కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన కేసీఆర్
తెలంగాణ
కమాండ్ కంట్రోల్ సెంటర్
దేశంలో ఎక్కడా లేని విధంగా నిర్మించిన రాష్ట్ర పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఎం కేసీఆర్ ఆగస్టు 4న ప్రారంభించారు. రాష్ట్రంలోని సీసీ కెమెరాలను ఈ సెంటర్‌కు అనుసంధానం చేశారు. సుమారు లక్ష కెమెరాలను వీక్షించేలా ఈ సెంటర్లో బాహుబలి తెరను ఏర్పాటు చేశారు. సుమారు రూ.600 కోట్లతో దీనిని నిర్మించారు.
రామచందర్ నాయక్
రాష్ట్ర గిరిజన ఆర్థిక సహకార సంస్థ (టీఎస్టీసీఎఫ్సీ-తెలంగాణ స్టేట్ ట్రైబల్ కో ఆపరేషన్ ఫైనాన్స్ కమిషన్) చైర్మన్‌గా ఇస్లావత్ రామచందర్ నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆగస్టు 4న సీఎం కేసీఆర్ నియామకపత్రం అందజేశారు.
చంద్రమోహన్ రేఖారెడ్డిలకు జపాన్ అవార్డు
హైదరాబాద్‌కు చెందిన గోవిందరాజులు చంద్రమోహన్ (ABK-AOTs DOSOKAO ప్రెసిడెంట్) రేఖారెడ్డి గవ్వా (జపాన్ పూల అలంకరణ ‘ఒహరా ఇకెబానా’ కళానిపుణురాలు) జపాన్ విదేశాంగ మంత్రి ప్రశంసా పురస్కారం-2022కు ఎంపికయ్యారు. ABK-AOTs DOSOKAO ద్వారా భారత్-జపాన్ మధ్య ఆర్థిక సంబంధాలు పెంపొందించినందుకు చంద్రమోహన్, ఇకెబానా ద్వారా భారత్-జపాన్ మధ్య సాంస్కృతిక మార్పిడి, సుహృద్భావ, స్నేహ సంబంధాలకు దోహదపడినందుకు రేఖారెడ్డిలను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు చెన్నైలోని కాన్సులేట్ కార్యాలయం ఆగస్టు 4న ప్రకటించింది.
జస్టిస్ ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. ఆగస్టు 5న నిర్వహించిన ఓయూ 82వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ 48వ ప్రధాన న్యాయమూర్తి కాగా.. ఓయూ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న 48వ వ్యక్తి కావడం విశేషం. ఓయూ గౌరవ డాక్టరేట్‌ను 21 ఏండ్ల అనంతరం, తెలంగాణ ఏర్పడిన తరువాత తొలిసారిగా ప్రదానం చేశారు.
జాతీయం
అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ‘మిషన్ భూమిపుత్ర’ పోర్టల్‌ను ఆగస్టు 1న ప్రారంభించారు. కుల ధ్రువీకరణ పత్రాలు సులభంగా పొందడానికి ఈ పోర్టల్‌ను రూపొందించారు. విద్యార్థులకు సరళీకృతంగా, డిజిటల్ పద్ధతిలో సర్టిఫికెట్లు జారీచేస్తారు.
మొట్టమొదటిసారిగా పూర్తిగా మహిళా అధికారులతో నావికాదళ బృందం ఉత్తర అరేబియా సముద్రంలో ఆగస్టు 3న నిఘా చేపట్టి రికార్డు సృష్టించారు. ఈ నిఘా మిషన్‌ను డోర్నియర్ 228 విమానం ద్వారా చేపట్టారు. ఈ మిషన్‌ను లెఫ్టినెంట్ కమాండర్ ఆంచల్ శర్మ నాయకత్వంలో లెఫ్టినెంట్లు శివాంగి, అపూర్వ గీతే, పూజా పాండా, పూజా షెఖావత్ నిర్వహించారు. వీరు గుజరాత్, పోర్బందర్లోని ఇండియన్ నేవల్ ఎయిర్ స్కాడ్రన్ (ఐఎన్ఏఎస్)-314లో విధులు నిర్వహిస్తున్నారు.
చీరాగ్ పథకం
హర్యానా ప్రభుత్వం ఆగస్టు 3న ‘చీఫ్ మినిస్టర్ ఈక్వల్ ఎడ్యుకేషన్ రిలీఫ్, అసిస్టెన్స్ అండ్ గ్రాంట్ (చీరాగ్)’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద పేద విద్యార్థులు 2 నుంచి 12వ తరగతి వరకు ప్రైవేట్ పాఠశాలలో చేరవచ్చు.
మరో 10 రామ్సర్ సైట్లు
భారత్ నుంచి మరో 10 చిత్తడి నేలలు రామ్సర్ సైట్స్ జాబితాలో చేరాయని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ ఆగస్టు 3న వెల్లడించారు. తమిళనాడు నుంచి 6, గోవా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఒక్కొక్కటి చొప్పున ఎంపికయ్యాయి. తమిళనాడులోని గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ బయోస్ఫియర్ రిజర్వ్, వెంబన్నూర్ వెట్లాండ్ కాంప్లెక్స్, వెల్లోడ్ బర్డ్ శాంక్చువరీ, వేదాంతంగల్ బర్డ్ శాంక్చువరీ, ఉదయమార్తాండపురం బర్డ్ శాంక్చువరీ, ఒడిశాలోని సట్కోసియా గోర్జ్, గోవాలోని నంద లేక్, కర్ణాటకలోని రంగనతిట్టు బర్డ్ శాంక్చువరీ, మధ్యప్రదేశ్‌లోని సిర్పూర్ వెట్లాండ్ రామ్సర్ జాబితాలో చేరాయి. వీటి చేరికతో దేశంలోని మొత్తం రామ్సర్ సైట్ల సంఖ్య 64కు చేరింది.
అంతర్జాతీయం
హిట్లర్ గడియారం వేలం
జర్మనీ దివంగత నియంత అడాల్ఫ్ హిట్లర్‌కు చెందిన చేతిగడియారం వేలంలో 1.1 మిలియన్ డాలర్ల (సుమారు రూ.8.71 కోట్లు) ధర పలికింది. ఆగస్టు 1న అమెరికా మేరీలాండ్‌లోని చెసపీక్ సిటీకి చెందిన అలెగ్జాండర్ హిస్టారికల్ ఆక్షన్స్ సంస్థ ఈ వేలాన్ని నిర్వహించింది. ఈ గడియారం వెనుక స్వస్తిక్ చిహ్నంతోపాటు ఇంగ్లిష్‌లో ఏహెచ్ రాసి ఉన్నాయి. 1945లో ఫ్రెంచ్ సైన్యం హిట్లర్ స్థావరంపై దాడిచేసినప్పుడు ఓ సైనికుడు ఈ వాచీని తీసుకున్నాడు.
దక్షిణ కొరియా
చంద్రుడిపైకి తన తొలి అంతరిక్ష నౌకను దక్షిణ కొరియా ఆగస్టు 4న విజయవంతంగా ప్రయోగించింది. 180 మిలియన్ డాలర్లతో చేపట్టనున్న ఈ దక్షిణ కొరియా మూన్ మిషన్‌కు ‘దనురి’ అని పేరుపెట్టారు. ఈ ప్రయోగాన్ని ఫ్లోరిడాలోని కేప్ కెనరావెల్ ఎలన్ మస్క్ ఏరోస్పేస్ కంపెనీ స్పేస్ ఎక్స్‌లో ఫాల్కన్ 9 రాకెట్ నుంచి చేపట్టారు. దనురి అంటే ‘ఎంజాయ్ ది మూన్’ అని అర్థం.
యునెస్కో లిస్ట్ లో భారత అబ్జర్వేటరీ
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని లంగత్ సింగ్ కాలేజీలోని ఖగోళ పరిశీలనా కేంద్రం అంతరించిపోతున్న వారసత్వ పరిశీలనాశాలల యునెస్కో జాబితాలో ఆగస్టు 4న చేరింది. దీనిని 1916లో ఏర్పాటు చేశారు. భారతదేశం నుంచి మొత్తం 40 ప్రదేశాలు యునెస్కో హెరిటేజ్ సైట్స్ అండ్ అబ్జర్వేటరీస్ జాబితాలో ఉన్నాయి. దీంతో భారత్ ప్రపంచవ్యాప్తంగా 6వ స్థానంలో నిలిచింది. 193 సభ్యదేశాలున్న యునెస్కోని 1945, నవంబర్ 16న స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం పారిస్‌లో ఉంది. దీని అధిపతి ఆడ్రీ అజౌలే.
చైనా ఆగస్టు 5న రీ యూజబుల్ (పునర్వినియోగించే) స్పేస్‌క్రాఫ్ట్ (అంతరిక్ష నౌక)ను విజయవంతంగా ప్రయోగించింది. దీనిని జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి లాంగ్మార్జ్ 2ఎఫ్ రాకెట్ ద్వారా ప్రయోగించారు.
క్రీడలు
యూరో కప్
మహిళల యూరో ఫుట్‌బాల్ టోర్నీ విజేతగా ఇంగ్లండ్ నిలిచింది. ఆగస్టు 1న లండన్‌లోని వెంబ్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 2-1తో జర్మనీపై గెలిచింది. 1996 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ పురుషుల జట్టు జర్మనీపైనే గెలిచింది.
పారాగేమ్స్
ఓఎన్జీసీ పారా గేమ్స్ నాలుగో ఎడిషన్ న్యూఢిల్లీలోని త్యాగరాజ్ స్పోర్ట్ కాంప్లెక్స్‌లో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఆగస్టు 2న ప్రారంభించారు. 4వ తేదీ వరకు నిర్వహించిన ఈ పోటీల్లో ఎనిమిది సెంట్రల్ ఆయిల్, గ్యాస్ పబ్లిక్ ఆర్గనైజేషన్లలో పనిచేస్తున్న వికలాంగులు పాల్గొన్నారు.
శాఫ్ ఫుట్‌బాల్
శాఫ్ అండర్-20 ఫుట్‌బాల్ టోర్నీని భారత జట్టు గెలుచుకుంది. ఆగస్టు 5న భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 5-2తో ఓడించింది. ఈ మ్యాచ్‌లో గుర్కీరత్ హ్యాట్రిక్‌తో సహా మొత్తం నాలుగు గోల్స్ చేశాడు. ఈ టోర్నీలో 8 గోల్స్ చేసిన గుర్కీరత్ అత్యధిక గోల్ స్కోరర్‌గా నిలిచాడు.
వార్తల్లో వ్యక్తులు
ప్రపంచ బ్యాంక్ ఆగస్టే టానో కౌమేని భారతదేశానికి కంట్రీ డైరెక్టర్‌గా ఆగస్ట్ 1న నియమించింది. ఇటీవల ఐదేండ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న జునైద్ కమల్ అహ్మద్ స్థానంలో ఆగస్టే నియమితులయ్యారు. ఈయన ఇదివరకు ప్రపంచ బ్యాంక్ రిపబ్లిక్ ఆఫ్ టుర్కియే కంట్రీ డైరెక్టర్‌గా పనిచేశారు.
సుజోయ్ లాల్ థాయోసెన్
సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) డైరెక్టర్ జనరల్ సుజోయ్ లాల్ థాయోసెన్ ఇండో-టిబెటన్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు ఆగస్టు 1న స్వీకరించారు. ఈయన 1988 బ్యాచ్ ఐపీఎస్ మధ్యప్రదేశ్ కేడర్ అధికారి. ఇదివరకు ఈ బాధ్యతల్లో ఉన్న సంజయ్ అరోరా ఢిల్లీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా నియమితులయ్యారు. దీంతో ఎస్ఎస్బీ డీజీ థాయోసెన్కు అదనంగా ఈ బాధ్యతలు అప్పగించారు.
రుచిరా కాంబోజ్
ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్ ఆగస్టు 2న బాధ్యతలు చేపట్టారు. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆమెతో ప్రమాణం చేయించారు. ఆమె టీఎస్ తిరుమూర్తి స్థానంలో నియమితులయ్యారు. ఆమె ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా రికార్డులకెక్కారు.
సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)గా సురేష్ ఎన్ పటేల్ ఆగస్టు 3న బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ అవినీతిని పరిష్కరించడానికి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌ను 1964, ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు.
ఉదయ్‌కుమార్ సాగర్
తెలంగాణ రాష్ట్రంలో బోట్సువానా తరఫు లాయర్‌గా సుప్రీంకోర్టు అడ్వకేట్ ఉదయ్‌కుమార్ సాగర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆగస్టు 3న బోట్సువానా విదేశాంగ శాఖ మంత్రి లెమోగాంగ్ క్వాసే ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణలో నివసించే బోట్సువానా ప్రజల ప్రయోజనాలను రక్షించేందుకు ఈయన కృషిచేస్తారు.
జస్టిస్ యూయూ లలిత్
సుప్రీంకోర్టు తదుపరి ప్రధా న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ పేరును సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సిఫారసు చేస్తూ కేంద్ర న్యాయ శాఖ మంత్రికి ఆగస్టు 4న లేఖ రాశారు. జస్టిస్ ఎన్వీ రమణ పదవీకాలం ఆగస్టు 26తో ముగియనున్నది. జస్టిస్ లలిత్ 2014లో నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈయన సీజేఐగా నియమితులైతే బార్ నుంచి ఈ స్థాయికి చేరిన రెండో వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు. 1971లో 13వ సీజేఐ జస్టిస్ ఎస్ఎం సిక్రీ ఇలాగే బార్ నుంచి వచ్చారు.
అర్చన కే
ఉపాధ్యాయురాలు, విషయనిపుణులు
నల్లగొండ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?