది. ఐటీఆర్-3 వ్యాపారం, వృత్తిలో లాభాలు పొందిన వారు సమర్పించేది. ఐటీఆర్-4 సుగమ్- ఇది హిందూ అవిభాజిత కుటుంబాలు, వ్యక్తులు (రూ.50 లక్షల వరకు) దాఖలు చేయాల్సింది. ఐటీఆర్-5, 6 పరిమిత లయబిలిటీ పార్ట్నర్షిప్, వ్యాపారాలకు సంబంధించినవి. ఐటీఆర్-7 ట్రస్ట్‌లు, లాభాపేక్షలేని సంస్థలు దాఖలు చేసేవి.
12. చక్కెర ఎగుమతిని ఎప్పటి వరకు నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది? (3)
1) డిసెంబర్ 31, 2022
2) 2022-23 ఆర్థిక సంవత్సరం
3) అక్టోబర్ 31, 2023
4) డిసెంబర్ 31, 2023
వివరణ: వచ్చే ఏడాది అక్టోబర్ 31 వరకు చక్కెర ఎగుమతిని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి అక్టోబర్ 31, 2022 వరకు చక్కెర ఎగుమతిని నిలిపివేస్తూ ఈ ఏడాది మే నెలలో నిర్ణయం తీసుకున్నారు. దీన్ని మరో సంవత్సరం పొడిగించారు. అమెరికా, యురోపియన్ యూనియన్లకు మాత్రం కొంత ఎగుమతిని అనుమతిస్తారు.
13. ఏ రాష్ట్రంలో సీ295 ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ యూనిట్‌ను నెలకొల్పారు? (4)
1) మహారాష్ట్ర 2) కర్ణాటక
3) ఒడిశా 4) గుజరాత్
వివరణ: సీ295 ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ యూనిట్‌ను గుజరాత్‌లోని వడోదరలో నెలకొల్పారు. దీనికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. టాటా ఎయిర్ బస్ దీన్ని ఏర్పాటు చేయనుంది. యూరప్ వెలుపల సీ295 సంస్థను ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం. అలాగే ఒక మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఒక ప్రైవేట్ సంస్థ తయారు చేయడం కూడా భారత్‌లో ఇదే ప్రథమం. సీ295 ఎయిర్‌క్రాఫ్ట్‌ను స్పెయిన్ దేశానికి చెందిన కన్స్ట్రుసినోస్ ఏరోనాటిక్స్ అనే సంస్థ ఏర్పాటు చేసింది. భారత్‌లో ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను తయారు చేసి 2026 సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి తెస్తారు. దీని గరిష్ఠ వేగం గంటకు 480 కిలోమీటర్లు ఉంటుంది.
14. ఐసీసీ నవంబర్ 2న ప్రకటించిన ర్యాంకుల్లో అగ్రస్థానంలో ఉన్న ఆటగాడు ఎవరు? (2)
1) విరాట్ కోహ్లీ
2) సూర్యకుమార్ యాదవ్
3) రోహిత్‌శర్మ 4) మహ్మద్ రిజ్వాన్
వివరణ: భారత్‌కు చెందిన సూర్యకుమార్ యాదవ్, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. 863 పాయింట్లతో అతను ఈ ఘనతను దక్కించుకున్నాడు. 862 పాయింట్లతో పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ రెండో స్థానంలో ఉన్నాడు. టీ20 ర్యాంకుల్లో విరాట్ కోహ్లీ తర్వాత అగ్రస్థానాన్ని అందుకున్న బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవే. అతను నవంబర్ 2, 2022 నాటికి 37 టీ-20 మ్యాచ్‌లు ఆడి ఒక సెంచరీ, 11 అర్ధ సెంచరీలు చేశాడు.
15. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఎవరు? (3)
1) రోహిత్ శర్మ 2) మహేల జయవర్ధనే
3) విరాట్ కోహ్లీ 4) సంగక్కర
వివరణ: టీ-20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ ఘనత సాధించాడు. నవంబర్ 2, 2022న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 16 పరుగుల వద్ద ఉండగా ఈ రికార్డ్‌ను నెలకొల్పాడు. శ్రీలంకకు చెందిన మహేల జయవర్ధనే 31 ఇన్నింగ్స్‌లలో 1016 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. కేవలం 23 ఇన్నింగ్స్‌లలో విరాట్ కోహ్లీ ఈ రికార్డ్‌ను అధిగమించాడు. విరాట్ 88.75 పరుగుల సగటును కలిగి ఉన్నాడు. 13 అర్ధ శతకాలు చేశాడు. అంతర్జాతీయ టీ-20ల్లోనూ అత్యధిక పరుగులు చేసిన ఘనత విరాట్ పేరిటే ఉంది. నవంబర్ 2, 2022 నాటికి మొత్తం 105 ఇన్నింగ్స్‌లలో 3932 పరుగులు చేశాడు. రెండో స్థానంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?