అసాధారణ విభజన.. అదుపు తప్పిన నియంత్రణ
- క్యాన్సర్ జీవశాస్త్రం
కణాలు పూర్తిగా విభేదనం చెంది నియంత్రణ, పెరుగుదల, నిర్దిష్ట ఆయు ప్రమాణాన్ని, పరస్పర కణ స్పర్శ ద్వారా నియంత్రించే చలనం వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ నియంత్రణను కోల్పోయినప్పుడు కణాలు చాలా వేగంతో అస్తవ్యస్తంగా విభజనలు చెంది కణసమూహాలను ఏర్పరుస్తాయి. ఈ కణాల సమూహాలను ‘కణతులు’ అంటారు. కణతి లేదా కంతి అంటే ఒక స్పష్టమైన విధిలేని పెరుగుదలను ప్రదర్శించే నియోప్లాజం. ఈ పెరుగుదల ఆ జీవికి మాత్రమే ప్రత్యేకతను ప్రదర్శిస్తుంది. స్వయం ప్రతిపత్తి కలిగి హాని కలిగిస్తుంది. కంతుల గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని ఆంకాలజీ అంటారు.
కంతులను వైద్య పరిభాషలో ట్యూమర్స్ అని కూడా అంటారు. వీటిలో అత్యంత హానికరమైనవి, హాని కలిగించనివి ఉంటాయి. కంతుల స్వభావం, నిర్మాణం ఆధారంగా చేసుకుని వీటిని రెండు రకాలుగా విభజించారు. అవి. మాలిగ్నెంట్ ట్యూమర్లు, బినైన్ ట్యూమర్లు.
- మాలిగ్నెంట్ కంతులు
మాలిగ్నెంట్ కంతులను క్యాన్సర్ కారక కంతులు అంటారు. వీటి నుంచి కొన్ని కణాలు విడిపోయి దేహంలో అవి ఏర్పడిన ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి చేరి ద్వితీయ కంతులను ఏర్పరుస్తాయి. ఈ ప్రక్రియను ‘మెటాస్టాటిస్’ అంటారు. మాలిగ్నెంట్ కంతులు హానికరం, ప్రాణాంతకం. - బినైన్ కంతులు
బినైన్ కంతులను క్యాన్సర్ రహిత కంతులు అంటారు. ఇవి చిన్నవిగా ఉండి ఒక తంతుయుత పొరతో కప్పబడి ఉండి స్థానికంగా ఏర్పడే కంతులు. ఇవి మెటాస్టాటిస్ను ప్రదర్శించవు. అంటే మరొక ప్రదేశానికి చేరవు. ఈ కంతులు హానిరహితం. స్వల్ప శస్త్రచికిత్స ద్వారా తొలగించవచ్చు.
మాలిగ్నెంట్ కంతుల లక్షణాలు: క్యాన్సర్ కణాల అనిశ్చితి పెరుగుదల, అపోప్టోసిన్ను అధిగమించడం పరస్పర స్పర్శా నియంత్రణను కోల్పోవడం అనేవి కొన్ని లక్షణాలు. క్యాన్సర్ కణాలకు అంతులేని వృద్ధి సంభావ్యత, అధిక మోతాదులో ‘ట్రీలోమియరేజ్’ అనే ఎంజైమ్‌ను కలిగి ఉండటం, అధిక క్యాన్సర్ కణాలు కణవిభజన రేటును, విభజన చెందే సామర్థ్యాన్ని కోల్పోవడం తక్కువ సంఖ్యలో సూక్ష్మ తంతువులు కలిగి ఉండటం వల్ల గోళాకృతిని పొందడం, అసాధారణ ప్రతిజనకాలు కలిగి ఉండటం, అసాధారణ సంఖ్యలో క్రోమోజోమ్‌లను కలిగి ఉండటం.పొదుగు కణజాలాలను ఆక్రమించడం (మెటాస్టాటిస్) అనే లక్షణాలను ప్రదర్శిస్తాయి. నిర్విరామంగా విభజన చెందే ఉపకళా కణజాలాల వంటివి తరచూ క్యాన్సర్ కణజాలాలుగా మారడానికి అవకాశం ఉంటుంది. సాధారణ కణాల మధ్య కాడ్హెరిన్ అనే ప్రొటీన్ అణువులుండి కణాలు ఒకదానితో మరొకటి అనుసంధానించబడతాయి. క్యాన్సర్ కణాల్లో ఈ కాడ్హెరిన్ పూర్తిగా లోపించడమో లేదా క్షీణించడమో జరగడం వల్ల కణాల మధ్య సంబంధాలు లోపించి అవి వదులుగా ఉన్న మాత్రికను ఏర్పరుస్తుంది. ఫలితంగా ఇవి పొరుగు కణజాలాలకు వ్యాప్తి చెందుతాయి.
క్యాన్సర్ దశలు
క్యాన్సర్‌లో మూడు దశలుంటాయి. అవి ప్రారంభ దశ, ప్రోత్సాహ దశ, వృద్ధి దశ. సాధారణ కణంలో మొదట ఉత్పరివర్తనం జరిగి ప్రారంభ దశ మొదలవుతుంది. ద్వితీయ ఉత్పరివర్తనం వల్ల ప్రోత్సాహ దశ ఏర్పడుతుంది. మూడో ఉత్పరివర్తనం వల్ల వృద్ధి దశ ప్రారంభమవుతుంది. నాలుగో ఉత్పరివర్తనం కలిగి క్యాన్సర్ సంభవిస్తుంది.
క్యాన్సర్ రకాలు
మానవుడిలో దాదాపు 200 రకాల క్యాన్సర్లను గుర్తించారు. వీటిలో కొన్ని అనువంశికతను ప్రదర్శించేవి. మరికొన్ని అనువంశిక రహిత క్యాన్సర్లు. మానవుడి దేహంలో ఉండే అనేక కణాలు క్యాన్సర్‌ను కలిగిస్తాయి. క్యాన్సర్‌ను కలుగజేసే కణాల ఆవిర్భావాన్ని ఆధారంగా చేసుకుని నాలుగు రకాలుగా వర్గీకరించారు.
కార్సినోమా: కార్సినోమా అనేది ఉపకళా కణజాలంలో ఏర్పడే మాలిగ్నెంట్ కంతులు. ఈ క్యాన్సర్ కణాలు చర్మ, శ్వాస, జీర్ణ, మూత్రజనన వ్యవస్థలోని ఉపకళా కణాల నుంచి ఏర్పడతాయి. అదేవిధంగా దేహంలోని వివిధ గ్రంథులైన క్షీరగ్రంథులు, నాడీకణజాలం నుంచి ఏర్పడతాయి. వీటి నామకరణం ఆవిర్భవించిన అవయవాల ఆధారంగా చేస్తారు. దేహంలో ఏర్పడే 85 శాతం కంతులు కార్సినోమా రకానికి చెందినవే.
ఉదా: మెదడులోని ట్యూమర్లు, చర్మ క్యాన్సర్ మొదలైనవి.
సార్కోమా: సంయోజక కణజాలంలో ఏర్పడే మాలిగ్నెంట్ కంతులను సార్కోమా అంటారు. ఈ కంతులు మధ్యస్తచం నుంచి ఏర్పడిన కణజాలం నుంచి గాని, అవయవాల నుంచి గాని ఏర్పడతాయి. కంతుల్లో సార్కోమా కేవలం 2 శాతం మాత్రమే ఉంటాయి.
ఉదా: ఆస్టియో సార్కోమా (ఎముక), కాండ్రోసార్కోమా (మృదులాస్థి)
ల్యూకేమియా: కాండ కణాల హీమోపాయిటిక్ కణజాలానికి వచ్చే మాలిగ్నెంట్ కంతులు. ఇవి ద్రవరూప కంతులు. ఇవి ఎక్కువగా ఎముక మజ్జలో ఏర్పడే తెల్ల రక్తకణాలను ప్రభావితం చేస్తాయి. దేహంలో 4 శాతం మేరకు ల్యూకేమియా కంతులు ఏర్పడతాయి.
ఉదా: మైలియోసైటిక్ ల్యూకేమియా
లింఫోమా: ద్వితీయ లింఫాయిడ్ అవయవాలైన ప్లీహం, శోషరస కణుపుల్లో ఉండే తెల్ల రక్తకణాల్లో ఏర్పడే మాలిగ్నెంట్ కంతులు. దేహంలో ఏర్పడే కంతుల్లో ఇది 4 శాతం ఉంటాయి.
ఉదా: బుర్కెట్ లింఫోమా
క్యాన్సర్‌ను కలగజేసే కారకాలు
ఆంకో జన్యువులు: అనేక జన్యువులకు క్యాన్సర్‌ను కలగజేసే శక్తి ఉంటుంది. ఆ జన్యువులను ఆంకో జన్యువులు, కంతి ప్రేరేపిత జన్యువులు లేదా ట్యూమర్ ప్రేరేపిత జన్యువులు అంటారు. ఈ జన్యువులు సాధారణ కణాన్ని క్యాన్సర్ కణంగా పరివర్తనం చెందిస్తాయి. ఈ జన్యువులు వైరస్లలో ఉండవచ్చు (వైరల్ ఆంకోజీన్స్) లేదా అతిథేయి కణాల్లో ఉండవచ్చు. (సెల్యూలార్ ఆంకోజీన్స్)
వైరల్ ఆంకో జన్యువులు: ఈ ఆంకో జన్యువులు సాధారణంగా రిట్రో వైరస్ చేత తీసుకోబడతాయి. ఇవి కంతులు ఏర్పడటాన్ని ప్రేరేపిస్తాయి. ఏవియన్ సార్కోమా వైరస్ వల్ల కోళ్లలో సార్కోమా రకపు ట్యూమర్ ఏర్పడటాన్ని పైటస్ రౌస్ కనుగొన్నాడు. అప్పటి నుంచి Ti జన్యువులను గుర్తించడం ప్రారంభించారు. ఇది వివిధ కణాలకు సంక్రమిస్తుంది. అనియంత్రిత కణవిభజనలు ప్రేరేపించి కంతులను ఏర్పరుస్తాయి.
సెల్యులార్ ఆంకో జన్యువులు: ప్రోటో ఆంకో జన్యువు ఒక సాధారణ జన్యువు. ఇది సెల్యులార్ ఆంకో జన్యువుగా మారుతుంది. ప్రోటో ఆంకో జన్యువులు ప్రొటీన్లను కోడ్ చేస్తాయి. ఈ ప్రొటిన్లు కణవృద్ధి విభేదనాలను నియంత్రిస్తాయి. ఇది చైతన్యవంతమై ఆ జన్యువు దాని ఉత్పన్నం గాని క్యాన్సర్‌ను కలుగజేస్తుంది. ఆ జన్యువు ఆంకోజీన్ అవుతుంది.
- క్యాన్సర్లు అనేక కారకాలైన కాలుష్యం, రేడియేషన్, వృత్తిపరంగా కార్సినోజెనిక్ పదార్థాలకు గురికావడం, కల్తీ ఆహారం, పొగాకు, ఆల్కహాల్, కాస్మోటిక్స్, కొన్ని రకాల ఔషధాలు, హెక్సా క్లోరోఫిల్ లాంటి రసాయనాల వల్ల వస్తాయి. డయాక్సిన్లు, బెంజోపైరీన్లు, కొన్ని భార లోహాలు, వృత్తిసంబంధ కాలుష్యాలైన ఆర్సెనిక్, బొగ్గు, తారు వంటి పదార్థాలు క్యాన్సర్‌ను కలుగజేస్తాయి. పర్యావరణ కారకాలైన X-కిరణాలు, అతినీలలోహిత కిరణాలు, రేడియో ధార్మిక కిరణాలు కూడా కార్సినోజెనిక్‌గా పనిచేస్తాయి.
- క్యాన్సర్ వ్యాధిని నయం చేసేందుకు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీతో పాటు కొందరికి సర్జరీ కూడా అవసరం కావచ్చు. బయో మార్కర్ టెస్టింగ్ అనేది క్యాన్సర్ గురించి సమాచారాన్ని అందించే జన్యువులు, ప్రొటీన్లు, ఇతర పదార్థాల కోసం వెతకడానికి ఒక మార్గం. క్యాన్సర్ చికిత్సను ఎంచుకోవడంలో బాధితులకు వైద్యులకు బయోమార్కర్ టెస్టింగ్ ఉపయోగపడుతుంది.
కీమోథెరపీ: ఈ విధానంలో క్యాన్సర్ కణాలను చంపడానికి మందులను ఉపయోగిస్తారు. క్యాన్సర్ కణాలు త్వరగా పెరుగుతూ కణ విభజన ద్వారా వృద్ధి చెందుతాయి. కీమోథెరపీ ఈ క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపుతుంది. లేదా వాటి వృద్ధిని తగ్గిస్తుంది. క్యాన్సర్‌ను నయం చేయడానికి లేదా క్యాన్సర్ కణతి పెరుగుదలను ఆపడానికి లేదా మందగించడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. నొప్పి ఇతర సమస్యలను కల్గించే కణతులును తగ్గించడానికి కూడా కీమోథెరపీని ఎంచుకోవచ్చు.
హార్మోన్ థెరపీ: కొన్ని క్యాన్సర్లు మానవ శరీరంలో వృద్ధిచెందడానికి హార్మోన్లపై ఆధారపడతాయి. దీంతో ఈ హార్మోన్లను నిరోధించేందుకు క్యాన్సర్ల పెరుగుదలను ఆపడానికి కొన్ని ట్రీట్మెంట్స్ వాడతారు. హార్మోన్లలో వచ్చే క్యాన్సర్‌కు చికిత్స అందించడాన్ని హార్మోన్ థెరపీ లేదా ఎండోక్రైన్ థెరపీ అంటారు. రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్లకు చికిత్స చేయడానికి హార్మోన్ థెరపీని ఎక్కువగా వాడతారు.
హైపర్థెర్మియా: ఈ రకం ట్రీట్మెంట్లో క్యాన్సర్ కణజాలాన్ని 1130F వరకు వేడిచేసి కణాలను నిర్వీర్యం చేస్తారు. సాధారణ కణాలకు హాని కలగకుండా క్యాన్సర్ కణాలను చంపడానికి ఈ చికిత్సను వాడతారు.
ఇమ్యునో థెరపీ: రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేస్తారు. ఈ థెరపీ ద్వారా రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచి క్యాన్సర్ కణాలను నిరోధించవచ్చు. ఇది ఒక బయోలాజికల్ థెరపీ. అంటే క్యాన్సర్ చికిత్సకు జీవుల నుంచి తీయారైన పదార్థాలను ఉపయోగించే ఒకరకమైన చికిత్స.
రేడియేషన్ థెరపీ: క్యాన్సర్ కణాలను చంపడానికి, కంతులను కుదించడానికి ఎక్కువ మోతాదులో రేడియేషన్‌ను ఉపయోగిస్తారు.
స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్: కొన్ని రకాల క్యాన్సర్లకు అధిక మోతాదులో కీమోథెరపీ లేదా రేడియేషన్ థెరపీ చేసినప్పుడు స్టెమ్‌సెల్స్ లేదా మూల కణాలు నాశనమయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటిని పునరుద్ధరించే ప్రక్రియను స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. ఈ మూలకణాలు మానవ శరీరానికి ముఖ్యమైనవి. ఎందుకంటే అవి వివిధ రకాల రక్తకణాలుగా పెరుగుతాయి. వీటిలో తెల్ల రక్తకణాలు, ఎర్రరక్త కణాలు, ప్లేట్లెట్స్ వంటివి ఉంటాయి.
క్యాన్సర్‌లో చాలా రకాలున్నాయి. వాటిలో ఎక్కువగా కనిపించేవి. మూత్రాశయ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్ మొదలైనవి.
నోట్: క్యాన్సర్ వ్యాధి, వాటిలోని రకాలు, లక్షణాలు, నివారణ చర్యల గురించి అవగాహన కల్పించడానికి ఏటా ఫిబ్రవరి 4న క్యాన్సర్ వ్యాధి అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
– ఏవీ సుధాకర్
స్కూల్ అసిస్టెంట్
జడ్పీహెచ్ఎస్
లింగంపల్లి(మంచాల)
రంగారెడ్డి జిల్లా
sudha.avanchi@gmail.com
- Tags
- Cancer
- diagnosis
- human body
- nipuna
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు