భారత్ @ 75 రామ్సర్ సైట్స్
దేశం స్వాతంత్య్రం పొంది 75 సంవత్సరాలు పూర్తయిన వేళ, దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వెలుగులు ప్రసరిస్తున్న పర్యావరణ పరిరక్షణలో భారత్ మరో ఘనత సాధించింది. దేశంలో 11 కొత్త చిత్తడి ప్రాంతాలను రామ్సర్ సైట్లుగా గుర్తించినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో దేశంలో గుర్తింపు పొందిన మొత్తం రామ్సర్ సైట్ల జాబితా 75కు పెరిగింది. ఈ నేపథ్యంలో చిత్తడి ప్రాంతాల ఆవశ్యకత గురించి సమగ్రంగా తెలుసుకుందాం.
చిత్తడి ప్రాంతం అంటే?
-సంవత్సరం పొడవునా నీటితో నిండి ఉండే ప్రాంతాలను చిత్తడి ప్రాంతాలు అంటారు.
ఉదా: మంచినీటి, ఉప్పునీటి సరస్సులు. మడ అడవులను కలిగిన సాగర సంగమ ప్రాంతాలు. బురద కయ్యలు, ఉప్పునీటి కయ్యలు, రొయ్యల చెరువులు. వరి పొలాలు, ప్రవాహాలు కలిగిన ప్రాంతాలు. నదీముఖ, సముద్ర తీర ప్రాంతాలు.
– దేశంలోని చిత్తడి నేలలు, మడ అడవులు, ప్రవాళ మృత్తికలు, బురద నేలల పరిరక్షణలో సహకారం అందించే లక్ష్యంతో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కొత్తగా 2021, అక్టోబర్ 2న వెట్‌ల్యాండ్స్ ఆఫ్ ఇండియా పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్‌లో పొందుపరిచిన నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 7.57 లక్షల చిత్తడి నేలలు ఉండగా, వీటి విస్తీర్ణం 1.52 కోట్ల హెక్టార్లు. దేశ విస్తీర్ణంలో చిత్తడినేలల వాటా 4.63 శాతం.
చిత్తడి ప్రాంతాల పరిరక్షణకు అంతర్జాతీయ కృషి,రామ్సర్ ఒప్పందం-1971
-అంతర్జాతీయంగా చిత్తడి నేలలను పరిరక్షించడానికి 1960 దశకం నుంచే ప్రయత్నాలు జరిగాయి. చివరగా యునెస్కో ఆధ్వర్యంలో 1971, ఫిబ్రవరి 2న ఇరాన్‌లోని రామ్సర్ అనే నగరంలో అంతర్జాతీయ చిత్తడినేలల పరిరక్షణ సదస్సు జరిగింది. ఈ సదస్సులో 18 దేశాలు తీర్మానం మీద సంతకాలు చేశాయి.
1) రామ్సర్ ఒప్పందం మీద సంతకం చేసిన తొలి దేశం- ఆస్ట్రేలియా (1974లో)
2) రామ్సర్ ఒప్పందం కింద గుర్తించిన తొలి సైట్- కోబర్గ్ ద్వీపకల్పం (ఆస్ట్రేలియా)
3) యునెస్కో ఆధ్వర్యంలో రామ్సర్ ఒప్పందం అమల్లోకి వచ్చిన సంవత్సరం- 1975
నోట్: అంతర్జాతీయ చిత్తడి నేలల పరిరక్షణ తొలి సదస్సు జరిగిన ఫిబ్రవరి 2ను 1997 నుంచి ప్రతి ఏటా ‘ప్రపంచ చిత్తడినేలల దినోత్సవం’గా జరుపుకొంటున్నారు. ప్రపంచ చిత్తడి నేలల దినం-2022 ఇతివృత్తం ‘వెట్‌ల్యాండ్స్ యాక్షన్ ఫర్ పీపుల్ అండ్ నేచర్’.
నోట్: భారత్ రామ్సర్ ఒప్పందంలో చేరిన రోజు- 1982, ఫిబ్రవరి 1.
రామ్సర్ కన్వెన్షన్‌లో భాగస్వాములుగా ఉన్న అంతర్జాతీయ సంస్థలు
1) బర్డ్ లైప్ ఇంటర్నేషనల్
2) ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్)
3) వెట్‌ల్యాండ్స్ ఇంటర్నేషనల్
4) వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్)
5) అంతర్జాతీయ నీటి నిర్వహణ సంస్థ
6) వైల్డ్ ఫౌల్ అండ్ వెట్‌ల్యాండ్స్ ట్రస్ట్
-1982 పారిస్ ప్రొటోకాల్, 1987 రెజినా ప్రొటోకాల్స్ ద్వారా రామ్సర్ ఒప్పందం కొన్ని మార్పులకు గురైంది.
రామ్సర్ ఒప్పందం – మూడు కీలక స్తంభాలు
1) చిత్తడి ప్రాంతాల తెలివైన వినియోగం (Wise Use)
2) అంతర్జాతీయ కృషి కోసం అర్హత కలిగిన చిత్తడి ప్రాంతాలను రామ్సర్ సైట్లుగా గుర్తించడం
3) అంతర్జాతీయంగా చిత్తడి ప్రాంతాల పరిరక్షణకు సమష్టి కృషి చేయడం
నోట్: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రామ్సర్ ఒప్పందంలోని దేశాలు- 172
– ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ్సర్ సైట్లు- 2400+
– అత్యధికంగా రామ్సర్ సైట్లు ఉన్న దేశాలు- యునైటెడ్ కింగ్డమ్ (175), మెక్సికో (142)
-రామ్సర్ సైట్ల కింద అత్యధిక సంరక్షణ ప్రాంతంలోని దేశం- బొలీవియా (1,48,000 చ.కి.మీ.)
– ప్రపంచంలో అతిపెద్ద రామ్సర్ సైట్ (విస్తీర్ణం పరంగా) గల దేశం- బ్రెజిల్ (రియో నీగ్రో రామ్సర్ సైట్ 1,20,000 చ.కి.మీ.)
మాంట్రియక్స్ రికార్డ్
-అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల జాబితాలోని వాటిలో పర్యావరణ మార్పుల వల్ల తీవ్రమైన ప్రతికూల ప్రభావాలకు గురయ్యే రామ్సర్ సైట్ల గురించి తెలియజేసే జాబితాను మాంట్రియక్స్ రికార్డ్ అని అంటారు.
– 1990లో మాంట్రియక్స్ రికార్డ్‌ను రూపొందించారు.
-ఇది రామ్సర్ ఒప్పందంలో ఒక అంతర్భాగం.
– ప్రస్తుతం మాంట్రియక్స్ రికార్డ్‌లో 48 రామ్సర్ సైట్లను గుర్తించారు.
నోట్: మాంట్రియక్స్ రికార్డ్‌లో చేర్చిన భారతదేశానికి చెందిన రామ్సర్ సైట్లు- 2 (మణిపూర్‌లోని లోక్తక్ సరస్సు, రాజస్థాన్‌లోని కియోలాడియో జాతీయ పార్క్)
రామ్సర్ సైట్లు – భారత్
1) దేశంలో గుర్తించిన తొలి రామ్సర్ సైట్స్- చిలికా సరస్సు (ఒడిశా), కియోలాడియా జాతీయ పార్క్ (రాజస్థాన్)
2) దేశంలో అత్యధిక రామ్సర్ సైట్లు గల రాష్ట్రం- తమిళనాడు (14)
3) దేశంలో అతిపెద్ద రామ్సర్ సైట్- సుందర్బన్స్ మడ అడవులు (పశ్చిమ బెంగాల్)
4) దేశంలో అతిచిన్న రామ్సర్ సైట్- రేణుక వెట్‌ల్యాండ్ (0.2 చ.కి.మీ.), హిమాచల్ ప్రదేశ్
చిత్తడి ప్రాంతాలు – పర్యావరణ ప్రాముఖ్యత
1) నీటిని వడగట్టి శుభ్రపరచి నిల్వచేస్తాయి. వరదనీటిని నియంత్రిస్తాయి.
2) వృక్ష, జంతు సంపద, జలచర జీవులకు చిత్తడి ప్రాంతాలు ఆవాసాలు
3) అనేక స్థానీయ, వలస పక్షులకు ఇవి ప్రధాన ఆవాస ప్రాంతాలు.
4) పోషకాలను, భూగర్భ జలాలను రీసైక్లింగ్ చేసి, వాతావరణ పరిస్థితులను సమతూకం చేస్తాయి.
5) వాతావరణంలో తేమ శాతాన్ని కొనసాగించడానికి దోహదపడతాయి.
6) వరి వంటి పంటలకు జన్యు రిజర్వ్ గా పనిచేస్తాయి.
7) పర్యాటక రంగం బలోపేతం కావడానికి తద్వారా ఆర్థిక ప్రగతికి కారణమవుతాయి.
8) సాంస్కృతిక వైభవానికి, ఆధ్యాత్మికతకు ఇవి నెలవులుగా ఉంటున్నాయి.
9) ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కొద్ది ప్రజలకు ప్రధాన జీవనాధారంగా ఉన్నాయి.
10) జీవవైవిధ్యం అంతరించడకుండా ఉండటానికి ప్రధాన సహజ వనరులుగా ఉన్నాయి.
చిత్తడి ప్రాంతాల క్షీణత – కారణాలు
1) ఆక్వా కల్చర్, ఓవర్ ఫిషింగ్
2) పారిశ్రామిక, గృహ, వ్యవసాయ వ్యర్థాలు యథేచ్ఛగా చిత్తడి ప్రాంతాల్లో కలిసి పోతుండటం
3) అటవీ నిర్మూలన, ప్రజా ఆవాసాల కోసం చిత్తడి ప్రాంతాల ఆక్రమణ
4) వరి బదులు వాణిజ్య పంటలను సాగుచేయడం
5) సముద్ర తీర ప్రాంతాల్లో భారీ ఇసుక తవ్వకాలు జరపడం
చిత్తడి నేలల సంరక్షణ – భారత ప్రభుత్వ చర్యలు
1) 1985-86 నుంచి జాతీయ చిత్తడి నేలల పరిరక్షణ కార్యక్రమాన్ని అమలు చేయడం
2) చిత్తడి నేలలు పరిరక్షణ, నిర్వహణ నియమాలు-2017ను అమలు చేయడం
3) చిత్తడి నేలలను రామ్సర్ సైట్స్‌గా గుర్తింపు పొందడానికి అంతర్జాతీయంగా కృషిచేయడం
నోట్: చిత్తడి నేలల నిబంధనలు-2017 ప్రకారం కింది వాటిని భారత ప్రభుత్వం నియంత్రించడం లేదు.
ఎ. నదీ కాలువలు
బి. వరి పొలాలు
సి. తాగునీటి అవసరాల కోసం, ఆక్వా కల్చర్ కోసం నిర్మించిన కాలువలు,నీటి వనరులు
డి. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్-1927 పరిధిలోకి వచ్చే చిత్తడి నేలలు
ఇ. అటవీ పరిరక్షణ చట్టం-1980 పరిధిలోకి వచ్చే ప్రాంతాలు
ఎఫ్. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 పరిధిలోకి వచ్చే చిత్తడి నేలలు
జి. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నోటిఫికేషన్-2011 పరిధిలోకి వచ్చే చిత్తడి నేలలు
4) చిత్తడి నేలల నిబంధనలు-2017 కింద స్టేట్ వెట్‌ల్యాండ్ అథారిటీ ఏర్పాటు చేసే నేషనల్ వెట్‌ల్యాండ్ కమిటీని ఏర్పాటు చేయడం
పీ శ్రీరామ్‌చంద్ర
గ్రూప్-1 మెంటార్
హైదరాబాద్
8008356825
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు