మొగల్ నిర్మాణాలు-వారసత్వ సంపదలు
- ఆగ్రాలోని ఎర్రకోట
l అక్బర్ కాలంలో చేపట్టిన మొదటి బృహత్తర కట్టడం. ఇందులో జహంగీర్ మహల్లో హిందూ వాస్తు శిల్పం ప్రభావం కనిపిస్తుంది. అక్బర్ తర్వాత కాలంలో జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ ఆగ్రాకోటలో కొత్త నిర్మాణాలు చేపట్టారు. రెండుసార్లు ఆగ్రా నుంచి రాజధాని మార్పిడి జరిగింది. మొదట అక్బర్ ఫతేపుర్ సిక్రీకి, తర్వాత షాజహాన్ ఢిల్లీలోని షాజహానాబాద్ (ఎర్రకోట)కు మార్చాడు.
l ఔరంగజేబ్ షాజహాన్‌ను ఆగ్రా కోటలోనే బంధించాడు. చివరి రోజుల్లో కోటలోని ముసమ్మాన్ బుర్జ్ నుంచి తాజ్‌మహల్‌ను చూస్తూ గడిపాడట. శివాజీని కూడా ఔరంగజేబ్ ఆగ్రా కోటలోనే బంధించాడు.
l ఇది డబుల్ ఫోర్ట్ (రెండు కోటల శైలిలో) శైలిలో నిర్మాణమైంది. ఒక పక్క యమునా నది ఆవరించి ఉండగా మిగిలిన కోట చుట్టూ అగడ్తాను రక్షణగా నిర్మించారు. ఇందులో మోతీ మసీదును షాజహాన్ నిర్మించాడు.
ఫతేపుర్ సిక్రీ
l ఇక్కడ నివాసం ఉండే ప్రముఖ సూఫీ సాధువు షేక్ సలీం చిష్తీ ఆశీర్వచనం తర్వాత అక్బర్‌కు సలీం (తర్వాత జహంగీర్గా ప్రసిద్ధుడు) జన్మించాడు. దీనికి గుర్తుగా నిర్మించినదే ఈ ఫతేపుర్ సిక్రీ రాజప్రాసాదం. ఇది ఆగ్రాకు పశ్చిమంగా సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
l జోధ్‌బాయి నివాస మందిరం, దివాన్-ఎ-ఆమ్ (చక్రవర్తి కార్యాలయం), దివాన్-ఎ-ఖాస్ (చక్రవర్తి ముఖ్యమైన చర్చలు జరిపే భవనం) ఈ ప్రాసాదం ప్రణాళికలో ముఖ్యమైన నిర్మాణాలు.
l చక్రవర్తి ఆట విడుపు కోసం నిర్మించినట్లుగా భావిస్తున్న ‘పంచమహల్’లో బౌద్ధ విహారాల శైలి కనిపిస్తుంది. ఇది ఒక అంతస్తు నుంచి మరో అంతస్తుకు విస్తీర్ణం తగ్గుతూ వెళ్లే అయిదు అంతస్తుల నిర్మాణం. ఫతేపుర్ సిక్రీలో నీటి కొరత ఉండటంతో కొన్ని సంవత్సరాల్లోనే అక్బర్ రాజధానిని మళ్లీ ఆగ్రాకు మార్చాడు.
బులంద్ దర్వాజా
l అంటే ‘పెద్ద ద్వారం’ అని అర్థం. ఇది ఫతేపుర్ సిక్రీలో అక్బర్ నిర్మించిన జామీ మసీదు దక్షిణ ముఖద్వారం. దీనిని గుజరాత్ మీద విజయానికి గుర్తుగా నిర్మించాడు. నిర్మాణం 1601లో పూర్తయింది. ఇది ప్రపంచంలోనే అతి ఎత్తయిన ద్వారం. సుమారు 160 అడుగుల ఎత్తుతో అలరారుతున్నది. జామీ మసీదు ప్రాంగణంలోనే ఉన్న షేక్ సలీం చిష్తీ సమాధి నిర్మాణంలో గుజరాత్ వాస్తుశిల్పం పోకడలు కనిపిస్తాయి.
l అక్బర్ కాలంలోనే నిర్మాణం మొదలై జహంగీర్ కాలంలో పూర్తయిన అక్బర్ సమాధి ఆగ్రాకు సమీపంలోని సికిందరాలో ఉంది. ఇందులో బౌద్ధవిహారాల శైలితోపాటు, ఇండో చైనాలోని ఖ్మేర్ వాస్తుకళ ప్రభావం కూడా కనిపిస్తుంది. దీనికి గుమ్మటాలు లేవు.
జహంగీర్
l అక్బర్ తర్వాత ఆయన కుమారుడు జహంగీర్ మొగల్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అయితే తండ్రిలా భవన నిర్మాణాల మీద కాకుండా జహంగీర్ చిత్రకళ పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. అందుకే ఈ కాలపు నిర్మాణాలు అంత ఆకర్షణీయంగా కనిపించవు. జహంగీర్ కాలంలో సికిందరా లో అక్బర్ సమాధి మందిరం పూర్తయింది.
l ఈ కాలపు కట్టడాల్లో ప్రధాన నిర్మాణం జహంగీర్ మామ, నూర్జహాన్ తండ్రి అయిన ఇతిమతుద్దౌలా (మీర్జా ఘియాస్ బేగ్) సమాధి. ఇది ఆగ్రాలో ఉంది. పూర్తిగా పాలరాయితో నిర్మించిన ఈ కట్టడాన్ని ‘పీత్రదురా’ శైలిలో అలంకరించారు మొగలుల కట్టడాల్లో ఈ తరహా శైలిని వాడిన మొదటి కట్టడం ఇదే.
l ఇదే కాలానికి చెందిన ప్రముఖ సూఫీ మార్మికవాది, అక్బర్ ఆస్థాన విద్వాంసుడు అయిన అబ్దుల్ రహీం ఖాన్-ఎ-ఖానన్ సమాధి హుమాయూన్ సమాధికి, షాజహాన్ కాలపు తాజ్‌మహల్‌కు అనుసంధానంగా నిలుస్తుంది. జహంగీర్, నూర్జహాన్ సమాధులు పాకిస్తాన్‌లోని లాహోర్ సమీపంలోని షాదారాలో ఉన్నాయి.
షాజహాన్ నిర్మాణాలు
lషాజహాన్ అత్యున్నత అభిరుచి ఉన్న భవన నిర్మాత. ఇతని కాలంలోనే ఎన్నో భవనాలు, కోటలు ఉద్యానవనాలు, మసీదులు నిర్మాణమయ్యాయి. వీటి నిర్మాణానికి ఎంత ఖర్చు చేశాడో అంచనా వేయడం సాధ్యం కాదంటారు చరిత్రకారులు.
lఅక్బర్ నిర్మాణాలతో పోల్చితే షాజహాన్ నిర్మాణాలు ఎంతో మహోన్నతమైనవి కాదు. అయితే ఇవి వివిధ అలంకరణలతో శిల్పుల నైపుణ్యాన్ని చాటుతూ రాళ్లమీద చెక్కి నగలను తలపిస్తాయి.
ఢిల్లీలోని ఎర్రకోట
l దీనిని షాజహానాబాద్ అంటారు. నిర్మాణం 1648లో పూర్తయింది. పాత ఢిల్లీలోని చాందినీచౌక్ సమీపంలో ఉంటుంది. పూర్తిగా ఎర్రరాతి నిర్మాణం. దివాన్-ఎ-ఆమ్, దివాన్-ఎ-ఖాస్, రంగ్ మహల్ తదితర నిర్మాణాలు ఆకట్టుకుంటాయి. ‘భూమి మీద స్వర్గం అనేది ఏదైనా ఉంటే అది ఇదే, అది ఇదే, అది ఇదే అనే వాక్యాలను ఎర్రకోట గురించే అంటారు.
lకోటలో చక్రవర్తి ఆసీనులయ్యేందుకు ప్రత్యేకంగా బంగారు తాపడంతో, విలువైన మణులను పొదిగి చేయించిన ‘మయూర సింహాసనం’ (తఖ్త్-ఎ-తావూస్) షాజహాన్ కళాభిరుచికి మరో నిదర్శనం. దీనికి ప్రణాళికను సిద్ధం చేసింది బేబాదల్ ఖాన్. నాదిర్ షా దండయాత్రలో ఈ సింహాసనం పర్షియాకు తరలిపోయింది.
జామా మసీదు
lఎర్రకోటకు దగ్గర్లోనే సామూహిక ప్రార్థనలు జరుపుకొనేందుకు షాజహాన్ ‘జామా మసీదు’ను నిర్మించాడు. ఇది ఎర్రరాయి, పాలరాయిల అత్యున్నత కలయిక. ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. మసీదు మీద ఉండే మూడు గుమ్మటాలను పాలరాయి, మధ్యలో నల్లసరపురాయి చారికలతో నిర్మించారు. భారతదేశంలోని పెద్ద మసీదులలో ‘జామామసీదు’ ఒకటి. దీనితోపాటు ఆగ్రాలో మోతీమసీదు, జామి మసీదులను కూడా షాజహానే నిర్మించాడు.
తాజ్‌మహల్
l షాజహాన్ కాలంలోనే కాదు మొత్తం ఇండో- ఇస్లామిక్ వాస్తుశిల్పంలో దానికదే సాటి (Piece-de-resistance) అని చెప్పుకొనే కట్టడం తాజ్‌మహల్. పూర్తిగా పాలరాయితో ఉన్న ఈ కట్టడాన్ని షాజహాన్ తను ఎంతగానో ప్రేమించిన భార్య ముంతాజ్ మహల్ (అర్జుమంద్ బాను బేగం) స్మారకంగా నిర్మించాడు. అందుకే దీనిని ప్రేమకు చిహ్నంగా పేర్కొంటారు.
l క్రీ.శ. 1631-1653 మధ్య 22 ఏళ్ళపాటు జరిగిన ఈ సమాధి నిర్మాణానికి ప్రణాళిక వేసింది ఉస్తాద్ ఈసా. దీని నిర్మాణంలో సుమారు 20వేల మంది శ్రామికులు పాలుపంచుకున్నారు. యమునా నదీ తీరంలో విశాలమైన ఉద్యానవనం మధ్య అలరారుతున్న తాజ్‌మహల్‌లో ముంతాజ్ మహల్‌తోపాటు షాజహాన్ సమాధి కూడా ఉంది. కట్టడం వేదికకు నలువైపులా స్వేచ్ఛగా నిలబడిన మినార్లు తాజ్ మహల్‌కు మరింత ఆకర్షణను తీసుకువచ్చాయి.
ఔరంగజేబ్
l తన తాతలు తండ్రిలతో పోల్చితే ఔరంగజేబ్ సాధారణ జీవితాన్ని గడిపాడు. విలాస వంతమైన భవనాల నిర్మాణం షాజహాన్తోనే ఆగిపోయింది. ఎక్కువ కాలం యుద్ధాలతోనే గడిపిన ఔరంగజేబ్ ఢిల్లీలోని ఎర్రకోటలో ‘మోతీ మసీదు’ లాహోర్‌లో ‘బాద్ షాహి’ మసీదును నిర్మించాడు.
l ఔరంగజేబు భార్య దిల్ రస్ బాను బేగం (రబియా-ఉద్-దుర్రానీ) సమాధి ‘బీబీ కా మఖ్బరా’ను వారి కుమారుడు అజీమ్షా నిర్మించాడు. తాజ్‌మహల్‌కు నకలులా ఉండే ఈ సమాధి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఉంది.
l ఔరంగజేబ్ మరణానంతరం మొగల్ సామ్రాజ్య పతనం ప్రారంభం కావడంతో వాస్తుశిల్పం కూడా క్షీణదశకు చేరుకుంది. ఢిల్లీలో మొగలుల ప్రధానిగా పనిచేసిన సఫ్దర్ జంగ్ సమాది’ అయోధ్య నవాబు ఆసఫుద్దౌలా లక్నోలో నిర్మించిన బడా ఇమాంబారా మొగలుల క్షీణయుగపు నిర్మాణాలు. ఇక్కడితో ఇండో ఇస్లామిక్ వాస్తుకళా వైభవం దాదాపుగా అంతమైందనే చెప్పాలి.
మొగలుల ఉద్యానాలు
lసౌందర్యారాధకులైన మొగలులు తమ వాస్తుశిల్పంతో ఉద్యనవనాలకు చోటు కల్పించారు. మొగలుల ఉద్యానాల్లో ముఖ్యమైనవి
lషాలిమర్బాగ్ (కశ్మీర్- జహంగీర్)
lనిషాంత్ బాగ్ (కశ్మీర్- అసఫ్ఖాన్)
lచష్మైషాహి (కశ్మీర్-షాజహాన్) ముఖ్యమైనవి
ప్రాక్టీస్ బిట్స్
1. మొగల్ చిత్రకళ ఎవరి కాలంలో ఉన్నత స్థానం పొందినది?
ఎ) జహంగీర్ బి) అక్బర్
సి) షాజహాన్ డి) జౌరంగజేబు
2. అక్బర్ ఎవరి స్మారకార్థం బులంద్ దర్వాజను ఏర్పాటు చేశాడు
ఎ) తన కుమారుడు సలీం జన్మదినం
బి) మేవార్‌పై తన విజయం
సి) గుజరాత్‌పై విజయం
డి) వీటిలో ఏదీకాదు
3. ఫతేపుర్ సిక్రీ అనే కొత్త నగరానికి ఎవరి
గౌరవార్థం అక్బర్ పునాది వేశాడు?
ఎ) బాబర్ బి) మెయినుద్దీన్ చిష్తీ
సి) సలీం డి) నిజాముద్దీన్ ఔలియా
4. మొగలుల కాలంలో ముస్లిం మౌల్వీలకు, పండితులకు పాఠశాలలకు ఇచ్చిన భూమిని ఏమని పిలిచేవారు?
ఎ) సయూర్ ఘర్ బి) ఖాల్స
సి) జాగీర్ డి) బతాయ్
5. జోధ్‌బాయి రాజ ప్రాసాదం ఎక్కడ నిర్మించారు?
ఎ) ఫతేపుర్ సిక్రీ బి) ఢిల్లీ
సి) ఆగ్రా డి) పానిపట్టు
6. దహసాలా పద్ధతిని ఎవరు సంవత్సరంలో ప్రవేశ పెట్టారు?
ఎ) 1582-తోడర్మల్
బి) 1572- తోడర్మల్
సి) 1565 అక్బర్ డి) 1570 అక్బర్
7. మొగల్ చక్రవర్తుల్లో ఎవరు రాజధానికి
‘దీన్ఫణ్’ అని పేరు పెట్టారు?
ఎ) బాబర్ బి) హుమాయూన్
సి) అక్బర్ డి) షాజహాన్
8. కింది వాటిలో తాజ్‌మహల్ కట్టడాన్ని పోలి ఉన్నది ఏది?
ఎ) అక్బర్ సమాధి బి) జహంగీర్ సమాధి
సి) హుమూయూన్ సమాధి
డి) బీబీ-కా-మఖ్బరా
9. భారతదేశంలో ఫిరంగి దళాన్ని మొట్టమొదట ఉపయోగించినది ఎవరు?
ఎ) తైమూర్ బి) బాబర్
సి) షేర్షా సూరి డి) అల్లావుద్దీన్ ఖిల్జీ
10. మొగల్ నిర్మాణాల్లో ఏ భవనం పొడవు, వెడల్పు సరిసమానంగా ఉన్నాయి?
ఎ) ఎర్రకోట బి) తాజ్‌మహాల్
సి) బులంద్దర్వాజ డి) ఆగ్రాకోట
11. ప్రసిద్ధి గాంచిన మయూర సింహసనం ఏ మొగల్ భవనంలో కలదు?
ఎ) ఎర్రకోటలోని రంగు మహాల్
బి) ఎర్రకోటలోని దివాన్-ఇ-ఆరమ్
సి) ఫతేపూర్ సిక్రీలోని దివాన్-ఇ-ఖాస్
డి) ఆగ్రాకోట
– సి. హర్షవర్థన్, హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు