‘ఖనిజ భద్రతా భాగస్వామ్యం’లో ఎన్ని దేశాలు ఉన్నాయి?
1. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్‌కు సంబంధించి ఇటీవల భారత్ చేసిన మార్పులు ఏంటి? (3)
1) కేవలం 1 నెల వ్యవధికే పర్మిట్ ఇవ్వడం
2) ప్రపంచమంతా ఎప్పటికీ చెల్లేలా కొత్త విధానం
3) దేశవ్యాప్తంగా ఈ లైసెన్స్ ఇవ్వడంలో
ఒక ప్రామణికతను తీసుకురావడం
4) ఏదీకాదు
వివరణ: ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ విధానంలో భారత్ ఇటీవల సవరణ చేసింది. దేశంలో డ్రైవింగ్ లైసెన్స్‌ను కలిగిన వ్యక్తులకు ఇది ఇస్తారు. అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పద్ధతిలో, ఒక్కో సైజ్‌లో లైసెన్స్ ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఒకే విధంగా లైసెన్స్ ఇచ్చే ప్రక్రియ ఉండేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఒక ఒప్పందం ఉంది. 1949లో కుదిరిన ఈ ఒప్పందం- కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ రోడ్ ట్రాఫిక్. అంతర్జాతీయ స్థాయిలో ట్రాఫిక్ భద్రతను పెంచేందుకు ఉద్దేశించింది. ఈ ఒప్పందంపై భారత్ కూడా సంతకం చేసింది.
2. అణు వ్యాప్తి నిరోధక ఒప్పందానికి సంబం ధించి ఇటీవల జరిగిన చర్చలో ఒప్పందంపై ఏ దేశం అభ్యంతరంతో నిలిచిపోయింది? (4)
1) చైనా 2) ఫ్రాన్స్
3) యూఎస్ఏ 4) రష్యా
వివరణ: అణ్వస్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం సమీక్షలో వచ్చిన పలు ప్రతిపాదనలపై రష్యా అభ్యంతరం చెప్పడంతో నాలుగు వారాలుగా జరిగిన సమీక్ష ఎలాంటి ఫలితం తేల్చకుండానే నిలిచిపోయింది. ప్రతి అయిదు సంవత్సరాలకు ఒకసారి ఈ సమీక్ష నిర్వహిస్తారు. 2015లో జరిగింది, మళ్లీ 2020లో జరగాల్సి ఉన్నా, కరోనా వల్ల వాయిదా పడి ఈ ఏడాది ఆగస్ట్ 1 నుంచి 26 వరకు నిర్వహించారు. ఈ ఒప్పందం మార్చి 5, 1970లో అమల్లోకి వచ్చింది. 1 జనవరి 1967కు ముందు అణ్వాయుధాలను కలిగిన దేశాలనే ఈ ఒప్పందంలో భాగంగా అణ్వస్త్ర దేశాలుగా గుర్తించారు. దీని ప్రకారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని అయిదు దేశాలు మాత్రమే ఈ ఆయుధాలను కలిగి ఉన్నాయి.
3. ‘ఐఎండీ-యూఎన్డీపీ-జపాన్’ సంయుక్తంగా భారత్‌లో చేపట్టనున్న ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది? (3)
1) మౌలిక సదుపాయాలు
2) రైల్వే ట్రాక్‌ల విస్తరణ
3) పర్యావరణ మెరుగు
4) విపత్తు నిర్వహణ
వివరణ: పర్యావరణ పరిరక్షణలో భాగంగా 23 దేశాలకు జపాన్ ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ సాయం పొందుతున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్య క్రమం (యూఎన్డీపీ) అలాగే భారత మెటీరియోలాజికల్ డిపార్ట్మెంట్లు సంయుక్తంగా తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ పర్యావరణ మెరుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. అవి- సిక్కిం, ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్, జారండ్, మహారాష్ట్ర, ఒడిశా. ఈ కార్యక్రమంలో భాగంగా 5.16 మిలియన్ డాలర్ల నగదు జపాన్ చేసే పర్యావరణ గ్రాంట్‌లో భాగంగా అందింది.
4. ‘ఖనిజ భద్రతా భాగస్వామ్యం’లో ఎన్ని దేశాలు ఉన్నాయి? (2)
1) 10 2) 11 3) 15 4) 21
వివరణ: కొవిడ్-19 వల్ల ఖనిజాల సరఫరా గొలుసుకు విఘాతం కలిగింది. ఎక్కువగా చైనా పైనే ఆధారపడటం ఇబ్బందికి గురిచేసింది. ఈ నేపథ్యంలో 11 దేశాలు కలిసి ఖనిజ భద్రతా భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించాయి. దీనికి అమెరికా నేతృత్వం వహిస్తుంది. ఇందులో కెనడా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, స్వీడన్, యురోపియన్ కమిషన్, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఆస్ట్రేలియా దేశాలున్నాయి. ఖనిజాల సరఫరాకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తారు. అరుదుగా భావించే 17 భూ ఖనిజాల సరఫరా గొలుసుకు విఘాతం కలగకుండా చూసుకుంటారు. వీటిని ఎలక్టిక్ వాహనాలు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ హార్డ్ డ్రైవ్‌లు, ఎలక్టిక్-హైబ్రిడ్ వాహనాలు, సెమీ కండక్టర్లు, ఫ్లాట్ స్క్రీన్ టీవీలు, మానిటర్లు తదితరాల్లో వినియోగిస్తారు.
5. ఏ నగరం/కేంద్ర పాలిత ప్రాంతంలోని విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు పెట్టారు? (1)
1) చండీగఢ్ 2) అమృత్సర్
3) గుర్గావ్ 4) లక్నో
వివరణ: చండీగఢ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ అనే పేరు పెట్టారు. ఇందుకు పంజాబ్-హర్యానా ప్రభుత్వాలు సంయుక్తంగా అంగీకరిం చాయి. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, హర్యానా ఉప ముఖ్యమంత్రి దుశ్యంత్ తాలాల మధ్య జరిగిన చర్చలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విమానాశ్రయం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి భాగస్వామ్యంతో ఏర్పడిందే.
6. 2023లో ప్రవాసీ భారతీయ దివస్‌ను ఏ నగరంలో నిర్వహించనున్నారు? (3)
1) ఢిల్లీ 2) అహ్మదాబాద్
3) ఇండోర్ 4) బెంగళూర్
వివరణ: 17వ ప్రవాస భారతీయ దివస్‌ను 2023లో ఇండోర్‌లో నిర్వహించనున్నారు. ఏటా జనవరి 9న దీనిని నిర్వహిస్తారు. ప్రవాస భారతీయులు సాధించిన విజయాలు, వారు మన దేశానికి చేస్తున్న సాయానికి ఇది గుర్తు. ఇదే రోజును ఎంపిక చేయడానికి కారణం- 1915 జనవరి 9న మహాత్మాగాంధీ భారత్‌కు తిరిగి వచ్చి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఎల్ఎం సింఘ్వీ కమిటీ సూచన మేరకు ప్రవాస భారతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తు న్నారు.
7. అన్ని గృహ సముదాయాలకు పైప్‌ల ద్వారా నీటిని అందించే రాష్ట్రంగా సర్టిఫికెట్‌ను పొందిన తొలి రాష్ట్రం? (4)
1) పంజాబ్ 2) కేరళ
3) మిజోరం 4) గోవా
వివరణ: అన్ని గృహ సముదాయాలకు పైప్‌ల ద్వారా నీటిని అందించేందుకు 2019 ఆగస్ట్ 15న కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ అభియాన్‌ను ప్రారంభించింది. ఈ ఘనతను సాధించి సర్టిఫికెట్‌ను పొందిన తొలి రాష్ట్రం గోవా. అయితే అన్ని గృహ సముదాయాలకు నీటిని అందిస్తున్న రాష్ట్రాలు తెలంగాణ, హర్యానాలతో పాటు దాద్రానగర్ హవేలీ-డామన్ డయ్యూలు కూడా ఉన్నాయి. 2024 నాటికి అన్ని గృహ సముదాయాలకు నీటిని అందించాలన్నది లక్ష్యం. ఇందుకు అయ్యే వ్యయంలో కేంద్ర రాష్ట్రాలు 50:50 శాతం భరిస్తాయి. హిమాలయ, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం కేంద్ర, రాష్ట్రాలు 90:10 నిష్పత్తిలో వ్యయం చేస్తాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో నూరు శాతం కేంద్రమే భరిస్తుంది.
8. ఇటీవల ఇస్రో ఎస్పీఏఆర్కే (స్పార్క్)ను ప్రారం భించింది. ఇది దేనికి సంబంధించింది? (1)
1) ఇస్రో ప్రయోగాలను తెలుపుతుంది
2) అంతరిక్షంలోని వివిధ నక్షత్రాలను చూపుతుంది
3) కాంతి ప్రక్రియల ప్రదర్శన
4) ఇస్రో చేపట్టనున్న ప్రాజెక్ట్‌ల సమాహారం
వివరణ: ఎస్పీఏఆర్కే (స్పార్క్) పేరుతో ఇస్రో ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను చేపట్టింది. ఇస్రో మిషన్లను ప్రదర్శించే ఉద్దేశంతో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. దీన్ని ఒక స్పేస్ మ్యూజియంగా భావించొచ్చు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో ఇది భాగం. ఇంటరాక్టివ్ పద్ధతిలో ఇది కొనసాగుతుంది. ఇందులో ఎన్నో డాక్యుమెంట్లు, ఇమేజ్‌లు, వీడియోలు ఉంటాయి.
9. కామన్వెల్త్ క్రీడల పతకాల పట్టికలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? (3)
1) 2 2) 3 3) 4 4) 5
వివరణ: ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు జూలై 28 నుంచి ఆగస్టు 8, 2022 వరకు నిర్వహించారు. ఇంగ్లండ్‌లో ఈ క్రీడలు జరగడం ఇది మూడోసారి. 1934లో తొలిసారిగా లండన్‌లో, 2002లో రెండోసారి మాంచెస్టర్‌లో జరిగాయి. ఈ ఏడాది క్రీడల్లో 72 దేశాలు పాల్గొన్నాయి. పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఆస్ట్రేలియా ఉంది. రెండు, మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా ఇంగ్లండ్, కెనడా, భారత్ ఉన్నాయి. పోటీల్లో పాల్గొనడం భారత్‌కు ఇది పద్దెనిమిదోసారి. 61 పతకాలను భారత్ గెలుచుకుంది. ఇందులో 22 బంగారు, 16 వెండి, 23 కాంస్యాలు ఉన్నాయి. ఈ క్రీడల ప్రారంభ వేడుకల్లో పతాకదారులుగా భారత్ తరఫున మన్‌ప్రీత్ సింగ్, పీవీ సింధు ఉండగా, ముగింపు వేడుకలకు నిఖత్ జరీన్, ఆచంట శరత్ కమాల్ ఉన్నారు.
10. ఉత్తమ ఆకాంక్షిత జిల్లాగా ఎంపికయినది ఏది? (4)
1) ఇండోర్ 2) విజయనగరం
3) రాంచీ 4) హరిద్వార్
వివరణ: అయిదు ప్రమాణాల ఆధారంగా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ను ఉత్తమ ఆకాంక్షిత జిల్లాగా నీతి ఆయోగ్ ప్రకటిం చింది. మౌలిక వసతుల కల్పన ఇతివృత్తం లో తొలి ర్యాంక్‌ను దక్కించుకుంది. రూ.3 కోట్లను అదనంగా ఈ జిల్లా పొందనుంది. ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమాన్ని 2018లో ప్రారంభించారు. సాంఘిక-ఆర్థిక అభివృద్ధి లో భాగంగా జిల్లాలను అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం. ఎంపిక చేసిన జిల్లాల్లోని బ్లాక్‌లను అభివృద్ధి చేస్తారు. తెలంగాణ నుంచి ఈ జాబితాలో కుమ్రం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి.
11. 119 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఏ రాష్ట్రంలో కొత్త రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేశారు? (1)
1) నాగాలాండ్ 2) సిక్కిం
3) అరుణాచల్ ప్రదేశ్ 4) మేఘాలయ
వివరణ: నాగాలాండ్‌లో శోకువి అనే ప్రాంతంలో ఇటీవల రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు. స్వతంత్ర దేశంలో ఈ రాష్ట్రానికి రైల్వే స్టేషన్ రావడం ఇదే తొలిసారి. బ్రిటిష్ పాలనా కాలంలో 1903లో దిమాపూర్ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు. మళ్లీ 119 సంవత్సరాల తర్వాత ఆ రాష్ట్రంలో మరో రైల్వే స్టేషన్ వచ్చింది. నిత్యం గువాహటి నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లోని నహర్లగూన్కు నడిచే రైలును కొత్తగా నిర్మించిన శోకువి రైల్వే స్టేషన్ వరకు విస్తరిస్తారు.
12. ఏ లక్ష్యంతో ప్రధాన్ మంత్రి జన్‌ధన్ యోజనను ప్రారంభించారు? (3)
1) సుస్థిరాభివృద్ధి సాధనకు
2) బ్యాంక్‌ల పరిరక్షణకు
3) సమ్మిళిత అభివృద్ధికి
4) ప్రైవేట్ బ్యాంక్‌లను ప్రోత్సహించేందుకు
వివరణ: సమ్మిళిత ఆర్థిక వృద్ధిని సాధించేందుకు ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజనను 2015 ఆగస్ట్‌లో ప్రారంభించారు. ఈ ఏడాదితో ఈ పథకం ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సమ్మిళిత ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఈ పథకంతో పాటు స్మాల్ బ్యాంక్‌లు, చెల్లింపుల బ్యాంక్‌లను కూడా కేంద్రం ప్రారంభించింది. అందరికీ బ్యాంకుల్లో ఖాతాలను తెరిచేలా ప్రోత్సహించేదే ప్రధాన్ మంత్రి జన్‌ధన్ యోజన. ఎలాంటి కనీస డిపాజిట్ లేకుండా ఖాతా తెరనొచ్చు. ఫలితంగా పథకాలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించొచ్చు. పేదలకు ఇది ప్రయోజనం. ఆర్థిక సేవలను అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు తీసుకెళ్లడాన్నే సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి అంటారు. దీనినే ఇంగ్లిష్‌లో ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ అంటారు.
13. సూపర్ వాసుకి ఇటీవల వార్తల్లో నిలిచింది, ఇది ఏంటి? (2)
1) యుద్ధ నౌక 2) రైలు 3) కొత్త క్షిపణి
4) భారత్ ప్రయోగించనున్న కొత్త ఉపగ్రహం
వివరణ: సూపర్ వాసుకి అనే రైలును ఇటీవల సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రారంభిం చింది. ఇది దేశంలోనే అత్యంత పొడవైన రైలు. 3.5 కిలోమీటర్లు ఉంటుంది. సరకు రవాణాకు ఉద్దేశించింది. 267 కిలోమీటర్లు ఇది ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా, నాగ్‌పూర్‌లోని రజ్నాన్డ్ గావోన్ల మధ్య ప్రయాణించింది. దక్షిణ తూర్పు మధ్య రైల్వే (ఎస్ఈసీఆర్) ఈ రైలును నడపనుంది. వివిధ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు సరఫరాకు దీనిని వినియోగించుకుంటారు. ఫలితంగా బొగ్గు లేని కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయాన్ని నివారించొచ్చు.
14. ఏ రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలో తొలిసారిగా స్టీల్ స్లాగ్‌తో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ రహదారిని నిర్మిస్తుంది? (2)
1) సిక్కిం 2) అరుణాచల్ ప్రదేశ్
3) లఢఖ్ 4) జమ్ము కశ్మీర్
వివరణ: దేశంలోనే తొలిసారిగా బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ స్టీల్ స్లాగ్ రోడ్‌ను అరుణాచల్ ప్రదేశ్‌లో నిర్మించనుంది. ఇది ప్రయోగాత్మ కంగా చేపట్టే ప్రాజెక్ట్. అయితే ఇప్పటికే దేశంలో ఈ తరహా రోడ్ గుజరాత్‌లోని సూరత్‌లో అందుబాటులో ఉంది. అరుణాచల్ ప్రదేశ్‌లో రానున్న రహదారిని బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ చేపట్టే తొలి స్టీల్ రహదారి. పర్యావరణానికి మేలు చేస్తుంది ఈ తరహా రహదారి.
15. అన్ని ఫార్మాట్లలో 100 మ్యాచ్‌లు పూర్తిచేసిన భారత తొలి క్రికెటర్ ఎవరు? (3)
1) కేఎల్ రాల్ 2) రోహిత్ శర్మ
3) విరాట్ కోహ్లీ 4) జస్ప్రీత్ బుమ్రా
వివరణ: టెస్టులు, వన్డే ఇంటర్నేషనల్, టీ-20 ఫార్మాట్లలో ఒక్కోదానిలో 100 మ్యాచ్‌లు పూర్తిచేసిన తొలి భారత ఆటగాడు విరాట్ కోహ్లీ. అయితే ప్రపంచంలో మాత్రం ఈ ఘనతను సాధించిన తొలి వ్యక్తి రాస్ టేలర్. 2022, ఆగస్ట్ చివరి వారంలో ప్రారంభమైన ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ ఈ ఘనతను దక్కించుకున్నాడు. ఇదే మ్యాచ్‌తో రోహిత్ శర్మ కొత్త రికార్డ్‌ను సృష్టించాడు. టీ-20 మ్యాచుల్లో ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా ఘనత దక్కించుకున్నాడు. మార్టిన్ గప్టిల్ పేరిట ఉన్న రికార్డును భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
ఎడ్యు రిపబ్లిక్
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?