వరల్డ్ జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ ఇతివృత్తం?
1. ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ తృణ ధాన్యాల సంవత్సరంగా ప్రకటించారు? (3)
1) 2022 2) 2024
3) 2023 4) 2020
వివరణ: 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ తృణ ధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ ప్రకటించింది. ఈ మేరకు 2018లో భారత్ చేసిన ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ తృణ ధాన్యాల ప్రోత్సాహానికి భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ, నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ప్రపంచంలోనే అతి ఎక్కువగా తృణ ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్న దేశం మనదే. అలాగే మొత్తం తృణ ధాన్యాల ఉత్పత్తిలో భారత్, చైనా, నైజీరియాల వాటా 50% ఉంటుంది. 2024 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కెమెలిడ్స్గా ప్రకటించారు. అలాగే 2022 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లాస్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టెయినబుల్ మౌంటెన్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ బేసిక్ సైన్స్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్‌గా నిర్వహిస్తారు.
2. యూఎన్‌సీటీఏడీ ప్రకారం 2021తో పోలిస్తే, 2022లో భారత వృద్ధి రేటు? (2)
1) పెరుగుతుంది 2) తగ్గుతుంది
3) స్థిరంగా ఉంటుంది 4) చెప్పలేం
వివరణ: భారత వృద్ధి రేటుపై యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అంచనాలను విడుదల చేసింది. ఈ సంస్థ ప్రధాన కేంద్రం జెనీవాలో ఉంది. సంస్థ నివేదిక ప్రకారం 2021లో భారత వృద్ధి రేటు 8.2% ఉండగా, 2022లో అది 5.7 శాతానికి తగ్గనుంది. 2023లో 4.7 శాతానికి మాత్రమే పరిమితం కానుంది. ప్రభుత్వ వ్యయం మందగించడమే దీనికి ప్రధాన కారణంగా యూఎన్‌సీటీఏడీ పేర్కొంది. అలాగే ప్రపంచ బ్యాంక్ సైతం తన అంచనాలను విడుదల చేసింది. దీని ప్రకారం భారత వృద్ధి రేటు 6.5 శాతం మాత్రమే ఉండొచ్చు. గతంలో భారత వృద్ధి రేటు 7.5% ఉండొచ్చని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. తాజా నివేదికలో 1% తగ్గించింది. దక్షిణాసియాలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ బాగా పుంజుకుంటుందని ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో వెల్లడించింది.
3. వరల్డ్ జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్‌ను ఏ నగరంలో నిర్వహించారు? (3)
1) కోల్‌కతా 2) న్యూఢిల్లీ
3) హైదరాబాద్ 4) గ్రేటర్ నోయిడా
వివరణ: వరల్డ్ జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ అక్టోబర్ 10 నుంచి 13వ తేదీ వరకు హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సంస్థకు ఇది రెండో సమావేశం. మొదటి సమావేశం చైనాలో 2018లో జరిగింది. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి దీన్ని నిర్వహిస్తారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశానికి ఇతివృత్తం ‘జియో ఆధారిత ప్రపంచ గ్రామం: ఎవరిని విస్మరించరాదు (జియో-ఎనేబ్లింగ్ ది గ్లోబల్ విలేజ్: నో వన్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్)’. అత్యంత నాణ్యమైన, విశ్వసనీయమైన జియో స్పేషియల్ డేటాను అందించడమే దీని ప్రధాన లక్ష్యం.
4. కింది ఏ వ్యవస్థ ‘సింగిల్ చార్జర్’ నిబంధన తేవాలని నిర్ణయించింది? (4)
1) ఆఫ్రికన్ యూనియన్
2) ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం
3) ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్
4) యూరోపియన్ యూనియన్ పార్లమెంట్
వివరణ: ‘సింగిల్ చార్జింగ్ వ్యవస్థ’ను తీసుకురావాలని యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ నిర్ణయించింది. అన్ని స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు, కెమెరాలకు ఒకే తరహాలో చార్జర్ ఉండాలి. 2024 చివరి నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని గడువు నిర్దేశించింది. సింగిల్ చార్జింగ్‌పై జరిగిన ఓటింగ్‌కు 602 మంది మద్దతు పలకగా 13 వ్యతిరేకించారు.
5. ఏ పథకానికి సంబంధించి ‘నాన్ ట్రెడిషనల్ లైవ్లీహుడ్’ అనే కొత్త అంశాన్ని కేంద్రం ఇటీవల చేర్చింది? (2)
1) ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన
2) బేటీ బచావో బేటీ పఢావో
3) ప్రధానమంత్రి జన్ ఔషధి యోజన
4) ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్
వివరణ: బేటీ బచావో బేటీ పఢావో పథకానికి నాన్ ట్రెడిషనల్ లైవ్లీహుడ్ అనే కొత్త ఐచ్చికాన్ని చేరుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బాలికలకు నైపుణ్యాలను పెంచే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. లింగనిష్పత్తిని పెంచేందుకు 2015 జనవరి 22న ఈ పథకాన్ని హర్యానాలోని పానిపట్టులో ప్రారంభించారు. అలాగే తాజా మార్పుల్లో మరో అంశం కూడా ఉంది. స్టెమ్ కోర్స్‌లను చదివేందుకు బాలికలను ప్రోత్సహిస్తారు. స్టెమ్ కోర్స్‌లు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్
6. కరోనా వల్ల ప్రపంచంలో అతి ఎక్కువగా ఏ దేశంలో పేదల సంఖ్య పెరిగిందని ప్రపంచ బ్యాంక్ ఇటీవల పేర్కొంది? (3)
1) నైజీరియా 2) అంగోలా
3) భారత్ 4) కోట్ డీ ఐవరీ
వివరణ: కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా 71 మిలియన్ల మంది పేదలుగా మారారని ప్రపంచ బ్యాంక్ తన తాజా నివేదికలో పేర్కొంది. ఇందులో 56 మిలియన్ మంది భారతీయులు ఉన్నారని వెల్లడించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత మంది పేదరికంలోకి వెళ్లడం ఇదే మొదటి సారి. 2030 నాటికి పేదరికం ఏ రూపంలోనూ లేకుండా చేయాలనుకున్న లక్ష్యం సాధించడం కష్టం అని ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. ‘పేదరికం, పంచుకున్న సంపద (పావర్టీ అండ్ షేర్డ్ ప్రాస్పారిటీ)’ అనే పేరుతో ఈ నివేదిక విడుదలయ్యింది. ఇటీవల ప్రపంచ బ్యాంక్ పేదరిక గీతను మార్చింది. గతంలో 1.9 డాలర్లు ఉండగా తాజాగా దాన్ని 2.15 డాలర్లుగా పరిగణిస్తుంది. దీన్ని కొనుగోలు శక్తి ఆధారంగా పేదరికాన్ని గణిస్తుంది.
7. మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించే అంశంపై అధ్యయనానికి వేసిన కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు? (1)
1) కేజీ బాలకృష్ణన్
2) జస్టిస్ చంద్రచూడ్
3) జస్టిస్ యూయూ లలిత్
4) ఎవరూ కాదు
వివరణ: క్రైస్తవ, ముస్లిం మతాల్లోకి మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించే అంశంపై అధ్యయనం చేసేందుకు కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో ఒక కమిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. భారత్‌కు 37వ ప్రధాన న్యాయమూర్తిగా కేజీ బాలకృష్ణన్ పనిచేశారు. కమిషన్‌లో సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ రవీందర్ కుమార్ జైన్, యూజీసీ మెంబర్ ప్రొఫెసర్ సుష్మాయాదవ్ ఉన్నారు.
8. ఇటీవల నిర్వహించిన 36వ జాతీయ క్రీడల్లో తెలంగాణ ఎన్నో స్థానంలో నిలిచింది? (4)
1) 21 2) 24 3) 18 4) 15
వివరణ: 36వ జాతీయ క్రీడలు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 12 వరకు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఎనిమిది స్వర్ణ, ఏడు వెండి, ఎనిమిది కాంస్య పతకాలతో 15వ స్థానంలో నిలిచింది. 2015లో జరిగిన క్రీడల్లో తెలంగాణ 12వ స్థానంలో ఉంది. ఈ క్రీడలను గుజరాత్‌లోని అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, భావ్‌నగర్‌లలో నిర్వహించారు. పతకాల పట్టికలో సర్వీసెస్ జట్టు అగ్రస్థానంలో ఉంది. ఆ జట్టు మొత్తం 128 పతకాలను సొంతం చేసుకుంది. ఇందులో 61 బంగారు పతకాలు ఉన్నాయి. 37వ జాతీయ క్రీడలు గోవాలో జరగనున్నాయి.
9. భారతదేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? (3)
1) కొలీజియం 2) కేంద్ర క్యాబినెట్
3) రాష్ట్రపతి
4) పదవీ విరమణ పొందిన ప్రధాన న్యాయమూర్తి
వివరణ: రాజ్యాంగంలోని 124వ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారు. ముందుగా ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి ఈ ప్రక్రియను రాష్ట్రపతి పూర్తి చేస్తారు. ఈ అంశానికి సంబంధించి వివిధ తీర్పులు ఉన్నాయి. కొలీజియం సిఫారసు చేసిన వారిని నియమిస్తారు. ప్రత్యక్షంగా కూర్చొని చర్చించి కొలీజియం పేర్లను సూచిస్తుంది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ పదవీ కాలం నవంబర్ 8తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రధాన న్యాయమూర్తి పేరును కొలీజియం సూచించింది. 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ నవంబర్‌లో బాధ్యతలను స్వీకరిస్తారు. ఆయన 2024 నవంబర్ 10 వరకు పదవిలో కొనసాగుతారు. గతంలో ఆయన తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ కూడా ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. దేశంలో సుదీర్ఘ కాలం ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగింది కూడా ఆయనే.
10. ఈ ఏడాది హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారం ఎవరికి లభించింది? (1)
1) అందెశ్రీ
2) రామోజు హరగోపాల్
3) అమ్మంగి వేణుగోపాల్ 4) ఎవరూ కాదు
వివరణ: హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారం-2022ను ప్రముఖ కవి డాక్టర్ అందెశ్రీకి ఇవ్వనున్నారు. సుద్దాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సుద్దాల అశోక్ తేజ పేర్కొన్నారు. అక్టోబర్ 15న ఈ అవార్డును అందుకున్నారు. సుద్దాల హనుమంతు తొలి తరం ప్రజావాగ్గేయకారుడిగా పేరుపొందారు. జయజయహే తెలంగాణ గీతాన్ని రచించింది అందెశ్రీనే. ఆయన రాసిన ఎన్నో పాటలు విశేష ఆదరణ పొందాయి. ఎర్ర సముద్రంలో ‘మాయమై పొతున్నడమ్మ మనిషన్నవాడు’ పాట ఆయన రచించిందే. ఈ ఏడాది కాళోజీ అవార్డ్ రామోజు హరగోపాల్ అందుకున్నారు. ఈ అవార్డ్‌ను గెలుచుకున్న తొలి వ్యక్తి అమ్మంగి వేణుగోపాల్. ఈ ఏడాది అమ్మంగి వేణుగోపాల్ డాక్టర్ సి. నారాయణ రెడ్డి పురస్కారాన్ని అందుకున్నారు.
11. పౌర విమానయాన రంగంలో ఏ సంవత్సరం నాటికి కర్బన ఉద్గారాల్లో ‘శూన్య ఉద్గారాన్ని’ సాధించాలనేది లక్ష్యం? (2)
1) 2030 2) 2050
3) 2035 4) 2070
వివరణ: 2050 నాటికి పౌర విమానయాన రంగంలో శూన్య ఉద్గారాల స్థాయిని చేరుకోవాలని అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఒక తీర్మానాన్ని ఇటీవల ఆమోదించింది. సంస్థ ప్రధాన కార్యాలయం కెనడాలోని మాంట్రియల్లో ఉంది. ఇటీవల నిర్వహించిన సమావేశాల్లో దాదాపు 200 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. శూన్య ఉద్గారాన్ని సాధించడం ఆకాంక్షిత లక్ష్యంగా పేర్కొన్నారు. అయితే పౌర విమానయానం వల్ల వస్తున్న కర్బన ఉద్గారాల శాతం తక్కువే. అయినప్పటికీ శూన్య ఉద్గారాలు సాధించడం ద్వారా సమాజానికి హితం చేయాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇటీవల ఈ సంస్థ భారత్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ సౌర కూటమిలో సభ్యత్వాన్ని కూడా పొందింది.
12. ఇటీవల చంద్రయాన్-2 వార్తల్లో నిలవడానికి కారణం? (3)
1) కక్ష్య నుంచి తప్పుకొంది
2) నాసా ప్రయోగించిన డార్ట్ దీన్ని గుర్తించింది
3) చంద్రుడిపై సోడియం విస్తీర్ణాన్ని కనుగొంది
4) చంద్రుడిపై నీటి జాడాలను ధ్రువీకరించింది
వివరణ: 2019 జూలై 22న ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రయోగం చంద్రయాన్-2. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని ప్రయోగించారు. చంద్రుడిపై ఉన్న సోడియం విస్తీర్ణాన్ని ఇది కొలిచింది. ఇందుకు ఇస్రో సీఎల్ఏఎస్ఎస్ (క్లాస్) అనే దానిని వినియోగించింది. దీని విస్తృత రూపం- చంద్రయాన్-2 లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్.
13. అర్థశాస్త్రంలో నోబెల్ ఈ ఏడాది ఎవరికి లభించింది? (4)
1) బెన్ షాలోమ్ బెర్నాంకే
2) డగ్లస్ డబ్ల్యూ డైమండ్
3) ఫిలిప్ హెచ్ డిబ్విగ్
4) పై అందరికి
వివరణ: బ్యాంక్‌లతో పాటు ఆర్థిక సంక్షోభాలపై చేసిన పరిశోధనకు అమెరికాకు చెందిన ముగ్గురికి అర్థశాస్త్రంలో నోబెల్ ప్రకటించారు. బ్యాంక్‌లు కుప్పకూలకుండా చూడాల్సిన ప్రాధాన్యాన్ని వీరు తమ పరిశోధనల ద్వారా వివరించారు. బెర్నాంకే 2006, 2014 సంవత్సరాల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్‌గా కూడా విధులు నిర్వహించారు.
14. ‘భారత దేశం నా మాతృభూమి’ అనే ప్రతిజ్ఞను రచించిన పైడిమర్రి వెంకటసుబ్బారావు ఏ జిల్లాకు చెందిన వారు? (1)
1) నల్లగొండ 2) కరీంనగర్
3) ఖమ్మం 4) నిజామాబాద్
వివరణ: భారత దేశం నా మాతృభూమి, భారతీయులందరు నా సహోదరులు అంటూ సాగే ప్రతిజ్ఞను రచించింది నల్లగొండ జిల్లా అన్నెపర్తికి చెందిన పైడిమర్రి వెంకట సుబ్బారావు. దీన్ని రచించి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన పేరుతో తపాలా శాఖ ప్రత్యేక కవర్‌ను విడుదల చేసింది. అలాగే పైడిమర్రి జీవిత చరిత్రను ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన రేపాక రఘునందన్ రచించారు. పైడిమర్రి బహుభాషా కోవిదుడు. సంస్కృతం, తెలుగు, ఇంగ్లిష్, అరబిక్ మాట్లాడగలరు. కాలభైరవుడు అనే నవలను కూడా ఆయన రచించారు. విశాఖపట్నంలో జిల్లా ట్రెజరీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సమయంలో ఆయన జాతీయ ప్రతిజ్ఞను రచించారు.
15. ఇటీవల సిప్రి అనే సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇండో-పసిఫిక్ దేశాల్లో ఆయుధాల ఉత్పత్తిలో స్వయం స్వావలంబన సాధించిన దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? (3)
1) 2 2) 3 3) 4 4) 5
వివరణ: ఆయుధాల ఉత్పత్తిలో స్వయం స్వావలంబనను సాధించే అంశానికి సంబంధించి స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన 12 దేశాల ఆయుధాల ఉత్పత్తిని ఇందులో పేర్కొన్నారు. దిగుమతుల విషయంలో భారత్ తొలి స్థానంలో, ఎగుమతుల విషయంలో నాలుగో స్థానంలో ఉంది.
-వి. రాజేంద్ర శర్మ ఫ్యాకల్టీ , 9849212411
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు