నిబంధనల ప్రకారమే సీట్ల కేటాయింపు
రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన వెంటనే ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపునకు షెడ్యూల్ విడుదల చేసింది. స్లాట్ బుకింగ్, వెబ్ ఆప్షన్లు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితర ప్రక్రియలు ఆగస్టు 21 నుంచి మొదలవుతాయి. విద్యార్థులకు సీట్ల కేటాయింపు, కౌన్సెలింగ్ విధానంపై విద్యార్థుల తల్లిదండ్రులకు అనేక సందేహాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో టీఎస్ ఎంసెట్ క్యాంప్ ఆఫీసర్ బోడకుంట శ్రీనివాస్ అడ్మిషన్ ప్రక్రియకు, విద్యార్థుల సందేహాలకు పరిష్కారం, సలహాలు, సూచనలు ‘నిపుణ’ ప్రతినిధితో పంచుకున్నారు. ఆ విశేషాలు..
ఇంజినీరింగ్ షెడ్యూల్ ఎన్ని దశల్లో ఉంటుంది? ఎన్ని సీట్లు ఉన్నాయి?
# ప్రస్తుతం ఇంజినీరింగ్ విభాగానికి మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశాం. మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 21 నుంచి ప్రారంభిస్తున్నాం. మొదట స్లాట్ బుకింగ్ ఉంటుంది. ఆగస్టు 23 నుంచి 31 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. వెబ్ ఆప్షన్లు, బ్రాంచీల సెలక్షన్ సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు ఉంటుంది. ఏఐసీటీఈ ఇచ్చిన జాబితా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 1,01,200 సీట్లు అందుబాటులో ఉన్నాయి. యూనివర్సిటీ పరిశీలించి సీట్ల వివరాలు మాకు అందిస్తుంది. దాని ప్రకారం తుది జాబితా ప్రకటిస్తాం.
ఇంజినీరింగ్‌లో చేరిన విద్యార్థులకు ఎన్ఐటీ, ఐఐటీలో సీట్లు వస్తే వెంటనే పంపిస్తారా?
# ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌ను మూడు దశల్లో నిర్వహిస్తున్నాం. మొదటి దశ సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 6న నిర్వహిస్తున్నాం. దీంతో దోస్త్ ద్వారా అప్పటికే డిగ్రీలో చేరిన విద్యార్థులకు ఇంజినీరింగ్‌లో సీటు వస్తే డిగ్రీ సీటును క్యాన్సిల్ చేస్తారు. దోస్త్ ఆరో దశ రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు పూర్తవుతుంది. ఇక జేఈఈ విషయానికి వస్తే.. జేఈఈ మూడు దశల కౌన్సిలింగ్ పూర్తయ్యాకనే ఇంజినీరింగ్ రెండో దశ కౌన్సెలింగ్ పూర్తవుతుంది. జేఈఈలో ఆరు దశల తర్వాతనే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మూడోదశ రిజల్ట్ వస్తుంది. విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐఐటీ, ఎన్ఐటీ వంటి జాతీయ సంస్థలు, రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరవచ్చు.
స్లాట్ బుకింగ్‌కి ఎంత ఫీజు ఉంటుంది?
– స్లాట్ బుకింగ్ చేసుకున్నందుకు నామమాత్రపు ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.600 ఉంటుంది. బీసీ, ఓసీ, ఇతర కేటగిరీల విద్యార్థులకు రూ. 1200 అవుతుంది.
ఇంజినీరింగ్‌లో ఈ ఏడాది కొత్త కోర్సులు ప్రారంభిస్తున్నారా?
-మూడేళ్ల క్రితం కొన్ని కొత్త కోర్సులు వచ్చాయి. ఈ ఏడాదైతే కొత్త కోర్సులేమీ లేవు. జేఎన్టీయూహెచ్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ప్రారంభించాలనే ఆలోచనలో ఉంది. కానీ దానిపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. ప్రస్తుతం ఉన్న కోర్సుల్లోనే సర్దుబాటు చేస్తున్నాం. సివిల్, మెకానికల్, ఈఈఈ బ్రాంచుల్లో సీట్లు తగ్గించి కంప్యూటర్ సైన్స్‌కు సంబంధించిన సీట్లు పెంచుతున్నాం. ఎందుకంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు కంప్యూటర్ ఆధారిత కోర్సులపై దృష్టి పెడుతున్నారు. గతేడాది సివిల్, మెకానికల్ సీట్లు దాదాపు 40 శాతం వరకు మిగిలాయి. దీని కారణంగా వాటిని తగ్గించి కంప్యూటర్ సంబంధింత కోర్సులు పెంచుతున్నాం. దీనిపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోగానే సీట్ల సర్దుబాటు చేస్తాం.
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఆగస్టు 28న ఉంది. ఇంజినీరింగ్ మొదటి విడత కౌన్సెలింగ్ 31తోనే పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బంది పడతారు కదా?
# అలాంటి పరిస్థితి రాదు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ 23 నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి పరీక్షకు ముందే ఆప్షన్లు పెట్టుకోవచ్చు. వారు పరీక్ష రాసిన తర్వాత కూడా మూడు రోజులు సమయం ఉంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరొక విషయం ఏమిటంటే జేఈఈ అడ్వాన్స్డ్ స్థాయి వరకు కొందరు విద్యార్థులే ఎంపికవుతారు. వారు 29, 30, 31 వరకు ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
ఎంసెట్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులన్నీ ఏపీ విద్యార్థులకే వచ్చాయి. దీని వల్ల తెలంగాణ విద్యార్థులకు నష్టం కాదా?
– రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అన్ని వృత్తి విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షలు 2024 వరకు రాసుకోవచ్చు. అప్పటి వరకు వారికి ఇక్కడ అవకాశం కల్పిస్తాం. ఇక ర్యాంకుల విషయానికి వస్తే ఎవరు బాగా చదివితే వారికే ర్యాంకులు వస్తాయి. అన్యాయం జరుగుతుంది అంటే దానికి 2024 వరకు ఏమీ చేయలేం. ఇంకొక విషయం ఏంటంటే టాప్ 100 ర్యాంకుల విద్యార్థుల్లో దాదాపు 70 శాతం మంది జేఈఈ మెయిన్స్, ఐఐటీ, ఎన్ఐటీలకు వెళ్లిపోతారు.
సీట్లు, ఫీజుల విషయంలో చాలా కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపణలున్నాయి. దానిపై మీ స్పందన ఏంటి?
# ప్రభుత్వ నిబంధనల ప్రకారమే సీట్లు కేటాయిస్తాం. మేం కేటాయించిన సీట్లు మా వెబ్సైట్లో ఉంచుతున్నాం. ఎవరికైనా ఎలాంటి సందేహాలున్నా వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇందులో కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా సీట్లు అన్ని కళాశాలలు నిబంధనల ప్రకారమే నింపుకోవాలి. ఫీజులు కూడా ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే కళాశాల స్థాయిని బట్టి నిర్ణయిస్తున్నారు. దాని ప్రకారమే వసూలు చేయాలి.
కౌన్సెలింగ్‌కు ఎన్నో ర్యాంకు వరకు హాజరు కావొచ్చు?
# అర్హత సాధించిన విద్యార్థులందరూ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అందరికీ కౌన్సెలింగ్ నిర్వహిస్తాం. ఆయా కళాశాలల్లో ఉన్న సీట్లు, మొత్తం విద్యార్థుల సంఖ్యను బట్టి సీట్ల కేటాయింపు ఉంటుంది. మొత్తం సీట్లు ఎన్ని ఉన్నాయో అంతవరకు తీసుకుంటాం. అప్పటికీ ఎవరైనా మిగిలితే సీటు వచ్చి చేరని వారి స్థానంలో చేరవచ్చు.
కొంతమంది విద్యార్థులకు మంచి ర్యాంకు వచ్చినా మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీటు రావడం లేదు. కారణమేంటి?
# విద్యార్థులు చేసే మొదటి తప్పు ఏంటంటే వెబ్ ఆప్షన్లు చాలా తక్కువగా ఇవ్వడం. ప్రతి విద్యార్థి కచ్చితంగా సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇవ్వాలి. ఎందుకంటే ర్యాంకు, రిజర్వేషన్ ప్రకారం సీట్ల కేటాయింపు ఉంటుంది. చాలా మంది విద్యార్థుల్లో ఎక్కువ ఆప్షన్లు పెట్టుకుంటే టాప్ కళాశాలల్లో సీటు రాదేమో అనే అపోహ ఉంది. అది తప్పు.. ఎందుకంటే ర్యాంకు ఆధారంగానే టాప్ నుంచి మీడియం కళాశాలల కేటాయింపు ఉంటుంది.
విద్యార్థులు గతేడాది ఏ ర్యాంకు వారికి ఏ కళాశాల వచ్చిందో చూసుకోవాలి. దాన్ని బట్టి ఈసారి కూడా కేటాయింపులు దాదాపు అలాగే ఉంటాయి. అందుకే మంచి ర్యాంకు వచ్చిన వారు ఎన్ని ఆప్షన్లు పెట్టుకున్నా టాప్ లిస్టులో ఉన్న కళాశాలలోనే సీటు వస్తుంది.
కౌన్సెలింగ్‌కు ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు?
# రాష్ట్ర వ్యాప్తంగా 36 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే ఆయా కేంద్రాల నిర్వాహకులకు సమాచారం అందించాం. కేంద్రాలన్నీ ఆయా జిల్లా కేంద్రాల్లో ఉంటాయి. హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది కాబట్టి నగరంలోనే ఆరు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. నూతనంగా ఏర్పడిన ఒకటి రెండు జిల్లాల్లో మాత్రం కేంద్రాలు ఉండవు. ఆ జిల్లాలకు చెందిన విద్యార్థులను వారికి అందుబాటులో ఉన్న కేంద్రాలను కేటాయించాం.
స్లాట్ బుకింగ్, కౌన్సెలింగ్ ప్రక్రియలో ఏమైనా సమస్యలుంటే ఎవరిని సంప్రదించాలి?
# స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లు, కౌన్సెలింగ్ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. ఆన్లైన్, వెబ్సైట్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా చూసుకుంటు న్నాం. అన్ని కౌన్సెలింగ్ కేంద్రాల్లో నిరంతరం విద్యుత్ సౌకర్యం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సరైన జాగ్రత్తలు తీసుకుంటాం. ఒకవేళ ఎక్కడైనా స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో సమస్యలు తలెత్తితే మా వెబ్సైట్ https://tseamcet.nic.inను సంప్ర దించండి. ఈ వెబ్సైట్లో హెల్ప్‌లైన్ నంబర్లు ఉంటాయి. వాటికి ఫోన్ చేస్తే సరైన సలహాలు, సూచనలు చేస్తారు.
దివ్యాంగులు, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా వారికి కౌన్సెలింగ్ ఎక్కడ నిర్వహిస్తారు?
# దివ్యాంగులు, ఎన్సీసీ, స్పోర్ట్ కోటాకు చెందిన వారిని పరీక్షించడానికి వైద్య నిపుణులు అవసరం. ప్రతి కౌన్సెలింగ్ కేంద్రంలో సంబంధింత నిపుణులను ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. కాబట్టి వీరి కోసం మాసబ్‌ట్యాంక్‌లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. వారికి అక్కడే కౌన్సెలింగ్ నిర్వహిస్తాం. వారు తమ వెంట సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తీసుకొని కౌన్సెలింగ్‌కు హాజరవ్వాలి. వారికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
దివ్యాంగులకు సదరం ద్వారా జారీ చేసిన సర్టిఫికెట్ సరిపోతుందా? వైద్యుల ద్వారా పరీక్షిస్తారా?
# దివ్యాంగులకు ప్రభుత్వం సదరం ద్వారా జారీ చేసిన సర్టిఫికెట్లు ఆన్లైన్లో లభించవు. వాటిని ప్రభుత్వం ఆన్లైన్ చేయలేదు. దీంతో ఆ సర్టిఫికెట్లు అసలైనవా.. నకిలీవా.. అని నిర్ధారించుకోవలసి ఉంటుంది. ఇందుకోసం దివ్యాంగ విద్యార్థులను సంబంధిత వైద్యులు పరీక్షిస్తారు. వారికి కేటాయించిన కౌన్సెలింగ్ కేంద్రంలో చెవిటి, మూగ, మానసిక వైకల్యాన్ని నిర్ధారించే వైద్యులు అందుబాటులో ఉంటారు. వారు ధ్రువీకరించిన వారికి రిజర్వేషన్ కల్పిస్తారు.
ఫార్మసీ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఎప్పుడు నిర్వహిస్తారు?
# ఫార్మసీ కౌన్సెలింగ్ నీట్ ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. నీట్ ఫలితాలు వచ్చిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేస్తాం. ముందే ఫార్మసీ కౌన్సెలింగ్ నిర్వహించడం వల్ల నీట్లో సీటు వచ్చిన విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అందుకే మొదట ఇంజినీరింగ్ పూర్తి చేస్తున్నాం.
కౌన్సెలింగ్‌కు ఏయే సర్టిఫికెట్లు ఉండాలి?
# ఒకటి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, పదో తరగతి, ఇంటర్ మెమోలు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ, ఆధాయ ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఉండాలి. దివ్యాంగులు, ఎన్సీసీ, క్రీడలకు చెందిన వారికి సంబంధిత
ధ్రువపత్రాలు.
విద్యార్థులకు మీరిచ్చే సలహాలు, సూచనలేంటి?
# విద్యార్థులు సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. దీంతో మీ ర్యాంకును బట్టి సీటు వస్తుంది. స్లాట్ బుక్ చేసుకున్నాక మీ ఫోన్ నంబర్, పాస్వర్డ్ ఎవరికీ చెప్పవద్దు. ఏదైనా ఆన్లైన్ సెంటర్లో స్లాట్ బుకింగ్, వెబ్ ఆప్షన్లు ఇచ్చుకుంటే మీ ఐడీ లాగవుట్ చేసినాకనే అక్కడి నుంచి వెళ్లండి. వెబ్ ఆప్షన్లు పూర్తయ్యాక ఒక ప్రింట్ తీసుకుని మీరు ఎంచుకున్న కళాశాల కరెక్టా కాదా సరి చూసుకోండి. ఏదైనా మీరు అనుకోని కళాశాల ఎంపిక అయితే వెంటనే సరి చేసుకోండి. ఆందోళనలు, భయానికి గురవ్వకుండా కౌన్సెలింగ్‌లో పాల్గొనండి.
విద్యార్థుల తల్లిదండ్రులకు మీరిచ్చే సూచనలేమిటి?
# స్లాట్ బుకింగ్, వెబ్ ఆప్షన్లు పూర్తయ్యాక మీ ఫోన్ నంబర్, పాస్‌వర్డ్‌ను ఎవరికీ ఇవ్వవద్దు. కొన్ని ప్రైవేట్ కళాశాలలు ఫోన్ చేసి మీ పాస్వర్డ్ అడుగుతారు. మీరు పాస్వర్డ్ చెప్పడం వెబ్ ఆప్షన్లలో వారి కళాశాలనే ఎంపిక చేస్తారు. దీంతో మీ ర్యాంకుకు తగ్గ కళాశాలలో సీటు రాకపోవచ్చు. కొంతమంది మధ్యవర్తులు మంచి వసతులు, సౌకర్యాలు ఉన్నాయంటూ ఫలనా కళాశాలలో చేరాలని మీ ఫోన్ నంబర్, పాస్వర్డ్ అడుగుతారు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు. కొన్ని కళాశాలల వారు అందులో చేరితే ఎలాంటి ఫీజులు ఉండవు. వసతి, భోజనం ఉచితంగా కల్పిస్తాం, మా కళాశాలలో చేరాలని ఫోన్ చేస్తుంటారు. వారిని నమ్మొద్దు. కౌన్సెలింగ్‌లో పాల్గొని కేటాయించిన కళాశాలలోనే విద్యార్థులను చేర్పించాలి.
కౌన్సెలింగ్ వివరాలు
షెడ్యూల్ మొదటి విడత రెండో విడత తుది విడతస్లాట్బుకింగ్, ఫీజు చెల్లింపు– 21-8 – 22 నుంచి 29 -8-22 28-9-22 నుంచి 29-9-22 11-10-22 నుంచి 12-10-22
సర్టిఫికెట్ వెరిఫికేషన్ 23-8-22 నుంచి 30-8-22 30-9-22 13-10-22
వెబ్ ఆప్షన్స్ 23-8-22 నుంచి 02-9-22 28-9-22 నుంచి 1-10-22 11-10-22 నుంచి 14-10-22
ఫ్రీజింగ్ ఆప్షన్స్ 2-9-22 1-10-22 14-10-22
సీట్ల కేటాయింపు 6-9-22 4-10-22 17-10-22
ట్యూషన్ ఫీజు చెల్లింపు 6-9-22 నుంచి 13-9-22 4-10-22 నుంచి 8-10-22 17-10-22 నుంచి 20-10-22
…కాసాని కుమారస్వామి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు